ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి హైడ్రోజన్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. వీటిని హరిత హైడ్రోజన్‌గా మారిస్తే? విలువైన గ్రాఫైన్‌నూ సృష్టిస్తే? పరిశోధకులు అదే సాధించారు.

Published : 27 Sep 2023 00:34 IST

ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. వీటిని హరిత హైడ్రోజన్‌గా మారిస్తే? విలువైన గ్రాఫైన్‌నూ సృష్టిస్తే? పరిశోధకులు అదే సాధించారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగం అత్యవసరం. ఇందుకోసం శాస్త్రవేత్తలు రకరకాల పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఈ దిశగా రైస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. స్వల్ప ఉద్గారాల పద్ధతితో ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి హైడ్రోజన్‌, గ్రాఫీన్‌ను తయారు చేసి ఔరా అనిపించారు. ఇది ప్లాస్టిక్‌ కాలుష్యం, గ్రీన్‌హౌజ్‌ వాయువుల వంటి పర్యావరణ సమస్యలను పరిష్కరించటానికే కాదు.. అదనంగా గ్రాఫీన్‌ లభించటంతో హైడ్రోజన్‌ ఉత్పత్తికయ్యే ఖర్చూ తగ్గుతుందని భావిస్తున్నారు. పరిమాణం ప్రకారం శిలాజ ఇంధనాల కన్నా హైడ్రోజన్‌లో మరింత ఎక్కువ శక్తి ఉంటుంది. శిలాజ ఇంధనాలను మండించటం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణానికి హాని చేస్తాయి. అందుకే హైడ్రోజన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో విద్యుత్తు ఉత్పత్తి చేయొచ్చు, వాహనాలకు వాడుకోవచ్చు. నీటిని విడగొట్టటం ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంటారు. ఇందుకు చాలావరకు ఆవిరి-మీథేన్‌ రిఫార్మింగ్‌ పద్ధతిని వినియోగిస్తారు. ఇందులో మీథేన్‌ వంటి సహజ వాయు వనరులతో అత్యధిక వేడితో నీటి ఆవిరిని పుట్టించి హైడ్రోజన్‌ను తయారుచేస్తారు. ఈ క్రమంలో ప్రతి టన్ను హైడ్రోజన్‌ ఉత్పత్తితో 11 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతుంది. సౌర, వాయు, జల విద్యుత్తు వంటి పునర్వినియోగ పద్ధతులతో హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు. కాకపోతే దీనికి ఖర్చు ఎక్కువవుతుంది. ఒక కిలో హరిత హైడ్రోజన్‌ తయారీకి సుమారు రూ.420 ఖర్చవుతుంది. అందుకే స్వల్ప ఉద్గారాల విధానంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి హైడ్రోజన్‌, గ్రాఫీన్‌ రెండూ ఉత్పత్తి కావటం ఆసక్తి కలిగిస్తోంది. దీని ద్వారా ఉత్పత్తి అయిన గ్రాఫీన్‌ను ప్రస్తుత మార్కెట్‌ విలువలో 5% ధరకే అమ్మినా కూడా హైడ్రోజన్‌ను ఉచితంగా తయారు చేసినట్టు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అదీ హరిత హైడ్రోజన్‌ లభించటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని