3డీ ముద్రిత మూత్ర పరీక్ష పరికరం

మహిళల్లో మూత్ర ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. వీటికి చికిత్స చేయటానికి ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియాను గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాక్టీరియాను వృద్ధి చేసి, దాన్ని గుర్తిస్తారు. దీనికి రెండు, మూడు రోజులు పడుతుంది.

Published : 04 Oct 2023 00:12 IST

హిళల్లో మూత్ర ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. వీటికి చికిత్స చేయటానికి ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియాను గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాక్టీరియాను వృద్ధి చేసి, దాన్ని గుర్తిస్తారు. దీనికి రెండు, మూడు రోజులు పడుతుంది. మరి చాలా త్వరగా, అదీ అతి తక్కువ ఖర్చుతోనే మూత్ర పరీక్ష చేస్తే? ఐఐటీ గువహటి పరిశోధకులు అలాంటి ప్రయత్నమే చేశారు. మూత్ర ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చవకగా గుర్తించగలిగే 3డీ ముద్రిత పరికరాన్ని రూపొందించారు.

ఈ పరికరం బ్యాక్టీరియాను నిమిషాల్లోనే గుర్తిస్తుండటం గమనార్హం. ప్రత్యేకంగా తయారుచేసిన యాప్టామెర్లకు బంగారం నానో రేణువులను జతచేసి దీన్ని సాధించారు. యాప్టామెర్‌ ఓ 3డీ పజిల్‌ ముక్కలా ఉంటుంది. ఇది ఆయా బ్యాక్టీరియా ఉపరితలం మీద చక్కగా అమరుతుంది. అప్పుడు బంగారం నానో రేణువులు యూవీ విజిబుల్‌ స్పెక్ట్రోమీటర్‌ సాయంతో విశిష్టమైన సంకేతాన్ని ఏర్పరుస్తాయి. దీని ఆధారంగా అది ఎలాంటి బ్యాక్టీరియానో తేలిపోతుంది. సాధారణంగా మూత్ర విశ్లేషణ పరికరం తయారీకి సగటున రూ.75 వేలు అవుతుంది. కానీ దీనికి రూ.800 మాత్రమే ఖర్చవుతుంది. ఎనిమిది రూపాయలకే ఒక మూత్ర పరీక్ష చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరికొన్ని మార్పులు చేస్తే రకరకాల బ్యాక్టీరియాను గుర్తించటానికీ దీన్ని వాడుకోవచ్చని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని