ఒంటి చేత్తో యాపిల్‌ వాచ్‌

చేతిలో కాఫీ కప్పుంది. అంతలో స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్‌ వచ్చింది. ఇలాంటి సమయంలో ఒంటి చేత్తోనే దానికి సమాధానం ఇస్తే? వచ్చే ఫోన్‌ కాల్‌ను రిసీవ్‌ చేసుకొని, మాట్లాడిన తర్వాత కట్టేస్తే? యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 స్మార్ట్‌వాచ్‌లతో ఇది సాధ్యమే.

Published : 08 Nov 2023 00:01 IST

చేతిలో కాఫీ కప్పుంది. అంతలో స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్‌ వచ్చింది. ఇలాంటి సమయంలో ఒంటి చేత్తోనే దానికి సమాధానం ఇస్తే? వచ్చే ఫోన్‌ కాల్‌ను రిసీవ్‌ చేసుకొని, మాట్లాడిన తర్వాత కట్టేస్తే? యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 స్మార్ట్‌వాచ్‌లతో ఇది సాధ్యమే. వీటిల్లో డబుల్‌ ట్యాప్‌ అనే మంచి ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. తెరను తాకకుండానే స్మార్ట్‌వాచ్‌తో ఎన్నో పనులు చేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. అదీ వాచ్‌ను ధరించిన చేతి వేళ్ల కదలికలతోనే.

చిటికెలో పని పూర్తి చేస్తానని చాలామంది  అనటం తెలిసిందే. ఏదో మాట వరసకు అలా అంటుంటారు గానీ యాపిల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లతో  దీన్ని నిజంగానే చేసేయొచ్చు. అంతా డబుల్‌ ట్యాప్‌ ఫీచర్‌ గొప్పతనమే. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలంటే- ముందుగా యాపిల్‌ వాచ్‌ యాప్‌లో సెటింగ్స్‌ ద్వారా యాక్సెసిబిలిటీ విభాగంలోకి వెళ్లాలి. ఇందులోని ‘అసిస్టివ్‌ టచ్‌’ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే చాలు. వాచ్‌ను చేతికి ధరించి చూపుడు వేలు, బొటన వేలు చివర్లను వేగంగా రెండు సార్లు తాకిస్తే స్క్రీన్‌ మీద తర్వాతి ఐటమ్‌కు చేరుకోవచ్చు. మళ్లీ వేళ్లను రెండు సార్లు తాకిస్తే వెనక్కి వెళ్లొచ్చు. ఏదైనా యాప్‌ను వాడుతున్నప్పుడు డబుల్‌ ట్యాప్‌ ఫీచర్‌తో ప్రైమరీ బటన్‌ చేసే పనులన్నీ చేసుకోవచ్చు. ఉదాహరణకు- టైమర్‌ లేదా స్టాప్‌వాచ్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయొచ్చు. కెమెరా షటర్‌ ఆన్‌ చేయొచ్చు. పడుకున్నప్పుడు అలారం మోగుతుంటే రెండు వేళ్లను తాకి స్నూజ్‌ చేయొచ్చు. ఐమెసేజ్‌ ద్వారా సమాధానం పంపొచ్చు. సిరిని యాక్టివేట్‌ చేయొచ్చు. ఫోన్‌ కాల్స్‌ను తీసుకోవచ్చు, కట్టేయొచ్చు. ఇలా ఒంటి చేత్తోనే బోలెడన్ని పనులు చేసుకోవచ్చు.

కొత్త వాచ్‌లకే ఎందుకు?

ఇంత మంచి ఫీచర్‌ కొత్త వాచ్‌లకే ఎందుకు పరిమితం చేశారు? అన్నింటికీ విస్తరించొచ్చు కదా అనే సందేహం రావొచ్చు. దీనికి కొత్త ఎస్‌9 సిప్‌ చిప్‌ అవసరమవుతుంది. ఇది గత జనరేషన్‌ చిప్‌ల కన్నా 25% ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇందులో మెషిన్‌ లెర్నింగ్‌ పనులను రెట్టింపు వేగంతో నిర్వహించగల కొత్త ఫోర్‌-కోర్‌ న్యూరల్‌ ఇంజిన్‌ కూడా ఉంది. వినూత్న మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌తో కూడిన యాక్సెలోమీటర్‌, జైరోస్కోప్‌, ఆప్టికల్‌ హార్ట్‌ సెన్సర్ల నుంచి అందే సమాచారాన్ని ఇది విడమరుస్తుంది. చూపుడు వేలు, బొటన వేలు తాకినప్పుడు రక్త సరఫరాలో ఏర్పడే మార్పులు, స్వల్ప మణికట్టు కదలికల సంకేతాలను ఈ ఆల్గారిథమ్‌ గుర్తిస్తుంది. దీన్ని విశ్లేషించుకొని అవసరమైన పనులు చేసి పెడుతుంది. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియలా అనిపించొచ్చు గానీ వాడకం మాత్రం తేలికే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని