ఇమేజ్‌లోంచీ అక్షరాలు కాపీ

ఇమేజ్‌లోనో, వీడియోలోనో టెక్స్ట్‌ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్‌ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా.

Updated : 13 Dec 2023 00:57 IST

మేజ్‌లోనో, వీడియోలోనో టెక్స్ట్‌ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్‌ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. డాక్యుమెంటు, వెబ్‌పేజీలోంచి అక్షరాలను కాపీ, పేస్ట్‌ చేయటం తేలికే గానీ ఇమేజ్‌, వీడియోలోని పదాలను కాపీ చేయటమెలా? విండోస్‌ 11 లేదా విండోస్‌ 10 వీ2004, ఆ తర్వాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన పీసీలో మైక్రోసాఫ్ట్‌ పవర్‌టాయ్స్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే చాలు. పీసీలో పవర్‌టాయ్స్‌ లేకుంటే మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ లేదా గిట్‌హబ్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. దీనిలోని టెక్స్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ అద్భుతమే చేస్తుంది. ఇమేజ్‌ లేదా వీడియో ఏదైనా గానీ తెర మీద ఎలాంటి పదాలనైనా కాపీ చేసేస్తుంది. ఇది ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌ (ఓసీఆర్‌) సాయంతో ఇమేజ్‌, వీడియో లేదా స్క్రీన్‌షాట్లలోని పదాలను కంప్యూటర్‌-రీడబుల్‌ టెక్స్ట్‌ రూపంలోకి మార్చేస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం.

  • ముందు పవర్‌టాయ్స్‌ను ఓపెన్‌ చేసి ఎడమ వైపు కనిపించే మెనూలోంచి ‘ఎనేబుల్‌ టెక్స్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌’ ఫీచర్‌ను ఎంచుకొని, పక్కనుండే బటన్‌ను ఆన్‌ చేసుకోవాలి.
  • టెక్స్ట్‌తో కూడిన ఇమేజ్‌, వీడియో లేదా వెబ్‌ పేజీని ఓపెన్‌ చేయాలి.  
  • విండోస్‌, షిఫ్ట్‌, టీ మీటలను కలిపి నొక్కితే టెక్స్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ యాక్టివేట్‌ అవుతుంది. తెర నల్లగా అవుతుంది. పైన టూల్‌బార్‌ ప్రత్యక్షమవుతుంది. ఇందులో లాంగ్వేజ్‌ డ్రాప్‌ డౌన్‌, సింగిల్‌ లైన్‌ ఇన్‌సైడ్‌ ఎ బాక్స్‌, స్ప్రెడ్‌షీట్‌, సెటింగ్స్‌ గుర్తులు కనిపిస్తాయి. లాంగ్వేజ్‌ డ్రాప్‌ డౌన్‌ ఇష్టమైన భాషను ఎంచుకోవటానికి తోడ్పడుతుంది. పీసీలో ఇన్‌స్టాల్‌ అయిన ఓసీఆర్‌ ప్యాక్‌లో ఉన్న భాషలనే టెక్స్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ గుర్తిస్తుంది. పరికరంలో ఒక్క భాషే అందుబాటులో ఉంటే డ్రాప్‌ డౌన్‌ జాబితాలో అదొక్కటే కనిపిస్తుంది. సింగిల్‌ లైన్‌ ఇన్‌సైడ్‌ ఎ బాక్స్‌ గుర్తేమో ఒక్క వాక్యంలోనే ఫలితాన్ని చూపిస్తుంది. స్ప్రెడ్‌షీటేమో పట్టిక రూపంలో టెక్స్ట్‌ను సంగ్రహిస్తుంది. ఇక సెటింగ్స్‌ గుర్తు వేరే విండోలో పవర్‌టాయ్స్‌ సెటింగ్స్‌ను ఓపెన్‌ చేస్తుంది. ఇక్కడి నుంచి టెక్స్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ను ఎనేబుల్‌/డిసేబుల్‌ చేసుకోవచ్చు. ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు.
  • ఈ టూల్‌బార్‌తో పాటు తెర మీద ప్లస్‌ గుర్తుతో కూడిన బాక్స్‌ కూడా ఓపెన్‌ అవుతుంది. దీన్ని మౌజ్‌ బటన్‌తో కదిలించొచ్చు. ఇమేజ్‌లో టెక్స్ట్‌ ఉన్న చోటు మొత్తం ఆక్రమించేలా బాక్స్‌ను సాగదీయాలి.
  • అనంతరం మౌజ్‌తో క్లిక్‌ చేసి డ్రాగ్‌ చేయాలి. ఇది విండోస్‌ స్పిన్నింగ్‌ టూల్‌ మాదిరిగానే పనిచేస్తుంది. మౌజ్‌ను వదిలేయగానే టెక్స్ట్‌ క్లిప్‌బోర్డులో సేవ్‌ అవుతుంది.
  • వేరే డాక్యుమెంట్‌ను ఓపెన్‌ చేసి పేస్ట్‌ చేయాలి.
  • ఒకసారి టెక్స్ట్‌ను సరి చూసుకోవాలి. ఎందుకంటే ఇమేజ్‌ మసకగా, చిన్నగా, టెక్స్ట్‌ గజిబిజిగా ఉంటే సరిగా కాపీ కాకపోచ్చు.
  • ఇదొక్కటే కాదు.. గూగుల్‌ ఫొటోస్‌, యాపిల్‌ ఫొటోస్‌ యాప్స్‌ కూడా ఇమేజ్‌ నుంచి అక్షరాలను సంగ్రహించటానికి తోడ్పడతాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని