మన భూమి బంగారం!

బంగారం మీద మనకున్న మోజు అంతా ఇంతా కాదు. అరుదైనదీ, అందమైనదీ, విలువైనదీ కావటమే కాదు.. వివిధ పరిశ్రమల్లోనూ వాడుతుండటం వల్ల దీనిపై ఆసక్తి పెరుగుతూనే వస్తోంది.

Updated : 18 Oct 2023 07:46 IST

బంగారం మీద మనకున్న మోజు అంతా ఇంతా కాదు. అరుదైనదీ, అందమైనదీ, విలువైనదీ కావటమే కాదు.. వివిధ పరిశ్రమల్లోనూ వాడుతుండటం వల్ల దీనిపై ఆసక్తి పెరుగుతూనే వస్తోంది. భూమి ఏర్పడిన కొత్తలో అంతరిక్ష వస్తువులు బలంగా ఢీకొట్టటం వల్ల బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలు మన గ్రహానికి చేరుకున్నాయని.. మునుపు ఊహించినదాని కన్నా ఇవి ఉపరితలానికి చేరువలో నిక్షిప్తమయ్యాయని భావిస్తుంటారు. అయితే ఏ పక్రియతో ఈ లోహాలు భూమిలో కలిశాయనేది ఇప్పటికీ రహస్యమే. దీనికి సంబంధించి యేల్‌ యూనివర్సిటీకి చెందిన జున్‌ కొరెంగా, ఎస్‌డబ్ల్యూఆర్‌ఐకి చెందిన సైమోన్‌ మార్చి కొత్త విషయాన్ని గుర్తించారు. బంగారం, ప్లాటినం అనేవి సైడరోఫైల్‌ మూలకాలు. అంటే ఐరన్‌తో బలమైన సంబంధాన్ని కలిగుంటాయి. ఖగోళ వస్తువులు ఢీకొన్నప్పుడు ఇవి నేరుగా ఐరన్‌తో కూడిన భూ అంతర్భాగంలో కలిసిపోవటమో.. లేదా అతి వేగంగా మ్యాంటిల్‌ నుంచి అంతర్భాగంలోకి కుంగిపోవటమో జరిగి ఉండొచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు. విలువైన లోహాలు భూ ఉపరితలానికి సమీపంలో పోగుపడకపోవటానికిదే కారణం కావొచ్చని భావిస్తున్నారు. భూమి దిగువ పొర అయిన మ్యాంటిల్‌ అడుగున పలుచగా ఉండే చోట నెలకొనే పరిస్థితుల ఆధారంగా దీన్ని కనుగొన్నారు. ఇక్కడ మ్యాంటిల్‌ అడుగు భాగం కరిగిన దశలో ఉంటే పైభాగం ఘన స్థితిలో ఉంటుంది. ఇది లోహాలను పట్టి ఉంచి, వాటిని మిగతా మ్యాంటిల్‌ భాగాలకు చేరవేస్తుంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ వస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తొలిదశలో భూమిని ఖగోళ వస్తువు బలంగా ఢీకొన్నప్పుడే మ్యాంటిల్‌లో ఆ పలుచటి భాగం ఏర్పడిందనీ బలంగా నమ్ముతున్నారు. ఇది బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాల ఆవిర్భావం గురించే కాదు.. విశ్వంలో ఖగోళ వస్తువుల పుట్టుక విషయంలోనూ కొత్త సంగతులను వెలువరించింది. మ్యాంటిల్‌ దిగువన ఈ పలుచటి ప్రాంతం అతి తక్కువ సమయంలో.. అదీ ఒకరోజులోనే ఏర్పడి ఉండొచ్చని తమ అధ్యయనంలో గుర్తించామని కొరెంగా పేర్కొంటున్నారు. కానీ దీని ప్రభావం మాత్రం కోట్లాది సంవత్సరాల వరకూ కొనసాగుతూ వచ్చిందని, భూ పరిణామ క్రమంలో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపించిందని వివరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని