క్యాన్సర్‌ తీరును పసిగట్టే ఏఐ

ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్‌ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సౌత్‌వెస్ట్రన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్‌’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం.

Updated : 13 Dec 2023 01:31 IST

రోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్‌ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సౌత్‌వెస్ట్రన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్‌’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. ఇది క్యాన్సర్‌ బాధితుల నుంచి సేకరించిన కణజాల నమూనాలను విశ్లేషించి, జబ్బు ఎలా పరిణమించగలదో కచ్చితంగా అంచనా వేస్తుంది. అదెలా అంటారా? కణజాలంలోని కణాల అమరికను విశ్లేషించటం ద్వారా. కణజాలాల్లో కణాల అమరిక అనేది గజిబిజి ముక్కల పజిల్‌ లాంటిది. ఒక్కో ముక్కను ఒక్కో కణం అనుకోవచ్చు. ఇవి కచ్చితంగా తమ స్థానంలో కుదురుకొని, ఒకదాంతో మరోటి అనుబంధాన్ని ఏర్పరచుకోవటం వల్లనే కణజాలాలు, అవయవాలకు ఆయా ఆకారాలు ఏర్పడతాయి. కణజాలంలో కణాల మధ్య సంక్లిష్ట సంబంధాలను గుర్తించటమే సియోగ్రాఫ్‌ చేసే పని. ఇది మనుషులు గ్రహించలేని సూక్ష్మ సమాచారాన్నీ సంగ్రహించి, క్యాన్సర్‌ బాధితుల భవిష్యత్తును అంచనా వేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా క్యాన్సర్‌ బాధితుల నుంచి సేకరించిన కణజాలాన్ని నిపుణులు గాజు పట్టీల మీద విశ్లేషించి, జబ్బును నిర్ధరిస్తుంటారు. అయితే ఇదంత తేలిక కాదు. దీనికి సమయం పడుతుంది. జబ్బును నిర్ధరించే నిపుణుల అభిప్రాయాలూ వేర్వేరుగా ఉండొచ్చు. పైగా మన మెదడు కొన్ని స్వల్ప మార్పులను గుర్తించలేకపోవచ్చు. రోగుల పరిస్థితిని తెలియజేసే ముఖ్యమైన సూచనలను విస్మరించొచ్చు. ఇక్కడే ఏఐ మోడళ్లు ఉపయోగపడుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా కణాల రకాలు, కణాల మధ్య సాన్నిహిత్యం వంటి వాటిని గుర్తించటానికి కొన్ని మోడళ్లనూ రూపొందించారు. అయితే కణాల అమరిక మధ్య దూరం వంటి అత్యంత సంక్లిష్టమైన సమాచారాన్ని సంగ్రహించటంలో అంతగా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలోనే సియోగ్రాఫ్‌ ఏఐ మోడల్‌ను రూపొందించారు. రోగ నిర్ధరణ నిపుణులు గాజు పట్టీల మీద కణజాలాన్ని విశ్లేషించినట్టుగానే ఇది పనిచేస్తుంది. ఇమేజెస్‌లోని కణాలను గుర్తించటంతో ఆరంభించి వాటి స్థానాలను పసిగట్టటం మొదలెడుతుంది. కణాల రకాలతో పాటు వాటి ఆకారాలు, అమరికను గుర్తించి, వాటి పటాన్ని రూపొందిస్తుంది. ఇలా ఆయా క్యాన్సర్‌ కణాల మధ్య తేడాలను విజయవంతంగా కనిపెడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక ప్రయోగ పరీక్షలో ఇది నోటి క్యాన్సర్‌ ముందస్తు మార్పులనూ గుర్తించింది. అది క్యాన్సర్‌గా మారే అవకాశాన్నీ అంచనా వేసింది. అన్ని ప్రయోగ పరీక్షల్లోనూ సంప్రదాయ విధానాలను సియోగ్రాఫ్‌ మించిపోవటం గమనార్హం. రోగులకు సరిపోయే చికిత్సలను నిర్ణయించుకోవటంతో పాటు క్యాన్సర్‌ ముప్పు అధికంగా గలవారు తీసుకోవాల్సిన నివారణ చర్యలను ముందే సూచించటానికీ ఇది తోడ్పడగలదని ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని