డేటా వృథా...కిటుకులతో ఆదా

నా స్మార్ట్‌ ఫోన్‌... మొబైల్‌ డేటాని తాగేస్తోంది! మొన్నే కదా రీఛార్జ్‌ చేయించా... అప్పుడే అయిపోయిందా! ఒక్కసారి మొబైల్‌ డేటా ఆన్‌ చేస్తే... వందల ఎంబీ ఖర్చయిపోతోంది! రాత్రి ఫోన్‌లో నెట్‌ ఆన్‌ చేసి ఆఫ్‌ చేయడం మరచిపోయా... ఉదయానికి మొత్తం అయిపోయింది! స్మార్ట్‌ఫోన్‌ వాడే వారికి తరచుగా ఎదురయ్యే అనుభవాలివి. 28 రోజుల డేటా ప్యాక్‌...

Updated : 22 Nov 2022 16:38 IST

నా స్మార్ట్‌ ఫోన్‌... మొబైల్‌ డేటాని తాగేస్తోంది!
మొన్నే కదా రీఛార్జ్‌ చేయించా... అప్పుడే అయిపోయిందా!
ఒక్కసారి మొబైల్‌ డేటా ఆన్‌ చేస్తే... వందల ఎంబీ ఖర్చయిపోతోంది!
రాత్రి ఫోన్‌లో నెట్‌ ఆన్‌ చేసి ఆఫ్‌ చేయడం మరచిపోయా... ఉదయానికి మొత్తం అయిపోయింది!
స్మార్ట్‌ఫోన్‌ వాడే వారికి తరచుగా ఎదురయ్యే అనుభవాలివి. 28 రోజుల డేటా ప్యాక్‌... 10 రోజులకే అయిపోతుందంటూ బాధపడేవాళ్లలో మీరూ ఉన్నారా? అయితే మీ ఫోన్‌, ఆప్స్‌ సెట్టింగ్స్‌లో చిన్న మార్పులు చేసి డేటా వృథా కాకుండా ఆదా చేసుకోవచ్చు. అవేంటో, ఎలా చేయాలో ఒక లుక్కేద్దాం!

అన్నీ డౌన్‌లోడ్‌ వద్దు

వాట్సాప్‌, టెలీగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, గూగుల్‌ ఆలో లాంటి మెసేజింగ్‌ ఆప్స్‌లో వస్తున్న ఫొటోలు, వీడియోలు ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్‌ అయిపోతున్నాయా? దీని వల్ల చాలా డేటా వృథా అవుతుంటుంది. కావల్సిన ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఉంటే ఈ సమస్యను అధిగమించొచ్చు. ఈ ఆప్స్‌లో మొబైల్‌ డేటా వాడుతున్నప్పుడు ఫొటోలు వాటంతట అవే డౌన్‌లోడ్‌ కాకుండా చేసే ఆప్షన్‌ ఉంది. వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోల ఆటోమేటిక్‌ డౌన్‌లోడ్‌ నిలిపేయడానికి... ఆప్‌ స్క్రీన్‌పైన కుడివైపు ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ ఒత్తి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో ‘మీడియా ఆటో డౌన్‌లోడ్‌’ ట్యాబ్‌ క్లిక్‌ చేయండి. అక్కడ ఉన్న ‘మొబైల్‌ డేటా వాడినప్పుడు ఏవేవి ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్‌ అవ్వాలి’ ఆప్షన్‌లో వీడియోలు, ఫొటోలు తదితర అంశాలను డిజేబుల్‌ చేసుకోవాలి. టెలీగ్రామ్‌ ఆప్‌లోనూ ఇదే విధంగా మీడియా డౌన్‌లోడ్‌ను క్రమబద్ధీకరించొచ్చు. జిఫ్‌లు ఆటో ప్లే కాకుండా చేసే ఆప్షన్‌ కూడా ఉంటుంది. గూగుల్‌ ఆలో విషయానికొస్తే... సెట్టింగ్స్‌లో ‘ఆల్వేస్‌ డౌన్‌లోడ్‌ మీడియా’ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేసి డేటా వృథాను అరికట్టొచ్చు.


బ్యాక్‌గ్రౌండ్‌ డేటా

ప్రతి ఆప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను వినియోగించుకుంటుంది. అంటే ఆప్‌ ఓపెన్‌ చేయకపోయినా అది ఎంతో కొంత మొబైల్‌ డేటాను వాడుకుంటుందన్నమాట. అలా డేటా వినియోగంలో ఉండటం వల్లే ఆ ఆప్‌ ఓపెన్‌ చేయకపోయినా దానికి సంబంధించిన మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లు వస్తుంటాయి. ఒకవేళ మీకు అలా నోటిఫికేషన్లు రాకపోయినా ఫర్వాలేదనుకుంటే బ్యాక్‌గ్రౌండ్‌ డేటా ఆప్షన్‌ను ఆపేయడం ద్వారా డేటాను ఆదా చేసుకోవచ్చు. దీని కోసం మొబైల్‌ సెట్టింగ్స్‌లోని డేటా యూసేజ్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత పైన కనిపించే మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ‘రిస్ట్రిక్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ డేటా’ అనే ఆప్షన్‌ను ఉంటుంది. దాన్ని ఎనేబుల్‌ చేస్తే ఓపెన్‌ చెయ్యని ఆప్స్‌ మొబైల్‌ డేటాను యాక్సెస్‌ చేయలేవు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్‌ ఉపయుక్తంగా ఉంటుంది.


ఎంత ఖర్చవుతోంది

మొబైల్‌లో వేసుకున్న డేటా ప్లాన్‌లో ఎంత డేటా ఉంది, ఇంకెంత మిగిలుందనే విషయం ఎప్పటికప్పుడు తెలిస్తే డేటాను ఆదా చేసుకోవడం సులభమవుతుంది. దీని కోసం ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఓ ఆప్షన్‌ ఉంది. దాన్ని ఎనేబుల్‌ చేయడానికి మొబైల్‌ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి. అందులో డేటా యూసేజ్‌ ట్యాబ్‌ను క్లిక్‌ చేయండి. దాంట్లో మీ డేటా ప్యాక్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోండి. అంటే వ్యాలిడిటీ, ఎంత మొత్తంలో మొబైల్‌ డేటా వస్తుంది, ఎంత ఖర్చయితే నోటిఫికేషన్‌ రావాలి... లాంటి అంశాలన్నమాట. ఆ తర్వాత మీ డేటా యూసేజ్‌ వివరాల్ని ఈ విభాగంలో చూసి తెలుసుకోవచ్చు. డేటా లిమిట్‌కు చేరువవుతున్న సమయంలో ఆ విషయాన్ని ముందు జాగ్రత్తగా నోటిఫికేషన్‌ రూపంలో మీకు సమాచారం పంపిస్తుంది.


ఆఫ్‌లైన్‌లో పాటలు

మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ఆప్స్‌లో పాటలు వినడం అంటే మీకు ఇష్టమా? వింక్‌, రాగా, గానా లాంటి ఆప్స్‌లో ఎక్కువగా పాటలు వింటుంటారా. మొబైల్‌ డేటా ఆన్‌ చేసి వాటిలో పాటలు వింటే నెట్‌ తొందరగా ఖర్చయిపోతుంది. ఈ ఇబ్బంది లేకుండా వైఫై అందుబాటులో ఉన్నప్పుడు ముందుగానే ఆ పాటలు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల మొబైల్‌ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు వింక్‌ ఆప్‌ తీసుకుంటే...ఆ ఆప్‌లో ఈ ఆప్షన్‌ ఎనేబుల్‌ చేయాలంటే ఆప్‌ స్క్రీన్‌పై ఎడమవైపున్న సెట్టింగ్స్‌ ఆప్షన్‌లో ‘డేటా సేవ్‌ మోడ్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తితే Download on wifi only అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే సరి. యూట్యూబ్‌లోనూ ఈ తరహా ఆఫ్‌లైన్‌ సౌకర్యం ఉంది.


మ్యాప్స్‌ ముందుగా

చిరునామా వెతకడానికి గూగుల్‌ మ్యాప్స్‌ను మించిన ఆప్షన్‌ మరొకటి లేదు. అయితే మ్యాప్స్‌ను యాక్సెస్‌ చేయడానికి డేటా ఎక్కువగానే ఖర్చవుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌ చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. మీకు కావల్సిన ప్రాంతాలను సెలెక్ట్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌ పైన మూడు అడ్డ గీతల ఐకాన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తితే ‘ఆఫ్‌లైన్‌ ఏరియాస్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఒత్తి మ్యాప్‌పై మీకు కావల్సిన ప్రాంతాన్ని సెలెక్ట్‌ చేసి ఆఫ్‌లైన్‌ బటన్‌ ఒత్తండి. అప్పుడు ఆ ప్రాంతం ఆఫ్‌లైన్‌లో స్టోర్‌ అవుతుంది. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌ ఏరియాస్‌ ట్యాబ్‌పై కుడివైపునున్న సెట్టింగ్స్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ‘మొబైల్‌ డేటా సేవ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకుంటే ఆఫ్‌లైన్‌ చేసిన మ్యాప్స్‌ను మొబైల్‌ డేటా లేకుండా వాడుకోవచ్చు.


వైఫై ఉంటేనే

స్మార్ట్‌ ఫోన్‌ మొబైల్‌ డేటా వాడకంలో ఆప్స్‌ అప్‌డేట్‌ వాటా ఎక్కువగా ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర ఆప్స్‌కు ఎక్కువగా అప్‌డేట్లు వస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా ఆప్స్‌ అందించే కొత్త ఆప్షన్లు, ఆప్‌ల్లో చేసే మార్పులను పొందలేము. అలాగని మొబైల్‌ డేటాతో డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఇబ్బంది. ఆప్స్‌ అప్‌డేట్‌కు డేటా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిని వైఫై అందుబాటులో ఉన్నప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటే డేటా ఖర్చు తగ్గించుకోవచ్చు. దీని కోసం మొబైల్‌లోని ప్లేస్టోర్‌ ఆప్‌ ఓపెన్‌ చేయండి. ఆ ఆప్‌ సెట్టింగ్స్‌లో Auto update apps ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ‘వైఫై ఉన్నప్పుడే ఆప్స్‌ను అప్‌డేట్‌ చేయండి’ అనే ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోండి.


అవసరమైతేనే...

మీ ఫోన్‌లో ఏ ఆప్‌ ఎంత డేటా వినియోగిస్తోంది, సెట్టింగ్స్‌ మార్చుకుంటే ఎంత డేటా ఆదా చేయొచ్చు లాంటి విషయాలు తెలుసుకునే ఆప్‌లు కొన్ని ఉన్నాయి. వీటితో డేటాను కుదించి (కంప్రెస్‌ చేసి) వాడుకోవచ్చు.. Opera Max, Dataeye ఇలాంటి ఆప్సే. ఇలాంటి ఆప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఏయే ఆప్‌, ఎంత డేటాను వినియోగిస్తోందనే విషయం సులభంగా తెలిసిపోతుంది. డేటా వినియోగం అక్కర్లేదనుకొనే ఆప్స్‌ను ఇక్కడి నుంచే ఎంచుకోవచ్చు. ఈ ఆప్స్‌ ద్వారా నిమిషాల వారీగా డేటా వినియోగాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ‘డేటాఐ’ ఆప్‌ను తీసుకుంటే ఈ ఆప్‌ను ఓపెన్‌ చేస్తే మీ ఫోన్‌ను స్కాన్‌ చేసి డేటాను వినియోగించుకునే అవసరం ఏయే ఆప్స్‌కు ఉంది అనేది తెలుసుకుంటుంది. ఆ తర్వాత అక్కర్లేని ఆప్స్‌కు డేటాను ఆపివేస్తుంది.


వీడియోలు... క్లిక్‌ చేస్తేనే!

సామాజిక అనుసంధాన వేదికల్లో డేటా ఎక్కువగా ఖర్చయ్యే విషయాల్లో ‘వీడియోల ఆటో ప్లే’ ఒకటి. సాధారణంగా వీడియోను క్లిక్‌ చేస్తేనే ప్లే అవుతుంది. అయితే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి వాటిలో వీడియోపై క్లిక్‌ చేయకపోయినా... ఆ పోస్ట్‌ను చూస్తే చాలు ప్లే అవుతుంది. ఈ ఆప్షన్‌ డిజేబుల్‌ చేసుకొని డేటా వృథాను తగ్గించుకోవచ్చు.

* ఫేస్‌బుక్‌లో ‘వీడియో ఆటో ప్లే’ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేయడానికి ఫేస్‌బుక్‌ ఆప్‌లో ఎడమవైపు ఉన్న మూడు అడ్డ గీతల ఐకాన్‌ను ఒత్తండి. అక్కడ ‘ఆప్‌ సెట్టింగ్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్తే ‘ఆటోప్లే’ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తితే వీడియోలు ప్లేకు సంబంధించిన మూడు ఆప్షన్లు వస్తాయి. మీరు వైఫై ఉన్నప్పుడు మాత్రమే వీడియోల ఆటోప్లే అవ్వాలా, అస్సలు ఆటోప్లే ఆప్షనే వద్దా అనేది మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు.

* ట్విట్టర్‌ విషయానికొస్తే... ఆప్‌ సెట్టింగ్స్‌ ట్యాబ్‌లోని డేటా ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ వీడియో ట్యాబ్‌ కింద ‘వీడియో ఆటో ప్లే’ అప్షన్‌ ఉంటుంది. అందులోకి వెళ్తే ఫేస్‌బుక్‌ తరహాలోనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు కావల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ట్వీట్లు చూస్తున్నప్పుడు ఇమేజ్‌ ప్రివ్యూ కనిపించడం వల్ల కూడా కాస్త డేటా ఖర్చవుతుంది. దీన్ని కూడా ఆఫ్‌ చేసుకుంటే మంచిది.

* ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ తరహా ఆప్షన్‌ ఉంది. ఆప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తక్కువ డేటా వినియోగంతో ఇన్‌స్టాగ్రామ్‌ పని చేసేలా చేయొచ్చు. తక్కువ డేటా వాడుకుంటున్నప్పుడు ఫొటోలు, వీడియోలు లోడ్‌ అవ్వవు. దీని కోసం ఆప్‌ స్క్రీన్‌ దిగువన ఉన్న ప్రొఫైల్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత పైన కనిపించే మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. ఆ తర్వాత ‘సెల్యూలర్‌ డేటా యూజ్‌’ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ‘యూజ్‌ లెస్‌ డేటా’ను ఎనేబుల్‌ చేసుకుంటే సరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు