పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే చర్చలు

పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ చేసిన ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా

Published : 24 Jan 2022 04:14 IST

సంప్రదింపులకు ఏపీ ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించిన స్టీరింగ్‌ కమిటీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేడు ఉద్యోగుల సమ్మె నోటీసు

ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ చేసిన ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అశుతోష్‌ మిశ్ర నివేదికను ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. అంతకుముందు.. ఉద్యోగ సంఘాల నాయకులను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా మంత్రుల కమిటీ ఆహ్వానించింది. సంప్రదింపుల కోసం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు.  

విజయవాడలోని రెవెన్యూ కార్యాలయంలో పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ ఆదివారం దాదాపు 5గంటలకు పైగా సమావేశమై చర్చించింది. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం, వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. గతంలో ఇలాంటి విధానాన్ని చూడలేదంది. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త జీతాలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తేవొద్దని సూచించింది. జిల్లాలతోఉద్యమ కార్యాచరణ సమన్వయం, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై సమాధానాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా 8 మందితో పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటుచేసింది. స్టీరింగ్‌కమిటీలో సభ్యులను 20కి పెంచారు. సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు ప్రకటించాయి.

ఇంత పెద్ద ఉద్యోగుల ఉద్యమం చరిత్రలో ఎప్పుడూ లేదని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు హితవు పలికారు. పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను ఇస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారు: ఎన్‌ఎంయూ

ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని ఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత తెలిపారు. ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. వంద శాతం విజయవాడలోని ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. అందులో సుజాత మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని