రాజ్యసభ సభ్యులుగా దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దామోదర్‌రావు,

Published : 25 Jun 2022 03:08 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి ఇద్దరూ దైవసాక్షిగా తెలుగులో ప్రమాణం చేశారు.అనంతరం తనతో సమావేశమైన నూతన సభ్యులకు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తర్వాత ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత, రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో అంతా కలిసి ఫొటోలు దిగారు.  

ఏపీ నుంచి కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి..

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యులుగా ర్యాగ కృష్ణయ్య, సిర్గాపూర్‌ నిరంజన్‌రెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కృష్ణయ్య తెలుగులో, నిరంజన్‌రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం ఛైర్మన్‌ వెంకయ్యనాయుడితో వారు సమావేశమయ్యారు. నూతన సభ్యులకు ఛైర్మన్‌ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిరంజన్‌ బిషి కూడా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

జగన్‌ రాజకీయ ఆయుధం ఇచ్చారు

బీసీల అభ్యున్నతికి 47 ఏళ్లుగా ఆయుధం లేకుండా పోరాడుతున్న తనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ఆయుధం ఇచ్చారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసిన అనంతరం జంతర్‌మంతర్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. క్రీమీలేయర్‌ విధానాన్ని తొలగించే వరకు పోరాడతానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని