Telangana Secretariat: కొత్త సచివాలయానికి గోల్డ్‌ రేటింగ్‌

హరిత ప్రమాణాలతో భవనాలను నిర్మిస్తే అందులో పని చేసే వారి ఉత్పాదకత పెరుగుతుందని, విద్యుత్తు, నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం ఆదా అవుతుందని హరిత భవన మండలి హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి చెప్పారు.

Updated : 29 Apr 2023 09:54 IST

‘ఈనాడు’తో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ శేఖర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: హరిత ప్రమాణాలతో భవనాలను నిర్మిస్తే అందులో పని చేసే వారి ఉత్పాదకత పెరుగుతుందని, విద్యుత్తు, నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం ఆదా అవుతుందని హరిత భవన మండలి హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి చెప్పారు.  తెలంగాణ కొత్త సచివాలయాన్ని హరిత భవన మండలి(ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌-ఐజీబీసీ) ప్రమాణాల మేరకు నిర్మించారని వెల్లడించారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ కొత్త సచివాలయం గోల్డ్‌ రేటింగ్‌ కోసం ఎంపికైందని చెప్పారు. ‘‘ఆ రేటింగ్‌ ప్రమాణాలను పాటించిన సచివాలయం దేశంలో మరొకటి లేదు. హరిత ప్రమాణాల మేరకు భవనాలను నిర్మించనున్నట్లు ఆయా సంస్థలు ఐజీబీసీకి దరఖాస్తు చేసుకుంటాయి. అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నిపుణులతో కౌన్సిల్‌ ఉంటుంది. నిపుణుల బృందం ఆ నిర్మాణాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. నిర్మాణ తీరుతెన్నులు తెలుసుకుంటుంది. సహజ సిద్ధమైన గాలి, వెలుతురు పుష్కలంగా భవనంలోకి రావాలి. నీటి వృథాను నియంత్రించేందుకు సెన్సర్స్‌, ఆటోమేటిక్‌ విద్యుత్తు పరికరాలు ఉపయోగించాలి. పాటించిన నిబంధనల ప్రకారం ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌, సర్టిఫికెట్‌.. ఇలా గుర్తింపు ఉంటుంది.

ప్రభుత్వ భవనాల్లో రెండింటికి..

రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో రెండింటికి గోల్డ్‌ రేటింగ్‌ లభించింది. ఇంతక్రితం హైదరాబాద్‌లో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఇది దక్కగా తాజాగా సచివాలయం ఈ రేటింగ్‌కు ఎంపిక అయింది. సచివాలయంలో నూరు శాతం ఎల్‌ఈడీ లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భవనంలోని వారికి బయటి పరిసరాలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు వినియోగాన్ని పర్యవేక్షించేందుకు భవన నిర్వహణ వ్యవస్థ(బీఎంఎస్‌)ను ఏర్పాటు చేశారు. పచ్చదనం కోసం స్థానిక మొక్కలను తీసుకున్నారు. సెంట్రల్‌ కోర్డుయార్డు నమూనాను వినియోగించారు’ అని శేఖర్‌రెడ్డి వివరించారు. ‘మండలి పరిధిలో దేశవ్యాప్తంగా పది వేల భవనాలు నమోదు అయ్యాయి. తెలంగాణ నుంచి 600 భవనాలు ఉన్నాయి. ఐజీబీసీ ప్రమాణాల మేరకు పరికరాలను ఉపయోగించటంతో రేడియేషన్‌ తక్కువ ఉండటంతో ఆ భవనంలో పని చేసే వారిలో ఉత్పాదకత పెరుగుతుందని శాస్త్రీయంగా గుర్తించారు’ అని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు