డిజిటల్‌ అక్షరాస్యతకు ‘కంప్యూటర్‌ ఛాంప్స్‌’

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్‌ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అత్యవసరం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చేందుకు పాఠశాలల్లో లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్లు కొనుగోలు చేశారు.

Published : 20 Jun 2023 03:59 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల:  ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్‌ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అత్యవసరం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చేందుకు పాఠశాలల్లో లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్లు కొనుగోలు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ‘కంప్యూటర్‌ ఛాంప్స్‌’ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇదీ ఉద్దేశం..: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులతో పోటీ పడే స్థాయికి తీసుకురావాలనేది దీని ప్రధానోద్దేశం. దీనికోసం జిల్లా పరిషత్తు, మోడల్‌, కేజీబీవీలకు చెందిన 60 పాఠశాలలను ఎంపికచేశారు. 6 నుంచి పదో తరగతి వరకు 12,823 మంది విద్యార్థులకు డిజిటల్‌ అక్షరాస్యతను అందించనున్నారు.

జేఎన్‌టీయూ సాంకేతిక సహకారం..: కంప్యూటర్‌ ఛాంప్స్‌కు ఆటంకం లేకుండా సాగాలంటే స్థానిక వనరులను వినియోగించుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆలోచన చేశారు. అందులో భాగంగా జేఎన్‌టీయూలోని కంప్యూటర్‌ విభాగం అధ్యాపకుల నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈనెల 15న ఎంపిక చేసిన పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణనిచ్చారు. రూ.1.17 లక్షలు వెచ్చించి ఒకటి నుంచి పది భాగాలుగా పాఠ్యాంశాలను పుస్తకాల రూపంలో తయారు చేయించారు. వీటిలో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ హిస్టరీ, పెయింట్, నోట్పాడ్‌ అండ్‌ టైపింగ్‌ ప్రాక్టీస్‌, ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ ఎంఎస్‌ ఆఫీస్‌, వర్డ్‌, ఎక్సెల్‌ బేసిక్స్‌, ఎమ్మెస్‌ పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌, ఇంటర్నెట్ ఆపరేషన్‌ సైబర్‌ సెక్యూరిటీ తదితర అంశాలను విద్యార్థులకు నేర్పిస్తారు. రాబోయే తరాలకు ఇవి కనీస అవసరాలుగా మారనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని