Telangana Rains: కుండపోత వాన

రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురం భీం జిల్లా బెజ్జూరులో 20 సెం.మీ. వర్షం కురిసింది.

Updated : 21 Jul 2023 08:24 IST

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
పొంగిపొర్లిన వాగులు
రహదారులు జలమయం
హైదరాబాద్‌లో 24 గంటల్లో 18.8, బెజ్జూరులో అత్యధికంగా  20 సెం.మీ. వర్షపాతం నమోదు
గోదావరి పరవళ్లు.. భద్రాచలం  వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
నేడు విద్యాసంస్థలకు సెలవు
జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు, రేపు  కార్యాలయాలకు, బడులకూ..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం
టీఎస్‌పీఎస్సీ సహా పలు పరీక్షల వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురం భీం జిల్లా బెజ్జూరులో 20 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్‌ సహా అన్ని నగరాలు, పట్టణాలు, మండలాల్లో భారీగా వాన పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో రహదారులు చెరువులను తలపించాయి. ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.  పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. 

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో అత్యధికంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 34.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కుమురం భీం, మంచిర్యాల, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి,  వరంగల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఇందల్‌వాయిలో అత్యధికంగా 105.6 మి.మీ వర్షం పడింది. 

నిలిచిన రాకపోకలు

భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లడంతో పాటు పలుచోట్ల రోడ్లు తెగడం, కోత పడడం, ధ్వంసం కావడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణంలోకి నీరు చేరింది. అక్కడ గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. గోదావరి కరకట్టపై రాకపోకలను పోలీసులు నిషేధించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిన్న గంగారం వద్ద పాలెం వాగుకు గండిపడింది. మండలంలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంతర్రాష్ట్ర రహదారి వరదనీటితో నిండిపోవడంతో ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామస్థులను చెల్పాక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. జనగామ నుంచి సిద్దిపేట మార్గంలో బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్‌నగర్‌ వద్ద కల్వర్టు తెగిపోయింది. దేవాదుల బొమ్మకూరు జలాశయం కుడికాల్వకు వెంకిర్యాల సమీపంలో పలుచోట్ల గండ్లు పడ్డాయి. జనగామ జిల్లాలో ఆకేరు వాగు, సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మొయతుమ్మెద వాగు, మహబూబాబాద్‌ జిల్లాలోని పాకాలేరు, మద్దెలవాగు, దొరవారి తిమ్మాపురం, మొట్ల తిమ్మాపురం వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్‌ శివారులో నల్లవాగు కాల్వ వద్ద తాత్కాలిక రోడ్డు వరదకు కొట్టుకుపోయింది.

వచ్చే మూడు రోజులూ జోరు వానలు

రాష్ట్రంలో వచ్చే మూడు రోజులూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు..,  ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


రాజధానిలో 24 గంటల్లో 18.8 సెం.మీ

హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏమాత్రం తెరపినివ్వలేదు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో సగటున 18.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గురువారం సగటున 10 సెం.మీ. వర్షం కురిసినట్లు అధికారులు అంచనా వేశారు. మియాపూర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 9.9 సెంటీమీటర్లు కురిసింది.


జోలెలో వాగు దాటించి.. వైద్యం అందించి

వెంకటాపురం, న్యూస్‌టుడే: అస్వస్థతతో బాధపడుతున్న గిరిజనుల వైద్య సేవలకు వరదలు ఆటంకం కలిగిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలోని సీతారాంపురానికి చెందిన కుర్సం ముత్తయ్య, కుర్సం సిద్ధు జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలోని పూసువాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సిద్ధును కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతన్ని జెడ్డీ(జోలె)లో మోస్తూ దాటించారు. మరో 5 కి.మీ కాలినడకన ప్రయాణించి ఆలుబాకకు చేర్చారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. డెంగీ అనుమానంతో అతడిని ములుగు ప్రాంతీయ ఆసుపత్రికి వైద్యులు పంపించారు. సీతారాంపురానికి చెందిన కుర్సం బాబూరావు(37) జ్వరం, అనారోగ్య సమస్యలతో గురువారం మృతి చెందారని, గ్రామంలో పలువురు అస్వస్థతతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు.


నేలకూలిన 345 స్తంభాలు

కరెంటు సరఫరా ఆగకుండా డిస్కంల ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలతో కరెంటు సరఫరా నిలిచిపోకుండా డిస్కంలు ఏర్పాట్లు చేశాయి.  రాష్ట్రవ్యాప్తంగా పెనుగాలులు, వర్షాలకు 345 కరెంటు స్తంభాలు నేలకూలగా వాటిని మార్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. కరెంటు సరఫరా  నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించడానికి అందుబాటులో ఉండాలని విద్యుత్‌ ఇంజినీర్లకు సెలవులను రద్దు చేసినట్లు దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి గురువారం తెలిపారు. ఇతరశాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాలరావు, రఘుమారెడ్డి అన్ని జిల్లాల ఇంజినీర్లకు ఆదేశించారు.

స్తంభాలు, వైర్లను తాకవద్దు

వర్షపు నీటిలో ఉన్న కరెంటు స్తంభాలు, వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దని ప్రజలకు సీఎండీలు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమైన వెంటనే ఆ సమాచారాన్ని కరెంటు కార్యాలయాలకు తెలియజేస్తే.. సరఫరా నిలిపివేస్తామని రఘుమారెడ్డి వివరించారు. ప్రతి సర్కిల్‌ పరిధిలో  కంట్రోల్‌ రూములు ఏర్పాటుచేయాలని ఆదేశించినట్లు సీఎండీలు తెలిపారు. ఉత్తర డిస్కం పరిధిలో కరెంటు సమస్యలపై ఫిర్యాదు చేయడానికి  18004250028 , 1912 నంబర్లకు ఫోన్‌ చేయాలని గోపాలరావు పేర్కొన్నారు. దక్షిణ డిస్కం పరిధిలో ఫిర్యాదులు చేయడానికి 1912, 7382071574, 7382072106, 7382072104 నంబర్లకు ఫోన్‌ చేయాలని రఘుమారెడ్డి తెలిపారు. మరోవైపు విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని