IT Internships: మళ్లీ ఇంటర్న్‌షిప్‌ల జోరు!

ఐటీ కంపెనీలు ఏడాది తర్వాత మళ్లీ ఇంటర్న్‌షిష్‌ల జోరు పెంచాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో ఆర్థిక మందగమనంతో సంవత్సర కాలంగా ఇంటర్న్‌షిప్‌లను తగ్గించిన కంపెనీలు మళ్లీ ప్రతిభావంతులైన విద్యార్థులకు ద్వారాలు తెరిచాయి.

Updated : 26 Sep 2023 08:06 IST

ఐటీ కంపెనీలు పిలుస్తున్నాయ్‌..
కోడింగ్‌ నైపుణ్యాలకు పెద్దపీట
వచ్చే మూడేళ్లలో బీటెక్‌ పూర్తిచేసే వాళ్లకు అవకాశం
అమ్మాయిలకే కొన్ని ప్రత్యేకం..
ఇంటర్న్‌షిప్‌ తర్వాత కొలువుల్లోకి..!

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ కంపెనీలు ఏడాది తర్వాత మళ్లీ ఇంటర్న్‌షిష్‌ల జోరు పెంచాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో ఆర్థిక మందగమనంతో సంవత్సర కాలంగా ఇంటర్న్‌షిప్‌లను తగ్గించిన కంపెనీలు మళ్లీ ప్రతిభావంతులైన విద్యార్థులకు ద్వారాలు తెరిచాయి. 3 నుంచి 6 నెలల వరకు ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. ప్రధానంగా ఈసారి కోడింగ్‌ నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2023, 2024 సంవత్సరాల్లో పాసైన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే కాదు.. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలూ భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ సందడి కూడా తగ్గిపోయింది. ఫలితంగా గత ఏడాదిన్నరగా బీటెక్‌ పూర్తయిన చాలామంది విద్యార్థులకు కొలువులు దక్కలేదు. దీనివల్ల కూడా రెండు మూడేళ్లుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుండటం విశేషం.

  • ప్రస్తుతం బీటెక్‌ చదువుతున్న (రెండు, మూడు, నాలుగు సంవత్సరాల) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. ఎంపికైన వారికి పలు కంపెనీలు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు స్టైపెండ్‌ కూడా అందజేస్తున్నాయి. ఇందుకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆప్టిట్యూడ్‌, కోడింగ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి.
  • ఎక్కువగా ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు 70-80 శాతం ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తున్నాయి. విద్యార్థులు బీటెక్‌ మొదటి సెమిస్టర్‌లో ఆప్టిట్యూడ్‌, సీ, డీఎస్‌లు.. రెండో సెమిస్టర్‌లో కోడింగ్‌ విత్‌ జావా లేదా పైథాన్‌ లేదా సీ++ నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడో సెమిస్టర్‌లో డీఎస్‌ఏ కోడింగ్‌పై పట్టు సాధించాలని, అప్పుడే టాప్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లను దక్కించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్న్‌షిప్‌లతో విద్యార్థి దశలోనే ఉద్యోగానుభవం దక్కించుకునే వీలుంటుంది.
  • అట్లాసియన్‌, అమెజాన్‌ వావ్‌, అడోబ్‌ కంపెనీలు కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. కోడింగ్‌ కాంపిటీషన్‌ ప్లస్‌ హ్యాకథాన్‌ పేరిట వారికి పోటీలు నిర్వహించి నగదు బహుమతిని అందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌, రూబ్రిక్‌ ఇంక్‌, జీఈ (కేవలం సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచి విద్యార్థులకు), మోర్గాన్‌ స్టాన్లీ, డైరెక్ట్‌ ఐ, సేల్స్‌ ఫోర్స్‌ తదితర కంపెనీలు అర్హులైన విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. అధిక కంపెనీలు 3-6 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తుండగా.. కొన్ని కంపెనీలు బీటెక్‌ చివరి సంవత్సరం మొత్తం ఆఫర్‌ చేస్తున్నాయి.

కోడింగ్‌పై దృష్టి పెడితేనే..!

ఎక్కువ జీతాలను ప్రొడక్ట్‌ కంపెనీలు మాత్రమే ఇస్తాయి. అందుకే అవి అత్యంత ప్రతిభావంతులను కోరుకుంటున్నాయి. డేటా స్ట్రక్చర్స్‌ ఆల్గరిథమ్స్‌ (డీఎస్‌ఏ) కోడింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారిని ఎంపిక చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. అందుకోసం బీటెక్‌ రెండో సంవత్సరం నుంచే అభ్యర్థులను అన్వేషిస్తున్నాయి. ఇంతవరకు మేం వెర్బల్‌, రీజనింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను కూడా పెంపొందించేందుకు సమయం వెచ్చించాం. తాజాగా డీఎస్‌ఏ కోడింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. విద్యార్థులకు ఆన్‌లైన్‌తోపాటు, క్లాస్‌రూమ్‌ శిక్షణ ఇస్తున్నాం. బీటెక్‌లో చేరిన విద్యార్థులు తొలి ఏడాది నుంచే కోడింగ్‌పై దృష్టి పెడితేనే రెండో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఎంపికైన వారంతా అవే కంపెనీల్లో శాశ్వత కొలువు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వెంకట్‌ కాంచనపల్లి, సీఈఓ, సన్‌టెక్‌ కార్ఫ్‌ ప్లేస్‌మెంట్‌ శిక్షణ సంస్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని