రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!

రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు.

Published : 19 Mar 2024 02:44 IST

కొత్త కోడ్‌, సిరీస్‌తో రవాణా శాఖకు కాసుల పంట

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి జిల్లాలోనూ మొదటి 10 వేల నంబర్ల వరకు జిల్లా కోడ్‌ తర్వాత ‘ఏబీ’ లాంటి సిరీస్‌ లేకుండా నేరుగా నంబర్లు ఉంటాయి. శుక్ర, శని, సోమవారాల్లో 33 జిల్లాల పరిధిలో ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. 18వ తేదీ వరకు ఫ్యాన్సీ నంబర్లు... రిజిస్ట్రేషన్‌ ఫీజుతో కలిపి రూ.4.29 కోట్లు సమకూరగా... ఇందులో కేవలం ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.2.05 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. అన్ని కార్యాలయాల్లో టీజీతోపాటు 0001 కొత్త సిరీస్‌ ప్రారంభం కావడంతో.. అభిరుచి ఉన్న నంబర్లు దక్కించుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి రోజు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఖైరతాబాద్‌ ఆర్టీఏలో టీజీ09 0001 ఏకంగా రూ.9,61,111 ధర పలికింది. రంగారెడ్డి పరిధిలో టీజీ07 0999ను రూ.4,75,999కు దక్కించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, భద్రాద్రి, నిజామాబాద్‌, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, యాదాద్రి, ఖమ్మం తదితర జిల్లాల్లో ఫ్యాన్సీ నంబర్లు ఎక్కువ ధర పలికాయి. 0009, 0999 లాంటి వాటి కోసం ఎక్కువ మంది పోటీ పడుతుంటారని.. పారదర్శకంగా ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా కేటాయిస్తున్నట్లు హైదరాబాద్‌ జేటీసీ రమేశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని