ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్‌

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది.

Updated : 19 Mar 2024 04:35 IST

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. తదుపరి స్థానంలో 3.20 లక్షలతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పుర్‌ కేంద్రం ఉంది. సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు(సీఎస్‌బీ) ఆధ్వర్యంలో బిలాస్‌పుర్‌ కేంద్రంగా దేశంలో 18 దసిలి మూలవిత్తన ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఇందులో 1986లో ఏర్పాటు చేసిన ఎల్లక్కపేట కేంద్రం ఒకటి. ఇది నాణ్యమైన పట్టుగుడ్లు ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతులకు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఘండ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల వారికి అందిస్తోంది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో నిర్వహించిన అంతర్జాతీయ పట్టుపురుగు విత్తన సదస్సులో ఈ కేంద్రం శాస్త్రవేత్త భగవాన్లు ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు.

పట్టుగూళ్లతో రైతులకు ఆదాయం

పట్టుగూళ్లను పండించే రైతులు ఈ కేంద్రాల నుంచి పట్టుగుడ్లను కొనుగోలు చేస్తారు. తీసుకెళ్లిన గుడ్లను బుట్టలో ఉంచుతారు. వాటి నుంచి పురుగులు బయటకు రాగానే అటవీప్రాంతంలో ఉండే నల్ల, తెల్ల మద్ది చెట్లపై విడిచిపెడతారు. పురుగులు గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్డు ఆకారంలో ఏర్పడిన పట్టుకాయలను రైతులు సేకరిస్తారు. ఏటా రెండుసార్లు పండిస్తారు. మొదటిదాన్ని విత్తన పంటగా, రెండో పంటను కమర్షియల్‌గా భావిస్తారు. ఒక్కో రైతు ఏటా సుమారు రూ.50వేల వరకు ఆదాయం పొందుతున్నారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున గుడ్లను ఉత్పత్తి చేసేందుకు ఎల్లక్కపేట కేంద్రం సిబ్బంది ఇప్పటికే ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని