పిల్లలు పుట్టలేదని విడాకులు ఇస్తానంటున్నారు

పెళ్లై పదేళ్లు అవుతున్నా మాకు పిల్లలు లేరు. వైద్య పరీక్షలు చేయించుకుంటే గర్భసంచి బలహీనంగా ఉండటం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదని చెప్పారు. ఈ కారణం చూపిస్తూ నాకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకోమని మావారిపై అత్త, ఆడపడుచు ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం నా మీద రకరకాల అభాండాలు వేస్తున్నారు. దత్తత తీసుకుందామనుకున్నా... అందుకూ ఒప్పుకోవడం లేదు.

Updated : 27 Jun 2023 12:51 IST

పెళ్లై పదేళ్లు అవుతున్నా మాకు పిల్లలు లేరు. వైద్య పరీక్షలు చేయించుకుంటే గర్భసంచి బలహీనంగా ఉండటం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదని చెప్పారు. ఈ కారణం చూపిస్తూ నాకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకోమని మావారిపై అత్త, ఆడపడుచు ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం నా మీద రకరకాల అభాండాలు వేస్తున్నారు. దత్తత తీసుకుందామనుకున్నా... అందుకూ ఒప్పుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన ఫోన్‌ రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయి. చట్టం నాకీ విషయంలో ఎలాంటి సాయం చేయగలదు. -ఓ సోదరి

హిందూ వివాహ చట్టంలో పిల్లలు లేకపోవడాన్ని విడాకులు తీసుకోవడానికి ఒక కారణంగా చూపించలేరు. సంతానం కావాలనుకోవడం తప్పుకాదు. అందుకోసం ఇప్పుడు ఎన్నో అధునాతన చికిత్సా విధానాలున్నాయి.. ప్రయత్నించొచ్చు. చాలామంది వీటిని అనుసరిస్తున్నారు కూడా. భార్యా భర్తలిద్దరూ అంగీకరిస్తే దత్తతా తీసుకోవచ్చు. అయితే, పిల్లల్ని వద్దనుకోవడం మాత్రం క్రూరత్వమే అని ‘ప్రవీణ్‌ మెహతా’ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం భార్య/భర్త ఉండగా వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, క్రూరంగా ప్రవర్తించడం, మరో పెళ్లి చేసుకోవడం, ఎటువంటి కారణం లేకుండా భర్త లేదా భార్యకు దూరంగా ఉండటం, వేరే మతంలోకి మారడం, మానసిక స్థితి సరిగ్గా  లేకపోవడం, నయంకాని సాంక్రమిక వ్యాధుల బారిన పడటం, ఏడేళ్లు కనిపించకుండా పోవడం వంటి వాటిని కారణాలుగా చూపించొచ్చు. ఇవికాక పెళ్లికి ముందే భర్తకు మరో భార్య ఉండటం, మైనర్‌గా ఉన్నప్పుడే భార్యగా చేసుకోవడం, అత్యాచార నిందితుడిగా పరిగణించడం వంటివాటినీ కారణాలుగా చూపించి విడాకులు తీసుకోవచ్చు. ఇక, మీ విషయానికి వస్తే గర్భసంచి బలహీనంగా ఉండటం మీ తప్పుకాదు. మీ మీద అభాండాలు వేస్తే చట్టం ఒప్పుకోదు. మీరు విడాకులు వద్దనుకుంటున్నారు కాబట్టి... ఈ సమస్య చక్కదిద్దడానికి మధ్యవర్తుల సాయం తీసుకోండి. మీ దగ్గరున్న ఆధారాలతో కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందన్నది నిజమే కానీ, మీ మధ్య దూరం మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ముందు ఏదైనా ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ లేదా మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా భర్త, ఆత్త, ఆడపడుచులకు కౌన్సెలింగ్‌ ఇప్పించండి. అలాకాకుండా ఇప్పటికే మీ భర్త విడాకులు కేసు వేసినా కూడా... మీడియేటర్‌ దగ్గర సయోధ్య చేయడానికి ప్రయత్నించొచ్చు. అధైర్య పడకండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని