భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’..!

విడాకులు తీసుకున్న మహిళల్ని చులకనగా చూస్తుంది మన సమాజం.. తప్పు తమది కాకపోయినా కాపురాన్ని సరిదిద్దుకోలేని అసమర్థులుగా పరిగణిస్తూ లేనిపోని నిందలేస్తుంటుంది. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గరే మహిళల పరిస్థితి ఇలా ఉంటే.. పురుషాధిపత్యం ఉన్న ఇస్లామిక్‌ దేశాల్లో వాళ్ల పరిస్థితులెలా ఉంటాయో ఊహించుకోగలం.

Published : 14 May 2024 12:58 IST

(Representational Images)

విడాకులు తీసుకున్న మహిళల్ని చులకనగా చూస్తుంది మన సమాజం.. తప్పు తమది కాకపోయినా కాపురాన్ని సరిదిద్దుకోలేని అసమర్థులుగా పరిగణిస్తూ లేనిపోని నిందలేస్తుంటుంది. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గరే మహిళల పరిస్థితి ఇలా ఉంటే.. పురుషాధిపత్యం ఉన్న ఇస్లామిక్‌ దేశాల్లో వాళ్ల పరిస్థితులెలా ఉంటాయో ఊహించుకోగలం. అలాంటిది ఓ ముస్లిం దేశం మహిళల ఇష్టానికి ప్రాధాన్యమివ్వడం, వాళ్ల నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం నమ్మగలమా? మారిటేనియా దేశమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! తమకు నచ్చని వైవాహిక బంధంలో జీవితాంతం మగ్గిపోకుండా.. విడాకులు తీసుకొని, నచ్చిన వ్యక్తిని పునర్వివాహం చేసుకొనే స్వేచ్ఛను కల్పిస్తోందీ దేశం. అంతేకాదు.. ఇక్కడి మహిళలు తమ విడాకుల్నీ పెళ్లి మాదిరిగానే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం! మహిళల స్వేచ్ఛకు, సాధికారతకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోన్న ఈ దేశ విడాకుల ఆచారం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..!

పరిహారం ఇచ్చి మరీ!

మారిటేనియా.. ఉత్తర ఆఫ్రికాలోని ఈ దేశానికి అట్లాంటిక్‌ మహాసముద్రం, సహారా ఎడారి సరిహద్దులు. అరబ్‌ దేశమైన ఇక్కడి జనాభా సుమారు 43 లక్షలుంటుంది. సాధారణంగా ముస్లిం దేశం అనగానే పురుషాధిపత్య సమాజమే గుర్తొస్తుంది. వివాహం, విడాకుల విషయాల్లోనూ పురుషులదే అంతిమ నిర్ణయంగా ఉండడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ దేశంలోనూ వివాహం, విడాకులు ఇస్లామిక్‌ చట్టం ప్రకారమే జరుగుతున్నప్పటికీ.. ఈ చట్టంలోని ‘ఖుల్‌’ అనే నిబంధన ప్రకారం భార్య తన ఇష్టప్రకారమే.. తన భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు. అయితే సాధారణంగా పెళ్లి సమయంలో తీసుకున్న కట్నాన్ని.. విడాకులు తీసుకున్నప్పుడు వరుడు కుటుంబ సభ్యులు తిరిగి వధువుకు చెల్లిస్తుంటారు. కానీ ఖుల్‌ నిబంధన ప్రకారం.. భార్యే భర్తకు కొంత మొత్తం పరిహారం రూపంలో చెల్లిస్తూ ఆ బంధం నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఇలా తిరిగి మహిళలే పురుషులకు డబ్బు చెల్లించడాన్ని ఒక రకమైన హోదాగా, సాధికారతకు నిదర్శనంగా భావిస్తారు ఇక్కడి స్త్రీలు.

విడాకుల ‘పార్టీ’!

సాధారణంగా విడాకులంటేనే అదొక ప్రతికూలమైన అంశం. అందుకే ఆ సమయం ప్రతి ఒక్కరి జీవితంలో బాధతో నిండిపోతుంది. కానీ మారిటేనియా దేశంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. పెళ్లిలాగే విడాకుల్నీ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు ఇక్కడి మహిళలు. ఇక్కడ అన్నింటికంటే విడాకుల పార్టీలే ఎక్కువగా జరుగుతాయట! సంబంధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఒక్క చోట చేరి.. ఆటపాటలతో సందడిగా గడుపుతారట! ఇదొక సామాజిక వేడుకగానే కాదు.. విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం చేసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారని ఈ వేడుకలతో చెప్పకనే చెబుతారట ఇక్కడి మహిళలు.

ఇక తమకు విడాకులయ్యాయని మహిళలు బాధపడకుండా.. గత అనుబంధంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూనే తదుపరి వివాహానికి సిద్ధపడతారట! అంతేకాదు.. తమను తిరిగి పెళ్లి చేసుకోబోయే వాడికి నచ్చేలా ఆహారం, అందం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారట ఇక్కడి పడతులు. ఇలా ఇవన్నీ ఇక్కడి మహిళల స్వేచ్ఛకు, సాధికారతకు అద్దం పడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. అలాగే గతాన్ని తలచుకుంటూ అక్కడే ఆగిపోవడం కంటే.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే.. మంచి రోజులొస్తాయన్న వాస్తవాన్నీ కళ్లకు కడుతున్నారు మారిటేనియా మహిళలు.

ఆ మార్కెట్లో అమ్మేస్తారు!

విడాకుల అనంతరం గత జీవితానికి సంబంధించిన ఆలోచనలే కాదు.. ఆ జ్ఞాపకాల్నీ పూర్తిగా చెరిపేస్తుంటారు మారిటేనియా మహిళలు. ఈ క్రమంలో తమకు పెళ్లిలో కానుకగా అందించిన వస్తువులు, గృహోపకరణాలు, ఇంటి సామగ్రి.. వంటివన్నీ అమ్మేస్తుంటారట! ఇందుకోసం వారు అక్కడి ‘డివోర్స్ మార్కెట్‌’కు చేరుకుంటారు. అక్కడే ఈ సామగ్రిని అమ్మి.. తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాల్ని చాటుకుంటారు. అంతేకాదు.. తాము తిరిగి పునర్వివాహానికి సిద్ధమంటూ ఇలా పరోక్షంగా హింట్‌ కూడా ఇస్తారు. ఇక ఇక్కడికొచ్చిన పురుషులు తమకు నచ్చిన అమ్మాయిని ఎంచుకోవడం, అమ్మాయి అభిప్రాయం కూడా ఇదే అయితే వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేయడం.. ఇలా ఈ డివోర్స్‌ మార్కెట్‌ కొన్ని సందర్భాల్లో పెళ్లి సంబంధాలకూ వేదికగా మారుతుంటుంది.

సవాళ్లూ ఉన్నాయట!

అయితే ఈ ‘ఖుల్‌’ నిబంధన ప్రకారం.. ఇక్కడ విడాకుల రేటు అంతకంతకూ పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొందరు చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకుంటున్నట్లు అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం ఇరు కుటుంబాల పైనే కాదు.. వారి పిల్లల పైనా పడుతోంది. ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛ లేని మహిళలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారట! అందుకే ఇలా విచ్చలవిడి విడాకులకు అడ్డుకట్ట వేసేందుకు.. జంటలకు కౌన్సెలింగ్ ఇప్పించడం వంటి పలు చర్యలు తీసుకుంటోందట అక్కడి ప్రభుత్వం. అంతేకాదు.. చాలామంది ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల.. వైవాహిక జీవితంపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే.. ఎక్కువ జంటలు విడిపోతున్నట్లు ఇక్కడి నిపుణులు చెబుతున్నారు. ఇకపై ఇలా జరగకుండా బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు పలు చర్యలూ తీసుకుంటున్నారట అక్కడి అధికారులు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే నష్టాలు, ఈడొచ్చాక పెళ్లి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి బాలికల తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్