Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!

రాజకీయాల్లో రాణించడమంటే అంత సులువు కాదు. ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుతూనే.. సమర్థ పాలనతో వారి మనసులు గెలుచుకోవాల్సి ఉంటుంది. తెరపై తమ నటనతో మెప్పించిన కొందరు నాయికలు ఇందుకు సిద్ధమైపోయారు.

Published : 07 May 2024 15:32 IST

(Photos: Instagram)

రాజకీయాల్లో రాణించడమంటే అంత సులువు కాదు. ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుతూనే.. సమర్థ పాలనతో వారి మనసులు గెలుచుకోవాల్సి ఉంటుంది. తెరపై తమ నటనతో మెప్పించిన కొందరు నాయికలు ఇందుకు సిద్ధమైపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోన్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వీరిలో కొందరికి ఇదివరకే రాజకీయ అనుభవం ఉంటే.. మరికొందరు ఈసారి కొత్తగా బరిలోకి దిగారు. ఇంతకీ ఈసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతోన్న ఆ అందాల నాయికలెవరు? ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

దుస్తులతో కట్టిపడేస్తోంది!

వెండితెరపై విభిన్న పాత్రల్ని ఎంచుకుంటూ, మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది కంగనా రనౌత్‌. తన నటనతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తోంది. ‘తలైవి’ చిత్రంతో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో వెండితెరపై నటించిన ఆమె.. ఇప్పుడు నిజజీవితంలో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తన పూర్తి మద్దతిచ్చిన కంగన.. అదే పార్టీ తరఫున తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచింది. ఈ క్రమంలోనే ఓవైపు తన ప్రచారంతో ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో పాటు మరోవైపు తన ఆహార్యంతోనూ వారి మనసులు గెలుచుకుంటోందీ అందాల తార.

సహజంగానే భారతీయత ఉట్టిపడేలా నిండైన దుస్తులు ధరించే ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. ఎన్నికల ప్రచారం, రోడ్‌ షోల కోసం అక్కడి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా హిమాచలీ అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే కిన్నౌర్‌ జిల్లా రోడ్‌ షోలో పాల్గొన్న కంగన.. ఊదా రంగు స్కర్ట్‌, మెజెంటా టాప్‌ ధరించి.. దానిపై నుంచి కొల్లార్డ్‌ జాకెట్‌తో హంగులద్దింది. కలర్‌ఫుల్‌ హిమాచలీ శాలువా, టాజిల్‌ క్యాప్‌తో మెరిసిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తన ఆహార్యంతో అక్కడి వారిని కట్టిపడేసింది. ఇదే కాదు.. చీరలు, గాగ్రా, శారీ స్టైల్‌ కుర్తా.. వంటి విభిన్న అవుట్‌ఫిట్స్‌కి కలర్‌ఫుల్ శాలువాలు, టాజిల్‌ క్యాప్స్‌ని జోడిస్తూ.. ప్రచార కార్యక్రమాల్లో ట్రెడిషనల్‌గా మెరిసిపోతోంది.. ప్రజల మనసులు గెలుచుకుంటోంది.. కంగన!


పవన్‌కు వీరాభిమానిని!

‘పొలిమేర-1’, ‘పొలిమేర-2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది సాహితి దాసరి. తన నటనతో సినీ ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్న ఈ బ్యూటీ.. రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈసారి తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది సాహితి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిందామె. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఉన్నా.. విజయం తనదేనంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. ‘మీ ఓటే మీ తీర్పు, మీ మార్పు’ అంటూ తనదైన రీతిలో సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తోందామె. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పే ఈ ముద్దుగుమ్మ.. ఇన్‌స్టాలో తాను రీల్స్‌ చేసే పాటలకు పొలిటికల్‌ విషయాల్ని ఆపాదించొద్దని ఫ్యాన్స్‌ని కోరుతోంది.


హుగ్లీ సీటుకు ‘దీదీ నం.1’!

అవడానికి బెంగాలీ అయినా.. తెలుగు సినిమాల్లో నటించి అచ్చ తెలుగమ్మాయిలా టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది రచనా బెనర్జీ. ‘కన్యాదానం’, ‘మావిడాకులు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’.. మొదలైన చిత్రాలలో నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, ఒడియా, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బెంగాలీ టీవీ రియాల్టీ షో ‘దీదీ నం.1’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇలా తనకు బెంగాల్‌లో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిందీ అందాల తార. ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ ఎంపీ స్థానానికి పోటీపడుతోంది రచన.

‘రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నిజానికి ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్న ప్రయాణం.. ఇదెంతో కఠినమైన బాధ్యత కూడా! ఇక పాపులారిటీ ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు వాళ్ల నుంచి మరింత అభివృద్ధిని కోరుకుంటారు. ఇందుకు అనుగుణంగానే ప్రజా సేవ చేయాల్సి ఉంటుంది. ఇక నేను రాజకీయాల్లోకి రావడానికి పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ప్రేరణ. ఆమె కష్టపడే తత్వం, సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలో నిలదొక్కుకొని ప్రజా సేవ చేయడం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆమెను ఓ రాజకీయ నాయకురాలిగా కాకుండా శక్తిమంతమైన మహిళగా ఇష్టపడతా. ఇక ప్రచారంలో భాగంగా చాలామంది ప్రజలు తామెదుర్కొంటోన్న నీటి సమస్యల్ని నా ముందుంచుతున్నారు. మరికొందరు రోడ్ల సమస్యను వ్యక్తం చేస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే తప్పకుండా వీటికి పరిష్కారం చూపుతా..’ అంటోందీ గ్లామర్‌ క్వీన్‌. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లాకెట్ చటర్జీ అనే మరో బెంగాలీ నటి పోటీపడుతోంది. ఇద్దరూ ప్రజాదరణ పొందిన సినీ తారలే కావడంతో.. హుగ్లీ ఎంపీ పోరు మరింత రసవత్తరంగా మారిందని చెప్పచ్చు.


డ్రీమ్‌గర్ల్‌.. హ్యాట్రిక్‌ కొట్టేనా?!

1970-80ల మధ్యకాలంలో వరుస చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది లెజెండరీ నటి హేమామాలిని. బాలీవుడ్‌ డ్రీమ్‌గర్‌్ుగా పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ.. శాస్త్రీయ నృత్యకారిణి కూడా! భరతనాట్య కళాకారిణి అయిన ఆమె.. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం ఏడు పదులు దాటినా ఇప్పటికీ తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో ‘వయసు సంఖ్య మాత్రమే!’ అని నిరూపిస్తున్నారీ గ్లామర్‌ క్వీన్‌. ఇలా తన నటన, డ్యాన్స్‌తో సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన ఆమె.. 1999లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న హేమ.. 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2003-2009 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆమె.. 2010లో ఏడాది పాటు బీజేపీ జనరల్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో లోక్‌సభ ఎన్నికలకు మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిని చిత్తు చేశారు. 2019 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన హేమ.. ప్రస్తుతం మూడోసారి పోటీ పడుతున్నారు. ఎంపీగా రెండుమార్లు ప్రజా సేవలో తరించిన డ్రీమ్‌గర్ల్‌.. ఈసారి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. పొలాల్లో వరి కోస్తూ రైతులకు తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రచారం ‘Farm Girl’ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ప్రజాభీష్టమే లక్ష్యంగా..!

తన గ్లామర్‌, నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు రాధికా శరత్‌కుమార్‌. రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఆమె.. 2006లో తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆపై 2007 లో ‘All India Samathuva Makkal Katchi’ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన రాధిక.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి పూర్వమే ఈ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈ అలనాటి అందాల తార.. ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజాభీష్టం నెరవేర్చుతానంటూ ప్రజలకు హామీలిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీపడుతోన్న అత్యంత సంపన్న అభ్యర్థుల్లో రాధిక ఒకరు.


గ్లామర్‌ క్వీన్‌.. మరోసారి!

తెలుగు తెరపై పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముంబయి బ్యూటీ నవ్‌నీత్‌ కౌర్‌ రాణాకు రాజకీయాలు కొత్త కాదు. ప్రముఖ రాజకీయ నాయకుడు రవి రాణాను వివాహమాడాక ఇటువైపుగా అడుగులేసిన ఆమె.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీ పదవికి పోటీ చేసిన ఆమె విజయం సాధించారు. ఇక ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరిన ఆమె.. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీపడుతున్నారు. గతంలో లాగే ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చుతానని ప్రజలకు వాగ్దానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్