Mother’s Day: అమ్మకూ కావాలో ‘సోలో’ ట్రిప్!

ఇంట్లో అందరికంటే బిజీగా గడిపేది ఎవరంటే.. అమ్మే! ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే దాకా ఇంటి పనులు, ఆఫీస్‌ అంటూ తీరిక లేకుండా గడుపుతుంటుంది. ఇక వారంలో వచ్చిన ఒక్క ఆదివారం కూడా కుటుంబ సభ్యులకే అంకితమిస్తుంది.

Published : 11 May 2024 13:04 IST

ఇంట్లో అందరికంటే బిజీగా గడిపేది ఎవరంటే.. అమ్మే! ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే దాకా ఇంటి పనులు, ఆఫీస్‌ అంటూ తీరిక లేకుండా గడుపుతుంటుంది. ఇక వారంలో వచ్చిన ఒక్క ఆదివారం కూడా కుటుంబ సభ్యులకే అంకితమిస్తుంది. ఇలా అనుక్షణం అమ్మ ఆలోచనలు, మాటలు, చేతలు.. అన్నీ మన చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి త్యాగమూర్తి కోసం మనం ఒక్క రోజు కేటాయించలేమా? ఈ బరువు బాధ్యతల నుంచి విముక్తి కల్పించి.. స్వీయ ప్రేమను పెంపొందించుకునేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వలేమా? అలాంటి అవకాశాన్ని సోలో ట్రిప్‌ రూపంలో అందిస్తే..? కొద్ది రోజులు రిలాక్సవుతుంది.. రీఛార్జ్‌ అవుతుంది. తద్వారా తిరిగి మరింత ఉత్సాహంతో తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇక ఈ సోలో ట్రిప్‌ ఏదో ‘మదర్స్‌ డే’ రోజున ప్లాన్‌ చేస్తే.. అమ్మకు ఇంతకంటే గొప్ప బహుమతి మరేముంటుంది చెప్పండి!

‘సోలో’గానే ఎందుకంటే?!

ఈ ఆధునిక యుగంలో అమ్మలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారు. తద్వారా ఇతరులపై ఆధారపడకుండా తమ పనుల్ని తామే స్వయంగా చేసుకోగలుగుతున్నారు.. వృత్తిఉద్యోగాల్లో రాణిస్తూ కెరీర్‌ పరంగానూ వృద్ధి చెందుతున్నారు. ఇలాంటి వారికి సోలో ప్రయాణాలు కొత్త కాకపోవచ్చు. అయితే ఇలా ఒంటరిగా ప్రయాణాలు చేయడం వల్ల అమ్మలకు రోజువారీ బరువు-బాధ్యతల నుంచి కాస్త విశ్రాంతి లభించడంతో పాటు.. ఆ సమయాన్ని తమ కోసం తాము కేటాయించుకోగలుగుతారు. తద్వారా పునరుత్తేజితం కాగలుగుతారు. ఇదే కాదు.. ఈ సోలో ట్రిప్‌ వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.

⚛ ఒంటరి ప్రయాణాల వల్ల శరీరానికి, మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా వారిలో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. ఇది పరోక్షంగా వారి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

⚛ సోలోగా ప్రయాణించడం వల్ల ఇతరుల నిర్ణయాలు వారిపై రుద్దే అవకాశం ఉండదు. అది సాహసమైనా, ఇతర విషయాల్లోనైనా స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వెళ్లిన చోట తమకు నచ్చినట్లుగా ఉండగలుగుతారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తుంది.

⚛ ఇంట్లో ఉన్నంతసేపు కుటుంబ సభ్యుల గురించిన ఆలోచనలే అమ్మల మదిలో మెదులుతాయి. తద్వారా తమ ఆలోచనల్ని, అభిరుచుల్ని పక్కన పెట్టేస్తుంటారు. వాటిపై దృష్టి సారించడానికీ ఈ ఒంటరి ప్రయాణం ఉపయోగపడుతుంది. స్వీయ ఆలోచనలతో ముందుకు సాగుతూ, నచ్చిన అంశాలపై దృష్టి సారించచ్చు. ఇదీ వారిలో సానుకూల దృక్పథాన్ని నింపుతుందంటున్నారు నిపుణులు.

⚛ కొత్త ప్రదేశాల్ని, కొత్త వ్యక్తుల్ని కలుసుకొనే అవకాశం కూడా ఈ ఒంటరి ప్రయాణాలు అమ్మలకు అందిస్తాయి. తద్వారా వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు. ఇవి వారికి వ్యక్తిగతంగానే కాదు.. కెరీర్‌లోనూ ముందుకెళ్లడానికీ ఉపయోగపడతాయి.

⚛ ఇంట్లో ఉంటే ఓ గంట విశ్రాంతి తీసుకుందామన్నా కొంతమంది అమ్మలకు సమయం దొరకదు. అదే సోలోగా ఏదైనా దగ్గరి ప్రదేశానికి వెళ్తే.. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించచ్చు.. కావాలంటే ఓ గంటసేపు హోటల్‌ గదిలోనే విశ్రాంతి తీసుకోవచ్చు.. శారీరకంగా, మానసికంగా రీఛార్జ్‌ కావడానికి ఇదీ ఓ మార్గమే!

⚛ కొంతమంది అమ్మలకు మాతృభాష తప్ప మరో భాష రాకపోవచ్చు.. లేదంటే అప్పుడప్పుడే ఇతర భాషలు నేర్చుకుంటుండచ్చు.. ఇలాంటివారు కొత్త ప్రదేశాలకు వెళ్తే అక్కడి భాషల్నీ నేర్చుకునే అవకాశం దొరుకుతుందంటున్నారు నిపుణులు. అయితే ఆ భాషకు సంబంధించిన ప్రాథమిక పదాలపై ముందుగానే అవగాహన పెంచుకోవడం వల్ల వెళ్లిన ప్రదేశంలో భాష తమకు అవరోధంగా మారకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఒంటరి ప్రయాణాల వల్ల అమ్మలు తమ గురించి తాము బోలెడన్ని విషయాలు తెలుసుకోగలుగుతారంటున్నారు నిపుణులు. ఇన్నాళ్లూ తమ మనసులోనే దాచుకున్న తమ ఇష్టాయిష్టాలు, అభిరుచులు, ఆహార కోరికలు.. వంటివన్నీ వారికి అవగతమవుతాయి. ఇవీ వారిని పునరుత్తేజితం చేసేందుకు దోహదపడతాయి.


ఏడాదికోసారి!

కుటుంబమంతా కలిసి అప్పుడప్పుడూ విహారయాత్రలకు వెళ్లినా.. ఏడాదికోసారి అమ్మలు ఇలా ఒంటరి ప్రయాణం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే తమ తల్లుల కోసం ఇలా సోలో ట్రిప్‌ ప్లాన్‌ చేసే క్రమంలో పిల్లలు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి అంటున్నారు.

⚛ అమ్మలందరిలో ఒకే రకమైన ధైర్యసాహసాలు ఉండకపోవచ్చు.. కొంతమంది దూరప్రాంతాలకైనా వెళ్లడానికి సిద్ధపడచ్చు.. మరికొందరు తెలిసిన చోటికే ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపచ్చు. కాబట్టి మీ అమ్మగారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకున్నాకే.. ఆమెకు నచ్చిన చోటికి ట్రిప్‌ ప్లాన్‌ చేయండి. తద్వారా తనూ సౌకర్యంగా ఫీలవుతుంది.. ట్రిప్‌నూ ఎంజాయ్‌ చేస్తుంది.

⚛ తను వెళ్లేందుకు రవాణా సదుపాయాలు, ఉండేందుకు వసతి సౌకర్యాలు, అక్కడ గైడ్‌ని నియమించడం.. వంటివన్నీ ముందుగానే మీరు బుక్‌ చేసి పెడితే.. అమ్మ సోలో యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుంది. అలాగే ఈ ప్లానింగ్‌ కూడా బడ్జెట్‌కు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం మంచిది.

⚛ ఎంత పకడ్బందీగా సోలో ట్రిప్‌ ప్లాన్‌ చేసినప్పటికీ.. వెళ్లిన చోట అమ్మకు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవ్వచ్చు.. లేదంటే అనుకోని సంఘటనలూ జరగచ్చు. ఇలాంటప్పుడు ప్రయాణ బీమా చక్కగా ఉపయోగపడుతుంది. అనుకోని ప్రయాణ ఖర్చులు, వైద్య ఖర్చులు, లగేజ్‌ పోయినా, ట్రిప్‌ రద్దైనా.. ఇలాంటివన్నీ ఈ బీమా ద్వారా కవర్‌ చేసుకోవచ్చు.

⚛ సోలో ట్రిప్‌ ద్వారా అమ్మకు మరపురాని అనుభూతిని అందించడమే కాదు.. తను సురక్షితంగా వెళ్లొచ్చేలా తగిన ఏర్పాట్లూ చేయడం కూడా పిల్లల బాధ్యతే! ఈ క్రమంలో సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు అమ్మతో టచ్‌లో ఉంటూ ఆమె క్షేమసమాచారాలు తెలుసుకుంటుండాలి. అలాగే తను అక్కడ క్యాబ్‌లో లేదా ఇతర వాహనంలో వెళ్లినా లొకేషన్‌ని ఎప్పటికప్పుడు మీతో పంచుకునేలా అమ్మను అలర్ట్‌ చేయాలి.

⚛ సోలో ట్రిప్‌లో భాగంగా అమ్మ అక్కడి రుచుల్ని ఎంజాయ్‌ చేసినప్పటికీ తన కోసం కొన్ని ప్రత్యేకమైన వంటకాలు/స్నాక్స్‌ వంటివి తయారుచేసి పెడితే మరీ మంచిది.

⚛ ఒక్కోసారి వెళ్లిన ప్రదేశాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఫొటోలు దిగడమే మర్చిపోతుంటాం. అమ్మ ఇలా మర్చిపోకుండా పర్యటనకు వెళ్లే ముందు మీరే ఓసారి అమ్మకు గుర్తుచేయండి. వీలైతే ఓ మంచి కెమెరా అమ్మకు బహుమతివ్వచ్చు. ఇలా తాను బంధించిన ఫొటోలతో ఓ ఆల్బమ్‌, వీడియోలతో ఓ డాక్యుమెంటరీ రూపొందించి.. అమ్మకు కానుకిచ్చారంటే.. అది తనకు ఎవర్‌గ్రీన్‌ మధుర జ్ఞాపకంగా ఉండిపోతుంది. సో.. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరూ ఈసారి మీ అమ్మ కోసం తనకు నచ్చిన ప్రదేశానికి సోలో ట్రిప్‌ ప్లాన్‌ చేయండి.. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా తనకు మరపురాని బహుమతివ్వండి!

హ్యాపీ మదర్స్‌ డే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్