Maldives: ‘భారత్‌తో వివాదం మనకే ప్రమాదం’.. మాల్దీవుల అధ్యక్షుడికి ప్రతిపక్షాల హెచ్చరిక!

Maldives: మార్చి 15కల్లా తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు ఇటీవల తుది గడువు విధించారు.

Updated : 25 Jan 2024 19:05 IST

మాలె: చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్‌తో కయ్యానికి తెరతీసిన మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు దేశీయంగానూ వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ వివాదం మాల్దీవుల అభివృద్ధికే చేటు చేస్తుందంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆయన్ను హెచ్చరించాయి. చైనాకు చెందిన పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన తరుణంలో ప్రతిపక్షాల నుంచి హెచ్చరిక రావడం గమనార్హం.

మాల్దీవుల అభివృద్ధిలో సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్న మిత్రులను దూరం చేసుకోవడం దేశానికే హానికరం అంటూ ‘మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (MDP)’, ది డెమొక్రాట్స్‌ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. భారత్‌ను దీర్ఘకాల మిత్రుడిగా అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాయి. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు (Maldives) కలిసి పనిచేయాలంటూ మారుతున్న ‘విదేశాంగ విధాన వైఖరి’ని ఎత్తిచూపాయి. హిందూ మహా సముద్రంలో శాంతి, సుస్థిరత మాల్దీవుల భద్రతకు చాలా కీలకమని గుర్తుచేశాయి. ఎండీపీ ఛైర్మన్‌ ఫయాజ్‌ ఇస్మాయిల్‌, పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ అహ్మద్‌ సలీమ్‌, డెమొక్రాట్స్‌ అధిపతి హసన్‌ లతీఫ్‌, పార్లమెంటరీ గ్రూప్‌ నేత అలీ అజీమ్‌ ఇటీవల నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

మాల్దీవులతో పెరుగుతున్నఅంతరం

మార్చి 15కల్లా తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) ఇటీవల తుది గడువు విధించటంతో వివాదం మొదలైంది. భారత సేన వెనక్కి తిరిగి వస్తే.. ఆ స్థానంలో చైనా దళాలు ప్రవేశించే అవకాశం ఉంది. లక్షద్వీప్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడంతో వివాదం ముదిరింది. చైనా పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించడంపైనా భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని