Maldives: మే నాటికి పూర్తిగా భారత బలగాల ఉపసంహరణ: పార్లమెంట్‌లో మాల్దీవుల అధ్యక్షుడు

రెండు దశలుగా తమ దేశంలోని భారత బలగాలు వెనక్కి వెళ్లిపోతాయని మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు ముయిజ్జు వెల్లడించారు. 

Updated : 05 Feb 2024 15:41 IST

మాలె: దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ.. మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు(Mohamed Muizzu) తన భారత వ్యతిరేక వైఖరిపై ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదు. తమ దేశంలో ఉన్న భారత బలగాల ఉపసంహరణ మే 10నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఈ ఏడాదిలో ఆయన పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేస్తూ.. ‘మా సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని మేం అనుమతించం’ అని స్పష్టం చేశారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమ దేశంలో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయని, మిగతా రెండు స్థావరాల్లో ఉన్న దళాలు మే 10 నాటికి వైదొలుగుతాయని ముయిజ్జు(Mohamed Muizzu) తెలిపారు. ఈ విషయంలో భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం లేదని చెప్పారు. ఈ బలగాల ఉపసంహరణపై రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు ఇప్పటికే అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.

మాల్దీవుల్లో(Maldives) మోహరించిన భారత బలగాలు.. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తుంటాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి. భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు కింద ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే  కీలకమైన సముద్రమార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు చిన్న దేశం కావడంతో భారత్‌ ఎక్కువగా సాయం చేసింది. మాల్దీవుల్లో చైనా తిష్టవేయడం భారత భద్రతపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని