close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బి.ఆర్క్‌.ఫైనలియర్‌లో ఉన్నా!

బి.ఆర్క్‌.ఫైనలియర్‌లో ఉన్నా! 

అందం, అభినయం కలగలిసిన నటీమణులు ఇటీవలి కాలంలో తక్కువగానే కనిపిస్తున్నారు. ఆ రెండు ప్రత్యేకతలూ ఉన్న నటి నివేతా థామస్‌. మూడు దక్షిణాది భాషల్లో నటిస్తున్నప్పటికీ, తెలుగులోనే ఎక్కువగా అభిమానుల్నీ, గుర్తింపునీ సంపాదించింది. ‘జెంటిల్‌మన్‌’లో కేథరిన్‌, ‘నిన్నుకోరి’లో పల్లవి పాత్రల్లో కనిపించిన నివేతా... నిజ జీవితంలోని తన పాత్ర గురించి చెబుతోందిలా..!
 

మ్మానాన్నల మద్దతు, ప్రోత్సాహం లేకుంటే ఇక్కడివరకూ వచ్చేదాన్ని కాదు. నాకు ఎనిమిదేళ్లపుడు సినిమాలో నటించే అవకాశం వస్తే ఓ ప్రయత్నం చేసి చూద్దామని ఆరోజు వాళ్లు అనుకోబట్టే ఈరోజు మీ ముందుకు రాగలిగాను. మాది కేరళలోని కన్నూర్‌. నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే. అక్కడి ‘మాంట్‌ఫోర్ట్‌’ స్కూల్లో చదువుకున్నాను. స్కూల్లో పాటలూ, డాన్స్‌లూ లాంటి అంశాల్లో ఎప్పుడూ ముందుండేదాన్ని. ఓసారి మా స్కూల్లో బాలల ఉత్సవం జరిగింది. అక్కడికి వచ్చిన మలయాళ నటి పూర్ణిమా ఇంద్రజిత్‌ నన్ను చూశారు. అప్పటికి ఆమెకు తెలిసినవాళ్లు ఓ సినిమా కోసం నా వయసు పాపకోసం వెతుకుతున్నారట. నా వివరాలు కనుక్కొని దర్శకుడికి చెప్పారు. నాకు అప్పటికి సినిమాలపైన అంత అవగాహన కూడా లేదు. ఇంటికి వచ్చి అమ్మనాన్నలతో మాట్లాడారు. షూటింగ్‌ కోసం చెన్నై నుంచి కేరళ వెళ్తున్నపుడు అమ్మానాన్న నాకు ఆ సినిమా కథ గురించి చెప్పారు. తర్వాత డైరెక్టర్‌ కూడా కథ బాగా వివరించారు. ఆ సినిమాలో కథ నా పాత్ర చుట్టూ తిరుగుతుంది. 2002లో విడుదలైన ఆ సినిమా పేరు ‘ఉత్తర’, బాగా ఆడింది. దానికి బాలనటిగా నాకు కేరళ ప్రభుత్వం అందించే అవార్డు వచ్చింది. ఆ తర్వాత సినిమాలకు ఆరేళ్లు గ్యాప్‌ వచ్చింది. మళ్లీ 2008లో ఓ మలయాళ, మరో తమిళ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పట్నుంచీ సినిమాలూ, చదువూ రెండూ కొనసాగుతున్నాయి. ఏటా సెలవుల్లో సినిమాల్లో నటించేదాన్ని. అవి హిట్టయినా, కాకపోయినా స్కూల్‌ తెరిచాక అవన్నీ మర్చిపోయి చదువులో నిమగ్నమైపోతుండేదాన్ని. 2011 నుంచి బాలనటిని కాస్తా నటిని అయ్యాను. తమిళం, మలయాళ భాషల్లో ఆరేడు సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు చేశాను.

‘దృశ్యం’ చేయలేకపోయాను
దర్శకుడు జీతూ జోసెఫ్‌ మలయాళ ‘దృశ్యం’లో మోహన్‌లాల్‌కి కూతురిగా చేయమన్నారు. కానీ నాకప్పుడు పరీక్షలు ఉండటంతో చేయలేకపోయాను. ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలూ చేశాను. రెండేళ్ల తర్వాత జీతూ ఫోన్‌చేసి ‘పాపనాశం(దృశ్యం తమిళ రీమేక్‌)’లో చేయమన్నారు. హిట్‌ సినిమా, ఆపైన కమల్‌హాసన్‌ గారు ఉండటంతో ఈసారి రెండో ఆలోచన లేకుండా చేశాను. జీవితంలో అలాంటి అవకాశాలు మళ్లీమళ్లీ రావు. కమల్‌ సర్‌ని తెరపైన చూస్తూనే చాలా నేర్చుకోవచ్చు. అలాంటిది ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. సెట్స్‌లో ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ప్రతీ సినిమానీ ఉత్సాహంతో చేయడమే కాకుండా తోటి నటుల్లోనూ ఉత్సాహం నింపుతారాయన. ఆయనకి కూతురుగా నటించినా షూటింగ్‌ పూర్తయిన నాటికి నిజంగానే నాన్న అన్న ఫీలింగ్‌ వచ్చింది. మా నాన్న దుబాయిలో ఆ సినిమా చూసి బాగుందని ఫోన్‌చేసి చెప్పారు.

యూట్యూబ్‌లో చూశారు
‘పాపనాశం’ విడుదల సమయంలో ఓ తమిళ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ గారు ‘జెంటిల్‌మన్‌’ సినిమాలో కేథరిన్‌ పాత్రకోసం హీరోయిన్‌ను వెతుకుతున్న రోజులవి. ఆఫీసులో ఎవరో యూట్యూబ్‌లో నా తమిళ ఇంటర్వ్యూ చూస్తున్నపుడు... మోహన్‌గారు ఒక రూమ్‌ నుంచి వేరొక రూమ్‌కి వెళ్తూ కంప్యూటర్‌ స్క్రీన్‌మీద నన్ను చూశారు. సహ దర్శకుడు సురేష్‌కీ చూపారు. సీన్‌కట్‌ చేస్తే చెన్నైలో మా ఇంటికి వచ్చి నాకు జెంటిల్‌మన్‌ కథ చెప్పారు మోహన్‌ సర్‌. అప్పటివరకూ దాదాపు నా సెలవుల్నిబట్టి సినిమాలు చేస్తూ వచ్చేదాన్ని. కానీ ఈ సినిమా కోసం అవసరమైతే సెలవు పెడతానని అమ్మకు చెప్పేశా. కథ అంతలా నచ్చింది. మోహన్‌ సర్‌ కూడా వెళ్తూ వెళ్తూ ‘ఏదేమైనా సరే సినిమాలో నివేత ఉండాల’న్నారు. ఆ మాట నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. కథ విన్నరోజునుంచే సినిమాపైన బాగా మనసుపెట్టాను. జెంటిల్‌మన్‌ షూటింగ్‌ అనుభవం నాకు నటన పరంగా స్కూల్‌ అని చెబుతాను. ప్రతి సినిమా నుంచీ ఎంతోకొంత నేర్చుకుంటాం. కానీ జెంటిల్‌మన్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. చుట్టూ ఉన్న మనుషులూ, పనిచేసే విధానం, పని వాతావరణం... అన్నీ చాలా బావుండేవి. ‘తెలుగులో కొత్త’ అని మొదట కాస్త భయపడ్డాను. కానీ చాలా బాగా జరిగిందా షూటింగ్‌. మోహన్‌ సర్‌, నానీ, నేను ఖాళీ దొరికితే స్క్రిప్టు గురించే మాట్లాడేవాళ్లం. నటుల నుంచి ఏం కావాలో మోహన్‌ సర్‌కి బాగా తెలుసు. కమ్యునికేషన్స్‌లో ఆయనకి పీహెచ్‌డీ ఇవ్వొచ్చు.

నిన్ను కోరి... ఏరికోరి!
చాలామందికి మొదటి సినిమాకి అన్నీ కలిసొస్తాయి. కానీ రెండో సినిమా అసలైన పరీక్ష. ‘జెంటిల్‌మన్‌’లో కేథరిన్‌ పాత్రకు వూహించని గుర్తింపు వచ్చింది. అలాగని నేను కొత్త కథలు విన్నపుడు ఆ ఇమేజ్‌పెట్టి ఆలోచించలేదు. అంతకంటే కూడా స్క్రిప్టు ముఖ్యమని నమ్ముతాను. కాలేజీ మూడో సంవత్సరం పూర్తయిన తర్వాత సెలవుల్లో ‘జెంటిల్‌మన్‌’ చేశాను. సినిమా రిలీజయ్యాక కాలేజీ మొదలైంది. దాంతో చదువులో బిజీ అయిపోయాను. మధ్యలో సక్సెస్‌ పార్టీ, సక్సెస్‌ మీట్‌లతో అదే బృందంతో జర్నీ కొనసాగింది. కాబట్టి ఖాళీగా ఉన్నానన్న ఆలోచనే రాలేదు. జెంటిల్‌మన్‌ హ్యాంగ్‌ ఓవర్‌ నుంచి బయటకు రావడానికి ఆరు నెలలు పట్టింది. తర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను. ఏదీ అంత బాగా నచ్చలేదు. ఒక తరహా పాత్ర బాగా చేస్తే మళ్లీ మళ్లీ అలాంటివే వస్తాయి. కానీ మళ్లీ కేథరిన్‌లాంటి పాత్ర చేయడం నచ్చేది కాదు. కథ విన్నపుడే ఉత్సాహాన్నివ్వాలి అనుకునేదాన్ని. అందుకే దాదాపు ఏడాదిపాటు వేచిచూశాను. ఆ సమయంలో నానీ ఫోన్‌చేసి ‘ఓ కథ ఉంది విను’ అని చెప్పారు. ఇమేజ్‌ అంటూ పెట్టుకోకుండా కొత్తదనం కోసం చూసే నటుడు నానీ. తను చెప్పాడంటే విషయం ఉంటుందనుకున్నాను. అదే ‘నిన్నుకోరి’. కోన వెంకట్‌గారు నాకు ఆ కథ చెప్పారు. కథ పూర్తిగా విన్నాక రీకేప్‌ చేసుకోవడానికి 10-15 సెకన్లు సమయం తీసుకున్నాను. తర్వాత ‘షూట్‌ ఎప్పుడు మొదలుపెడదాం’ అని అడిగాను. మేం వూహించిన దానికంటే కూడా ప్రేక్షకులు ఈ సినిమాని పెద్ద హిట్‌ చేశారు. దర్శకుడు శివకి ఇదే తొలి చిత్రం. మోహన్‌ గారి సినిమాలో చేసిన తర్వాత వేరెవరితో పనిచేసినా బెటర్‌మెంట్‌ కోసం ఆలోచిస్తుంటాం. కానీ శివ కూడా స్క్రిప్టుపైన పూర్తి అవగాహనతో ఉండేవాడు. కథని ఎప్పుడూ డిస్కస్‌ చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. మళ్లీమళ్లీ కొత్తగా రాయడానికి ప్రయత్నించేవాడు. సినిమా హిట్‌ అవ్వాలని శివ గురించే ఎక్కువగా కోరుకున్నాను. కథలో ప్రధాన పాత్రలైన ఉమ, పల్లవి, అరుణ్‌లాంటివారు మనచుట్టూ చాలామంది ఉన్నారు. వారంతా తమని తాము తెరపైన చూసుకున్నారు. షూటింగ్‌ సమయంలో 40 రోజులు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్నాం. ప్రసాద్‌గారని ఓ ఎన్‌.ఆర్‌.ఐ... వాళ్లింట్లోనే షూటింగ్‌. అక్కడ యూనిట్‌ అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. ఇంట్లో అందరికీ వడ్డిస్తూ, ఇంటిని శుభ్రంగా ఉంచుతూ ఆ ఇంట్లో అమ్మాయిలానే ఉన్నాను. సహాయ సిబ్బంది ఎక్కువగా లేకపోవడంతో యూనిట్‌ సభ్యులందరం షూటింగ్‌ సమయంలో చాలా కష్టపడ్డాం. అమెరికా నుంచి తిరిగి వచ్చేటపుడు అందరూ ఒక విధమైన భావోద్వేగానికి గురయ్యారు. సినిమా రిలీజ్‌ రోజున ఉదయం 8:45 గంటల షోకి ప్రసాద్స్‌కి వెళ్లాను. ప్రేక్షకుల స్పందన చూశాక కష్టమంతా మర్చిపోయాను.

సెల్ఫీ అడుగుతారు
స్కూల్‌ రోజుల్లో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ అవ్వాలనుకున్నాను. ఆకాశంలో విహరించడమనే ఆలోచన గొప్పగా అనిపించేది. కానీ కుదరలేదు. సినిమాల కారణంగా నా చదువు నిర్లక్ష్యం కాకూడదని మొదట్నుంచీ అమ్మానాన్నా, నేనూ అనుకునేవాళ్లం. సినిమా, చదువు... రెండిట్లో ఏది ఫస్ట్‌ అంటే చెప్పలేను. రెండూ ముఖ్యమే. జెంటిల్‌మన్‌కి ముందు కూడా కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ చదువుకి ఆటంకమని వాటిని చేయలేదు. ప్రస్తుతం చెన్నైలోని ఎస్‌.ఆర్‌.ఎమ్‌. యూనివర్సిటీలో ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌’ చదువుతున్నాను. అయిదేళ్ల కోర్సది. ఫైనలియర్‌లో ఉన్నాను. పదేళ్లుగా చదువూ, సినిమాలూ రెండూ సమాంతరంగా సాగుతున్నాయి. సినిమాలు చేస్తున్నపుడు కాలేజీ గుర్తొచ్చి ఎప్పుడు వెళ్తానా అనిపిస్తుంది. ఎక్కువ రోజులు కాలేజీలో ఉంటే కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనిపిస్తుంది. నా కెరీర్‌ని ‘జెంటిల్‌మన్‌’కు ముందూ తర్వాతా అని విభజించాలి. ఎందుకంటే అదివరకు నేను సినిమాలు చేసినా, జీవితంలో పెద్ద తేడా రాలేదు. ఎస్‌.ఆర్‌.ఎమ్‌.లో తెలుగు విద్యార్థులు ఎక్కువ. కారు దిగి క్లాస్‌రూమ్‌కి వెళ్లేలోపల 20-30 మంది సెల్ఫీ కోసం అడుగుతారు. ఎవరికీ నో చెప్పను. అలాంటపుడు ఒక్కోసారి క్లాసుకి లేటవుతుంది. అందుకే ఈ మధ్య అందరికంటే ముందే కాలేజీకి వెళ్లి క్లాసులో కూర్చుంటున్నా. అయినా కూడా ‘మేం మీ ఫ్యాన్స్‌’ అనీ, ‘నానీ ఫ్యాన్స్‌’ అనీ చాలామంది మా డిపార్ట్‌మెంట్‌ దగ్గరకీ వచ్చి మాట్లాడతారు. సినిమాల గురించి చెబుతారు. సినిమాల గురించి ఫీడ్‌బ్యాక్‌ అందరికంటే నాకు బాగా తెలుస్తుంది. ఆర్కిటెక్చర్‌ కాస్త క్లిష్టమైన సబ్జెక్ట్‌. అందుకే కాలేజీకి వెళ్లాక అప్పటిదాకా మిస్సయిన క్లాసుల్ని స్నేహితులూ, లెక్చరర్లచేత చెప్పించుకుంటాను. షూటింగ్‌లో ఉన్నపుడు ఖాళీ దొరికితే క్లాసు పుస్తకాలు తిరగేస్తాను. ఆర్కిటెక్చర్‌, సినిమా రెండూ సృజనాత్మక విభాగాలు. వీటికి వంద శాతం ఏకాగ్రత, అంకితభావం అవసరం. భవిష్యత్తులో సినిమాల్లో ఉంటానో, ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తానో, లేక టీచింగ్‌ వైపు వెళ్తానో... ఏమో, ఇప్పుడే తేల్చి చెప్పలేను.

- సుంకరి చంద్రశేఖర్‌

బుల్లెట్‌పై షికారు చేస్తా...

మ్మ ఇల్లీ... నాతోనే చెన్నైలో ఉంటుంది. నాన్న షాజూ థామస్‌. దుబాయిలో ఉంటారు. నాకో తమ్ముడు... నిఖిల్‌.
* బుల్లెట్‌... నా ఫేవరెట్‌ బైక్‌. దాని శబ్దం ఆకట్టుకుంటుంది. నాన్న బుల్లెట్‌ నడుపుతూ నేర్చుకున్నాను. నాకు కొత్త బుల్లెట్‌ కొనివ్వాలని అమ్మ అనుకుంది. కానీ సినిమాల్తో, చదువులో బిజీగా ఉండి, బైక్‌ని ఇంట్లో ఖాళీగా ఉంచేయడం ఎందుకని ప్రస్తుతానికి వద్దనిచెప్పా.
* ఫ్రెండ్స్‌తో షికార్లకి ఎక్కువగా వెళ్లను. ఎప్పుడైనా ఒకచోట కలుసుకుని లంచ్‌, డిన్నర్‌ చేస్తూ మాట్లాడుకుంటాం.
* నచ్చిందల్లా తింటాను. వాసన చూస్తేనే బరువు పెరిగిపోయే రకం నా శరీరానిది. అందుకే బాగా వ్యాయామం చేస్తాను. డాన్స్‌ కూడా ప్రాక్టీసు చేస్తాను.
* ఎవరికైనా అత్యవసరంగా బ్లడ్‌ కావాలంటే వెళ్లి ఇస్తాను. అనాధాశ్రమాలకూ, వృద్ధాశ్రమాలకూ వెళ్తుంటాను.
* సోషల్‌ నెట్‌వర్క్‌ని సినిమా ప్రచారానికి ఉపయోగిస్తాను. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఉన్నాను.
* ఇప్పటివరకూ ఒకేసారి రెండు సినిమాలు చెయ్యలేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ‘జై లవ కుశ’ చేస్తున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.