close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా ప్రేమకథతో సినిమా తీస్తా!

నా ప్రేమకథతో సినిమా తీస్తా!

కథలు పుట్టినప్పట్నుంచీ, సినిమాలు తియ్యడం మొదలైనప్పట్నుంచీ... రచయితలు మారుండొచ్చు. కథలోని పాత్రల్లోనూ మార్పుండి ఉండొచ్చు. కానీ మనిషీ దెయ్యం చుట్టూ అల్లుకున్న ఏ కథలోనూ ఆత్మలు మనుషుల్ని భయపెట్టడం... అన్న కాన్సెప్టు మాత్రం మారలేదు. ఆ చరిత్రను తిరగరాసి, మనుషులకే దెయ్యాలు భయపడితే ఎలా ఉంటుందో చూపించి ప్రేక్షకుల మనసు గెలిచాడు మహీ వీ రాఘవ్‌. నిర్మాతగా అడుగు పెట్టి, దర్శకుడిగా మారి ఆనందో బ్రహ్మతో పెద్ద హిట్‌ని ఖాతాలో వేసుకున్న మహీ ప్రయాణం చిత్తూరు నుంచి బ్రిటన్‌, న్యూజిలాండ్‌ మీదుగా తెలుగు చిత్ర పరిశ్రమ వరకూ ఎలా సాగిందో ఆయన మాటల్లోనే...

నేను దేవుడినీ దెయ్యాల్నీ నమ్మను. మరి, నాలాంటి ఏ నమ్మకం లేనివాడు ఒక దెయ్యం కథ చెబితే ఎలా ఉంటుందీ... అని నాకొచ్చిన ఆలోచనకు రూపమే ‘ఆనందోబ్రహ్మ’. అసలు మనుషులు దెయ్యాల్ని చూసి ఎందుకు భయపడాలి..? శరీరం లేని ఆత్మకే అంత బలం ఉంటే ఆత్మా, శరీరం కలిసి ఉన్న మనిషికి ఇంకా బలం ఉండాలిగా అన్నదే నా లాజిక్‌. దేవుడైనా దెయ్యమైనా పుట్టుకొచ్చేది భయంలోంచే అనిపిస్తుంది నాకు. కానీ నేననుకున్నది ప్రేక్షకులు మెచ్చాలిగా... అందుకే, నా సినిమాలోని పాత్రలు ఏవిధంగానూ దెయ్యం గురించి భయపడే అవకాశం లేకుండా నలుగురికీ నాలుగు లోపాలను సృష్టించా. అదే రివర్స్‌లో దెయ్యం మనుషుల్ని చూసి భయపడేలా చేసింది. జనాన్ని కడుపుబ్బా నవ్వించింది.

సినిమాలే చూడలా...
నేను సినిమాల్లోకి ఎలా వచ్చానంటే... అది నాకే అర్థం కాని కథ. మా వూరు చిత్తూరు జిల్లాలోని బోరమంద గ్రామం. అమ్మ రమాదేవి, నాన్న వీర రాఘవ. నాకో తమ్ముడు. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న షుగర్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆయనకు చదువంటే చాలా ఇష్టం. ‘పిల్లలు ప్రయోజకులు కాకపోతే ఎంత ఆస్తి ఇచ్చినా కరిగిపోతుంది. చదువుని ఇస్తే అదే ఏం కావాలంటే అది సంపాదించి పెడుతుంది’ అనేవారు. అందుకే, ఆయన ఆర్థిక పరిస్థితికి మించిన పనే అయినా నన్ను ఫస్ట్‌క్లాస్‌లోనే మదనపల్లె దగ్గరున్న హార్సిలీహిల్స్‌ బోర్డింగ్‌ స్కూల్లో చేర్పించారు. దాదాపు పన్నెండేళ్లు ఆ స్కూలే నా ప్రపంచం. ఎప్పుడో ఏడాదికి రెండుసార్లు సెలవులకి ఇంటికొచ్చేవాడిని. దాంతో పల్లెటూర్లో పుట్టినా మా వూళ్లొ నేను గడిపింది చాలా తక్కువ. అందుకే, మా వూరికన్నా హార్సిలీహిల్స్‌తోనే నాకు అనుబంధం ఎక్కువ. స్కూల్‌ చదువైపోయాక బీకామ్‌ హైదరాబాద్‌లోనూ, ఎంబీఏ మద్రాస్‌ యూనివర్సిటీలోనూ చేశా. సినిమాల్లోకి వచ్చేవాళ్లకు చాలామందికి చిన్నప్పట్నుంచీ సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండడం, కాలేజీలకు డుమ్మాకొట్టి మరీ సినిమాలకు వెళ్లడం లాంటి కథలుంటాయి. విచిత్రం ఏంటంటే... చిన్నపుడు నాకసలు ఆ అవకాశమే పెద్దగా రాలేదు. స్కూల్లో టీవీ కూడా పెట్టేవారు కాదు. డిగ్రీలోకొచ్చాకే సినిమాలు చూడ్డం అలవాటైంది. ఎంబీఏకి వచ్చేసరికి అది కాస్తా ఇష్టంగా మారిపోయింది. నాలో ఉన్న రచయిత కూడా బయటికి రావడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆవైపు ప్రయత్నించాలనుకున్నా. కానీ నాన్న నన్ను అంత కష్టపడి చదివించారు. పదేళ్ల చదువుకి పదెకరాలు అమ్మడానిక్కూడా వెనకాడలా. నిజానికి చిత్తూరులో అన్ని కాలేజీలుంటే బీకామ్‌ చదవడానికి హైదరాబాద్‌ రావక్కర్లేదు. కానీ, బతకాలంటే చదువుతోపాటు చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడమూ అవసరం అనుకున్నారాయన. అందుకే, ఖర్చు చాలా అవుతుందని తెలిసినా డిగ్రీకి హైదరాబాద్‌ పంపించారు. నేనూ ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనుకునేవాడిని. బీకామ్‌ చదువుతూనే నాన్న ఇంటి దగ్గర్నుంచి డబ్బులు పంపిస్తున్నా, అనుభవం వస్తుందని అడ్వర్టైజింగ్‌లో క్లైంట్‌ సర్వీస్‌కి సంబంధించిన ఉద్యోగం చేసేవాడిని. సేల్స్‌మెన్‌గా కూడా కొంతకాలం పనిచేశా. అలాంటి నేను సినిమాలంటూ నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక ఆ ఆలోచనను కొంతకాలం వాయిదా వేశా.

లాభాల్లో ఉన్న కంపెనీని అమ్మేశా
ఎంబీఏ అయిపోయాక సికింద్రాబాద్‌లోని ఓ మల్టీమీడియా కంపెనీలో మార్కెటింగ్‌ ఉద్యోగం చేసేవాడిని. ఆరునెలలు పనిచేశాక కంపెనీ నష్టాల్లో ఉందనీ అమ్మేయాలనుకుంటున్నారనీ తెలిసింది. అక్కడ పనితీరు ఎలా ఉంటుందో, ఎక్కడ లోపాలున్నాయో నాకు తెలుసు. దాన్ని లాభాల్లోకి తీసుకురావచ్చు అనే నమ్మకం కలిగింది. నా స్కూల్‌ ఫ్రెండ్‌తో కలిసి ఆ కంపెనీని కొని లాభాల బాట పట్టించాం. ఆ ప్రయాణం రెండేళ్లపాటు సాగింది. కానీ మరీ 22 ఏళ్ల నుంచే విశ్రాంతి లేకుండా అయిపోవడంతో కొన్నాళ్లు కొత్తగా ఏదైనా చెయ్యాలనిపించింది. కంపెనీని అమ్మేసి ఎం.ఎస్‌. కోసం యూకే వెళ్లా. సరదాగా అక్కడ కొంత కాలం ఉండి, తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నది నా ఐడియా. ఎం.ఎస్‌లో చేరాగానీ పూర్తిచెయ్యకుండానే అక్కడ ఉద్యోగంలో చేరిపోయా. మూడేళ్ల తర్వాత మకాం న్యూజిలాండ్‌కి మారింది. అక్కడ ఏడేళ్లు రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగం చేసి బాగానే సంపాదించా. ఇక, సినిమాల్లో ప్రయత్నిద్దాం అనుకునేసరికి నేను న్యూజిలాండ్‌లో ఉన్నపుడే నాన్న చనిపోయారు. చాలా బాధపడ్డా. ఆయన ఉన్నంతవరకూ నా గురించి టెన్షన్‌ పడే సందర్భం రానీయలేదు.

అదే నాకు తృప్తి.
సినిమాల్లోకి వచ్చేముందే సాధ్యమైనంత వరకూ చూద్దాం, నావల్ల కానపుడు తిరిగి న్యూజిలాండ్‌ వెళ్లిపోదాం అనుకున్నా. నేను నా ప్రయత్నాల్లో ఉండగానే ఓ స్నేహితుడు తెలిసినవాళ్లు ‘వినాయకుడు’ సినిమా తీస్తున్నారని చెప్పి వెళ్లి కలవమన్నాడు. నేను సహాయ దర్శకుడిగా అవకాశం కోసం ఆ సినిమా దర్శకుడు సాయికిరణ్‌ని కలిశా. నాకు మీరేం డబ్బులివ్వొదు. పని నేర్పించండి చాలు. బదులుగా నాకు మార్కెటింగ్‌ గురించి తెలుసు కాబట్టి, ఈ సినిమాకు మార్కెటింగ్‌ చేసి పెడతా అని చెప్పా. వినాయకుడు చిత్రానికి పనిచేసిన టీమ్‌తోనే తర్వాత నిర్మాతగా మారి ‘విలేజ్‌లో వినాయకుడు’ తీశా. అది నేను రాసిన కథే. సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. కానీ మేం పెట్టిన డబ్బులు తిరిగిరాలేదు. ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాకూ ప్రొడ్యూసర్‌గా ఉన్నా. ఆ సినిమా కూడా నష్టాల్నే మిగిల్చింది. తర్వాత ‘పాఠశాల’ సినిమాకు రచయితగానూ, దర్శకుడిగానూ మారా. నేను కూడా శేఖర్‌ కమ్ముల, తేజగారిలా కొత్తవాళ్లని తీసుకుని అద్భుతాలు చేసేద్దామనుకుని ఆ సినిమాకు అందర్నీ కొత్త నటీనటుల్ని తీసుకున్నా. కానీ అదంత సులభం కాదని తర్వాత అర్థమైంది. అందుకే, ‘ఆనందోబ్రహ్మ’కు ఆ ప్రయోగం చెయ్యలేదు. ఈ సినిమాకి కథే హీరో అన్నది ఎంత నిజమో ఆ కథలో నటించినవాళ్లు సినిమా విజయానికి ప్రధాన కారణం అన్నది కూడా అంతే నిజం. సినిమా రాసుకుంటున్నపుడే రేచీకటి పాత్రను వెన్నెల కిషోర్‌ అయితే బాగా నిలపగలడు అనిపించింది. షకలక శంకర్‌ని జబర్దస్త్‌లో చూసి తన టాలెంట్‌కు చాలా ఆశ్చర్యపోయా. తను నటిస్తున్నప్పుడు ఆ మైకంలో ఉండిపోతాడు. మిగిలినవేవీ పట్టించుకోడు. ఇక, తాగుబోతు రమేష్‌ నిద్రలో కూడా ఆ పాత్రను బాగా చెయ్యగలడు. శ్రీనివాస్‌ రెడ్డి విషయానికొస్తే తన సీన్‌తో పాటు ముందు సీన్‌ వెనక సీన్‌ కూడా గుర్తుపెట్టుకుని, అర్థం చేసుకుని చెయ్యగలడు. ‘ఆనందో బ్రహ్మ’ సినిమాను ఏడాదిన్నర కిందటే అనుకున్నా. అప్పటికి తాప్సీ ఖాళీగానే ఉంది. అడగ్గానే ఈ సినిమాకి ఓకే చెప్పింది. కానీ నేను నిర్మాతను వెతుక్కునేసరికి ఆలస్యమైపోయింది. ఈలోపు తను హిందీలో ‘పింక్‌’ చిత్రం చెయ్యడమూ అది హిట్టవడమూ జరిగాయి. బాలీవుడ్‌లోనే మరో సినిమాకీ ఒప్పుకుంది. దాంతో నా సినిమా చేస్తుందో లేదో అనుకున్నా. కానీ రూపాయి తీసుకోకుండా ఈ సినిమా చేస్తానంది. సినిమా హిట్‌ అయితే లాభాల్లో కొంత ఇమ్మంది. మేకప్‌కీ విమాన టిక్కెట్లకు తప్ప మేం తనకేమీ ఇవ్వలేదు. అంతకుముందు నేనెవరో తాప్సీకి తెలీదు. అయినా నా కథను అంత నమ్మింది. నిర్మాత విజయ్‌ చిల్లా కన్నా ముందు పదిమందికి ఈ కథ చెప్పా. కానీ విజయ్‌ అందులోని విషయాన్ని గుర్తించారు. నేనే నిర్మాతగా ఉన్నప్పటి కన్నా ఇది నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. మనం కథ రాసుకుని మనమే బాగుందనుకుని డబ్బులు పెట్టుకోవడం గొప్పకాదు. వేరేవాళ్లు మన కథను నమ్మి చెయ్యడమే గొప్ప.

తెలుగు రాయడం రాదు...
పుట్టింది చిత్తూరులోనే అయినా చిన్నప్పట్నుంచీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ కావడం విదేశాల్లో ఉండడంతో తెలుగులో నా పేరు తప్ప నాకు ఇంకేం రాయడం రాదు. కానీ గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ పుణ్యమా అని కథల్నీ డైలాగుల్నీ కూడా తెలుగులో రాసేస్తున్నా. సినిమాల్లోకి వచ్చాక ఏడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా. అది నా ఎన్నో ఏళ్ల కష్టార్జితం. నాకు దేవుడు అదృష్టం ఇచ్చి బతకరా... అన్నాడు. కానీ నేనే ఇలా సవాళ్లు కావాలనుకున్నా. అందులో ఎవరి తప్పూ లేదు. జీవితంలో ఎవరికోసం వాళ్లు బతకాలనే స్వార్థం కొంచెమైనా ఉండాలన్నది నా అభిప్రాయం. మన ఇష్టాయిష్టాలకోసం మనమే బతకలేకపోతే ఎలా... నాన్నకోసమని ఓసారీ, కుటుంబం కోసమని ఇంకోసారీ సంపాదించినదంతా పోతే ఏం చెయ్యాలని మరోసారీ వయసైపోయిందనీ... ఇలా భయపడుతూ పోతే ఎప్పటికీ అనుకున్నది సాధించలేం. ఓటమి ఎదురైన ప్రతిసారీ దగ్గరివాళ్లు చాలామంది ‘ఇంకొద్దురా నాయనా వెళ్లిపో’ అన్నారు. పాఠశాల తీశాక ‘డైరెక్టర్‌గానూ ముచ్చట తీరిపోయిందిగా ఇక చాల్లే’ అని చెప్పారు. కానీ నా ఇష్టం నాది. దానివల్ల పడే కష్టం కూడా నాదే. ఈ సినిమా విడుదలయ్యే ముందు కూడా నేనొక్కటే అన్నా... పట్టుదలకూ మూర్ఖత్వానికీ చిన్న గీతే తేడా అని. రేపు సినిమా ఆడితే పట్టుదల అంటారు. పోతే మూర్ఖత్వం అని తిడతారు. అందుకే, జనం ఏం అంటారన్న దానికన్నా మనకేం కావాలో అదే చెయ్యాలనే క్లారిటీ ఉంది నాకు. అయినా నాకు సినిమా అంటే ఎంత ఇష్టం లేకపోతే చక్కగా డబ్బులొచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పదేళ్లపాటు ఓటమిని లెక్కచెయ్యకుండా ఎదురుచూస్తాను... ఓడిపోయిన ప్రతిసారీ దాన్నుంచి నేను చాలా నేర్చుకున్నా. పాఠశాల సినిమాలో కామెడీనే లేదన్నారు. అది తెలిసింది కాబట్టే ఆనందో బ్రహ్మలో అంతగా నవ్వించగలిగా.

నా కథలన్నీ వేరు వేరు ప్రదేశాలకు తిరుగుతున్నపుడు నా అనుభవాల్నుంచే పుట్టుకొస్తాయి. నాకు పుస్తకాలు చదివే అలవాటు కూడా పెద్దగా లేదు మరి. అసలు స్కూల్లోనే నా చదువు అంతంత మాత్రం. ఫస్ట్‌క్లాస్‌ రెండేళ్లు చదివా. దానికి తోడు నాన్న నిదానంగా చదవరా తొందరేముందీ... అనేవారు. ఆ తర్వాత కూడా మా క్లాస్‌లో 28 మంది ఉంటే నాకు 25, 26 ర్యాంకులు వచ్చేవి. నాన్నకు చెప్తే ‘నీకన్నా ఇంకా ముగ్గురు వెనకున్నారా... ఎవర్రా వాళ్లు’ అనేవారు. కానీ ఎప్పుడూ చదవమని ఫోర్స్‌ చెయ్యలా. చదువంటే మార్కులు కాదు జ్ఞానం అన్నది ఆయన నమ్మకం. నేనూ అదే నమ్ముతా.

అది నా ప్రేమకథ!
కాలేజీలో చదివేటపుడు లవ్‌ స్టోరీలు ఉన్నాయి. కానీ వాటి గురించి ఇప్పుడు చెప్పను ఎందుకంటే దానిమీద ఓ సినిమా తియ్యాలనుకుంటున్నా. అందులో నా కథతో పాటు నా చుట్టూ జరిగిన ప్రేమకథలూ ఉంటాయి. నా ప్రేమ సక్సెస్‌ కాలేదు. కానీ అది ఏ మలుపు తిరిగితే బాగుంటుందని నాకనిపిస్తే సినిమాను అలా తీస్తా. చాలామంది ప్రేమలో విఫలమైతే అన్నీ కోల్పోయినట్లే అనుకుంటారు. ఆ సందర్భానికి అలా అనిపిస్తుంది కానీ ఓ పదేళ్ల తర్వాత మనం అప్పుడు అలా ఉన్నామా అని తలుచుకుని మనమే నవ్వుకుంటాం. ఏ బాధైనా కష్టమైనా కాలంతో పాటు మాయని గాయం ఉండదుగా. కాబట్టే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా నేనిప్పుడు సంతోషంగా ఉన్నా. నాకిద్దరు పిల్లలు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నా అనుభవం దృష్ట్యా 21ఏళ్ల తర్వాత పిల్లల్ని కొంత కాలం విదేశాలకు పంపడం మంచిదే. పాశ్చాత్య దేశాల్లో నేను నేర్చుకున్న ఓ మంచి విషయం ఏంటంటే... అక్కడ చేసే ఉద్యోగాన్ని బట్టి మనుషుల్ని గౌరవించడం అనేది ఉండదు. డాక్టర్‌కైనా సెలూన్‌లో పనిచేసే వ్యక్తికైనా ఒకలాంటి మర్యాదనే ఇస్తారు. ఆ ఇద్దరిలో ఎవరు లేకపోయినా మనకు జరగనప్పుడు ఇద్దరి పనీ గొప్పదేగా. అందుకే, ఇంటిపేరుతోనో కులంతోనో కాకుండా నన్ను నాలానే గుర్తించాలన్న ఆలోచనతోనే పేరుని కూడా మార్చేసుకున్నా. నా అసలు పేరు మహేంద్ర. దాన్ని మహీ చేసి నాన్న పేరు వీర రాఘవని వీ రాఘవ్‌ గా కలిపి పెట్టుకున్నా.

- యార్లగడ్డ మధులత

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.