close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా విలనిజం... అసూయ పుట్టిస్తుంది!

నా విలనిజం... అసూయ పుట్టిస్తుంది!

అర్జున్‌ మన తెలుగు ప్రేక్షకులకి ఎంత దగ్గరో... తమిళ, కన్నడ అభిమానులకీ అంతే చేరువ! అందుకే మూడుభాషల్లోనూ కలిపి నూటయాభై సినిమాల మైలురాయిని దాటేశాడు. తన 37 ఏళ్ల కెరీర్‌లో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా శిఖరసమానమైన హిట్లూ, అథోపాతాళంలాంటి ఫ్లాపులూ చూశాడు!
ఎత్తులకెక్కినప్పుడు ఎక్కడా తలెగరేసినట్టు దాఖలాల్లేవుకానీ.. పడ్డ ప్రతిసారీ మాత్రం పట్టుదలగా పైకొచ్చిన సందర్భాలు కొల్లలు. హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్టు, విలన్‌.. పాత్ర ఏదైనా దానికి తనదైన గ్లామర్‌ అద్దుతున్న ఈ యాక్షన్‌ కింగ్‌ మనసు పొరల్లోకి తొంగిచూస్తే..

దో కన్నడ సినిమా. ‘సిపాయి రాము’ అని పేరు. ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌గారు హీరో. ఓ రోజు అమ్మతో కలిసి థియేటర్‌లో నేను ఆ సినిమా చూస్తున్నాను. ఫైట్‌ సీన్‌ వచ్చింది. హీరోగారు విలన్‌ని ‘డిష్యూం.. డిష్యూం’ అని కొట్టేస్తున్నాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే.. నా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నాలో కోపం, దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. ఒక దశలో తట్టుకోలేక పైకి లేచి ‘ఓయ్‌.. మా నాన్నని ఎందుకలా కొడుతున్నావ్‌?’ అని గట్టిగా అరవడం మొదలుపెట్టా. అమ్మ ఎంత వారించినా విన్లేదు. నాకు గుర్తున్నంత వరకూ సినిమాతో తొలి అనుభవం అదేనని చెప్పాలి. మానాన్న శక్తిప్రసాద్‌ సర్జా అప్పుడప్పుడూ ఆ విషయం ప్రస్తావించి ఉడికిస్తుండేవాడు నన్ను. కన్నడ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందకుపైగా సినిమాలు చేశారాయన. ఆయన బెంగళూరులోనిఓ స్కూల్‌లో పీఈటీ మాస్టర్‌గానూ పనిచేశారు. అమ్మ లక్ష్మి ఆర్ట్‌ టీచర్‌గా పనిచేసేవారు. నాకో అన్నయ్య, చెల్లెలు. నేను చదివిందంతా బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచీ పోలీసు ఆఫీసర్ని కావాలన్నదే నా కల. నాకు పదమూడేళ్లు ఉన్నప్పుడనుకుంటా బ్రూస్‌ లీ ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ సినిమా వచ్చింది. ఆ కరాటే ఫైట్‌లు నన్ను కట్టిపడేశాయి. అలా కాలేజీలో చదువుతూనే మార్షల్‌ ఆర్ట్స్‌లో చేరా. బ్లాక్‌ బెల్ట్‌ సాధించా. బాడీ బిల్డింగ్‌ కూడా చేయడం మొదలుపెట్టా. కాలేజీ అయ్యాక పోలీసు ట్రెయినింగ్‌లో చేరడమే తరువాయి అనుకుంటుండగా... ఓ రోజు సినిమావాళ్ల నుంచి పిలుపొచ్చింది.

బాడీ బావుంటే చాలు!
అదో బాలల సినిమా. కరాటే తెలిసిన టీనేజీ అబ్బాయి పాత్రకి కొత్త నటుణ్ణి వెతుకుతున్నారు. అప్పుడే ఎవరో చెప్పారట ‘మన శక్తిప్రసాద్‌ వాళ్లబ్బాయి బాడీ బిల్డర్‌లా ఉంటాడండీ, మనకి పనికొస్తాడు!’ అని. నన్ను రమ్మంటే వెళ్లాను. ఉన్నపళంగా షర్ట్‌ విప్పమన్నారు. పద్దెనిమిదేళ్లకే నాది సిక్స్‌ప్యాక్‌ బాడీ కదా.. తేరిపార చూశాక ‘నటిస్తావా?’ అని అడిగారు. ‘నాన్న ఒప్పుకుంటే సరేనండీ..’ అని నసిగా. నాన్న ఓకే చెప్పారు. దాంతో నటించేశా. అది ఫైట్స్‌ సినిమా కాబట్టి.. ఎలాగో గట్టెక్కాను. తర్వాతి సినిమా ఓ కాలేజీ లవ్‌స్టోరీ. మొదటిరోజే పాట చిత్రీకరిస్తున్నారు. నన్ను హీరోయిన్‌ నడుంపట్టుకోమని డ్యాన్స్‌ చేయమన్నారు. నాకు డ్యాన్స్‌ చేయడమే రాదు.. దానికితోడు హీరోయిన్‌ని పట్టుకోమనేసరికి బాగా బిడియపడ్డాను. ఎలాగైతేనేం దర్శక, నిర్మాతలు ఎంతో శ్రమించి నా చేత స్టెప్పులేయించారు.

ఆ తొలి తబ్బిబ్బుల తర్వాత తిరిగి చూసుకుంది లేదు. ‘మా పల్లెలో గోపాలుడు’తో తెలుగులో తొలి అవకాశం వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వ మాయతో ఏడాదిపాటు ఆడిన సూపర్‌హిట్‌ సినిమా అది! నన్ను నేను తొలిసారి స్టార్‌గా చూసుకుంది అప్పుడే. మా నాన్న హాజరైన తొలి విజయోత్సవం కూడా ఆ చిత్రానిదే. మరో ఏడాదికే తమిళంలో ఏవీఎం సంస్థవాళ్లది ‘శంకర్‌ గురు’ చిత్రం చేశా. అదీ కలెక్షన్‌ల వర్షం కురిపించింది. ఇక అంతే.. రెండు భాషల్లోనూ ఎడాపెడా సినిమాలు చేశా. గుడ్డిగా ఎంపిక చేసుకోవడం వల్ల.. ఫ్లాపులు మొదలయ్యాయి! నేను తెప్పరిల్లేసరికి అంతా చేయిదాటిపోయింది. చేతిలో ఒక్క సినిమా లేదు. ఒక ఏడాదంతా సినిమాల్లేక ఖాళీగా ఉన్నా. దర్శక, నిర్మాతలు నన్ను తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు.

ఇల్లమ్మేశాను..
ఇక తప్పదని నేనే సినిమాలు నిర్మించాలనుకున్నాను. కథ, దర్శకత్వం, ఫైట్స్‌.. అన్నీ నేనే! దర్శకత్వం నేర్చుకోవడం కోసం కొంతకాలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను. ఇల్లు అమ్మేశాను. ఆ డబ్బూ, అప్పటిదాకా సంపాదించినదాంట్లో చివరిగా మిగిలినది కాస్తా పెట్టి ‘సేవగన్‌’(తెలుగులో రౌడీ పోలీసుగా డబ్‌ చేశాం) అనే సినిమా తీశా. నాకష్టం ఊరికేపోలేదు. చిత్రం పెద్ద హిట్టు! ఆ తర్వాత మళ్లీ నా దర్శకత్వంలోనే ‘ప్రతాప్‌’ అనే సినిమా చేస్తే.. అది కూడా హిట్టే. నేను ఊహించినట్టే నిర్మాతలు మళ్లీ రావడం మొదలుపెట్టారు. కానీ నేను చాలా కోపంలో ఉన్నానప్పుడు. ‘నేను ఖాళీగా ఉన్నప్పుడు దగ్గరకు రానివాళ్లు.. ఇప్పుడొస్తున్నారా!’ అనే అక్కసుతో అందరినీ వెళ్లగొట్టాను. అలా నేను వెళ్లగొట్టినవాళ్లలో శంకర్‌ అనే యువకుడూ ఉన్నాడు! ఓ కథతో నాలుగైదు సార్లు నా దగ్గరకి వచ్చాడతను. నేను కుదరదనే చెప్పాను. చివరిగా ‘సార్‌ మీరు కథ వినకుండా వద్దనడం సరికాదు!’ అన్నాడు బాధగా. నాకు అదే అనిపించింది. దాంతో ‘ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదు...’ అనే నిశ్చయంతోనే ఆ కథ వినడం మొదలుపెట్టాను. మొత్తం విన్నాక ఆ కుర్రాడి సృజనకి అదిరిపోయాను. పశ్చాత్తాపంతోనే ఒప్పుకున్నాను. అదే ‘జెంటిల్‌మేన్‌’ కథ! ఆ సినిమా దక్షిణాదిలో చరిత్ర సృష్టించింది. నా ద్వారా ఓ గొప్ప దర్శకుడు పరిచయమయ్యాడని ఇప్పటికీ గర్వపడతాన్నేను. దాని తర్వాత మళ్లీ నా దర్శకత్వంలోనే ‘జై హింద్‌’ చేశాను. తెలుగులోనూ కోడిరామకృష్ణతో కలిసి ‘మా ఊరి మారాజు’ వంటి అచ్చమైన పల్లెటూరి సినిమాలు చేయడం మొదలుపెట్టా.

మళ్లీ అదే తప్పు చేయబోయా..
ఈసారి శంకర్‌ నుంచి మళ్లీ పిలుపు.. ‘ఒకే ఒక్కడు’ కోసం. మొదట రజనీకాంత్‌ని అడిగారట. సినిమాలో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆయన వద్దనడంతో నేనూ తటపటాయించాను. అంత బరువైన పాత్రకి నేను సరిపోనని అనుకున్నా. శంకర్‌ బలవంతంగా ఒప్పించాడు. ఈసారీ అతని అంచనాయే కరెక్టయ్యింది. అది నా కెరీర్‌లో మరో మైలురాయిగా మారిపోయింది! ఓ వైపు మిగతావారికోసం నేను చేస్తున్న సినిమాలూ, దర్శకుడిగా నిర్మాతగా మాటల రచయితగా నా అనుభవం... ఇవన్నీ నాలో పరిణతి తెచ్చాయని చెప్పాలి. హీరోగా చేయడానికే కాదు విలన్‌గా మారడానికీ చాలా దమ్ముండాలి అనిపించింది. మణిరత్నం ‘కడలి’తో దానికి శ్రీకారం చుట్టాను. గత ఏడాది నేనే హీరోగా
నా 150వ చిత్రం ‘కురుక్షేత్రం’ విడుదల చేశాను. అవి కాగానే, తెలుగులో తొలిసారి విలన్‌గా ‘లై’ సినిమా చేశాను. హీరోగా ఇంకో రెండుమూడు సినిమాలని అనుకుంటుండగా ‘అభిమన్యుడు’ స్క్రిప్టుతో వచ్చాడు దర్శకుడు మిత్రన్‌. దక్షిణాదిలో ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని విలనిజం ఇది! చక్కటి బాడీ, డ్రెస్సింగ్‌, మేధస్సుతో ఇప్పటిదాకా మనకున్న విలన్‌లందరూ అసూయపడేలాంటి పాత్ర అది. అందుకే ఒప్పుకున్నాను! ఆ సినిమా విడుదలయ్యాక దక్షిణాది నుంచే కాదు.. ప్రపంచంలో తెలుగు, తమిళ ప్రేక్షకులున్న అన్ని దేశాల నుంచీ అభినందనలు వచ్చిపడుతున్నాయి.

నేను ఆడే అబద్ధం అదే..
నా భార్య నివేదిత కన్నడ నటుడు రాజేశ్‌వాళ్లమ్మాయి. మంచి డ్యాన్సర్‌. ఆశారాణి పేరుతో ‘రథసప్తమి’ అనే చిత్రంలో నటించింది. ఏదో కార్యక్రమంలో చూసి ప్రేమలో పడ్డాం. ఇంట్లో తీవ్రమైన వ్యతిరేకత. అందర్నీ ఎదిరించే పెళ్లి చేసుకున్నాం. తాళికట్టేదాకా.. ఆ పెళ్లితంతు సాఫీగా సాగుతుందా లేదా అనే భయం నన్ను బాగా పీడించింది. అయ్యాక ‘హమ్మయ్య’ అని ఊపిరిపీల్చుకున్నా. నాకు ఇద్దరు కూతుళ్ళు. మా పెద్దమ్మాయి ఐశ్వర్య తమిళం, కన్నడల్లో కథానాయికగా చేస్తోంది. చిన్నమ్మాయి అంజన న్యూయార్క్‌లో చదువుకుంటోంది. మొన్న మొన్నటిదాకా వాళ్లతో ఆడుతూపాడుతూ తిరిగినట్టే ఉంది నాకు. వాళ్లతో ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉన్నట్టు గుర్తేలేదు. నా భార్య ఇందుకు పూర్తిగా విరుద్ధం.

సమయపాలనలో ఒక్క క్షణం తప్పినా.. ఉగ్రురాలైపోతుంది. నిజానికి.. నేను ఇప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, హీరోగా ఇన్ని పాత్రలు పోషిస్తున్నానంటే తనదగ్గర నేర్చుకున్న సమయపాలనే కారణం అని చెప్పాలి. ఎంత నేర్చుకున్నా ఇప్పటికీ అనుకున్న సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేక నెలకి పది ఫ్లైట్‌లన్నా మిస్‌ చేస్తుంటా! అలాంటప్పుడు వేరే ఫ్లైట్‌ ఎక్కి వచ్చి.. అసలు విమానమే లేట్‌ అయిపోయిందని మా ఆవిడతో అబద్ధం ఆడేస్తుంటా!

ద్రోహి.. అందమైన అనుభవం!

నేను కమల్‌కి వీరాభిమానిని. ఆయన సినిమా ఏదొచ్చినా మొదటిరోజు.. మొదటి షో చూడాలని తపించేవాణ్ణి. కానీ ఓ హీరోగా నేను అందరిలా జనాలమధ్యకొచ్చి సినిమా చూసే అవకాశం లేకపోయె! ‘గుణ’ సినిమాకి అలా ఆగలేకపోయా. ఎలాగైనా చూసితీరాల్సిందేననుకున్నా. ఓ పెద్ద తలపాగా చుట్టి.. పెట్టుడు గడ్డం అతికించుకుని థియేటర్‌కి వెళ్లి సినిమా చూడసాగా. ఇంటర్వెల్‌దాకా బాగానే సాగింది. ఆ తర్వాత నా ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి పక్కవాడితో ‘అరె ఆ వెనకున్న వ్యక్తి కళ్లు చూడు. అర్జున్‌లా లేడూ..!’ అంటున్నాడు. దాంతో తత్తరపడి మొహాన్ని కప్పేసుకున్నాను. అదే నేను చేసిన తప్పు. ‘సార్‌.. మీ మొహం మీద నుంచి చేతులు తీయండి ప్లీజ్‌’ అని అతనూ, అతని స్నేహితులూ పట్టుబట్టారు. తీసేశాను. అంతే.. ఇంటర్వెల్‌కి బయటకు వెళ్తున్నవాళ్లంతా నా చుట్టూ గుమిగూడారు. ఇక అక్కడెందుకుంటాన్నేను.. ‘సారీ ఫ్రెండ్స్‌’ అని చెప్పి పరుగొక్కటే తక్కువగా బయటకొచ్చేశాను. అలా వచ్చేశానన్నమాటేకానీ ఇంటర్వెల్‌ తరువాయి భాగం చూడలేదని చాలా బాధపడిపోయా. అంత అభిమానినైన నన్ను ఆయనే పిలిచి ‘ద్రోహి’ సినిమాకి అవకాశం ఇవ్వడం నా జీవితంలో ‘అందమైన అనుభవం’.

ఎంత పొగరో అనుకున్నా!  

గపతిబాబుని తొలిసారి ‘శుభవార్త’ సినిమా అప్పుడు చూశా! చూయింగ్‌ గమ్‌ నములుతూ.. నిర్లక్ష్యంగా కనిపిస్తున్న అతణ్ణి చూసి ‘ఎంత పొగరో’ అనుకున్నా(అతనూ నన్ను చూసి ఆ రోజు అలాగే అనుకున్నట్లు తర్వాత చెప్పాడు!). అప్పట్లో మాకు పెద్దగా పరిచయం ఏర్పడలేదు. కొన్నేళ్ల తర్వాత ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రంతోనే జగపతిబాబుని దగ్గరగా చూశాను. అతనిపైన నాకున్న అభిప్రాయం ఎంత తప్పో అప్పుడే అర్థమైంది. రవ్వంత కూడా హిపోక్రసీలేని మనిషి అతను. ‘ఇంత సహజంగా ఎలా ఉంటాడబ్బా!’ అని ఎన్నిసార్లు అనుకున్నానో. అప్పటి నుంచీ మేం దగ్గరి స్నేహితులమైపోయాం. నాకు జగపతిపై ఎంత అభిమానమో.. వాళ్లమ్మగారంటే అంత భక్తి! చూడగానే పాదాభివందనం చేయాలనిపించే తేజస్సు ఆమెది. హైదరాబాద్‌కంటూ వస్తే జగపతినీ, అమ్మనీ కలవడానికే ప్రయత్నిస్తా. నా ‘జై హింద్‌-2’ సినిమాలో జగపతే విలన్‌. ఆ సినిమా పనులప్పుడే వాళ్లమ్మగారి పుట్టినరోజూ వచ్చింది. ఇద్దరం కలిసి ఆత్మీయంగా నిర్వహించాం ఆ వేడుకని!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.