close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పన్నెండేళ్లకు ఓనమాలు దిద్దా..!

పన్నెండేళ్లకు ఓనమాలు దిద్దా..!

కళాకారులందరిపైనా ఓ అపవాదుంది... మిగతావాళ్లకంటే వాళ్లలో ఉద్వేగాలెక్కువనీ, కోపమైనా దుఃఖమైనా ఆనందమైనా దాచుకోలేరనీ! రోహిణికిది వర్తించదు. తన జీవితంలో కొండంత విషాదమున్నా నిండుకుండలాగే కనిపిస్తుందెప్పుడూ. బహుశా... జీవితాంతం మోయాల్సిన ఆ విషాదాన్నే ఆకురాయిగా చేసుకుని తన కళని సానబడుతోందేమో! అందుకే డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మనసులు దోచింది, నటిగా జాతీయ స్థాయి గుర్తింపు సాధించింది. రోహిణి జీవితంలోని ఎత్తుపల్లాలు ఆమె మాటల్లోనే...నేను ఔట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లినా, సెట్‌లో షూటింగ్‌ చేస్తున్నా నన్ను చూడగానే అందరూ అడిగేమాట ‘అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా!’ అనే. ఒక్క హైదరాబాదే కాదు, కేరళ, చెన్నై ఎక్కడికెళ్లినా ఈ ప్రశ్న వాళ్ల నుంచి ఎదురవుతూనే ఉంటుంది. ఆ పలకరింపులో ఆత్మీయతతోపాటూ ‘తండ్రిలేని బిడ్డని ఒంటరి తల్లిగా ఎలా పెంచుతోందో ఏమో!’ అనే ఆందోళనా కనిపిస్తుంది. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది... ఇంతటి అభిమానం సొంతం చేసుకునేంతగా మనం ఏం సాధించామా అని!  ఇందరి ప్రేమని నాకు సొంతం చేసిన సినిమాకి నేనేమిచ్చానా అని కూడా! నిజానికి తెలిసీతెలియని వయసులో ఈ రంగంలోకి వచ్చినా మొదట్లో చాలా అయిష్టంగానే ఇక్కడ కొనసాగాను.
‘నన్ను బడికెందుకు పంపరు’
మాది అనకాపల్లి. ఇంటిపేరు మొల్లేటివారు. నాన్న రావునాయుడు పంచాయతీ అధికారి. దాంతోపాటూ లారీల వ్యాపారం కూడా ఉండేది. ఇన్నున్నా ఎలాగైనా నటుడిగా మారాలనే కోరిక ఉండేది ఆయనలో. అందుకని అవకాశాల కోసం చెన్నై వస్తుండేవాడు. ఇంట్లో మేం నలుగురం. ముగ్గురన్నల తర్వాత నేను... నా తర్వాత ఓ తమ్ముడు.
వాడు పుట్టిన కొన్నాళ్లకి అమ్మ సరస్వతి చనిపోయింది. నాకప్పుడు ఐదేళ్లు కూడా లేవు! అమ్మ చనిపోయిన కొన్నాళ్లకి ‘యశోద కృష్ణ’ అనే తెలుగు సినిమాలో ఓ అవకాశం ఉందంటూ నాన్నకి పిలుపొచ్చింది. నాన్న నన్ను వెంట తీసుకెళ్లాడట! ఆ దర్శకుడు నాలో ఏం చూశాడో, ‘నా సినిమాకి చిన్ని కృష్ణుడు దొరికేశాడ’ంటూ నాచేత ఆ వేషం వేయించాడు. ఆ సినిమా కోసమే తొలిసారి ముఖానికి రంగేశాను. తర్వాత ఎన్నో సినిమాలు చేశాను. నాతోపాటూ నాన్నకి కూడా అవకాశాలొచ్చాయి. కానీ నాకు ఈ షూటింగ్‌లు ఏమాత్రం ఇష్టం ఉండేవి కావు. బడికెళ్లాలని ఉండేది. ‘నేనూ చదువుకుంటాన్నాన్నా...!’ అంటే ‘వాళ్లెవరికీ దక్కని అవకాశం నీకొస్తోందమ్మా! నువ్వు ప్రైవేటుగానైనా చదువుకోవచ్చు. కానీ వాళ్లకి లేని ప్రతిభ నీకుంది!’ అనేవాడు. ఇప్పుడు ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది. 

పన్నెండేళ్లకి అక్షరాలు దిద్దా!
పన్నెండేళ్లు వచ్చాయి. అటు బాలనటిగానూ... ఇటు పెద్దమ్మాయిలానూ చేయలేని వయసు అది. దాంతో అవకాశాలు తగ్గాయి. అదే అదనుగా నేను చదువులకి దగ్గరయ్యాను. అక్షరాలు దిద్దడం మొదలుపెట్టి నేరుగా ఐదో తరగతి చదివాను. ఏడాది తిరగకుండానే ఏడో క్లాసు పాఠాలు వల్లెవేయగలిగాను. అలా మూడేళ్లు గడిచాక ఓ మలయాళ సినిమాకి పిలిచారు... అదీ హీరోయిన్‌గా! రఘువరన్‌గారిని తొలిసారి చూసింది ‘కక్క’ (గవ్వ అని అర్థం) అనే ఆ సినిమాలోనే. అది హిట్‌ కావడంతో మలయాళంలో బిజీ అయిపోయా. అడపాదడపా తెలుగు, తమిళ చిత్రాల్లోనూ పనిచేసేదాన్ని. జంధ్యాలగారి ‘నాలుగు స్తంభాలాట’ అలాంటిదే. ఆ సినిమాకి అసోసియేట్‌గా ఉన్న పాణి... మణిరత్నం తెలుగులో తీస్తున్న ‘గీతాంజలి’కీ పనిచేశారు. ఆయన అడగడంతో అందులోని కథానాయిక గిరిజకి తొలిసారి గొంతు అరువిచ్చాను. ‘లేచి పోదామా...!’ అనే నా డైలాగ్‌కి అప్పట్లో భలే పేరొచ్చింది. అయినా మరెప్పుడూ ఇతరులకి డబ్బింగ్‌ చెప్పకూడదనే అనుకున్నా.వర్మకి నో...
‘గీతాంజలి’ చూసిన వర్మ తన తొలి సినిమా ‘శివ’లో అమల పాత్రకి గొంతు అరువివ్వాలని నన్ను అడిగారు. నేను పనిచేసే మలయాళ సినిమాలకి విరుద్ధంగా తమిళ, తెలుగు చిత్రాల్లో కనిపించే మెలోడ్రామా నాకు అస్సలు నచ్చేది కాదు. అందుకే ఆ సినిమాకి ముందు ‘నో’ చెప్పాను. వర్మ సహాయకులు మరీ మరీ అడిగితే ‘ఆ కొత్త దర్శకుడు సినిమా ఎలా తీశాడో ఏమో! సినిమా నాకు చూపమనండి!’ అన్నాను. అలాగే చూపించారు. అది సాదాసీదా తెలుగు చిత్రం కాదని సినిమా ప్రారంభంలోనే అర్థమైపోయింది. ఇంటర్వెల్‌ అప్పుడే చెప్పేశాను... అమలకి నేనే డబ్బింగ్‌ చెబుతానని! ఆ తర్వాత, డబ్బింగ్‌ చెప్పేకొద్దీ నా నటనా మెరుగుకావడం గమనించాను. దాంతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా వస్తున్న మంచి అవకాశాలన్నింటినీ వాడుకున్నాను. ఒక్క మణిరత్నంతోనే ఆరు సినిమాల్లో పనిచేశాను! ‘గీతాంజలి’లో అయితే ఏదో కుర్రమ్మాయిలా మాట్లాడగలిగానుకానీ... ‘బొంబాయి’లో మనిషాకొయిరాలాకి తగ్గట్టు గొంతు మార్చడానికి కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ముంబయి అల్లర్లలో ఇద్దరు పిల్లల్ని పొగొట్టుకున్న ఆమె బాధని గొంతులో చూపడం... సవాలుగా అనిపించింది. ఇక ‘రావన్‌’ క్లెమాక్స్‌లో విక్రమ్‌ చనిపోతుండగా ఐశ్వర్యరాయ్‌ బిగ్గరగా అరిచే సీన్‌ అయ్యాక... బొంగురుపోయిన నా గొంతుని సరిచేసుకోవడానికి డాక్టర్‌ని కలవాల్సి వచ్చింది!
జాతీయ గుర్తింపు...
తెలుగు, తమిళంలో డబ్బింగ్‌ చెబుతున్నా మలయాళంలో మాత్రం కథానాయికగానే చేస్తూ వచ్చాను. మలయాళ దర్శకుడు సేతుమాధవన్‌ అప్పుడే తెలుగులో ‘స్త్రీ’ అనే సినిమా తీశారు. అందులో నా నటనని ఆ ఏడాది జాతీయ అవార్డుల కమిటీ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసిస్తే... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డునిచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘తొట్టా చినుంగి’ అనే సినిమా చేశాను. అందులో రఘువరన్‌ కూడా ఉన్నారు! ఇదివరకు పరిచయమున్నా... ఆ షూటింగ్‌ నుంచే ఆత్మీయంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. అది ప్రేమగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన వద్దనడంతో సినిమాలకి దూరమైపోయాను. ఈలోపు బాబు పుట్టాడు. క్రమంగా మా మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. పొట్లాడుకుంటూ కలిసుండటంకన్నా స్నేహితులుగా విడిపోవాలనుకున్నాం. విడాకులు తీసుకున్నాం. బాబు నాతోనే ఉండిపోయాడు. నా ప్రపంచాన్ని వాడి చుట్టూ అల్లుకోవడం మొదలుపెట్టా!
అదో మలుపు...
పన్నెండేళ్లప్పుడు అక్షరాలు దిద్దాను అని చెప్పానుకదా... సినిమాలూ, డబ్బింగులు చేస్తున్నా చదువుని వదల్లేదు.  ప్రైవేటుగా ఎంఏ ఇంగ్లిషు పూర్తిచేశాను. తమిళ, తెలుగు భాషల్లోని గొప్ప రచనలన్నీ చదవడం మొదలుపెట్టా! ఆ పఠనం చిన్నప్పటి నుంచే నాలో సామాజిక స్పృహని పెంచింది. ఇరవైఏళ్లప్పుడే ఓ ఎన్జీఓలో పెరుగుతున్న ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నా! షూటింగ్‌ గ్యాప్‌లలో వివిధ సామాజిక సమస్యలపైన ధాటిగా మాట్లాడుతుండేదాన్ని. ఈ విషయాలన్నీ ఎలాగో తెలుసుకున్న తమిళ స్టార్‌ విజయ్‌ ఛానల్‌వాళ్లు... నాకో కొత్త అవకాశం ఇచ్చారు. అప్పట్లో ఎన్డీటీవీలో బర్ఖాదత్‌ నిర్వహిస్తున్న ‘వీ ది పీపుల్‌’ తరహాలో ఓ కార్యక్రమం చేయమన్నారు. బర్ఖా... పేరున్న జర్నలిస్టు. నేనేమో సినిమా మనిషిని. ఆమెలా నేను చేయడం సాధ్యమేనా అనిపించింది. అయినా రంగంలోకి దిగాను. అప్పటిదాకా అంతగా పత్రికలకెక్కని సామాజిక సమస్యలపైన నిపుణులూ, ప్రజలతో లైవ్‌గా మాట్లాడే కార్యక్రమం అది. ఆయా సమస్యల గురించి రోజంతా చదవడం, వివిధ వ్యక్తులతో మాట్లాడటం... ఇలా బాగా హోమ్‌వర్క్‌ చేసి షూటింగ్‌లకి వెళ్లేదాన్ని! ‘కేళ్విగల్‌ ఆయిరం’(వెయ్యి ప్రశ్నలు) అనే ఆ కార్యక్రమం తొలి రెండు ఎపిసోడ్‌లతోనే పెద్ద హిట్టయ్యింది.
అయితేనేం...
‘కేళ్విగల్‌ ఆయిరం’ కార్యక్రమం నాకే తెలియని నాలోని కొత్త కోణాన్ని చూపింది. సినిమా నటిననే భేషజాలు వదిలి మానవ హక్కుల సంఘాలతో కలిసి వివిధ వేదికలపైన మాట్లాడటం మొదలుపెట్టా. కుటుంబాలు వదిలేసిన మానసిక వికలాంగుల కోసం పనిచేసే ‘బన్యన్‌’తో కలిసి పనిచేయడం ప్రారంభించాను. ఎయిడ్స్‌ రోగుల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాను. అందుకోసమే ఓ నిర్మాణసంస్థను స్థాపించాను. సినిమారంగంలోని బాలనటుల కష్టనష్టాలపైన ‘సైలంట్‌ హ్యూస్‌’ పేరుతో 45 నిమిషాల డాక్యుమెంటరీ చేస్తే... అది లాస్‌ ఏంజెలస్‌ చిత్రోత్సవానికి వెళ్లింది! ఈలోపు తమిళంలో స్క్రిప్ట్‌ రైటర్‌గానూ, గేయరచయిత్రిగానూ మారిపోయాను. ఓ సినిమాలో అయితే అన్నిపాటలూ నేనే రాసి ‘సింగిల్‌ కార్డు’ సాధించాను. సింగీతం శ్రీనివాసరావుగారు చాలారోజుల తర్వాత తెలుగులో తీసిన ‘వెల్కం ఒబామా’ సినిమాకి సహాయకురాలిగా చేశాను. తాజాగా ‘అప్పావిన్‌ మీసై’(నాన్నగారి మీసం) అనే సినిమాకి దర్శకత్వం వహించాను. నిత్యామేనన్‌ కథానాయిక. ఆ సినిమా త్వరలోనే రిలీజవబోతోంది.
నందినితోనే..
ప్రేమా, పెళ్లి, విడాకులూ వాటితో వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత నేను చేసిన తొలి సినిమాల్లో ఒకటి ‘అలా మొదలైంది...’. దర్శకురాలు నందినిరెడ్డి ఆ తల్లి పాత్రని మలచిన తీరు నా మనసుకి దగ్గరగా అనిపించింది. మా వాడితో నేను ఎలా ఉంటానో అలాంటి పాత్ర అది. అందుకే ఒప్పుకున్నా. ఆ తర్వాత ‘అంతకుముందు ఆ తర్వాత...’ చేశాను. సాధారణంగా కథ విననిదే సినిమాలకి ఒప్పుకోని నేను రాజమౌళిపైన ఉన్న నమ్మకంతో బాహుబలికి కథ వినకుండానే సంతకం చేసేశా. నా నమ్మకం వమ్ముకాలేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తర్వాత ‘రంగస్థలం’, ‘చి.ల.సౌ’ వరసగా వచ్చాయి. చి.ల.సౌలో బైపోలర్‌ డిజార్డర్‌ ఉన్న తల్లి పాత్ర నాది. ‘బన్యన్‌’ సంస్థతో కలిసి పనిచేశాను కాబట్టి అలాంటివాళ్లని ఎంతోమందిని చూశాను. ఆ అనుభవం వల్లే ఆ తల్లి పాత్ర బాగా పండింది. ప్రస్తుతం చిరంజీవిగారి ‘సైరా’లోనూ కీలకపాత్ర చేస్తున్నా.అమ్మే ఉండుంటే...
నేను పెద్దగా ఉద్వేగాలకి గురయ్యే వ్యక్తిని కాను. గురైనా దాన్ని బయటకు చూపించను. కానీ అమ్మ ఉండుంటే బావుండేది కదా... అని చాలా సందర్భాల్లో అనిపించి బాధ కలిగేది. నేను రజస్వల అయినప్పుడూ, నాకు పెళ్లైనప్పుడూ, నేను తల్లిగా మారినప్పుడూ,  తోడెవ్వరూ లేక ఒంటరిగా మిగిలినప్పుడూ, మావాడు ఎదుగుతున్నప్పుడూ... అమ్మలేని వెలితి బాగా తెలిసింది. అమ్మపోయాక నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. పిన్నితో నాకే ఇబ్బందులూ లేకపోయినా కన్నతల్లిలేని లోటు పెద్దదే కదా! ఏదేమైనా నా జీవితంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ అలా జరగకుండా ఉండుంటే... ఈరోజు మానసికంగా నేనింత గట్టిగా ఉండేదాన్ని కాదు!

రఘు ఇవన్నీ చూసుండాల్సింది!

ఘు నటనని అందరూ ఎంతగా మెచ్చుకుంటారో ఆయనకి అర్థమయ్యేది కాదు. ‘ఆ.. మనల్నెవరు పెద్దగా పట్టించుకుంటారులే!’ అంటుండేవాడు. ఇప్పుడు ఏ సోషల్‌ మీడియాని చూసినా ఆయన నటన గురించి గొప్పగా రాస్తున్నారు. ‘ఫలానా సీన్‌లో ఏం చేశాడ్రా!’ అంటున్నారు. అవన్నీ చూడకుండా అంత చిన్నవయసులోనే ఆయన కన్నుమూసి ఉండాల్సింది కాదు. ప్రపంచానికి తెలియని ఓ విషయం ఏమిటంటే రఘు నిజానికి మంచి సంగీతకారుడూ, గాయకుడూ కూడా. దానిపైన దృష్టిపెట్టమంటే ‘నీలా నేను మల్టిటాస్కింగ్‌ చేయలేను! నటనలో ఉంటూ మిగతావాటిపైన దృష్టిపెట్టలేను!’ అనేవాడు. కానీ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు కొన్నిపాటలు పాడి వీడియో తీశాడు. వాటిని నేను సేకరించి ఈ మధ్యే వీడియో ఆల్బమ్‌గా చేశాను. దాన్ని రజినీకాంత్‌ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం కోసమే మావాడు తొలిసారి మీడియా
ముందుకొచ్చాడు! అన్నట్టు వాడిప్పుడు అమెరికాలో ప్రీ-మెడ్‌ డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.