close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ఆర్య’ నా జీవితాన్ని మార్చేసింది!

‘ఆర్య’ నా జీవితాన్ని మార్చేసింది! 

గీత గోవిందం... రూ.100 కోట్ల సినిమా. ఈ ప్రాజెక్టు ఇద్దరు వ్యక్తుల కల. వారిలో ఒకరు దర్శకుడు పరశురాం కాగా, రెండో వ్యక్తి నిర్మాత బన్నీ వాసు. సినిమా ప్రపంచానికి బన్నీ వాసుగా సుపరిచితుడైన వాసు అసలు పేరు గవర ఉదయ్‌ శ్రీనివాస్‌. నిర్మాతగా 100 పర్సెంట్‌ లవ్‌, పిల్లా నువ్వులేని జీవితం, భలే భలే మగాడివోయ్‌, నాపేరు సూర్య, గీత గోవిందం లాంటి అద్భుతమైన కథల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన వాసూని తన కథ గురించి అడిగితే, ఇదిగో ఇలా చెప్పుకొచ్చారు...దిల్లీలో ‘మాస్టర్స్‌ ఇన్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ’లో అప్పుడే చేరాను. ఇంకా అక్కడి వాతావరణానికి అలవాటు పడనేలేదు, నాన్న కనబడటంలేదని ఒకరోజు ఇంటినుంచి ఫోన్‌... మైండ్‌ బ్లాక్‌ అయింది. కాసేపటికి తేరుకుని బయలుదేరి పాలకొల్లు వచ్చేశాను. మా సొంతూరు అదే. నాన్న కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. వారసత్వంగా వచ్చిన ఆస్తితోపాటు ఆయన బాగా సంపాదించారు. చిన్నప్పట్నుంచీ మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. అప్పటికి అన్నయ్యకి పెళ్లయి డెహ్రాడూన్‌లోని ఐఐపీలో ఉద్యోగం చేసేవాడు. అక్కకీ పెళ్లి అయింది. వైజాగ్‌లో బిఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేశాను. నేను స్థిరపడితే చాలనుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారని తెలిసింది. అప్పులవాళ్లని కొంత టైమ్‌ ఇవ్వమని అడిగాను. ఆలోపు నాన్న ఎక్కడ ఉన్నారో తెలిసింది. వెళ్లి అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. ఆ పరిస్థితుల్లో ఇక చదువుకోలేనని అర్థమైంది. వంశీ అని నా స్కూల్‌మేట్‌, హైదరాబాద్‌లో ఉండేవాడు. ఇక్కడే ఏదైనా చేసుకుందామని వాడి రూమ్‌లో దిగాను. డిగ్రీ చదివేటప్పుడే 3డీ యానిమేషన్‌ నేర్చుకున్నాను. దాంట్లో మంచి స్కిల్‌ ఉండేది. వంశీ, నేనూ యానిమేషన్‌ వర్క్‌ చేసే ‘ఆప్ట్‌ సొల్యూషన్స్‌’ని పెట్టాం. అంతలోనే ఓరోజు నాన్న విషం తాగేశారని ఫోన్‌. టైమ్‌కి హాస్పిటల్‌కి తీసుకువెళ్లడంతో బతికారు. లాభంలేదని పొలాలూ, తోటలూ, ఇల్లూ అమ్మేసి చాలావరకూ అప్పులు తీర్చాం. నా జీవితంలో 20 ఏళ్లలో నేర్చుకోలేని పాఠం ఒక్క 2001 సంవత్సరంలోనే నేర్చుకున్నాను.
‘అల్లు’ కుటుంబంలోకి...
మేం సినిమాలకీ యానిమేషన్‌ వర్క్‌ చేసేవాళ్లం. డైరెక్టర్‌ మారుతికి యానిమేటర్‌గా అప్పటికే మంచి పేరుంది. తర్వాత అతడితో పరిచయమైంది. మేం ప్రభాస్‌ ‘ఈశ్వర్‌’ సినిమాకి కలిసి పనిచేశాం. ‘జానీ’ సినిమాకి పనిచేసినపుడు అల్లు అరవింద్‌ గారి పెద్దబ్బాయి బాబీ పరిచయమయ్యారు. మాది పాలకొల్లు అని తెలిసి ఇంకా క్లోజ్‌ అయ్యారు. బన్నీకి కూడా యానిమేషన్‌లో మంచి నైపుణ్యం ఉంది. మారుతి ద్వారా బన్నీ కూడా పరిచయమయ్యాడు. ఒకరోజు బాబీ పిలిచి... ‘బన్నీ హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు. తమ్ముడి పనులన్నీ చూడ్డానికి ‘మనవాడు’ అనుకునే ఒక వ్యక్తి కావాలి. నువ్వు ఉంటావా’ అని అడిగారు. అంత పెద్ద బాధ్యతని మోయగలనా అనిపించింది. అన్నీ ఆలోచించాక ఉంటానన్నాను. సరిగ్గా అప్పుడే బన్నీ ఏదో పనిమీద లండన్‌ వెళ్లాడు. అరవింద్‌గారు పిలిచి బన్నీ వచ్చేంతవరకూ తనతోపాటు ఉండమన్నారు. ఆ తర్వాతే ఏ విషయమూ చెబుతానన్నారు. దాదాపు రెండు నెలలు ఆయన దగ్గర ఉన్నాను. ఆ సమయంలో చాలా తప్పులు చేశాను. ముఖ్యంగా టైమ్‌కి ఆఫీసుకి వచ్చేవాణ్ని కాదు. అప్పగించిన పనుల్ని మాత్రం సకాలంలో పూర్తిచేసేవాణ్ని. అప్పుడే మా కుటుంబం గురించీ ఆయనకి తెలిసింది. బన్నీ వచ్చాక ‘ఇతను పర్‌ఫెక్ట్‌ మ్యాన్‌ కాదు. కాకపోతే తెలివైనవాడు, జీవితం తెలిసినవాడు. నీ పనులు చూస్తూ ఇక మనతోనే ఉంటాడు’ అని చెప్పేసరికి పెద్ద పరీక్ష పాసైన ఫీలింగ్‌ కలిగింది. అప్పటివరకూ శ్రీనివాసుగా ఉన్న నేను ఆరోజునుంచి సినీ పరిశ్రమలో బన్నీ వాసు అయిపోయాను.
డిస్ట్రిబ్యూటర్‌గా మొదలు...
‘ఆర్య’ పూర్తయ్యాక పాలకొల్లులో ఆ సినిమా తీసుకుంటానని నిర్మాత దిల్‌రాజు అన్నయ్యని అడిగితే డిస్ట్రిబ్యూటర్‌ని అడగమన్నారు. అతను చాలా ఎక్కువ రేటు చెప్పాడు. ఆ మాట చెబితే ‘మొత్తం పశ్చిమ గోవావరి డిస్ట్రిబ్యూషన్‌ నువ్వే చేస్కోరాదా రూ.42 లక్షలవుతుంది’ అన్నారు. కాసేపు ఆలోచించి సరేనన్నాను. అప్పటికి నా దగ్గరున్న యాభై రూపాయల్ని అడ్వాన్సుగా రాజన్న చేతిలో పెట్టాను. నవ్వుతూనే తీసుకున్నారు. అదే రోజు సురేఖ గారు ‘ఆర్య’ పాటలు చూడ్డానికి ప్రసాద్‌ ల్యాబ్స్‌కి వచ్చారు. అక్కడ ఆవిడతో డిస్ట్రిబ్యూషన్‌ విషయం చెప్పాను... ‘మరి డబ్బు చూసుకున్నావా’ అని అంటూనే చేతిలో రూ.9వేలు పెట్టారు. తర్వాత మారుతి, ఇంకా నా ఫ్రెండ్స్‌ అందరం కలిపి రూ.15 లక్షలు కూడబెట్టాం. థియేటర్‌ అడ్వాన్సులు తీసుకున్న మొత్తం కలిపి రూ.38 లక్షలు రాజన్న చేతిలో పెట్టి మిగతాది వారంలో ఇస్తానన్నాను. ‘మావాడు ఇచ్చినంత తీసుకోండి. మిగతాది నేను చూసుకుంటాను’ అని బన్నీ తనతో చెప్పాడని రాజన్న నాకు తర్వాత చెప్పాడు. ఆ సినిమా పెద్ద హిట్‌. అది బన్నీని హీరోగా నిలబడితే నా ఆర్థిక కష్టాల్ని తీర్చింది. ఆ డబ్బుతో నాన్న చేసిన అప్పుల్ని పూర్తిగా తీర్చేశాను. అందుకే ఆర్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆర్య తర్వాత యూవీ క్రియేషన్స్‌ వంశీతో కలిసి అరుంధతి, పోకిరి, మగధీర... ఇలా 50 వరకూ సినిమాల్ని డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. దాంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాను.నిర్మాతని చేశాడు...
2010లో ఒకరోజు ఇంట్లోకి క్లాప్స్‌ కొడుతూ జోష్‌తో వచ్చాడు బన్నీ. ‘ఆ స్వీట్‌ న్యూస్‌ ఏంటో నాకూ చెప్పు’ అని అడిగాను.‘సుకుమార్‌ కథ చెప్పాడు. చాలా బాగుంది. ఈ సినిమాలో నేను హీరోగా చేయకపోవచ్చు. కానీ నువ్వు నిర్మాతగా ఉండొచ్చు కదా!’ అని ఆ కథ చెప్పాడు. ‘సుక్కు ఏమంటాడో’ అన్నాను. వెంటనే సుక్కూకి ఫోన్‌చేసి ‘నేను ఈ సినిమాతో వాసుని ప్రొడ్యూసర్‌ చేద్దామనుకుంటున్నాను’ అని చెబితే ఓకే అన్నాడు. అదే ‘100 పర్సెంట్‌ లవ్‌’. సుక్కూ, నేనూ ఫ్రెండ్స్‌. ఆ సినిమాని ఆడుతూపాడుతూ చేసుకున్నాం. కథలో ఎక్కడైనా మొదట చెప్పినట్టు లేకపోతే నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేవాణ్ని. మొత్తానికి సినిమా మంచి హిట్‌. తర్వాత సాయిధరమ్‌ తేజతో ‘పిల్లా నువ్వులేని జీవితం’ తీశాం. షూటింగ్‌ పూర్తయిపోయి ఒక్క ఫైట్‌ మాత్రమే మిగిలున్న సమయంలో శ్రీహరిగారు చనిపోయారు. ఆ సినిమాలో ఆయనది చాలా ఎక్కువ నిడివి ఉన్న కీలక పాత్ర. అప్పటికే రూ.11-12 కోట్లు ఖర్చు పెట్టాం. అరవింద్‌ గారితో మాట్లాడితే మొత్తం మళ్లీ షూట్‌ చేద్దాం అన్నారు. ఆ సినిమాకి దిల్‌రాజు మరో నిర్మాత. శ్రీహరి పాత్రకి జగపతిబాబుగారిని పెడదామన్నారాయన. తర్వాత 20 రోజుల్లో షూటింగ్‌ పూర్తిచేశాం. అంత ఖర్చయినా ఆ సినిమాతో మాకు రూ.50 లక్షలు లాభం వచ్చింది. తర్వాత నా ఫ్రెండ్‌ మారుతి దర్శకుడిగా ‘భలే భలే మగాడివోయ్‌’ తీశాను. అది మంచి హిట్‌. ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి తక్కువ బడ్జెట్‌లో ‘నెక్స్ట్‌ నువ్వే’ సినిమాని తీశాను. అది బాగా ఆడకపోయినా లైట్‌ తీసుకున్నాను. ఆ సినిమాని నాన్న చూశారు. ‘ఏంటి ఇలాంటి సినిమా తీశావు. నీ పనిలో నెగ్లిజెన్స్‌ కనిపిస్తోంది’ అన్నారు. అరవింద్‌ గారు కూడా ‘నీకు గెలుపు ఈజీగా వస్తుందన్న ఫీలింగ్‌ వచ్చినట్లు ఉంది. చెక్‌ చేస్కో’ అన్నారు. ఆ మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి. అప్పటికి ‘నా పేరు సూర్య...’ షూటింగ్‌ జరుగుతోంది. పనుల్ని మెకానికల్‌గా చేస్తున్నాను తప్ప మునపటంత తపన ఉండటంలేదని అర్థమైంది. అందుకే తర్వాత కొద్దిరోజులు బ్రేక్‌ తీసుకున్నాను.అర్జున్‌రెడ్డి మేలు చేసింది
దర్శకుడు బుజ్జి(పరశురాం) నాకు మంచి ఫ్రెండ్‌. చాన్నాళ్ల కిందట మేము ఓ కథ అనుకున్నాం. అదే ‘గీత గోవిందం’. మా ఇద్దరికీ ఆ కథ బాగా ఇష్టం. అది గుర్తొచ్చి వెంటనే బుజ్జీని పిలిచి... ‘నేను వెనకబడిపోయాను. మనం మంచి సినిమా తీయాలి’ అన్నాను. బుజ్జి కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయింది. ఒక పెద్ద హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. హీరో విజయ్‌కి ఈ కథ చెప్పినపుడు విని ఏమీ చెప్పలేని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ‘నువ్వు చేసే యూత్‌ఫుల్‌ కథలు మంచివే. మధ్య మధ్యలో ఇలాంటివీ చేస్తే అన్ని వర్గాల అభిమానుల్నీ సంపాదించగలవు’ అన్నాను. ఆ మాటలకి సరేనన్నాడు. సినిమా ప్రారంభించిన వారం రోజులకి అర్జున్‌రెడ్డి రిలీజై బ్లాక్‌ బస్టర్‌ అయింది. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోగలమో లేదోనని భయం పట్టుకుంది. బుజ్జీకి పదేపదే జాగ్రత్తలు చెప్పేవాణ్ని. ‘అర్జున్‌రెడ్డి ఫ్యాక్షన్‌ కథ కాదుగదా. అదీ లవ్‌స్టోరీ, మనదీ లవ్‌స్టోరీ’ అని ధైర్యం చెప్పేవాడు. హీరోయిన్‌ కోసం ఆరు నెలలు వెతికాం. ఎవర్ని అడిగినా ‘నో’ అనేసేవాళ్లు. అర్జున్‌రెడ్డి రిలీజయ్యాక మాత్రం ‘నేను చేస్తానంటే నేను చేస్తాన’ని ఫోన్లు చేశారు. ‘కథ విన్నపుడు రష్మిక బాగా ఉత్సాహం చూపింది. ఆమే కరెక్ట్‌’ అని బుజ్జి అన్నాడు. అర్జున్‌రెడ్డి రాకపోతే హీరోయిన్‌ దొరకడానికి ఇంకెంత టైమ్‌ పట్టేదో! ఏ కథ అయినా మొదటిసారి విన్నపుడు ఒక ఉత్సుకత ఉంటుంది. అది తెరమీద కూడా కనిపించేలా చూడటమే నిర్మాతగా నా ప్రధాన బాధ్యత అనుకుంటాను.
నాకోసం జీఏ2
సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్న విషయాన్ని అరవింద్‌ గారితో చెప్పినపుడు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే చెయ్యమన్నారు. కానీ అదో ప్రతిష్ఠాత్మక బ్యానర్‌. అందులో చేయడానికి నాకు ధైర్యం చాల్లేదు. దాంతో ‘గీతా ఆర్ట్స్‌ 2’ పేరుతో కొత్త బ్యానర్‌ ప్రారంభించారు. వీటిలో ఏ బ్యానర్‌లో సినిమా తీసినా అరవింద్‌ గారూ, నేనూ భాగస్వాములుగా ఉంటాం. ఎక్కువ సినిమాలు తీయడానికి అప్పుడప్పుడూ ఇతర నిర్మాణ సంస్థలతోనూ కలిసి పనిచేస్తుంటాం. వాసు... బన్నీవాసుగా మారాక సినిమాలు తప్ప షికార్లూ, ప్రేమలూ లేవు. ఇంట్లో చూసిన సంబంధమే చేసుకున్నాను. తనపేరు కిరణ్మయి. మాకు ఒకబ్బాయి, ఒక అమ్మాయి. నాకో అలవాటు ఉంది. బాగా సంతోషం కలిగినా, బాధ అనిపించినా పాలకొల్లు వెళ్తాను. అక్కడికి వెళ్తే అన్నీ మర్చిపోయి మళ్లీ జీరోనుంచి ప్రయాణం మొదలుపెడతాను. నిన్ననే పాలకొల్లు వెళ్లొచ్చాను.

బన్నీని చూసి చాలా మారా!

న్నీదీ నాదీ దాదాపు ఒకటే వయసు. అందుకే స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా కలిసిపోయాం. బన్నీ చాలా సరదాగా ఉంటాడు. అదే సమయంలో ఎదగాలన్న సీరియస్‌నెస్‌ ఉంటుంది. ఆర్య షూటింగ్‌కి ముందు బన్నీకి చెన్నైలో టాన్సిల్స్‌ సర్జరీ చేశారు. ఉదయం సర్జరీ అయింది, సాయంత్రం బెంగళూరు వెళ్లి కాస్ట్యూమ్స్‌ సెలక్ట్‌ చేసుకుందాం బయలుదేరు అన్నాడు. ఇంట్లో ఒక మాట చెబుదామంటే, వద్దు మనం వెళిపోదామని బయలుదేరాడు. అంత కుతూహలం, తపన అతనిలో ఉంటాయి. ప్రతి సినిమాకీ కెరీర్‌ కొత్తగా ప్రారంభించిన వ్యక్తిలా కష్టపడతాడు. బన్నీని చూశాక నా ఆలోచనా ధోరణి చాలా మారింది. చాలా అంశాల్లో మా అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. తనదేమో దూకేసే క్యారెక్టర్‌. నేనేమో ఆచితూచి అడుగేస్తాను. తనకు నచ్చింది నాకు నచ్చదు. తనకు ఎందుకు నచ్చిందో చెబుతాడు. నాకు ఎందుకు నచ్చలేదో అడుగుతాడు. అలా ఇద్దరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇన్నేళ్ల మా ప్రయాణంలో తెలియక కొన్ని తప్పులు చేసినపుడు అరవింద్‌ గారు కోప్పడేవారు, సొంత కొడుకు చేసినా ఆయన అలానే కోప్పడతారనుకోండీ. కానీ బన్నీ మాత్రం ఎప్పుడూ నన్ను ఒక్క మాటా అనలేదు. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.