close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎనిమిదేళ్లలో వెయ్యిరెట్లు...!

ఎనిమిదేళ్లలో వెయ్యిరెట్లు...!

వన్‌97 కమ్యూనికేషన్స్‌ సంస్థ విలువ 2007లో 11 కోట్ల రూపాయలు ఉంటే 2015 నాటికి రూ.12వేల కోట్లకు చేరింది. అంటే- ఎనిమిదేళ్లలో వెయ్యి రెట్లకుపైన పెరిగింది. ‘ఇదెలా సాధ్యమ’ని అడిగితే... ‘వేగం నా నైజం’ అంటున్నాడు సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ. విజయ్‌ ఆశయాలూ, ఆలోచనలూ సగటు భారతీయ యువకుడివే. కానీ అతడి దారి మాత్రం భిన్నమైనది. అతడి విజయగాథలో ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు. అవన్నీ ఆయన మాటల్లో...
నాకు వేగం అంటే ఇష్టం. బంగీ జంప్‌, స్కైడైవింగ్‌, రివర్‌ రాఫ్టింగ్‌ నా హాబీలు. స్కైడైవింగ్‌ చేసేటపుడు ఆకాశంలోంచి గంటకు 350కి.మీ. వేగంతో కిందకు దూకుతుంటే ఆ థ్రిల్లే వేరు. ప్రతి ఒక్కరూ తమ రంగంలో ప్రథమంగా నిలవాలనుకుంటారు. కానీ సాధకుల్ని మిగతా వారినుంచి వేరుచేసేది పనిలో వేగమేనని నేను నమ్ముతాను. చదువులోనూ నాది దూకుడే. ప్రతి క్లాస్‌లోనూ నేనే స్కూల్‌ టాపర్‌ని. మధ్యలో రెండు క్లాసులు చదవకుండా 13 ఏళ్లకే టెన్త్‌, 15 ఏళ్లకు ప్లస్‌టూ పూర్తిచేసి వీసీతో ప్రత్యేక అనుమతి తీసుకొని ఇంజినీరింగ్‌లో చేరాను. ప్లస్‌టూ వరకూ హిందీ మీడియంలో చదువుకున్నాను. ‘దిల్లీ ఇంజినీరింగ్‌ కాలేజీ’లో ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌’ విభాగంలో చేరాను.

బ్యాక్‌ బెంచ్‌కు మారిపోయా...
అలీగఢ్‌ నుంచి దిల్లీ లాంటి పెద్ద నగరానికి వెళ్లి ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం చాలా కష్టంగా ఉండేది. నాన్న స్కూల్‌ టీచర్‌. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ఆయన ఒక్కరి జీతంతోనే ఇల్లు గడవాలి. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి నేను అమెరికా వెళ్లాలనీ లేదంటే ఇక్కడైనా కనీసం రూ.10వేల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాలనీ ఇంట్లో చెప్పేవారు. నాక్కూడా మొదట అదే లక్ష్యం ఉండేది. కాలేజీలో చేరిన మొదట్లో స్కూల్లో ఉన్నట్టే మొదటి బెంచీలో కూర్చొనేవాణ్ని. ఓరోజు లెక్చరర్‌ నాకో ప్రశ్న వేశారు. ఇంగ్లిష్‌లో ఏం అడిగారో అర్థం కాలేదు. ఆరోజు నుంచి బ్యాక్‌ బెంచీకి వెళ్లిపోయాను. వయసులో చిన్నవాణ్ని కావడంతో కాలేజీలో అంతా నాతో ఆడుకోవాలని చూసేవారు. కానీ నా హాస్టల్‌ మేట్‌ü్స రక్షణగా ఉండి ఎవరైనా ఏదైనా అంటే తిరిగి ప్రశ్నించే బలం ఇచ్చారు.

విద్యార్థిగానే కంపెనీ ప్రారంభించా
1994-95 నాటి రోజులు... అప్పుడే మనదేశంలోకీ ఇంటర్నెట్‌ వచ్చింది. ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి పత్రికలూ, మ్యాగజైన్లూ చదివేవాణ్ని. ఒక మ్యాగజైన్లో సిలికాన్‌ వ్యాలీ గురించి చదివాను. అది చదివాక నేనూ హాట్‌ మెయిల్‌ సృష్టికర్త సబీర్‌ భాటియాలా ఏదైనా కనిపెట్టాలి అనుకున్నాను. ఇంటర్నెట్‌లో, కాలేజీ లెక్చరర్ల సాయంతో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నేర్చుకున్నాను. క్లాస్‌లోకంటే ఇంటర్నెట్‌మీదనే ఎక్కువ సమయం గడిపేవాణ్ని. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉండగా నా బ్యాచ్‌మేట్‌ హరీందర్‌తో కలిసి ‘ఎక్స్‌ఎస్‌ కార్పొరేషన్‌’ పేరుతో ఒక వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించాను. అందులో ఫోన్‌ నంబర్లూ, ఇంటర్నెట్‌లో దొరికే సేవల గురించి సమాచారం పెట్టేవాళ్లం. కాలేజీ కంప్యూటర్‌ ల్యాబే మా ఆఫీసు. బదులుగా కాలేజీ వెబ్‌సైట్‌ నిర్వహణ చూసుకునేలా యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మెక్సికోకు చెందిన ఒక సంస్థ మా కంపెనీలో రూ.20వేలు పెట్టుబడి పెట్టింది. తర్వాత మాకు మరో ఇద్దరు స్నేహితులు తోడయ్యారు. 1998లో ఇంజినీరింగ్‌ పూర్తయింది. 1999 మే నాటికి కంపెనీ టర్నోవర్‌ రూ.50 లక్షలకు చేరింది. మంచి బేరం రావడంతో ఆ కంపెనీని మూడు కోట్లకు అమ్మేశాం. పెట్టుబడిదారు వాటా పోగా మిగిలిన డబ్బుని నలుగురం పంచుకున్నాం. అప్పటివరకూ మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఇంటికి ఒక కలర్‌ టీవీ కొన్నాను. అమ్మకి ఎన్నో చీరలు కొన్నాను. అక్కలకి పెళ్లిళ్లు చేయడానికి నాన్న కొంత అప్పు చేశారు. ఆ డబ్బు చెల్లించేశాను. అమ్మానాన్నలకి నేను చేస్తున్న పని ఏంటో అర్థం కాలేదు. కానీ, నేను బాగా సంపాదిస్తున్నందుకు ఎంతో సంతోషించారు.

అది బీఎస్‌ఎన్‌ఎల్‌ నంబరు...
ఎక్స్‌ఎస్‌... అమ్మేశాక అక్కడ కొన్నాళ్లు పనిచేశాను. తర్వాత వేరేచోట చేరాను. కానీ నాకు ఆ పని బోర్‌ కొట్టేసింది. నా సహోద్యోగి రాజీవ్‌ శుక్లాతో కలిసి ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’ని 2001 మొదట్లో ప్రారంభించాను. 197... బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరక్టరీ ఎంక్వైరీ నంబర్‌. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం చెందిన సంఖ్య. సింపుల్‌గా గుర్తు ఉంటుందని ఆ పేరుపెట్టాం. ఈ నంబరుకు ఏదైనా మొబైల్‌ నంబరు మెసేజ్‌ పెడితే అది ఎవరిదో చెప్పేవాళ్లం. దాంతోపాటు ఎయిర్‌టెల్‌ లాంటి టెలికామ్‌ కంపెనీతో జతకట్టి మాట్లాడుకునే సదుపాయానికి అదనంగా జోతిషం, క్రికెట్‌ స్కోర్లు, పాటలు... లాంటి(వాల్యూ ఏడెడ్‌ సర్వీసెస్‌)సేవలు అందించేవాళ్లం. కొన్ని నెలల తర్వాత అమెరికాలో ఉగ్రవాదులు దాడి(9/11) చేశారు. ఆ ప్రభావంతో కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది. దాంతో నా భాగస్వామి వెళ్లిపోయాడు. తర్వాత కంపెనీ నడపడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. స్నేహితులూ, కుటుంబ సభ్యుల నుంచి అప్పు తీసుకొని ఉద్యోగులకు జీతాలు ఇచ్చాను. క్రమంగా అప్పుల భారం పెరిగిపోయింది.. అయినా కూడా అయిదేళ్లు కంపెనీని నడిపాను.

నాకు అప్పటికి 25 ఏళ్లు. పెళ్లి చేయాలనేది ఇంట్లోవాళ్ల ఉద్దేశం. ఉద్యోగం లేనందున నాకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారనీ, ఏదైనా ఉద్యోగంలో చేరమని చెప్పేవారు నాన్న. ఆయన మాట కాదనలేక ఒక కంపెనీలో కన్సల్టెంట్‌గా చేరాను. అక్కడ నచ్చకపోతే మరో కంపెనీకి వెళ్లేవాణ్ని. మరోవైపు నా కంపెనీ విస్తరణకు ప్రయత్నాలు చేసుకునేవాణ్ని. ఇంటర్నెట్‌, టెలికామ్‌ రంగాలకు సంబంధించిన అంశాలపైనే మొదట్నుంచీ నాకు ఆసక్తి. ఏం చేసినా ఆ రంగంలోనే చేయాలని ఉండేది. న్యూజెర్సీలో ఒక కంపెనీలో 11 నెలలా 15 రోజులు పనిచేశాక మానేస్తానని చెప్పాను. మీరు మరో రెండు వారాలు పనిచేస్తే ఏడాది పూర్తయి మీకు రూ.16 లక్షలు వస్తాయన్నారు. అప్పటికే చాలా ఆలస్యం చేశానన్న ఫీలింగ్‌ ఉండేది. ‘ఈ రెండు వారాలు నా ప్రాజెక్టుమీద పనిచేస్తే భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ మొత్తాన్ని సంపాదించగల’ను అని చెప్పి కంపెనీ నుంచి బయటకు వచ్చేశాను.

పేటీఎమ్‌... అలా మొదలు
స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరుగుతుండటం చూశాక మొబైల్‌ రంగంలో ప్రకటనలూ, మార్కెటింగ్‌ సేవల్ని మళ్లీ ప్రారంభించాను. 2009 చివరి నాటికి వాటికి అదనంగా ఏదైనా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించాను. మొబైల్‌ ద్వారా డబ్బు చెల్లించే సేవలు మనదేశంలో అప్పటికే ప్రారంభమయ్యాయి. కానీ అవి ఫలవంతం కాలేదు. దాన్ని మేం మళ్లీ ప్రారంభించాలనుకున్నాం. టెలిఫోన్‌ ఆపరేటర్లతో మాట్లాడాం. కానీ వారి నుంచి మంచి స్పందన రాలేదు. 2010లో మనదేశంలో త్రీజీ సేవలు మొదలయ్యాయి. అప్పటికే స్మార్ట్‌ఫోన్‌తో అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా మార్పులు వచ్చాయి. వ్యాపారం మొబైల్‌ఫోన్‌ చుట్టూతా తిరగడం గమనించి అదే మనదేశంలోనూ జరగనుందని పేటీఎమ్‌డాట్‌కామ్‌ వెబ్‌ పోర్టల్‌ని ప్రారంభించి మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకునే వేదికను తీసుకొచ్చాం.

2011 తర్వాత పేటీఎమ్‌పైన ప్రధానంగా దృష్టిపెట్టాలని నిర్ణయించాను. ఆన్‌లైన్‌ రీఛార్జ్‌ తేలిగ్గా చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. క్లిక్‌ అయింది. అలా మేం ప్రారంభించిన 11 ఏళ్ల తర్వాత వన్‌97 సంస్థకు 110 కోట్ల లాభం వచ్చింది. తర్వాత డీటీహెచ్‌ బిల్లులు, బస్‌ టికెట్‌లూ, నగదు బదిలీ, ఇంకా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవల్నీ జాబితాలో చేర్చాం. ప్రస్తుతం రోజుకి లక్షమందికిపైగా పేటీఎమ్‌ మొబైల్‌ ఆప్‌ ద్వారా సేవలు పొందుతున్నారు. భవిష్యత్తు మొబైల్‌దేనని నమ్ముతున్నాం. అందుకే అక్కడ అధునాతన సాంకేతికతను తెస్తున్నాం. ఆప్‌లో ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ ఆప్షన్‌ని ప్రారంభించి ఒకే క్లిక్‌తో రీఛార్జ్‌ చేసే వెసులుబాటు తెచ్చాం. మేం పూర్తిగా రీఛార్జ్‌లపైనే ఆధారపడకుండా ఇతర రకాల సేవల్నీ తీసుకురావాలని చూస్తున్నాం. అందులో భాగంగా ప్రస్తుతం దుస్తులు లభించే పోర్టల్‌గానూ పేటీఎమ్‌ని మార్చాం. మా వినియోగదారులు పుస్తకాలూ, ఫోన్లూ అమ్మమనీ అడుగుతుంటే అవీ తెచ్చాం. మొబైల్‌ వాలెట్‌ని ప్రారంభించి షాపింగ్‌తోపాటు, క్యాబ్‌లు బుక్‌ చేసుకునే వెసులుబాటూ తీసుకొచ్చాం. పేటీఎమ్‌లో 10వేలమంది ఆఫ్‌లైన్‌, 16వేల ఆన్‌లైన్‌ వ్యాపారులు సేవలు అందిస్తున్నారు. క్రెడిట్‌ కార్డులూ నెట్‌ బ్యాంకింగ్‌పైన అవగాహన లేకపోయినా కూడా రోడ్డు పక్కన దుకాణాల దగ్గరకు వెళ్లి పేటీఎమ్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటున్నారు.

వారిని ప్రోత్సహిస్తా...
నాతోపాటే ఎంతోమంది మార్కెట్‌లోకి వస్తున్నారు. వారి ఆలోచనలూ వినూత్నంగా ఉంటున్నాయి. అలాంటి విలువైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టి ప్రోత్సహిస్తుంటా. ఇదివరకు మాలాంటి సేవలకు భిన్నమైన సేవలు అందించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవాళ్లం. ఇప్పుడు ఆన్‌లైన్‌ వేదికగా వచ్చే కంపెనీల్లోనూ మదుపు చేస్తున్నాను. గ్రెక్సిట్‌, మిలాప్‌ సోషల్‌ వెంచర్స్‌, ఎడ్యుకార్ట్‌, ఐఐఎమ్‌జాబ్స్‌, విష్‌బెర్గ్‌లలో పెట్టుబడులు పెట్టాను. ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన ‘లిటిల్‌ ఐ ల్యాబ్స్‌’తోపాటు ‘డెక్స్‌ట్రా’లోనూ మొదట్లో పెట్టుబడి పెట్టి తర్వాత ఉపసంహరించుకున్నాను. పెట్టుబడి పెట్టేటపుడు వ్యవస్థాపకుడినీ, అతడిలోని తపననీ గమనిస్తాను. అందరూ వస్తున్నారు కాబట్టి తానూ వచ్చాడా లేదంటే ఏదైనా ఒక వ్యవస్థను నెలకొల్పాలని చూస్తున్నాడా అని పరిశీలిస్తాను. కొన్ని స్టార్టప్స్‌కి అవసరమైతే మా సంస్థ కార్యాలయంలో ఉచితంగా గది కేటాయిస్తాను. బ్రౌన్‌టేప్‌, ఐనాక్స్‌ ఆప్స్‌, పోక్ట్‌ మా సంస్థ కార్యాలయంలో మొదలైన కంపెనీలే.

అలీబాబా భాగస్వామ్యం...
ప్రపంచమంతా అలీబాబా, జాక్‌ మాల గురించి ఆలోచిస్తే దాని వ్యవస్థాపకుడు జాక్‌ మా మాత్రం మా కంపెనీ గురించి ఆలోచించి సుమారు రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టాడు. మార్కెట్‌లో పోటీని తట్టుకోవాలంటే డబ్బుతోపాటు తగిన విధానాలను రూపొందించే భాగస్వామి కావాలన్న ఉద్దేశంతో అలీబాబాను ఆహ్వానించాం. చైనాలో ‘అలీ పే’ పేరుతో అలీబాబా కూడా పేటీఎమ్‌ తరహా సేవల్ని అందించడమూ దానికొక కారణం. మొబైల్‌ కేవలం మాట్లాడటానికే కాదు, అదో వాణిజ్య కూడలిగా మారిపోతోంది. పేటీఎమ్‌ ఆప్‌ని అందించి పేటీఎమ్‌ని అలాంటి వ్యాపార కేంద్రంగా మార్చుతున్నాం. మనదేశంలో 2020 నాటికి ఆన్‌లైన్‌ మార్కెట్‌ రూ.1.8 లక్షల కోట్ల మార్కెట్‌కు చేరుతుందని అంచనా. అందుకు తగ్గట్టు మేమూ ప్రణాళికలు వేస్తున్నాం. చెల్లింపుల బ్యాంకుగా వచ్చేందుకు ఇప్పటికే లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేశాం. మొబైల్‌ చెల్లింపులద్వారా ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వస్తుంది. ఈ-కామర్స్‌తో అవినీతిని అరికట్టవచ్చనేది నా ఉద్దేశం. ఇన్సూరెన్స్‌ విభాగంలోకీ విస్తరించేందుకు ఆలోచిస్తున్నాం.

వచ్చే 3-5 ఏళ్లలో కంపెనీ లాభాల బాట పడుతుందని అంచనా వేస్తున్నాం. ఇప్పటికి మాకు 5కోట్ల మంది వినియోగదారులున్నారు. నెలకు 6 కోట్ల చెల్లింపులు చేస్తున్నారు. వినియోగదారుల సంఖ్యను ఈ సంవత్సరం చివరికి 10 కోట్లకూ, 2017 చివరనాటికి 100 కోట్ల మందికీ చేర్చాలనుకుంటున్నాం. ఏదైనా అనుకుంటే అది సాధించాలనేది నా పాలసీ. ‘అహం బ్రహ్మాస్మి(నేనే సృష్టికర్తను)’... అనే మాటను విశ్వసిస్తాను.

యువ వ్యాపారులకు నేనిచ్చే సలహా ఒకటే... ‘వ్యాపార ఆలోచన’ వన్‌సైడ్‌ లవ్‌ లాంటిది. ఆలోచన దశలో కంపెనీని గొప్పదని చెప్పలేం. దాన్ని ఆచరణలోకి తీసుకురావడమే కీలకమైన అంశం. కానీ ఆ దశలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎంతో ఓపికతో చివరిదాకా మిగిలేవారే విజేతలుగా నిలుస్తారు.

ఇంకొంత...
నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ని ఫ్లిప్‌కార్ట్‌ తర్వాత మనదేశంలో అత్యధికంగా విలువ కలిగిన ఇంటర్నెట్‌ ఆధారిత కంపెనీగా చెబుతారు.
* ఈ కంపెనీలో విజయ్‌ శేఖర్‌కి దాదాపు 22 శాతం వాటా, పెట్టుబడి సంస్థ ఎస్‌ఏఐఎఫ్‌కు 40 శాతం, అలీబాబా గ్రూప్‌కి 25 శాతం ఉంది. వీరితోపాటు ఎస్‌ఏపీ వెంచర్స్‌, సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు, రిలయన్స్‌ క్యాపిటల్‌, రతన్‌ టాటాకూ, సంస్థలో పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగుల్లో సగం మందికి దీన్లో వాటాలు ఉన్నాయి.
* సంగీతం వినడం, సాహస క్రీడలూ విజయ్‌కి ఇష్టం.
* ‘గో బిగ్‌ ఆర్‌ గో హోమ్‌’... విజయ్‌ ఆఫీసు సమావేశగది తలుపుమీద రాసుండే మాటలు.
* వన్‌97... వీడియోగేమ్స్‌, వీడియోలతోపాటు ఏడెనిమిది రకాల సేవల్ని అందిస్తోంది.

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.