close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐఐటీలో చదివితే చాలనుకున్నా...

ఐఐటీలో చదివితే చాలనుకున్నా...

గ్రామీణ విద్యార్థులకీ, ఐఐటీలకీ మధ్య దూరం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే మూడు దశాబ్దాల కిందట పరిస్థితి ఎలా ఉండేదో అర్థంచేసుకోవచ్చు. కానీ, ప్రొఫెసర్‌ వలిపె రాంగోపాల్‌రావు పట్టుదల ముందు ఆ దూరం చిన్నబోయింది. తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లాపూర్‌ లాంటి వెనుకబడిన ప్రాంతం నుంచి వెళ్లి ఐఐటీలో విద్యనభ్యసించడమేకాక, ఇటీవలే ఐఐటీ-దిల్లీ సంచాలకుడిగా నియమితులయ్యారు. కొల్లాపూర్‌లో విద్యార్థి దశ నుంచి ఐఐటీ దిల్లీ సంచాలకుడి వరకూ ఆయన ప్రస్థానమిది...

ఐటీ చదువు నిజంగానే జీవితాల్ని మార్చేస్తుంది. అందుకు నేనే ఒక ఉదాహరణ. ఐఐటీ-బోంబేలో ఎం.టెక్‌. చేయకపోయి ఉంటే జీవితంలో ఈ స్థాయికి చేరేవాణ్ని కాదనే చెప్పాలి. గొప్ప ప్రొఫెసర్ల మార్గనిర్దేశం, విద్యార్థుల మధ్య పోటీ, అత్యున్నత మౌలిక సదుపాయాలూ.... బయట కాలేజీల్లో ఎక్కడా ఉండవు. అయితే ఇక్కడ జీవితం మారిపోవడం రెండు రకాలుగా ఉంటుంది. పోటీని తట్టుకొని నిలబడగలిగితే ఒకలా, పోటీలో నిలబడలేకపోతే మరోలా. నేను సవాళ్లని మనస్ఫూర్తిగా స్వీకరించాను. ‘అందరిలా బాగా చదవాలి, అందరికంటే బాగా చదవాలి’ అనుకున్నాను. అదంత సులభమైన పనికాదు. ఎందుకంటే అక్కడికి వచ్చేవారంతా దేశంలోనే టాపర్లు. ఐఐటీలో ప్రవేశం ప్రతి విద్యార్థిలోని అసలైన వ్యక్తిత్వానికి పరీక్షా సమయం. అప్పుడైనా ఇప్పుడైనా చిన్నప్పట్నుంచీ బాగా చదివేవాళ్లకీ సబ్జెక్టులోని అంశాలపై లోతైన అవగాహన ఉన్నవారికీ ఐఐటీలో రాణించడం ఒక సమస్యకాదు. రెండేళ్ల శిక్షణతో బట్టీ పద్ధతిలో చదివేవారు ర్యాంకు తెచ్చుకొని చేరినా తర్వాత ఇబ్బంది పడతారు.

గిల్లీ డండా రోజులు...
ఇప్పటిలా ఆరో తరగతి నుంచే ఐఐటీ గురించి ఆలోచించడం మారోజుల్లో లేదు. బీటెక్‌లో చేరేంత వరకూ నాకు ఐఐటీ గురించి తెలీదు. గ్రామీణ నేపథ్యం అందుకో కారణం కావచ్చు. కొల్లాపూర్‌లో మూడు తరాలవారూ ఉండే ఉమ్మడి కుటుంబం మాది. ఇంట్లో మొత్తం 15 మందిమి ఉండేవాళ్లం. అయిదుగురు అన్నదమ్ములం(మేం ఇద్దరం, చిన్నాన్న పిల్లలు ముగ్గురు). నాన్న రాఘవరావు న్యాయవాది. అమ్మ వెంకటమ్మ గృహిణి. నా బాల్యం చాలా ఆనందంగా గడిచింది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూసేవాళ్లం. గిల్లీ డండా, గోళీలూ, కబడ్డీలతో మా వీధి, పాఠశాల మైదానం ప్రతి సాయంత్రం సందడిగా ఉండేది. ఇప్పుడు వూళ్లొ ఈ ఆటలే కనిపించడంలేదు. చిన్న పండక్కీ ఓ పెద్ద పండగ వాతావరణం కనిపించేది ఇంట్లో. ఆటలు అయ్యాక పుస్తకాలే ప్రపంచం. చిన్నప్పట్నుంచీ చదువులో ముందుండేవాణ్ని. స్థానిక హైస్కూల్‌ నుంచి మా బ్యాచ్‌లో ఇద్దరమే పదో తరగతి పాసయ్యాం. నాకు ఫస్ట్‌క్లాస్‌ వచ్చింది. వెనకబడిన ప్రాంతం కాబట్టి మా వూళ్లొ ఉండటానికి టీచర్లు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. చాలామంది వచ్చీరాగానే బదిలీ గురించే ఆలోచించేవారు. అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివాను. మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌ లెక్చరర్‌ కూడా లేరు. ట్యూషన్లకి వెళ్లి చదువుకునేవాళ్లం. క్లాసు పుస్తకాలతోపాటు తెలుగు కథలూ, పద్యాలూ నవలలూ చదివేవాణ్ని.

నేను ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన 1981-82 సమయంలోనే ఎంసెట్‌ ప్రవేశపెట్టారు. దాంతో హైదరాబాద్‌లో కోచింగ్‌ సెంటర్లు మొదలయ్యాయి. కోచింగ్‌ కోసం అంత దూరం పంపడానికి ఇంట్లో ఆసక్తి చూపించలేదు. ‘నువ్వు బాగా చదువుతావు. సొంతంగా సిద్ధమైపోవచ్చు’ అని మా లెక్చరర్లూ, సీనియర్లూ అనడంతో సొంతంగానే ప్రిపేరయ్యాను. మంచి ర్యాంకు వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ‘కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌’లో ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో బీటెక్‌ ఎంచుకున్నాను. అప్పటివరకూ తెలుగు మీడియంలో చదవడంతో వివిధ అంశాల్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసుకొని రాయాల్సి వచ్చేది. మొదట్లో కొంత ఇబ్బందిపడ్డాను. ఇంకా కష్టపడాలని అర్థమైంది. దాంతో ఇంకాస్త ఎక్కువ సమయం చదివేవాణ్ని. ఆరు నెలల్లో ఇంగ్లిష్‌ మీడియంకి అలవాటు పడిపోయాను. బీటెక్‌ డిస్టింక్షన్‌లో పాసయ్యాను. బీటెక్‌లో ఇద్దరు, ముగ్గురు లెక్చరర్లు బాగా చెప్పేవారు. వారిచ్చిన స్ఫూర్తితోనే గేట్‌ రాసి ఐఐటీ బోంబేలో ఎం.టెక్‌.లో చేరాను. తర్వాత అక్కడే పీహెచ్‌డీలోనూ చేరాను. ఏడాదిన్నరపాటు పీహెచ్‌డీమీద పనిచేశాను. ఆ సమయంలో జర్మనీ ప్రభుత్వం నుంచి ఒక పథకం వచ్చింది. ‘పీహెచ్‌డీ చేస్తున్నవాళ్లు జర్మనీ యూనివర్సిటీలో ఏడాదిపాటు ఉంటూ అదే పరిశోధన కొనసాగించవచ్చు. తర్వాత సొంత దేశం వచ్చి థీసెస్‌ని సమర్పించవచ్చు’ అన్నారు. జర్మనీ ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది కూడా. ‘మంచి అవకాశం వెళ్లండి’ అని నా గైడ్‌ సూచించారు. అలా జర్మనీలో మ్యూనిక్‌ వెళ్లాను. ఏడాది తర్వాత... ‘మీ పరిశోధన బాగుంది. ఈ సమయంలో ఇండియాకి వెళ్లడమెందుకు... ఇష్టమైతే థీసెస్‌ని మా యూనివర్సిటీలోనే ఇవ్వండ’ని చెప్పారు నన్ను గైడ్‌ చేస్తున్న ప్రొఫెసర్‌. ఐఐటీ ప్రొఫెసర్‌కి ఆ విషయం తెలియజేస్తే ‘గొప్ప అవకాశం. ఎందుకు వదులుకోవడం అక్కడే కొనసాగించు’ అన్నారు. ఆ తర్వాత మరో ఏడాది ఉండి పీహెచ్‌డీ పూర్తిచేశాను. తర్వాత లాస్‌ఏంజలెస్‌లో ‘యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా’ నుంచి పోస్ట్‌ డాక్టరేట్‌ ఫెలోషిప్‌కి అవకాశం వచ్చింది. రెండేళ్లు ఆ ఫెలోషిప్‌పైన పనిచేశాను. జర్మనీ, తర్వాత అమెరికా వెళ్లినా కూడా ఐఐటీ బోంబేలో ప్రొఫెసర్లతో మాట్లాడుతూనే ఉండేవాణ్ని. దాంతో అమెరికాలో నా ఫెలోషిప్‌ పూర్తయ్యాక ఫ్యాకల్టీగా రావాలనుకుంటే వచ్చి చేరమన్నారు. ఒకప్పుడు ఐఐటీలో చదివితే చాలనుకున్నా... అలాంటిది ఐఐటీలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అవకాశం రావడంతో కాదనలేకపోయాను.

అవార్డులు ఆలోచనల్ని మార్చాయి...
శాస్త్రవేత్తగా నేను విజయం సాధించడానికి కారణం అమెరికా చదువే. అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పరిశ్రమలతో ముడిపడి ఉండేవి. ప్రతి వారం ఏదో ఒక కంపెనీ నుంచి ప్రతినిధులు వచ్చి తమ సమస్యని వివరించి పరిష్కారం చూపమని అడిగేవారు. దాంతో పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థమయ్యేది. పరిశ్రమలతో కలిసి పనిచేయడంవల్ల పరిశోధనల తాలూకు ప్రభావం నేరుగా తెలిసేది. మనదేశ విద్యా సంస్థల్లో వాతావరణం దానికి పూర్తిగా భిన్నం. ఇక్కడ పరిశోధకులు తమకు తాము ఏదైనా సమస్యని వూహించుకుని దాని పరిష్కారం కోసం పరిశోధిస్తారు. నేను మాత్రం పరిశోధనల్ని పరిశ్రమలతో ముడిపెట్టి అధ్యయనం చేసేవాణ్ని. అమెరికా, జర్మనీల్లో చదువుకునే రోజుల్లో పరిశ్రమ ప్రతినిధులతో ఏర్పడిన పరిచయాల్ని తర్వాత కూడా కొనసాగించాను. దాంతో వాళ్ల నుంచి చాలా ప్రాజెక్టులు వచ్చేవి. మొబైల్‌ ఫోన్లూ, ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వాడే ట్రాన్సిస్టర్లమీద ప్రధానంగా నా పరిశోధనలుండేవి. ఆ ప్రస్థానంలో 30కిపైగా పేటెంట్లు నాకు వచ్చాయి. అందులో సగం అమెరికాలో నమోదైన పేటెంట్లు. 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు ఇచ్చే స్వర్ణ జయంతి ఫెలోషిప్‌ 2003-04లో వచ్చింది. 2005లో ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ అవార్డు వచ్చింది. తర్వాత కూడా మరికొన్ని అవార్డులూ వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి వచ్చినా పరిశోధన రంగంలో ఉన్న నాలాంటి వాళ్లు ఎంతో సంతోషిస్తారు. కానీ నాకు అవన్నీ వచ్చాయి. అప్పటివరకూ ఇంటెల్‌, ఐబీఎం లాంటి విదేశీ కంపెనీల అవసరాలకు తగ్గట్టు పరిశోధనలు చేసేవాణ్ని. ఈ అవార్డులతో మనదేశంలోని సామాన్యుల జీవితాల్ని మెరుగుపర్చేందుకు ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత నాపైన ఉందనిపించింది. అలా ఆలోచించినపుడు చాలా సమస్యలు కనిపించాయి. వాటి కోసం కేవలం నేను పరిశోధనలు చేస్తున్న ఎలక్ట్రానిక్స్‌ విభాగం ఒక్కటే పనిచేస్తే సరిపోదు. మెకానికల్‌, జీవ, రసాయన, భౌతిక శాస్త్ర విభాగాల వాళ్లూ తోడవ్వాలి. ఐఐటీలో ఆయా విభాగాల వారితో మాట్లాడి ఒక బృందాన్ని తయారుచేశాను. మా ప్రయోగాలకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేసి నిధులు కోరాం. గుండె పోటుని ముందుగానే గుర్తించే ‘కార్డియాక్‌ చిప్‌’ని అభివృద్ధి చేస్తున్నాం. దీని ఖరీదు రూ.100కి దగ్గరగా ఉంటుంది. దీనికోసం ‘నానో స్నిఫ్‌’ పేరుతో ఐఐటీ-బోంబే క్యాంపస్‌లోనే ఒక స్టార్టప్‌ కంపెనీ పెట్టాం. పరిశోధనల స్థాయి దాటి త్వరలోనే మార్కెట్‌లోకి రానుందీ చిప్‌. పేలుడు పదార్థాల్ని గుర్తించే ఎలక్ట్రానిక్‌ పరికరాల్ని తేబోతున్నాం. నేలలోని తేమని గుర్తుపట్టి పంటకు అవసరమయ్యేంత నీటిని సూచించే సెన్సర్లనీ అభివృద్ధి చేస్తున్నాం. నలుగురు పీహెచ్‌డీ విద్యార్థులు దీనికోసం ఒక కంపెనీ మొదలుపెట్టారు. ఈ సెన్సర్లతో నీరు పొదుపు అవుతుంది. దీనివల్ల పంట ఉత్పత్తి 20-120 శాతం వరకూ పెరుగుతుంది. పొదుపుచేసిన నీటితో సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చు. ఫలితంగా రైతుల ఆర్థిక పరిస్థితీ, దేశ ఆర్థిక పరిస్థితీ మెరుగుపడతాయి. వీటిని హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయంతోపాటు చాలా చోట్ల ప్రయోగ పూర్వకంగా ఉపయోగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఐఐటీలూ, మిగిలిన విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల తీరుని మార్చేసింది. ఇదివరకు ఏ ప్రభుత్వ విద్యాసంస్థ అయినా తమకొచ్చే నిధుల్ని తమకు నచ్చిన పరిశోధనలకి కేటాయించేది. దాంతో 500 మంది 500 రకాల ప్రాజెక్టులమీద పనిచేసేవారు. ఫలితంగా, సమష్టిగా పనిచేసే సంస్కృతి అలవాటు కాలేదు. ఇప్పుడు కేంద్రం మొత్తం నిధులు ఇవ్వకుండా 60-70 శాతం మాత్రమే విడుదల చేస్తుంది. మిగతా మొత్తం కోసం పరిశోధనల ప్రతిపాదనలు పంపమంటోంది. అందులోనూ సమాజానికి ఉపయోగపడే, ప్రజల జీవనశైలిని మెరుగుపర్చే అంశాలపైనే దృష్టి పెట్టడం, పరిశ్రమతో కలిసి పనిచేయడం తప్పనిసరి. పరిశోధనలు కాగితాలకే పరిమితం కాకుండా పరిశ్రమ వరకూ వెళ్లాలనేది దీని ఉద్దేశం. ఈ మార్పుతో గతేడాది ఐఐటీలు మూడు వేల ప్రతిపాదనలు పంపాయి. ఇన్నేళ్ల నా పరిశోధనా అనుభవంలో ఇలాంటి మార్పు వస్తుందనుకోలేదు.

పరిశోధనలు ఆగవు...
ఐఐటీ బోంబేలో నా పరిశోధక బృందంలో 50 మంది వరకూ ఉన్నారు. మార్గనిర్దేశకుడిగా వారి పరిశోధనల్లో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాల్సిన బాధ్యత నామీద ఉంటుంది. వారి సమస్యలన్నీ నా సమస్యలే. అందుకే రోజులో 14 గంటలు పరిశోధనలమీద పనిచేస్తాను. ఐఐటీ-దిల్లీ డైరెక్టర్‌గా విద్యాసంస్థ పరిపాలనా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా కూడా పరిశోధనలు కొనసాగిస్తాను. ఈరోజు నేను డైరెక్టర్‌ హోదాలో ఉండొచ్చు... కొన్నాళ్ల తర్వాత ఉండకపోవచ్చు. నా పరిశోధనల ఫలితాలు సామాన్యులకి ఉపయోగపడటమే అంతిమ లక్ష్యం. అందుకే ఎన్ని బాధ్యతలు అదనంగా చేరినా విద్యార్థులకు మార్గనిర్దేశం కొనసాగిస్తూ పరిశోధకుడిగా కొనసాగుతాను. ఐఐటీ దిల్లీ- ఐఐటీ బోంబే సంయుక్తంగా పనిచేసేలా చూస్తాను. వ్యవసాయం, ఆరోగ్యం, భద్రత, పర్యావరణ అంశాల్లో పరిశోధనల్ని ప్రోత్సహిస్తాను. ఈ మధ్యనే నన్నొక అమెరికా యూనివర్సిటీ ప్రతినిధులు సంప్రదించారు. ఆ విశ్వవిద్యాలయంలోని అత్యుత్తమ విద్యార్థులు 10 మంది మనదేశంలో విద్యుత్తు సదుపాయం కూడా లేని గ్రామంలో నెల రోజులుండి స్థానికుల సమస్యల్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆ సమస్యలకు పరిష్కారాలు చూపడమే వారి తదుపరి ప్రాజెక్టు కావొచ్చు. అమెరికా నుంచి వచ్చి మరీ విద్యార్థులు మన గ్రామాల్ని అధ్యయనం చెయ్యగా లేనిది మనమెందుకు ఆ పని చేయలేం! ఐఐటీ విద్యార్థులూ ఇంటర్న్‌షిప్‌ కోసం గ్రామలకు వెళ్లి ఆర్థిక, సామాజిక కోణంలో సమస్యల్ని గుర్తించి వాటికి సరైన పరిష్కారాలు చూపేలా మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. మానవ వనరుల విభాగం మొదలుపెట్టిన ‘ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని కూడా ఇందుకు వేదికగా ఉపయోగించుకుంటాం. ఇప్పటికీ మన గ్రామీణ జనాభా ఎక్కువే. గ్రామీణాభివృద్ధి అంటే దేశాభివృద్ధే! అదే మన అందరి అంతిమ లక్ష్యం!


ఇంకొంత

శ్రీమతి అనుపమ, వైద్యురాలు.
* ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి స్మృతి, పన్నెండో తరగతి పూర్తిచేసింది. చిన్నమ్మాయి స్నేహ, అయిదో తరగతి చదువుతోంది.
* మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో ఎం.టెక్‌, నానోఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
* ఐఐటీ-దిల్లీ సంచాలకులుగా నియామకానికి ముందు ఐఐటీ-బోంబేలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఛైర్‌ ప్రొఫెసర్‌గా, ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ నానో టెక్నాలజీ’ విభాగానికి ముఖ్య పరిశోధకుడిగా ఉండేవారు.
* 2013లో ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌, 2016లో సీఎన్‌రావు జాతీయ నానోసైన్స్‌ అవార్డులు అందుకున్నారు.
* ఏడాదిలో ఒకసారైనా కొల్లాపూర్‌ వస్తారు. ఆ సమయంలో వూళ్లొని వివిధ పాఠశాలలకు వెళ్తారు. ‘గ్రామాల్లోని విద్యార్థులకి ఒక రోల్‌మోడల్‌ ఉండాలి. లేకపోతే, వారికి... మనది వెనకబడిన ప్రాంతం. మన చుట్టూ ఉండేవారంతా సామాన్యులే. మనమూ ఇంతేనన్న భావన కలుగుతుంది’ అని చెబుతారు రాంగోపాల్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.