close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ గౌరవం నాకే దక్కింది..!

ఆ గౌరవం నాకే దక్కింది..!

పర్వతనేని హరీష్‌...ఎప్పట్నుంచో ప్రపంచంలో చాలామంది ప్రముఖులకు పరిచయమున్న పేరు. ఇప్పటికైనా ప్రతి తెలుగువాడూ తెలుసుకోవాల్సిన పేరు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిగా సౌదీ, ఈజిప్ట్‌, సిరియా లాంటి సున్నితమైన ప్రాంతాల్లో పనిచేశారు. నిన్నమొన్నటి దాకా హూస్టన్‌లో కాన్సూల్‌ జనరల్‌గా లక్షలాది భారతీయులకు అండగా నిలిచారు. ఈ మధ్యే వియత్నాంలో భారత రాయబారిగా అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ప్రతినిధిగా విదేశాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన స్వదేశం నుంచి అక్కడి దాకా సాగించిన ప్రయాణాన్ని ఇలా గుర్తుచేసుకుంటున్నారు...

మ్యం కంటే ప్రయాణం చాలా విలువైనది... నాకు బాగా నచ్చిన మాటిది. ఫలితాన్ని ఆశిస్తూ పనిచేస్తే ఎప్పటికీ ఆనందంగా ఉండలేం. చివరికి కోరుకున్నది అందకపోతే ఆ తరవాతా సంతోషం ఉండదు. అందుకే చిన్నప్పట్నుంచీ నేను పనినే ఆస్వాదించడం నేర్చుకున్నా. ఫలితాలు వాటంతటవే రావడం మొదలుపెట్టాయి. మా నాన్న పీఎస్‌వీ ప్రసాద్‌గారు ఉత్తర్‌ ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన వృత్తి రీత్యా రకరకాల ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది కాబట్టి, నన్ను విజయవాడలో మా తాతగారి ఇంట్లోనే ఉంచి చదివించారు. తాతయ్య ఐటీఐ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. పిల్లల్నీ ఉన్నత చదువులు చదివించారు. దాంతో సహజంగానే నా పైనా ఆ విషయంలో కాస్త ఒత్తిడి ఉండేది. దానికి తగ్గట్టే నేనూ కష్టపడేవాణ్ణి. చిన్నప్పుడు క్లాస్‌లో టాప్‌ మార్కులే వచ్చేవి. వీలున్నప్పుడల్లా నాన్నతో రకరకాల ప్రాంతాలకు తిరగడం వల్ల కొత్త వ్యక్తులూ, పరిస్థితులూ, భాషలపైనా కాస్త అవగాహన కలిగింది.

టెన్త్‌లో టాపర్‌ని
వూహ తెలిసినప్పట్నుంచీ చదువే ప్రపంచంగా సాగింది. ఆటలంటే ఎందుకో నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. క్విజ్‌ కాంపిటీషన్లూ, డిబేట్‌లలో మాత్రం ఎక్కువగా పాల్గొనేవాణ్ణి. ఖాళీ దొరికితే పేపర్‌ చదవడం, రేడియో వినడంతోనే కాలక్షేపం. కనకదుర్గమ్మ గుడిలో ఉత్సవాలూ, మేరీమాత వేడుకలకు తరచూ వెళ్లేవాణ్ణి. స్కూల్లో చాలా మంది ఆంగ్లో ఇండియన్‌ టీచర్లూ, విద్యార్థులూ ఉండటంతో భిన్నమైన సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశమూ దొరికింది. ఇక తొలిసారి మా ఇంటికి టీవీ వచ్చినప్పుడు కలిగిన సంతోషమే వేరు. కానీ పైతరగతులకు వచ్చే కొద్దీ తక్కిన వ్యాపకాలపైన ఆసక్తి తగ్గిపోయింది. పదో తరగతి వరకూ చదువంతా సీబీఎస్‌ఈలోనే. టెన్త్‌లో 37వ ర్యాంకుతో ఆలిండియా టాపర్లలో ఒకడిగా నాకూ చోటు దక్కింది. కానీ ఆపైన సీబీఎస్‌ఈలో చదవడానికి అప్పట్లో విజయవాడలో స్కూళ్లు లేవు. దాంతో లయోలా కాలేజీలో ఇంటర్‌లో చేరా. అక్కడ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌గారు మా హిందీ టీచర్‌. అప్పుడప్పుడే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ ప్రభంజనం మొదలవుతున్న సమయంలో ఆయన మాత్రం చదువే ప్రపంచం కాదనీ, ముందు వ్యక్తిగా ఉన్నతంగా ఎదగాలనీ పిల్లలకు చెప్పేవారు.

ఎంసెట్‌లో స్టేట్‌ ర్యాంక్‌
ఎవరో నిరుత్సాహ పరిచారనీ, తెలిసిన వాళ్లెవరూ ఆ పని చేయట్లేదనీ మనం కూడా వెనకడుగు వేయడం, నలుగురిలో ఒకరిలా మిగిలిపోవడం సరికాదనే పాఠం నాకు ఇంటర్‌లో అర్థమైంది. ఆ రోజుల్లో నాకు ఐఐటీ జేఈఈపైన ఆసక్తి ఉండేది. ఎవరి సహాయం లేకుండా సొంతంగా దానికి సన్నద్ధమయ్యేవాణ్ణి. కానీ పరీక్షలు దగ్గరకు వస్తున్న సమయంలో ఐఐటీ ఆలోచనలు మానేసి ఇంటర్‌, ఎంసెట్‌పైన దృష్టిపెట్టమని టీచర్లు హెచ్చరించారు. దాంతో ఐఐటీ పుస్తకాల్ని పక్కన పెట్టాల్సొచ్చింది. అయినా ఎంట్రెన్సులో 1700లలో ర్యాంకొచ్చింది. అదే ఇంకాస్త కష్టపడి ఉంటే కచ్చితంగా 500లోపే వచ్చేదనిపించింది. ఆ ఫలితంతో కాస్త బాధపడినా ఎంసెట్‌లో 130వ ర్యాంకు రావడం దాన్ని మరిపించింది. ఇంటర్‌లో కూడా 89శాతం వచ్చింది. నా క్లోజ్‌ ఫ్రెండ్‌ 91శాతంతో ఆ సంవత్సరం స్టేట్‌ టాపర్‌గా నిలిచాడు. నాన్న ఐపీఎస్‌ అధికారి కావడం, తాతయ్య కూడా సివిల్స్‌ గురించి తరచూ ప్రస్తావించడంతో నాకూ క్రమంగా దాని పైన ఆసక్తి పెరిగింది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కంటే అదే ఉన్నతమైన కెరీర్‌ అనిపించేది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తే సివిల్స్‌ పరీక్షల్లో అది ఒక ఆప్షనల్‌ సబ్జెక్టుగానూ పనికొస్తుందనిపించి, హైదరాబాద్‌ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ కోర్సులో చేరా. అప్పట్లో ఉస్మానియా అంటే ఓ విజ్ఞాన భాండాగారమే. అక్కడ సెంట్రల్‌ లైబ్రరీలో అడుగుపెడితే దొరకని పుస్తకం, కనిపించని పత్రికంటూ ఉండేది కాదు. ఎప్పుడైనా సరదాకి తప్పించి క్యాంపస్‌ నుంచి బయట అడుగుపెట్టే అవసరమూ రాలేదు.బీటెక్‌లో బంగారు పతకం
ఆ రోజుల్లోనూ సివిల్స్‌కి పోటీ చాలా ఎక్కువే. వందల్లో ఉండే పోస్టులకు లక్షల్లో దరఖాస్తులొచ్చేవి. ఎంత కష్టపడ్డా కొంత అదృష్టమూ కలిస్తేనే ర్యాంకొస్తుంది. నాలుగైదు లక్షలమంది ప్రిలిమ్స్‌ రాస్తే, పదివేలమంది మెయిన్స్‌కీ, అక్కణ్ణుంచి ఓ 1800మంది ఇంటర్వ్యూకీ, 800మంది తుది జాబితాలోకీ అర్హత సాధించేవారు. కోరుకున్న సర్వీసు దక్కాలంటే కనీసం వందలోపు ర్యాంకు రావాలి. అందుకే రిస్కు తీసుకోకుండా ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పుడు ఎంబీఏ ఎంట్రెన్సులపైనా దృష్టిపెట్టేవాణ్ణి. క్యాట్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఆర్‌ఎంఏ లాంటి రకరకాల పరీక్షలు రాశా. ఓ పక్క ఎంబీఏ, మరో పక్క సివిల్‌ సర్వీసులకు ప్రిపేర్‌ అవడంతో పాటు ఇంజినీరింగ్‌పైనా దృష్టిపెట్టాల్సి రావడంతో ఒత్తిడి ఎక్కువగా ఉండేది. రోజుకు పదిహేను గంటలు పుస్తకాలతోనే సరిపోయేది. దానికి తగ్గట్టే ఫలితాలూ దక్కాయి. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఉస్మానియా నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నా. ఎంబీఏ కోసం ఐఐఎం కలకత్తా, బెంగళూరు, లక్నోతోపాటు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్‌పూర్‌, ఐఆర్‌ఎంఏ ఆనంద్‌ లాంటి అన్ని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లొచ్చాయి. ఒకవేళ సివిల్స్‌ కొట్టలేకపోయినా ఎంబీఏతో మంచి కెరీర్‌ ఉంటుందనిపించి కలకత్తా ఐఐఎంలో చేరా.

తొలి అడుగు ఈజిప్ట్‌లో
సివిల్స్‌కు సిద్ధమవడమంటే ఓ రకంగా తపస్సు చేయడమే. ప్రతిఫలం వస్తుందన్న నమ్మకం పెట్టుకోకుండా రోజుల తరబడి సమయాన్ని దానికే కేటాయించాలి. ఐఐఎంలో నా జీవితం అలానే గడిచింది. ఒకపక్క ఎంబీఏ సెమిస్టర్‌కు ప్రిపేర్‌ అవుతూనే మెయిన్స్‌ రాశా. కొన్నాళ్లు గోద్రెజ్‌ సంస్థలో సమ్మర్‌ జాబ్‌ చేస్తూ ఇంటర్వ్యూకి సన్నద్ధమయ్యా. చివరికి విడుదలైన ఫలితాలతో ఎన్నో ఏళ్ల నా కల నిజమైంది. ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌)కు అర్హత సాధించడంతో ఎంబీఏ రెండో ఏడాది పూర్తి చేయకుండానే ముసోరి వెళ్లి సర్వీసెస్‌ శిక్షణలో చేరిపోయా. ప్రతి ఐఎఫ్‌ఎస్‌ అధికారీ ఏదో ఒక విదేశీ భాష నేర్చుకోవాలన్న నిబంధన ఉండేది. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో నా తొలి పోస్టింగ్‌ వేసి అక్కడ అమెరికన్‌ యూనివర్సిటీలో అరబిక్‌ నేర్పించే ఏర్పాట్లు చేశారు. అక్కడుండగానే నాకు వివాహమైంది. మా పెద్దమ్మాయి ఆయుషి కూడా అక్కడే పుట్టింది. ఓ పక్క నేను క్లాసికల్‌ అరబిక్‌ నేర్చుకుంటుంటే, నా భార్య నందిత వ్యవహారిక అరబిక్‌ భాష నేర్చుకునేది. చివరికి డిస్టింక్షన్‌లో అరబిక్‌ పాసై నా తరవాతి గమ్యం సౌదీ అరేబియాకు బయల్దేరా. జీవితంలో కీలకమైన బాధ్యతలు అప్పుడే ఎదురయ్యాయి. సౌదీలో భారత ప్రతినిధిగా అక్కడ స్థిరపడ్డ దాదాపు ముప్ఫయ్‌ లక్షల మంది భారతీయులకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటు భారత ఎంబసీ కార్యాలయం, రాయబారి నివాసం సహా ఇతర అనేక భారతీయ భవనాల నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతా నాపైనే పడింది. అరబిక్‌లో పట్టుండటంతో అక్కడ సమర్థంగా పని చేయగలిగా.

ఉపరాష్ట్రపతి పేషీలో...
గాజా, జోర్డన్‌, సిరియా, లెబనాన్‌ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో డిప్యుటేషన్‌ మీద ఐక్యరాజ్య సమితి తరఫున పాలస్తీనా శరణార్థుల బాగోగులను పర్యవేక్షించే బాధ్యతలు నిర్వహించా. అక్కడ ఒక్కో బాధితుడి వెనక ఒక్కో కన్నీటి కథ దాగుండేది. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో కలిసి లక్షలమంది శరణార్థులకు స్థిరమైన జీవితాల్ని అందించే దిశగా కృషి చేశా. నా చొరవా, పనితీరూ నచ్చడంతో ఐరాస ఇంకొంత కాలం ఆ బాధ్యతల్లో కొనసాగాలని అభ్యర్థించింది. కానీ అప్పటికే భారత ప్రభుత్వ విధులకు దూరమై ఐదేళ్లయింది. దాంతో వాళ్ల అభ్యర్థనను సున్నితంగా పక్కకునెట్టి మళ్లీ ప్రభుత్వ విధుల్లో చేరా. జపాన్‌, దక్షిణ కొరియాలాంటి తూర్పు ఆసియా దేశాలతో భారత వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేయడం కోసం పనిచేశా. వీవీఐపీల విదేశీ పర్యటనలూ, మీడియా వ్యవహారాలూ పర్యవేక్షించే బాధ్యతలూ చూసుకున్నా. కొన్నాళ్లపాటు ఉప రాష్ట్రపతి పేషీలో ప్రత్యేక అధికారిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశా. ఆ హోదా దక్కించుకున్న తొలి ఐఎఫ్‌ఎస్‌ అధికారిని నేనే. ఆ సమయంలో ఉప రాష్ట్రపతి చేసే అన్ని పనుల్లో నా ముద్రే కనిపించేది. ఆయన ప్రసంగాలను తయారు చేయడం, ఆయన ఛాన్స్‌లర్‌గా వ్యవహరించే యూనివర్సిటీలను పర్యవేక్షించడం, వివిధ అవార్డు జ్యూరీలూ, విదేశీ మంత్రిత్వ శాఖ, రాజ్యసభ... ఇలా ఉపరాష్ట్రపతి అధీనంలో ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన బాధ్యతలూ చూసేవాణ్ణి. అంత అరుదైన గౌరవం తొలిసారి నాకే దక్కడం మరచిపోలేని అనుభవం.

బాధ్యత పెరిగింది...
అమెరికాలోని హూస్టన్‌లో కాన్సూల్‌ జనరల్‌గా ఎనిమిది రాష్ట్రాల్లోని నాలుగు లక్షలమంది భారతీయుల బాగోగులతో పాటు, భారత విద్యార్థులూ, వాణిజ్య లావాదేవీలూ, ఎగుమతీ దిగుమతులకు సంబంధించిన అన్ని విషయాలూ చూసుకునే కీలక స్థానంలో కొన్ని రోజుల క్రితం వరకూ పనిచేశా. ఒక్క ఈమెయిల్‌తో అక్కడున్న భారతీయులకు ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా అందుబాటులో ఉండటంతో పాటు, భారత్‌కు అమెరికా వాణిజ్య సేవల విలువను పెంచే ప్రయత్నంలో భాగమయ్యా. అమెరికాకు వీడ్కోలు పలికే సమయంలో దాదాపు 22 భారతీయ సంఘాలు నాకు గౌరవంగా ప్రత్యేక వేడుక నిర్వహించడం చూశాక, నా పనితీరు వాళ్లకు సంతృప్తినిచ్చిందన్న నమ్మకం కుదిరింది. ప్రస్తుతం వియత్నాంలో భారత రాయబారిగా పగ్గాలు అందుకున్నా. ఆ దేశంతో మన సంబంధాలను బలపర్చడమే ప్రస్తుతం నాకున్న ఏకైక లక్ష్యం.

నేను కెరీర్‌ మొదలుపెట్టిన కొత్తలో విదేశాల్లో పనిచేయడం కాస్త కష్టంగానే ఉండేది. ఫోన్‌ కాల్స్‌కు ఖర్చెక్కువ. ఉత్తరాల ద్వారానే ఆత్మీయులను పలకరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ ప్రాంతాలకూ, మనుషులకూ మధ్య అంతరాన్ని తగ్గించింది. దేశానికి దూరంగా అన్నేళ్లు పనిచేయడం కాస్త కష్టమే అయినా, దేశం కోసం పనిచేస్తున్నాననే భావన ఆ కష్టాన్ని మరిపించి నా పనిపైన ఇష్టాన్ని పెంచుతూ ఉంటుంది.

వాళ్ల వాటా ఎక్కువే

  నా భార్య నందితది చత్తీస్‌గఢ్‌లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. వాళ్ల తాతగారు ఈడుపుగంటి రాఘవేంద్రరావుగారు బ్రిటిష్‌ ఇండియాలో తొలి తెలుగు గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాళ్ల నాన్న అశోక్‌ రావుగారు మధ్యప్రదేశ్‌ ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
* ఐఎఫ్‌ఎస్‌ అధికారుల కెరీర్‌లో వారి భార్యల స్థానమూ కీలకమే. దేశ ప్రతినిధిగా ఏ కార్యక్రమానికి వెళ్లినా నా శ్రీమతిని చూసే భారత సంస్కృతీ సంప్రదాయాలపైన కొత్తవాళ్లు ఓ అవగాహనకు వచ్చేవారు. మూడేళ్లకోసారి ఏమాత్రం పరిచయం లేని దేశానికి వెళ్లడం, అక్కడ కొత్తగా జీవితాన్ని ప్రారంభించడమూ చాలా కష్టమైన పనే. అందుకే నా విజయంలో తనకూ సమ వాటా దక్కుతుంది. ఎక్కడికెళ్లినా అంతర్జాతీయ స్కూళ్లలో తను టీచర్‌గా పనిచేయడానికి ఆసక్తి చూపేది.

* మా పెద్దమ్మాయి ఆయుషి దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం జెనీవా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేస్తోంది. చిన్నమ్మాయి ఆమని హనోయ్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది.

* నా పుట్టినరోజు నాడు బాగా దగ్గరి వ్యక్తులే శుభాకాంక్షలు చెప్పడం మరచిపోయినా, విజయవాడలో ఒకప్పుడు మా పక్కింట్లో ఉండే ప్రసాద్‌ అంకుల్‌, అన్నపూర్ణ ఆంటీ కచ్చితంగా ఫోన్‌ చేస్తారు. అలాంటి సంఘటనలు నేనింకా భారత దేశంలోనే ఉన్నానన్న భావన కలిగిస్తాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.