close

పట్టులంగాఓణీ... వేసేయ్‌ మళ్లీ!

<p>పట్టులంగాఓణీ... వేసేయ్‌ మళ్లీ!</p>

హేమంత తుషారాలూ వసంతసమీరాలూ గ్రీష్మతాపాలూ వానవెల్లువలూ... కాలచక్రం గిర్రున తిరుగుతోంది. తరాలు మారుతున్నాయి. పాత ఫ్యాషన్లు పోయి కొత్తవి వస్తున్నాయి. ఎన్ని వెళ్లినా మరెన్ని వచ్చినా  ఎప్పటికీ నిలిచిపోయే ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషనే పదహారణాల పడుచుదనాన్ని చాటే పట్టుపరికిణీ ఓణీ.

శీతకాలపు మంచువాకిళ్లను చీల్చుకుంటూ నులివెచ్చని కాంతుల్ని వెదజల్లేందుకు సిద్ధమవుతోన్న శిశిరసుందరి సైతం చిన్నబోయిందట పట్టులంగాఓణీ కట్టిన ఆ పడుచు పరవళ్లు చూసి. అవునుమరి, అనార్కలీలూ లాంగ్‌గౌన్లూ; టీషర్టులూ జీన్స్‌ప్యాంట్లూ; కుర్తీలూ క్యాప్రీలూ... ఒకటారెండా, చెప్పుకుంటూ పోతే అమ్మాయిలకోసం వేనవేల ఫ్యాషన్లు. కానీ వాటన్నింటినీ తోసిరాజనగల  వన్నెచిన్నెల ఫ్యాషనే పట్టులంగా ఓణీ... చిన్నదాని సొగసుకూపడుచుప్రాయపు హొయలుకూ అద్దంపట్టే సంప్రదాయ డిజైనర్‌వేర్‌. కాంతులీనే చామంతిలా, మురిపించే ముద్దబంతిలా, ముద్దొచ్చే మందారంలా, అరవిరిసిన మల్లెమొగ్గలా... అమ్మాయి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయగలిగే అందం లంగాఓణీకే సొంతం. లంగాఓణీ... అన్న మాట వింటే చాలు...  గుండెగూటిలో ఎన్నో జ్ఞాపకాలు... మరెన్నో అనుభూతులు... ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. సందడి చేసే  చిట్టితల్లి తండ్రి గుండెల్లో నిండిపోతే, గారాలుపోయే పాపాయి రూపం తాతయ్య స్మృతుల్లో కదలాడుతుంది.  ఇక, అమ్మా, అమ్మమ్మా, అత్తమ్మా, నానమ్మల తలపుల్లో అమ్మాయి రూపం ఎప్పటికీ నిత్యనూతనమే. అవునుమరి, చిన్నారి పుట్టింది మొదలు... బారసాల, అన్నప్రాశన, మొదటి పుట్టినరోజు, లంగాఓణీ పేరంటం, పెళ్లి సందడి, రిసెప్షన్‌... వేడుక ఏదయినా అమ్మాయిని పట్టులంగాలూ ఓణీలతో బుట్టబొమ్మలా అలంకరించి మురిసిపోయే ఆ హడావుడే వేరు. ఇక, కవ్వించే ప్రియసఖి రూపం చెలికాడి మనసులో ఎప్పటికీ పదిలమే. అందుకే సరికొత్త ఫ్యాషన్లు ఎన్ని వచ్చి వెళుతున్నా పట్టులంగా మాత్రం సరిగంచు ఓణీని సవరించుకుంటూ చిరకాలం నిలిచే ఉంది.

<p>పట్టులంగాఓణీ... వేసేయ్‌ మళ్లీ!</p>

ఓ దశాబ్దం వెనక...
విదేశీ చదువులూ సాఫ్ట్‌వేర్‌ కొలువులూ తెచ్చిన సౌకర్యవంతమైన సల్వార్‌కమీజ్‌లూ కుర్తీచుడీదార్‌లతోబాటు లెగ్గింగులూ స్కర్టుల ఫ్యాషన్లతో సంప్రదాయ లంగాఓణీ కాస్త పక్కకు మళ్లిన మాట వాస్తవమే. కానీ కొన్నాళ్లే... సినిమాలూ సెలెబ్రిటీల పుణ్యమా అని అది మళ్లీ అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో అందంగా ఒదిగిపోయింది. తళుకుబెళుకుల ఎంబ్రాయిడరీలతో సొగసులద్దుకుని, డిజైనర్‌ లుక్‌ని సొంతం చేసుకుని మరీ మెరిసింది. పిల్లలూ పెళ్లయిన వాళ్లన్న వయసు తేడానీ చెరిపేసింది. లంగాఓణీ మళ్లీ వచ్చిందంటూ వేడుకలంతటా ఒకటే సందడి చేయసాగింది.నిజానికి పూర్వకాలంలో కొన్నిచోట్ల నామకరణం లేదా అన్నప్రాశన సమయంలోనే పాపాయికి అమ్మమ్మాతాతలు చీరో లంగాఓణీనో ఇచ్చేవారట. ఆ తరవాత తొమ్మిదీ, పదకొండేళ్ల ప్రాయంలో అమ్మాయికి చీరల/ఓణీల ఫంక్షన్‌లో భాగంగా లంగాఓణీ కట్టించడం మొదలైంది. అప్పటినుంచీ పెళ్లయ్యేవరకూ దీన్ని ధరించేవారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల కారణంగా - పేరంటంతో సంబంధం లేకుండా రెండుమూడేళ్ల పిల్లల నుంచీ పెళ్లయిన పడతుల వరకూ లంగాఓణీని ఎంతో ఇష్టంగా ధరిస్తున్నారు. దాంతో సంప్రదాయ లంగాఓణీ ట్రెండీఫ్యాషన్‌గా మారిపోయింది
‘ఫ్యాషనేదయినా కొన్నాళ్లే... లంగాఓణీల్లోనూ అదే జరగొచ్చు, ఉత్తరాది వేడుకల్లో ఎక్కువగా సందడి చేసే గాగ్రాచోళీలూ కోటీఅనార్కలీలూ లాంగ్‌గౌన్లూ పలాజోలమీద అప్పుడప్పుడూ మనసు పడినట్లే ఈ లంగాఓణీ మోజు కూడా కొన్నాళ్లే’ అన్న ఫ్యాషన్‌ పండితులూ లేకపోలేదు. కానీ అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ లంగాఓణీ ఎప్పటికీ కావాలనిపించే వాసంతసమీరంలా స్థిరంగా నిల్చిపోయింది.అయితే ఒకటి... ప్యాచ్‌వర్కులూ జర్దోజీలూ అద్దాలూ కుందన్లూ స్వరోవ్‌స్కీ రాళ్లతో బరువుగా మెరిసే లెహంగా స్టైల్‌ లంగాలు వేడుకల్లో కొన్నాళ్లు రాజ్యమేలినా వాటిమీదా కాస్త ముఖం మొత్తినట్లుంది డిజైనర్లకు. దాంతో ఓణీ పేరంటమైనా పెళ్లివేడుకకైనా మళ్లీ కంచి పట్టులంగా కళకళలాడుతోంది. కాకపోతే ఒకప్పటి ఏక రంగూ కాంట్రాస్ట్‌ బోర్డరుతో కనిపించే సాదా పట్టులంగా స్థానంలో, జరీబుటీలనీ చారలనీ గడులనీ అద్దుకుని నిండైన రంగుల్లో చూడచక్కని ఓణీలతో అందంగా కనువిందు చేస్తోంది. కంచిపట్టుతోబాటు ఏనుగులూ నెమళ్లూ చిలకలతో వచ్చే పోచంపల్లి పట్టు డిజైన్లూ నేటి అమ్మాయిల్ని ఆకట్టుకుంటున్నాయి. అంటే జార్జెట్‌, శాటిన్‌, కాటన్‌, షిఫాన్‌, నైలాన్‌, క్రేప్‌, నెట్టెడ్‌, మఖమల్‌... ఇలా ఎన్ని రకాలతో లంగాఓణీ డిజైన్‌ చేసినా; పట్టు అందం పట్టుదే. అది బెనారస్‌ అయినా కంచి అయినా పోచంపల్లి అయినా లంగాఓణీల్లో పట్టు వన్నెలూ దాన్ని కట్టిన చిన్నదాని చిన్నెలూ ఎప్పటికీ మాయనివే, మరువలేనివే..!

<p>పట్టులంగాఓణీ... వేసేయ్‌ మళ్లీ!</p>

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.