close
ప్రేయసి గుర్తొస్తే... బీపీ పరార్‌..!

ఒత్తిడిగా అనిపిస్తుందా... బీపీ పెరిగిపోయిందా... ఒక్కనిమిషం... కళ్లు మూసుకుని మీ ప్రేయసినో ప్రియుడినో గుర్తుతెచ్చుకోండి. ఏకాంతంలో వాళ్లు మీతో గడిపే మధురక్షణాలనో చిలిపి పనుల్నో మరోసారి తలచుకోండి. అప్పటివరకూ గూడుకట్టుకున్న ఒత్తిడంతా మాయమై పెదాలమీదకి ఆటోమేటిగ్గా చిరునవ్వు వచ్చేస్తుంది, మనసు ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది, హై బీపీ కాస్తా నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చేస్తుంది అంటున్నారు అరిజోనా విశ్వవిద్యాలయ మానసిక నిపుణులు. ఇందుకోసం వీళ్లు ప్రేయసీప్రియులున్న వందమంది వ్యక్తుల్ని ఎంపిక చేసి రెండు విభాగాలుగా విభజించి వాళ్లకి కొన్ని క్లిష్టమైన పనుల్ని ఇచ్చారట. అలా ఇచ్చేముందు ఒక విభాగానికి ఆయా పనుల్ని చేసేముందు మీ ప్రేయసీ ప్రియుల్ని గుర్తు తెచ్చుకుంటూ చేయమని చెప్పారట. మరో వర్గానికి ఏమీ చెప్పలేదు. తరవాత ఆయా టాస్కుల్ని చేసేముందూ చేశాకా ఇరువర్గాల బీపీనీ, గుండెవేగాన్నీ పరిశీలించారట. అందులో తమవాళ్లని గుర్తు తెచ్చుకుంటూ చేసినవాళ్లలో బీపీ, హృదయ వేగాలన్నీ సాధారణ స్థితిలోనే ఉంటే, రెండో వర్గం వారిలో మాత్రం పనిలో సంక్లిష్టత కారణంగా బీపీ కాస్త పెరిగినట్లు గమనించారు. తెలిసిందిగా మరి... ఇకనుంచైనా ఈ చిట్కాని పాటించి చూడండి..!


ఇవి తింటే ఆనందమే ఆనందం!

జీవితంలో ఎదురయ్యే సంఘటనలూ సందర్భాల్ని బట్టి మనలో రకరకాల భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో కలిగే ఆనందం, ఉత్సాహం వంటి వాటన్నింటికీ కారణం శరీరంలో విడుదలయ్యే రకరకాల హార్మోన్లే. అయితే మనం తినే కొన్నిరకాల ఆహారపదార్థాల వల్ల కూడా ఆయా హార్మోన్లు విడుదలై  సంతోషాన్నీ హాయినీ కలిగిస్తాయి అంటున్నారు పోషకనిపుణులు. అవేమంటే...
* గుడ్లు, పైనాపిల్‌, పాలకూర, నట్స్‌ తీసుకునేవాళ్లలో సృజనను పెంచే సెరటోనిన్‌ విడుదలవుతుంటుంది.
* చిక్కుళ్లు, ముడిధాన్యాలు, కమలాలు తింటుంటే ధైర్యాన్ని అందించే అడ్రినలిన్‌ పుష్కలంగా ఉంటుంది.
* చాకొలెట్లు, బ్లూబెర్రీలు, చిలగడదుంపలు, బ్రకోలీ ఆనందమయ జీవనానికి కారణమైన డోపమైన్‌ను విడుదల చేస్తాయి.
* స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, పెరుగు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి.
* అరటిపండ్లు, పియర్స్‌, బ్లాక్‌ టీ, చెర్రీలు, మామిడిపండ్లు కార్టిసాల్‌ను నియంత్రించి ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తాయి.
* గుమ్మడి విత్తనాలు, బంగాళాదుంపలు, క్వినోవా, నువ్వులు ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. సో, ఇవి తింటే హాయిహాయిగా జీవించేయొచ్చు. ఏమంటారు?


సరిగ్గా నిద్రపోవడం లేదా?

అందరూ అనుకున్నట్లుగా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, అది నెమ్మదిగా జన్యుక్రమాన్నీ దెబ్బతీస్తుంది అంటున్నారు. ఎందుకంటే జీవగడియారం దెబ్బతింటే దాని ప్రభావం జన్యువులమీదా పడుతుందని గుర్తించారు. ఇందుకోసం దాదాపు యాభై మంది పగటి వేళలో పనిచేసే వైద్య నిపుణుల రక్తాన్ని సేకరించి పరీక్షించారట. అదేసమయంలో రాత్రివేళలో పనిచేస్తూ నిద్ర తక్కువగా పోయే వైద్యుల రక్త నమూనాలని కూడా తీసుకుని జన్యుక్రమాన్నీ పరిశీలించారట. ఆ తరవాత ఆ రెండింటినీ పరిశీలించి చూడగా- మొదటి బృందంతో పోలిస్తే రెండో బృందం డీఎన్‌ఏ ఎక్కువగా దెబ్బతిందని గుర్తించారు. దీనివల్ల క్యాన్సర్లూ హృద్రోగాలూ నాడీసంబంధలోపాలూ జీవక్రియాలోపాలూ వంటివి తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి నిద్ర తక్కువగా పోయేవాళ్లంతా జాగ్రత్త వహించాల్సిందే.


ఒత్తిడితో బరువు పెరుగుతారు!

కంప్యూటర్ల కాలంలో ఒత్తిడి లేని ఉద్యోగం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ సంవత్సరాల తరబడి అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేయడం వల్ల ముఖ్యంగా మహిళలు బరువు పెరిగే అవకాశం ఉందని స్వీడిష్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వాళ్లు ఆహారపుటలవాట్లు ఇంచుమించు ఒకేరకంగా ఉన్న కొందరు మహిళల్ని ఎంపికచేసి ఇరవయ్యేళ పరిధిలో వాళ్ల శరీరబరువుని పరిశీలిస్తూ వచ్చారట. వాళ్లలో ఉద్యోగజీవితంలో పెద్దగా ఒత్తిడిలేని వాళ్ల బరువులో అనూహ్యమైన మార్పులేమీ రాకపోగా, ఒత్తిడితో కూడిన ఉద్యోగజీవితంలో ఉన్న మహిళల బరువులో స్పష్టమైన తేడా కనిపించిందట. అయితే దీనికి ఒత్తిడితోబాటు సమయాభావంతో వ్యాయామం చేయకపోవడం కూడా కారణం కావచ్చనీ మొత్తమ్మీద సమయం చాలకపోవడం అనేది ఒత్తిడితో కూడిన ఉద్యోగం వల్లే కాబట్టి అదే బరువుకి కారణమనీ తేల్చారు. కాబట్టి మహిళలూ, జాగ్రత్తపడండి మరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.