close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అలాంటివాడు ఎదురైతే ప్రేమిస్తా!

విజయ్‌ దేవరకొండ ఎన్ని సినిమాలు చేస్తున్నా తెలుగు ప్రేక్షకులకు అర్జున్‌రెడ్డిగానే గుర్తొస్తాడు. అలాగే షాలినిపాండే ఎన్ని పాత్రలు చేసినా ప్రీతి శెట్టిగానే మనకు గుర్తొస్తుంది. మొదటి సినిమాతోనే తన నటనతో అంత గుర్తింపు తెచ్చుకుంది షాలిని. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో బిజీగా ఉన్న ఆమెను ఓసారి పలకరించి కబుర్లలోకి దించితే... అర్జున్‌రెడ్డికి ముందు, తర్వాత తన జీవితం గురించి చెబుతోందిలా!

పెద్దయ్యాక ఏమవ్వాలన్న విషయంమీద స్కూల్‌ రోజుల్లోనే చాలా ఆలోచించేదాన్ని. నైన్‌ టు ఫైవ్‌ జాబ్‌ ఏదైనా బోర్‌ కొట్టేస్తుందనిపించింది. బోర్‌కొట్టని జాబ్‌ అంటే యాక్టింగ్‌ మాత్రమే అనిపించింది. కానీ ఆ మాట ఇంట్లో చెప్పేంత ధైర్యం లేదు. మా సొంతూరు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ గృహిణి. అక్క, నేను... ఇద్దరం పిల్లలం. నాన్న ఎప్పుడూ మేం బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేవారు. ఇష్టంలేకపోయినా ఇంజినీరింగ్‌లో చేరాను. జబల్‌పూర్‌... కళలూ, సంస్కృతుల నిలయం. నాటక రంగానికీ మంచి పేరుంది. సినిమాల్లోకి వెళ్తానని చెబితే ఏమంటారోనని నాటకాల్లో శిక్షణ తీసుకుంటానని ఇంట్లో చెప్పాను. అప్పటికి ఇంజినీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నాను. మార్కులు బాగానే వస్తున్నాయి కాబట్టి సరేనన్నారు నాన్న. సెలవు రోజుల్లో అక్కడే ఉండేదాన్ని. అలా నటనలో అనుభవం సంపాదించాను. దాని మూలాన ఈరోజుకీ గ్లిజరిన్‌ లేకుండానే ఏడ్వగలను. థర్డ్‌ ఇయర్‌కి వచ్చాక సినిమాల్లోకి వెళ్తానని చెబితే ఇంట్లో ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం సంపాదించి సెటిల్‌ అవ్వు’ అన్నారు. చదువు పూర్తవడానికి టైమ్‌ ఉందికదాని నేనూ ఊరుకున్నాను. అప్పుడే సోనీ వాళ్లు చేస్తున్న ‘మన్‌ మే విశ్వాస్‌ హై’ షోకి సంబంధించిన ఓ ఎపిసోడ్‌ జబల్‌పూర్‌లో షూటింగ్‌ జరిగితే అందులో నటించాను.

అర్జున్‌రెడ్డి అవకాశం
మా నాటక బృందంలో చాలామంది సినిమా ప్రయత్నాలు చేస్తుండేవారు. ఫొటో షూట్‌తో ప్రొఫైల్‌ తయారుచేసి ముంబయిలోని కాస్టింగ్‌ డైరెక్టర్లకి పంపేవారు. అలా నా ఫొటోలు కూడా పంపాను. వాళ్లు ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తికి పంపారు. వాటిని దర్శకుడు సందీప్‌రెడ్డి చూసి నాకు ఫోన్‌ చేశారు. అప్పటికి నా ఇంజినీరింగ్‌ పూర్తయింది. నాన్నతో విషయం చెప్పాను. వారం రోజులు బతిమలాడితేగానీ అంగీకరించలేదు. డైరెక్టర్‌తో డిస్కషన్స్‌కి నాతోపాటు హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడికి రాకముందు నేను తెలుగు సినిమాలు చూసింది లేదు. కానీ ఒకసారి కథ విన్నాక మాత్రం నేను చేసి తీరాల్సిన సినిమా అనిపించింది. నాటక రంగం నుంచి వచ్చిన నాకు ఇలాంటి ఛాలెంజింగ్‌ పాత్రకంటే ఏం కావాలి అనిపించిది. మొదటరోజే నాన్న సందీప్‌ని కలిసి ఎలాంటి ముద్దు సీన్లూ, క్లోజ్‌గా ఉండే సీన్లూ లేకపోతేనే మా అమ్మాయి పనిచేస్తుందని చెప్పారు. ఆయన సరేనంటూ తలూపారు. కథ చెప్పినప్పుడు నాతోకూడా ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. ఒకవేళ ముందే చెప్పుంటే చేసేదాన్ని కాదేమో!

అప్పుడు నాన్నతో మాటల్లేవ్‌!
అర్జున్‌రెడ్డికి నా ఎంపిక ఖరారైపోయింది. కానీ, సినిమా స్టార్ట్‌ కావడానికి టైమ్‌ పడుతుందని చెప్పారు. పది రోజులయ్యాక... ‘వాళ్లు ఎప్పుడు పిలుస్తారో అంతవరకూ టైమ్‌ వేస్ట్‌ చేసే బదులు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చుగా’ అని చెప్పడం మొదలుపెట్టారు నాన్న. ‘నన్ను ముంబయి పంపండి అక్కడ కూడా సినిమా ప్రయత్నాలు చేస్తా’నని నాన్నకి చెప్పాను. ఒక వారం మాత్రం టైమ్‌ ఇవ్వమన్నాను. అంతలోనే అవకాశాలు రావని తెలుసు కానీ, అక్కడ మా ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లని కలిసినట్లూ ఉంటుంది, పరిశ్రమ గురించి అవగాహనా వస్తుందనేది నా ప్లాన్‌. రిటర్న్‌ టికెట్‌ కూడా తీసిచ్చి ముంబయి పంపించారు. కానీ వెళ్లిన రెండో రోజునుంచే ‘ఎక్కడ ఉన్నావ్‌, ఏం చేస్తున్నావ్‌’ అంటూ ఫోన్‌ చేసేవారు. నేను మరీ అంత చిన్న పిల్లని కాదని చెప్పేదాన్ని. నేను సినిమాలకు దూరమవుతానేమోనని నా భయం. సినిమాలంటూ తిరిగి నేను ఏమైపోతానో అని ఆయన భయం. చివరికి ‘లాభంలేదు, 22 ఏళ్లవరకూ ఆయన చెప్పిందే చేశాను. ఈ ఒక్కసారికి నా మనసుకు నచ్చింది చేద్దాం’ అనిపించింది. వారం దాటినా తిరిగి వెళ్లలేదు. ‘నేను ఇంటికి రాను. నా కలల్ని నిజం చేసుకోనివ్వండి’ అని ఫోన్లో చెప్పడానికి ధైర్యం చాలక ఈ-మెయిల్‌ పెట్టాను. ఆ తర్వాత దాదాపు ఏడెనిమిది నెలలు నాన్న నాతో మాట్లాడలేదు. ‘అర్జున్‌రెడ్డి’ స్టార్ట్‌ అయ్యేదాకా ముంబయిలోనే ఉండాలనుకున్నాను. నా చేతిలో ఎక్కువ డబ్బులేదు. మా ఫ్రెండ్‌ తన ఫ్రెండ్స్‌తో ఉంటావా అని అడిగింది. కాకపోతే వాళ్లు అబ్బాయిలు. అయినా ఆ పరిస్థితుల్లో షెల్టర్‌ ముఖ్యమని ఉండటానికి సిద్ధపడ్డాను. ఓ 15 రోజులు అని వాళ్లతో చెప్పాను. వాళ్లు నన్ను బాగా చూసుకున్నారు. రెంట్‌ ఇస్తానన్నా తీసుకోలేదు. పొదుపుగా బతకడానికి ఒక పూట భోజనం చేస్తే మరోపూట టిఫిన్‌తో సరిపెట్టుకునేదాన్ని. అక్కడ పృథ్వీ కెఫేలోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసేదాన్ని. రెండు నెలలకు సందీప్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘హమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాను.

దక్షిణాది అబ్బాయిలు ఇష్టం!
అర్జున్‌రెడ్డి షూటింగ్‌కి ముందు నటీనటులతో పదిరోజుల పాటు వర్క్‌షాప్‌ చేశారు. అప్పుడే నాకు సినిమా హిట్‌ అవుతుందన్న నమ్మకం వచ్చింది. సందీప్‌ ఆలోచనల్లో ఉన్న ప్రీతి పాత్రను నేనూ, అర్జున్‌ పాత్రను విజయ్‌ బాగా అర్థం చేసుకున్నాం. కాబట్టే సినిమా అంత బాగా వచ్చింది. ప్రివ్యూ చూడ్డానికి నాన్న కూడా వచ్చారు. ఏం అంటారోనని భయం వేసింది. కానీ నేను చాలా సహజంగా నటించాననీ, కథలోని వాస్తవికత బావుందనీ అక్కతో చెప్పారు. నాన్న నోట అలాంటి మాటలు మొదటి సినిమాతోనే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. విజయ్‌, నేనూ ప్రివ్యూ చూసినపుడు మా ఫీలింగ్స్‌ చెప్పే పొజిషన్‌లో లేం. థియేటర్లో ఆడియన్స్‌తో కలిసి చూసినపుడు మాత్రం బాగా ఎంజాయ్‌ చేశాం. శాలినీ పాండేని కాస్తా ఒక్కరోజులోనే ప్రీతీ శెట్టి అయిపోయాను. ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లూ, పొగడ్తలూ, సెల్ఫీలూ... ఇప్పుడనిపిస్తుంది అవన్నీ ఎలా డీల్‌ చేయగలిగానా అని. ఒకబ్బాయి అయితే వీపుమీద నా ఫొటోని పచ్చబొట్టు పొడిపించుకుని ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఏం చెప్పాలో అర్థంకాలేదు. ఫోన్‌ చేసి ఒకసారి మాట్లాడాను. ‘అర్జున్‌రెడ్డి’తో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాని ఎక్కువగా చూడను. నిజజీవితంలో ప్రీతి, అర్జున్‌ రెండు పాత్రల స్వభావాలూ ఉన్నదాన్ని. ప్రీతి తన ఇష్టాల్ని మాటల్లో చెప్పలేదు. కానీ తన నిర్ణయాలు తాను తీసుకుంటుంది. నేనూ అంతే. అర్జున్‌రెడ్డిలా నేను లక్ష్యం కోసం ఏదైనా చేస్తాను. దక్షిణాదికి వచ్చి చూశాక ఇక్కడ అబ్బాయిలపైన ఇష్టం పెరిగింది. అర్జున్‌ లాంటి నిజాయతీ, ధైర్యం ఉన్న వ్యక్తి నిజజీవితంలో ఎదురైతే కచ్చితంగా ప్రేమిస్తాను.

తమిళంలో చాలా బిజీ...
అర్జున్‌రెడ్డి తర్వాత తెలుగులో చాలా కథలు విన్నాను. కానీ వాటిలో కొత్తదనం కనిపించలేదు. అందుకే చేయడానికి నచ్చలేదు. తక్కువ నిడివి పాత్రలైనా మహానటిలో సుశీలగా, ఎన్టీఆర్‌ కథానాయకుడులో షావుకారు జానకిగా కనిపించాను. నన్ను ప్రీతి లాంటి పాత్రలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని తెలుసు. కానీ అలాంటి ఛాన్స్‌లు ఎప్పుడోకానీ రావు కదా! అంతవరకూ వేేచిచూస్తూ ఉండిపోలేనుగా. పక్కంటి అమ్మాయి తరహా పాత్రల్ని చేయడమన్నా నాకు ఇష్టమే. ‘118’లో అలాంటి పాత్ర చేశాను. దీనికీ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం తమిళంలో ‘100 పర్సెంట్‌ కాదల్‌’ చేస్తున్నాను. రెహ్మాన్‌ మేనల్లుడు జీవీ ప్రకాష్‌ దీంట్లో హీరోగా నటిస్తున్నాడు. ‘100 పర్సెంట్‌ లవ్‌’కి రీమేక్‌ ఇది. ‘100 పర్సెంట్‌ లవ్‌’ చూశాను. అందులోని మహాలక్ష్మి పాత్ర నాకు బాగా నచ్చింది. అందుకే ఆ సినిమాకి అడిగేసరికి వెంటనే ఓకే చెప్పాను. అది చేస్తుండగానే ‘గొరిల్లా’ అనే మరో తమిళ సినిమాలోనూ అవకాశం వచ్చింది. హాస్య ప్రధానంగా సాగే సినిమా అది. విజయ్‌ ఆంటోనితో ‘జ్వాలా’ అనే చిత్రంలోనూ చేస్తున్నాను. అది తమిళంతోపాటు తెలుగులోనూ వస్తుంది. త్వరలోనే నేరుగా తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్టు చేయబోతున్నా. ‘బామ్‌ఫాద్‌’తో ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నాను. రెండేళ్ల సినిమా ప్రయాణంలో వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో నాలోని సాధారణ మధ్య తరగతి అమ్మాయిని మాత్రం దూరం చేసుకోలేదు!

సోషల్‌ మీడియా నచ్చదు!

నేను ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూస్తాను, ఇక్కడి పాటలు వింటుంటాను. సిధ్‌ శ్రీరామ్‌ పాడిన పాటలు బాగా నచ్చుతాయి. దర్శకుల్లో మణిరత్నం, నటుల్లో కమల్‌ హాసన్‌లకు అభిమానిని. బీ డైట్‌ అంటూ నోరు కట్టుకోను. సినిమాల్లోకి వచ్చాక వెజిటేరియన్‌గా మారిపోయాను. వెజ్‌లో ఏదైనా తింటాను.
* ముంబయిలో ఉంటే పృథ్వీ కేఫ్‌కి వెళ్తాను. అక్కడ థియేటర్‌కి సంబంధించి ప్రదర్శన, వర్క్‌షాప్‌... ఏదో ఒకటి జరుగుతుంటుంది. నేర్చుకోవడానికి మంచి అవకాశం.
* జిమ్‌కంటే కూడా వాకింగ్‌, రన్నింగ్‌ చేయడం ఇష్టం. బయటకు వెళ్లే పరిస్థితి లేకుంటేనే జిమ్‌ చేస్తాను. వారంలో కనీసం అయిదురోజులు వ్యాయామం చేస్తాను.
* పుస్తకాలు బాగా చదువుతాను. వాటితో ఊహా శక్తి పెరుగుతుంది. సినిమా పాత్రల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
* సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టడం, కామెంట్లు రాయడం.... నాకు నచ్చదు. వాటికి వీలైనంత దూరంగా ఉంటాను.
* నాకు స్నేహితులు చాలా తక్కువ. నా సర్కిల్‌లో కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారితో తప్పిస్తే బయటివాళ్లతో అంత త్వరగా కలవలేను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.