close

కాలేజీకి వెళ్లనోడు... కనిపెట్టాడెన్నో!

ఎప్పుడూ ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుండే ప్రధాని నరేంద్రమోదీ, విపక్ష నేత రాహుల్‌గాంధీ ఒకే అభిప్రాయంతో స్పందించిన అరుదైన సందర్భం ఇది... ఆ ఇద్దరూ కోరుట్ల కుర్రాడు సిరిపురం సాయితేజ ఆవిష్కరణకి ఫిదా అయిపోయారు. మందుబాబుల్ని కారు నడపకుండా ఆపే ఆ పరికరం గురించి ఒకరితర్వాత ఒకరు అభినందనలతో ముంచెత్తారు. నిజానికి 22 ఏళ్ల సాయి ఇదొక్కటే కాదు... ఇప్పటికే ఇలాంటి నాలుగు విశిష్ట పరికరాలని కనిపెట్టాడు!

సాయితేజది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలకేంద్రం. తండ్రి చంద్రశేఖర్‌ ప్రయివేటు సంస్థలో చిరుద్యోగి. తల్లి భారతి బీడీలు చుడుతుంది. ఎనిమిదో తరగతిలో తాను చదివిన ఏపీజే అబ్దుల్‌కలాం జీవిత చరిత్ర అందించిన ప్రేరణతో తానూ ఆవిష్కర్త కావాలనుకున్నాడు సాయి. తొమ్మిదో తరగతి నుంచే చిన్నచిన్న ప్రయోగాలు చేసేవాడు. పదోతరగతి తర్వాత జగిత్యాల పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో చేరాడు. తొలి ఏడాది పూర్తిచేయకముందే తలనొప్పి, వాంతులతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షల్లో అతని మెదడులో కణితి ఉన్నట్టు తేలింది. ఆ పేద తల్లిదండ్రులు అప్పటిదాకా తాము దాచుకున్న డబ్బంతా ఖర్చుచేసి అతనికి వైద్యం చేయించారు. అవీ సరిపోక అప్పులూ చేయాల్సి వచ్చింది. రెండేళ్ల పోరాటం తర్వాత కణితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోవడం, అమ్మానాన్నల చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకపోవడంతో సాయి మళ్లీ కాలేజీకి వెళ్లలేకపోయాడు. అప్పుడే అతని చూపు ఆవిష్కరణలవైపు మళ్ళింది.

దాంతోనే మొదలు...
కిందనున్న సంప్‌ నుంచి ఇంటిపైనున్న ట్యాంక్‌లోకి నీళ్లు ఎక్కించేటప్పుడు... ట్యాంక్‌లోకి పూర్తిగా నిండిపోయిన విషయం తెలియక ఎన్నో నీళ్లు వృధా కావడం మనందరికీ ఎదురయ్యే అనుభవమే. దానికి విరుగుడుగా అతితక్కువ ధరకే వాటర్‌ ఇండికేటర్‌ని కనిపెట్టాలనుకున్నాడు. తనకు తానే ఓ ఐసీ(ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌)ని కొని, కావాల్సిన రీతిలో కొత్త సర్క్యూట్‌ బోర్డు తయారుచేశాడు సాయితేజ. దానికి సెన్సార్‌లనీ, మోటార్‌నీ అనుసంధానం చేశాడు. ఇది ట్యాంక్‌ నిండేటప్పుడు హెచ్చరించడమే కాదు దానికదే మోటార్‌ని ఆపేస్తుంది... అంతేకాదు, నీళ్లు మరీ తక్కువైనప్పుడు మోటార్‌ని ఆన్‌ చేస్తుంది కూడా. మార్కెట్‌లో ఇలాంటి ఇండికేటర్‌ల ధర పదివేల రూపాయలు ఉంటుండగా కేవలం వెయ్యిరూపాయలకే దీన్ని తయారుచేసి ఇవ్వగలిగాడు సాయి. అంతేకాదు, ఇంట్లో ఎవరూలేనప్పుడు దొంగ జొరబడితే అలర్ట్‌ చేసే సెక్యూరిటీ అలార్మ్‌, అగ్నిప్రమాదం జరిగితే తక్షణం అగ్నిమాపక దళానికి మెసేజ్‌ పంపే పరికరం, ముప్పై రూపాయలకే పవర్‌బ్యాంకు... రెండేళ్లలో ఇలా ఎన్నింటినో అతి తక్కువ ఖర్చుతో తయారుచేశాడు సాయితేజ. అవన్నీ ఒక ఎత్తైతే పగలు సౌరవిద్యుత్తుతో, రాత్రి ఉప్పునీటితో నడిచే సైకిల్‌ని తయారుచేయడం ఒకెత్తు! కేవలం ఉప్పునీరుతో 30 కిలోమీటర్లు నడిచే ఆ సైకిల్‌కి మీడియా చక్కటి ప్రచారం కల్పించడంతో హైదరాబాద్‌కి చెందిన స్మార్ట్‌ట్రాన్‌ అనే కార్పొరేట్‌ సంస్థ స్పందించింది. సాయితేజ విద్యార్హత కేవలం పదోతరగతే అయినా... బీటెక్‌ స్థాయివాళ్లకిచ్చే ఉద్యోగంలో కూర్చోబెట్టింది. అలా హైద్రాబాద్‌ వచ్చిన సాయితేజని ఇక్కడ తాగిన మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వార్తలు ఆలోచనలో పడేశాయి.

ఇలా చేశాడు...
మద్యం మత్తులో ఉన్న వ్యక్తి డ్రైవర్‌ సీట్లో కూర్చుంటే ఆ ఇంజిన్‌ స్టార్ట్‌ కాకుండా ఉండేలా ఏదైనా కనిపెట్టాలనుకున్నాడు సాయితేజ. కాకపోతే అతడు అప్పటిదాకా ఆవిష్కరించిన కొత్త పరికరాలన్నీ ‘ఐసీ’తో పనిచేసేవే. కారుని నియంత్రించాలంటే వాటి సామర్థ్యం సరిపోదు. దానికి ఓ చిన్న సైజు కంప్యూటర్‌లాంటి ‘మైక్రో కంట్రోలర్‌’ కావాలి.

అది మార్కెట్‌లో దొరుకుతుంది కానీ... దానిచేత మనం కోరుకున్న పనుల్ని చేయించాలంటే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌  బాగా తెలిసి ఉండాలి. సాయితేజకి అది తెలియదు. అయినా వెనకంజ వేయలేదు. అతిక్లిష్టమైన సీ లాంగ్వేజ్‌ ప్రోగ్రామ్‌ని గూగుల్‌ సాయంతో కేవలం 15 రోజుల్లోనే నేర్చుకోగలిగాడు. దాంతో మైక్రో కంట్రోలర్‌ని నియంత్రించడంపైన పట్టు సాధించాడు. అలా మద్యం మత్తులో ఉన్నవాళ్లెవరైనా డ్రైవర్‌ సీటులో కూర్చోగానే కారు స్టార్ట్‌ కాకుండా నియంత్రించే పరికరాన్ని మనముందుకు తెచ్చాడు. అదే ఇప్పుడతనికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిపెడుతోంది!

ఇప్పటిదాకా సాయితేజ కనిపెట్టిన పరికరాలు వేటికీ పేటెంట్‌ తీసుకోలేదు. దానికయ్యే ఖర్చు భరించే స్తోమత అతని కుటుంబానికి లేకపోవడమే ఇందుక్కారణం! కానీ కారు ఆల్కహాల్‌ డిటెక్టర్‌కి మాత్రం ఎలాగైనా పేటెంట్‌ సాధించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు సాయితేజ. ఆ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం!

- గోడికె రాజ్‌కుమార్‌, న్యూస్‌టుడే, కోరుట్ల

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.