close
టీనేజీ వ్యాపారులు..!

తమ ఈడు పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే, వీళ్లు మాత్రం తమ కంపెనీల్ని లాభాల బాట పట్టించడం గురించి ప్రణాళికలు వేస్తున్నారు. మిగతావాళ్లంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటే, తీరికలేనంతగా కంప్యూటర్‌ కోడింగ్‌లు రాసేస్తూ... టీనేజీ దాటకుండానే తమ కంపెనీలకు మేనేజర్లు అయిపోయారు!

ఆన్‌లైన్లో దూసుకెళ్తూ...

రేళ్ల వయసులో కంప్యూటర్‌ని ఉపయోగించడం తెలుసుకున్న అద్వైత్‌ ఠాకూర్‌, ఏడేళ్లకే కోడింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తొమ్మిదేళ్లపుడు సొంత వెబ్‌సైట్‌ని డిజైన్‌ చేసుకున్నాడు. 12 ఏళ్లకి ‘అపెక్స్‌ ఇన్ఫోసిస్‌ ఇండియా’ కంపెనీని ప్రారంభించాడు. ఈ సంస్థ వెబ్‌ పోర్టల్‌ పెట్టేవాళ్లకి డొమైన్‌ పేర్లను అందించడం, వెబ్‌సైట్ల నిర్వహణతోపాటు వివిధ రకాల డిజిటల్‌ సేవల్ని అందిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి ఐఓటీ విభాగాల్లో సేవలందిస్తోంది. ఇప్పుడు అద్వైత్‌ వయసెంతంటే... 16 ఏళ్లు. అనలిటిక్స్‌, డిజిటల్‌ సేల్స్‌, యాడ్‌వర్డ్స్‌, మొబైల్‌ సైట్స్‌ ప్రొఫెషనల్‌గా గూగుల్‌ గుర్తింపు సంపాదించిన అద్వైత్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ అంశాల్లో గూగుల్‌కు తన సేవలు అందించాడు. 14 ఏళ్లపుడు ‘టెక్నాలజీ క్విజ్‌’ ఆప్‌ని అభివృద్ధి చేశాడు. దీనిద్వారా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని నేర్చుకోవచ్చు. ‘ఆటిజం అవేర్‌నెస్‌’ పేరుతో బుద్ధిమాంద్యంమీద అవగాహన తెచ్చే ఆప్‌ని అభివృద్ధి చేశాడు. అద్వైత్‌ తండ్రి ఐటీ నిపుణుడు. ‘కంప్యూటర్‌ మీద చాలా చేస్తుంటాం. అయితే అదంతా ఎలా జరుగుతుందన్న కుతూహలం నాకు ఉండేది’ అని చెప్పే అద్వైత్‌... తండ్రి కోడింగ్‌ రాస్తుంటే ఎంతో ఆసక్తిగా చూసేవాడు. తర్వాత ఆన్‌లైన్‌లోని పుస్తకాలూ, బ్లాగ్‌లూ చదువుతూ కోడింగ్‌ సొంతంగా నేర్చుకున్నాడు. లింక్డిన్‌ తన అభిమాన సోషల్‌ నెట్‌వర్క్‌ అని చెబుతాడు.

డ్రైవర్‌లేని వాహనం...

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆటి మోటార్స్‌’ సహ వ్యవస్థాపకుడు 17 ఏళ్ల సాద్‌ నాజర్‌. వి.వినయ్‌(55), సౌరభ్‌ చంద్ర (40)లతో కలిసి పనిచేస్తాడు. అటానమస్‌ కార్గో ఎలక్ట్రిక్‌ వాహనాన్ని వీరు అభివృద్ధి చేస్తున్నారు. దీనికి వీరు పెట్టిన పేరు షెర్పా. ఈ పేరు సూచించింది సాద్‌. 2017లో ఈ కంపెనీని ప్రారంభించారు. 2020 నాటికి పూర్తిస్థాయిలో వాహనాన్ని అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తేనున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రాంగణంలో ఈ సంస్థ పనిచేస్తోంది. సాద్‌కి బాల మేధావిగా గుర్తింపు ఉంది. ఐటీ విభాగంలో వ్యాపారవేత్త అయిన వినయ్‌ని మొదటిసారి కలిసినపుడు అతడికి 11 ఏళ్లు. అప్పట్నుంచీ వినయ్‌ సాద్‌కి మార్గదర్శిగా ఉంటున్నాడు. కంప్యూటర్‌ కోడింగ్‌ని ఇంటర్నెట్‌ సాయంతో నేర్చుకున్నాడు సాద్‌. ఇతడి ప్రతిభను గుర్తించి ఇంటెల్‌ సంస్థ ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌కి అవకాశం ఇచ్చింది. ఓసారి వినయ్‌ తాము చేపట్టనున్న అటానమస్‌ వాహనం గురించి చెబుతూ కంప్యూటర్‌ కోడ్‌ రాయమంటే కేవలం 30 నిమిషాల్లోనే రాశాడట. దాంతో సాద్‌ అవసరం కంపెనీకి ఎంతైనా ఉందని సహ వ్యవస్థాపకుడిగా చేర్చుకున్నారు. కంపెనీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటాడు సాద్‌. 

మందుపాతరని పట్టేస్తుంది!

హ్మదాబాద్‌కు చెందిన హర్షవర్థన్‌ జాలా... 14 ఏళ్లకే ‘ఏరోబోటిక్స్‌ 7’ కంపెనీ పెట్టాడు. ప్రపంచంలో ఇలాంటి కంపెనీ మరోటిలేదు. వీరు రూపొందించిన ‘ఈగల్‌ ఏ7’ డ్రోన్‌ యుద్ధ ప్రాంతంలో మందుపాతరల్నీ, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉపయోగించి చేసిన పేలుడు పరికరాల్నీ గుర్తించి వాటిని పనిచేయకుండా చేస్తుంది. పదేళ్లకే హర్షాకి ఎలక్ట్రానిక్‌ పరికరాలతో ప్రయోగాలు చేయడం అలవాటైంది. ఇంట్లో ఫ్యాన్‌, లైట్లనీ సొంతంగా రిమోట్‌కి అనుసంధానించాడు. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో తెలుసుకునేవాడు. అలా ఓసారి మందుపాతరల్ని తొలగిస్తూ సైనికులు చనిపోయిన వీడియోని యూట్యూబ్‌లో చూశాడు. ఆ పనిని రోబోని ఉపయోగించి ఎందుకు చేయకూడదన్న ఆలోచన అప్పుడే వచ్చి అటువైపు దృష్టి పెట్టాడు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతూ, గృహోపకరణాల్ని స్మార్ట్‌గా మార్చుతూ పరిశోధనలకు డబ్బు సంపాదించేవాడు. యువ శాస్త్రవేత్తగా ఫెలోషిప్‌మీద అమెరికా వెళ్లి గూగుల్‌, ఫేస్‌బుక్‌ సహా ప్రఖ్యాత కంపెనీల ఆఫీసుల్ని సందర్శించాడు. పదో తరగతి పూర్తయ్యాక కంపెనీ కోసమని చదువుకి విరామం ఇచ్చాడు. డ్రోన్ల ఉత్పత్తికి గుజరాత్‌ ప్రభుత్వం రూ.5కోట్ల ఆర్థిక సాయం చేసింది. హర్షా డ్రోన్‌ని భారత్‌, దక్షిణ కొరియా సైన్యాలు పరీక్షిస్తున్నాయి. ప్రస్తుతం 95 శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్న తన పరికరాన్ని 100 శాతం కచ్చితత్వంతో పనిచేసేలా మెరుగుపర్చి సైనికులూ, సామాన్యుల ప్రాణాల్ని రక్షించడమే లక్ష్యమని చెప్పే 16 ఏళ్ల హర్ష... వారాంతాల్లో ఆటపాటలకు సమయాన్ని కేటాయిస్తానంటాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.