close
ఇస్రో కోసం శాటిలైట్‌లు చేస్తున్నాం!


ఓ ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేసి పారిశ్రామికవేత్తగా మారిన విజయగాథలెన్నో మనం వినే ఉంటాం. పావులూరి సుబ్బారావది కూడా అలాంటి కథే కానీ... ఆయన విజయాలు ఆకాశమంత ఎత్తైనవి! ఇస్రో అంతరిక్ష ప్రయోగాలకీ, డీఆర్‌డీఓ క్షిపణులకీ అవసరమైన కమ్యూనికేషన్‌ సాంకేతికతని తయారుచేసే శాస్త్రవేత్తా, పారిశ్రామికవేత్తా ఆయన! దేశంలో ఇంకెవరూ చేయని విధంగా పూర్తిస్థాయి ‘ప్రైవేటు’ శాటిలైట్‌నీ తయారుచేసి నింగికి పంపారు. రోదసీ రంగంలో తెలుగువారి సత్తా ఏమిటో చాటుతున్న ఆయన్ని పలకరిస్తే...

మార్చి 2.ఓ మీటింగ్‌ కోసం ముంబయి వెళ్లాలి. హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునేదారిలో... ఔటర్‌ రింగ్‌రోడ్డు దాటుతూ ఉన్నాం. మా ముందు ఓ లారీ వెళుతూ ఉంది. దాన్నీ, మా కారునీ ఓవర్‌టేక్‌ చేయాలని ప్రయత్నిస్తోంది వెనక నుంచి వస్తున్న ట్రక్కు ఒకటి. అలా ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆ ట్రక్కు డ్రైవర్‌ మా కారు వేగాన్ని ఒక్క క్షణం తప్పుగా అంచనా వేసినట్టున్నాడు. మా కారుని ఢీకొట్టేశాడు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపలే నా తుంటీ, పక్కటెముకలూ విరిగిపోయాయి. మోకాలూ దెబ్బతింది. ఆసుపత్రిలో చేర్చారు. రెండు మూడు ఆపరేషన్‌లూ, పదిరోజుల ఆసుపత్రివాసం తర్వాత ఇంటికొచ్చాను. మోకాలూ, నడుమూ కదల్చలేని పరిస్థితిలో ఉన్నా. నా డెబ్భైఏళ్ల జీవితంలో ఆసుపత్రిలో చేరడమే కాదు... ఇలా రోజుల తరబడి విశ్రాంతి తీసుకోవడం కూడా ఇదే తొలిసారి. జీవితమంటే పరుగెత్తడమేననీ, పరుగుతోనే ప్రగతి అనీ నమ్మే నాకు ఇది కొత్తగా ఉంది. ప్రతి చెడులోనూ ఓ మంచీ, ప్రతి బాధలోనూ ఓ సవాలూ చూడటం నాకున్న అలవాటు. అలా ఈ ‘తప్పనిసరి విశ్రాంతి’ని నా జీవితాన్ని సమీక్షించుకోవడానికి ఓ మంచి సందర్భంగా భావిస్తున్నాను. ఆ సింహావలోకనంలోని కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను...

ఊరే స్ఫూర్తినిచ్చింది... 
తెనాలి దగ్గర గోవాడ అనే గ్రామం మాది. చదువుల కాణాచి అది. వందేళ్లకిందటే మంచి బడులూ, గ్రంథాలయాలూ ఏర్పాటుచేసుకున్న ఊరు. నా ముందు తరంవాళ్లలోనే ఎంతోమంది పెద్ద చదువులకెళ్లి అమెరికా, రష్యాలో స్థిరపడ్డారు. కాబట్టి, నాకు స్ఫూర్తికి కొదవలేదు. ఇంట్లోనూ చదువుకోవడానికి ఏ ఇబ్బందీ లేదు. నాన్న అప్పట్లోనే ఎఫ్‌.ఎ(ఇంటర్మీడియట్‌లాంటిది) చదివారు. కానీ నాన్నమ్మవాళ్ల ప్రోద్బలంతో ఊళ్ళోనే ఉండిపోయి వ్యవసాయంలోనే స్థిరపడ్డారు. మేం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్నయ్య ఇంజినీరుగా కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. రెండో అన్నయ్య బీఎస్సీ చేసి వ్యవసాయ శాఖలో చేసేవాడు. నాకు ముందు నుంచీ తెలుగు సాహిత్యమంటే వల్లమాలిన అభిమానం. కానీ, మా రోజుల్లో- ముఖ్యంగా మా ఊళ్ళో- కళలూ, సాహిత్యాలని కెరీర్‌గా ఎంచుకున్నవాళ్లెవరూ లేరు. అందరి ఆలోచనా ‘మనకో మంచి బతుకుతెరువునిచ్చే చదువులవైపే వెళ్లాల’న్నట్లే ఉండేది. నేనూ అటే వెళ్లాను. పీయూసీ తర్వాత ఇంజినీరింగ్‌వైపు మొగ్గాను. వరంగల్‌ ఆర్‌ఈసీలో సీటొచ్చింది కానీ... అప్పట్లో ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇంట్లోవాళ్లు వెళ్లనివ్వలేదు. దాంతో కేరళ కోళిక్కోడులో ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరాను. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ తీసుకున్నాను. ఆ కొత్త రాష్ట్రమూ సంస్కృతీ నన్ను కట్టిపడేశాయి. వాటిని ఆనందిస్తూనే బీఈ ముగించాను. తర్వాత, బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో పీజీలో చేరాను. ఇస్రో ప్రధాన కార్యాలయం ఉండేది ఆ నగరంలోనే కదా... సహజంగానే నా దృష్టి అటువైపు మళ్లింది. 1978 ప్రాంతం అది. ఇస్రో అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్నా కూడా అక్కడి ఉద్యోగ సంస్కృతి మిగతావాటికంటే భిన్నంగా ఉండేది. మంచి ఐడియాలకు ప్రాధాన్యమిచ్చేవారు. స్థాయీభేదాలకి అతీతంగా అందర్నీ ప్రయోగాలవైపు ప్రోత్సహించేవారు. అందుకే ఎంఈ ముగించగానే ఇస్రోలో ‘సైంటిస్టు-డి’ హోదాలో చేరాను.

‘సాగు’ ప్రేరణైంది... 
ఇస్రోలో ప్రధానంగా నేను ఉపగ్రహాలూ, రాకెట్లని అంతరిక్షంలో నియంత్రించే కమ్యూనికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ల రూపకల్పనలోనే పాలుపంచుకున్నాను. రాకెట్‌ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి వదిలాక దాని నియంత్రణకి కావాల్సిన టెలీమెట్రీ, టెలీకమాండ్‌ కంట్రోల్‌ బాధ్యత నాది. చూస్తుండగానే, ఇస్రోలో పదిహేనేళ్లు గడిచిపోయాయి. ఆ సంస్థలో ఉపగ్రహం తయారీకి కావాల్సిన కీలక భాగాల్ని ప్రైవేటు భాగస్వాములకి అప్పగించాలనే ఆలోచన మొదలైంది. ఇస్రోకి ఆ పనులు చేసిపెట్టే ప్రైవేటు సంస్థని నేనే ఎందుకు స్థాపించకూడదనే ఆలోచన వచ్చింది నాకు! దానిపైన పనిచేయడం మొదలుపెట్టినా, లోలోపల ‘ఇది అవుతుందా కాదా’ అని అనుమానంగా ఉండేది. బంధువులూ, స్నేహితులని అడిగితే వద్దేవద్దన్నారు. 
‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... జీతానికి కొదవలేదు. పైగా, సైంటిస్టు హోదా. వసతులూ తక్కువ కాదు. ఇన్నింటిని వదులుకుని రిస్క్‌ తీసుకోవడం ఎందుకు? పైగా పిల్లలిప్పుడు స్కూల్‌కి వెళుతున్నారు. నువ్వు ఉద్యోగం మానేస్తే వాళ్ల భవిష్యత్తేమిటీ?’ అన్నారు. నాకేమో ఎంతసేపూ మా నాన్న చేసే వ్యవసాయమే గుర్తొచ్చేది. సాగు చేయడం, పరిశ్రమ స్థాపించడం రెండూ ఒకటే అనిపించేది. మట్టి చదును చేసి ఏరువాక మొదలుపెట్టడం నుంచి కల్లంలోకి పంటని చేర్చడం దాకా వ్యవసాయంలో ప్రతి అడుగూ మనకు మనం చూసుకోవాల్సిందే. ఓ రైతు చెమట చిందించడంతోనే సరిపోదు... వర్షం అదును చూసి విత్తు నాటడంలో ఓ వాతావరణ శాస్త్రవేత్తగా, చీడపీడల్ని పరిహరించడంలో బయో-టెక్‌ నిపుణుడిగా, పంట అమ్మేవేళ ఓ వ్యాపారిగా... ఇన్ని అవతారాలూ ఎత్తాల్సిందే కదా! మా నాన్నలో నాకు ఈ కోణాలన్నీ కనిపించేవి. పరిశ్రమ స్థాపించడం కూడా అలాంటిదే అనిపించింది. ఏ రైతైనా ‘ఈ ఏడాది పంట లాభం వస్తుందో రాదో తెలియదు కాబట్టి సాగు మానేసి ఖాళీగా కూర్చుందాం!’ అనుకుంటాడా! కనుకే, ఓ రైతు బిడ్డగా సాహసం చేయాలని భావించాను. ఇస్రోలో ఏ బాదరబందీలేని ఉద్యోగ జీవితం కన్నా ఓ పారిశ్రామికవేత్తగా సవాళ్లు ఎదుర్కోవడంలోనే అసలైన ‘కిక్‌’ ఉంటుందనుకున్నాను!

చిన్న తటపటాయింపు... 
మా ఇంట్లోవాళ్లందరినీ ఒప్పించినా ‘ఇస్రో’ ఉన్నతాధికారులు ఏమంటారో అన్న అనుమానం కొంత  పీడించింది. తమదగ్గర పనిచేసిన ఉద్యోగి ఓ పరిశ్రమ స్థాపించి ఆ ఉత్పత్తుల్ని తమకే అమ్మడానికి వాళ్లు ఒప్పుకుంటారా అన్న అనుమానం వెంటాడింది. మరే సంస్థలోనైనా ఆ ఇబ్బంది ఉండేదేమోకానీ... ఇస్రో అలాకాదు. నాటి ఇస్రో ఛైర్మన్‌ యూఆర్‌ రావుతో ఆ విషయం చెప్పగానే ‘శభాష్‌’ అన్నారు. ఆయనే కాదు, సీనియర్‌ శాస్త్రవేత్తలందరూ ప్రోత్సహించారు. అలా, 1992లో ఇస్రోకి రాజీనామా చేశాను. నాకొచ్చిన పీఎఫ్‌ సొమ్మూ మా పంటల నుంచి వచ్చిన డబ్బూ బ్యాంకు రుణాలూ... అన్నింటినీ కలిపి 60 లక్షలతో  ‘అనంత్‌ టెక్నాలజీ’ సంస్థని స్థాపించాను.

ఆకాశంలో మేము... 
ఉపగ్రహాలని నియంత్రించే ఆన్‌-బోర్డు కంప్యూటర్‌లూ, రాకెట్లకి అవసరమయ్యే సబ్‌-సిస్టమ్స్‌ తయారీకి మా సంస్థ నడుం బిగించింది. మా నాణ్యతా, నవ్య సాంకేతికతా వాళ్లని మెప్పించింది. తొలి ఏడాదిలోనే లాభాలని అందుకుంది మా సంస్థ. 
ఆ తర్వాతి ఏడాదే ప్రతిష్ఠాత్మకమైన ‘పీఎస్‌ఎల్‌వీ’ ప్రయోగానికి కావాల్సిన కమ్యూనికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ని అందించాం. దాని విజయం మా సంస్థ అభివృద్ధికీ సోపానంగా మారింది. క్రమంగా ఉపగ్రహ ప్రయోగానికి అవసరమైన మూడు ప్రధాన విభాగాలు(తయారీ, దాన్ని నింగిలోకి పంపించడం, వెళ్లాక దానితో పనులు చేయించడం) అన్నింటా మా సేవల్ని విస్తరించాం. ఆ తర్వాత డీఆర్‌డీఓ నుంచి పిలుపొచ్చింది. కలాంగారితో కలిసి అగ్ని, పృథ్వీతో మొదలుపెట్టి ‘బ్రహ్మోస్‌’ దాకా క్షిపణుల తయారీలో కీలకపాత్ర పోషించాం. ఈ క్షిపణులని ‘గైడెడ్‌ మిస్సైల్స్‌’ అనడం వినే ఉంటారు... వాటిని అలా గైడ్‌ చేసే కంప్యూటర్‌ అప్లికేషన్‌ల తయారీయే మా పని అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్రో, డీఆర్‌డీఓలకి ప్రధాన ప్రైవేటు భాగస్వాములుగా ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అటు క్షిపణులు కావొచ్చు, ఇటు రాకెట్‌లు కావొచ్చు మనదేశం నుంచి ఆకాశంలోకి ఏది దూసుకెళ్లినా దాని వెనకా ముందూ మా పాత్ర ఉంటుందని చెప్పగలం!

ప్రతిదీ ఓ ముందడుగే... 
‘శాటిలైట్‌ విడిభాగాలు చేయడం ఓకే మనమూ ఇస్రోలాగే ఓ పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని తయారుచేస్తే?’- అనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. మన కేంద్రప్రభుత్వం అలాంటి శాటిలైట్‌లు పరిశోధనకోసం తయారుచేసి ప్రయోగించడానికైతే అంగీకరిస్తుంది కానీ... దాని ద్వారా వ్యాపార ప్రయోజనాలు పొందాలంటే ఒప్పుకోదు. అయినా నా కోరికని చంపుకోదలచుకోలేదు. మనలాంటి నిషేధాలేవీ లేని దక్షిణ అమెరికా దేశాలపైన దృష్టిపెట్టాను. ‘ఏ1శాట్‌’ అనే సొంత శాటిలైట్‌-ని రష్యా అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపాను. భారత్‌లో మరే ప్రైవేటు సంస్థా ఇప్పటిదాకా దీనికి సాహసించలేదు! మేం పంపిన ఆ శాటిలైట్‌ దక్షిణ అమెరికాలో ఇంటర్నెట్‌ సేవల్ని అందిస్తోంది. ప్రస్తుతం ఇస్రో విధానం మారింది. భారత్‌పైన ప్రైవేటు సంస్థల శాటిలైట్లు ఉండకూడదుకానీ... ఇస్రో కోసం ప్రైవేటు సంస్థలు పూర్తిస్థాయి శాటిలైట్లు తయారుచేసి ఇవ్వొచ్చని చెప్పారు. అంతకంటే కావాల్సిందేముంది...ఆ అవకాశాన్నీ మేమే అందిపుచ్చుకున్నాం. ప్రైవేటు శాటిలైట్‌లు తయారుచేయడానికి బెంగళూరులో ఇరవైవేల చదరపుటడుగుల్లో అతిపెద్ద తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశాను. ఇందులో ఇస్రోతోపాటూ ఇతర దేశాలకీ శాటిలైట్‌లు చేసిస్తాం. మనదేశంలో ఇలాంటి కేంద్రం ఇదొక్కటే. మనదేశ నావికాదళం ఎక్కువగా రష్యాకి చెందిన ‘మి’ రకం హెలీకాప్టర్లనీ, వైమానిక దళం ‘సుయొ’ విమానాలనీ వాడుతుంటాయి. వాటికి ఏ సమస్య వచ్చినా... మళ్లీ రష్యాకి పంపించి మరమ్మతులు చేయిస్తుంటారు. ఒకసెట్‌ విమానాలు పూర్తిస్థాయిలో మరమ్మతై రావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఆ అవసరం లేకుండా, అంత ఖర్చుతో పనిలేకుండా, ఓ రష్యన్‌ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని ఆదిభట్లలో అతిపెద్ద మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటుచేశాను. ఈ సంస్థ ద్వారా కేవలం ఆరునెలల్లోనే రిపేర్లు పూర్తవుతాయి. మా కేంద్రాన్ని చూశాక ‘మేకిన్‌ ఇండియా’కి అసలైన అర్థం మీరే చెబుతున్నారు’  అంటున్నారందరూ!

- జె.రాజు

 


‘అనంత’ కుటుంబం మాది! 

‘అనంత్‌’ మా సంస్థ పేరు. ‘మేము శాటిలైట్‌లు ప్రయోగించే ఆకాశం అనంతమైంది కదా, అందుకే ఈ పేరు పెట్టాం’ అంటుంటాను. అది నిజమే కానీ, ఆ పేరు వెనక అంతకన్నా బలమైన కారణమే ఉంది. నా భార్య పేరు అనంత లక్ష్మి. ‘ఇస్రో’లో సైంటిస్టుగా చేరడానికి ఏడాది ముందు మాకు పెళ్ళైంది. ఆ సంస్థ నుంచి బయటకు వస్తానంటే అందరూ వద్దన్నా నా భార్య మాత్రం నా ఆలోచనకే ఓటేసింది. తనకున్న ఆస్తి నుంచి నాకు 20 లక్షల రూపాయలిచ్చింది(అప్పుగానే లెండి!). అందుకే ఆ పేరు ఎంచుకున్నాను. ఆ చేతుల చలవేమో... మా సంస్థ ఈ 22 ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి 450 కోట్ల రూపాయల టర్నోవర్‌కి చేరుకుంది. దేశంలో నాలుగు కేంద్రాల్లో పదహారు వందలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్లలో నా ఇద్దరు పిల్లలూ ఉన్నారు. పెద్దవాడు అరవింద్‌ అమెరికాలో ఉంటూ మా సంస్థ కార్యకలాపాలు చూస్తున్నాడు. చిన్నవాడు అఖిల్‌ ఇక్కడే ఉంటూ కంపెనీని నిర్వహిస్తున్నాడు.  

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.