close
బిస్కెట్లకు పూల సోకు!

తాజా పూలను తల్లో పెట్టుకుంటాం. పూల ప్రింట్లున్న బట్టలు వేసుకుంటాం. దేవుడిని  కొలవడానికైనా ఇంటిని అలంకరించడానికైనా పూలను మించినవి లేవు. ఇవన్నీ మనకు తెలిసినవే... కొత్త విషయం ఏంటంటే... పూలతో ఇపుడు కుకీలనూ అందంగా మార్చేస్తున్నారు. అదేమంటే... ఎడిబుల్‌ ఫ్లవర్స్‌ ఆరోగ్యానికీ మంచివే అంటున్నారు.

ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న పదార్థాలు కనిపించినపుడు... ‘అబ్బ... చూస్తుంటేనే నోరూరిపోతుంది...’ అంటూ చేతుల్లోకి తీసుకుని, నోటికి అందించేస్తాం. కళ్లకు ఇంపుగా అనిపించినవి నోటికీ రుచిగా అనిపిస్తాయి మరి. ఈ కారణంతోనే ఒకప్పుడు బట్టలూ నగలకు మాత్రమే పరిమితమైన అందం కాన్సెప్టు ఇపుడు తినే వాటిక్కూడా పాకేసింది. అసలే ఆ అందాలను క్లిక్‌మనిపించడానికీ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చెయ్యడానికీ కెమేరా కన్ను కాచుకు కూర్చుంటుందాయె. ఇక, కుకీల దగ్గరికొస్తే పిల్లలూ పెద్దలక్కూడా ఇవి ఫేవరెట్లే. ఇంటికి ఎవరొచ్చినా టీతో పాటు స్నాక్స్‌లా ప్లేటులో పెట్టివ్వడానికీ బాగుంటాయి. అందుకే, వాటిని ఆకర్షణీయంగానూ మరింత ఆరోగ్యంగానూ మార్చేందుకు పూనుకున్నారు షెఫ్‌లు. అలా పుట్టుకొచ్చిందే ఎడిబుల్‌ ఫ్లవర్‌ కుకీల ట్రెండ్‌. 

ప్రకృతిలో అందమైనవీ ప్రకృతినే అందంగా మార్చేవీ సుమాలే. గులాబీ, మందార, చామంతి, ఛమేలీ, శంఖుపూలు, వయోలా, డయాంథస్‌... లాంటి కొన్ని రకాల పువ్వులైతే ఆరోగ్యానికీ మంచివి. కాబట్టే, ఈ తినే పూల రేకులను ఎండబెట్టి కుకీలమీద అంటిస్తున్నారు. కంటికి అందం... ఒంటికి ఆరోగ్యం అన్నదే దీని వెనుక సూత్రం. నిన్నమొన్నటి వరకూ పదార్థాలను ఆకర్షణీయంగా మార్చేందుకు రంగులు వాడేవారు. అయితే, కొన్నిరకాల రంగుల వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంతోనే ప్రకృతిలో దొరికే వాటినే అలంకరణకు ఉపయోగించడం ఈమధ్య బాగా పెరిగింది. ఇక, తినే పువ్వులతో అలంకరించడం వల్ల కేవలం అందమే కాదు, వాటి నుంచి వచ్చే ఫ్లేవర్‌ వల్ల వంటకాలకు ప్రత్యేక రుచి కూడా వస్తుంది. వీటిని ఇంట్లో చెయ్యడం కూడా సులువే. వేరు వేరు రంగుల తినే పూలను ఎంపిక చేసుకుని, ఎండబెట్టి బేక్‌ చేసే ముందు కుకీల మీద అంటిస్తే సరి. ఎండబెట్టిన ఎడిబుల్‌ ఫ్లవర్స్‌ని ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నారు. మనకు దొరకని పూలను అంటించాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. మన దగ్గర దొరికే పూవుల్లో- మందారలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయ వ్యాధులకీ చర్మం, జుట్టు ఆరోగ్యానికీ మందారాలు మంచివి. గులాబీ రేకులు జీర్ణసంబంధ, రుతు క్రమ సమస్యలకు మంచి మందు. వీటిలో విటమిన్‌ ఎ, ఇ ఉంటాయి. చామంతి చర్మ సంబంధ వ్యాధుల్ని తగ్గిస్తుంది. దీన్లో ఉండే ఫ్లేవనాయిడ్లు కణాల ఆరోగ్యాన్ని పెంచి క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయి. చామంతి కంటి సమస్యలకూ మంచి మందు. ఛమేలీ పూల రేకుల్లోని ఔషధ గుణాలు 
జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. 

అంతేకాదు, ఒత్తిడిని దూరం చేసి బాగా నిద్రపట్టేలానూ చేస్తుంది ఛమేలీ. ఇవండీ తినే పూల కుకీల సోకులూ వాటి వెనకున్న ఆరోగ్య రహస్యాలూ...

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.