close
హిమాలయాలు... ఏముందక్కడ?

కొండలు, లోయలు, కనుచూపుమేరా పచ్చదనం, చల్లని ప్రశాంత వాతావరణం... ఒక్కో అడుగూ పైకి వెళ్తుంటే వెండికొండల్లా తళుకులీనే తెల్లని మంచుకొండలు మనసును కట్టిపడేస్తాయి. ఉదయ సాయంత్రాల్లో ఎర్రని సూర్యకిరణాలు సోకి ఆ కొండలే బంగారు రంగులో మెరిసిపోతూ రారమ్మని పిలుస్తుంటాయి. హిమాలయాల అందాలను కళ్లతో చూడాలే కానీ మాటలతో వర్ణించలేం. అందుకేనేమో... యోగులైనా, మహాభోగులైనా మనసుపడే మనోజ్ఞసీమ అన్నారో కవి. ఎన్నెన్నో విశేషాలతో అలరారే ఈ హిమగిరులు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి..!

కొనదేలినట్లున్న పర్వత శిఖరం మీద సన్నని దారి పొడుగునా కొండవీటి చాంతాడును గుర్తుకు తెచ్చే మనుషుల వరుస... ఆ దారికి రెండువైపులా లోతైన లోయలు. కాలు జారి పడిపోకుండా కట్టిన తాడును పట్టుకుని ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తూ ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరుకోవటానికి క్యూలో వేచి ఉన్న వారి ఫొటో ఈ మధ్య అంతర్జాలంలో వైరల్‌ అయింది. హిమాలయాల మీద ట్రాఫిక్‌ జామ్‌ అన్న వార్తలకు కారణమైంది. ఎత్తైన మంచుకొండలు ఎక్కడమే కష్టమనుకుంటే అందుకు ఎందరో పోటీ పడి మరీ వెళ్తున్నారనడానికి సాక్ష్యం ఆ ఫొటో. నిర్మల్‌ పుర్జా అనే పర్వతారోహకుడు మే 22న ఆ ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 320 మంది దాకా ఆ క్యూలో ఉన్నారని రాశాడు. ఎవరెస్ట్‌ అంటే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. సముద్రమట్టానికి 8,848 మీటర్ల ఎత్తున ఉన్న ఆ శిఖరాగ్రాన్ని చేరుకోవటమంటే సాహసాలకే సాహసం. ప్రాణవాయువు అందదు. పట్టుకెళ్లినది సరిపోవాలంటే సాధ్యమైనంత త్వరగా శిఖర దర్శనం చేసుకుని తిరుగుదారి పట్టాలి. అక్కడ గడిపే ప్రతి క్షణమూ అమూల్యమే. అలాంటి చోట ప్రాణాలు అరచేత పట్టుకుని అంతమంది అలా గంటల తరబడి క్యూలో నుంచున్నారంటే... ఏ శక్తి వాళ్లను అక్కడి దాకా తీసుకొచ్చింది... ఏ ఆకర్షణ వారిని ఆ యాత్రకు పురికొల్పింది... ఆ వార్తలు చూసిన చాలా మందిలో ఇవే సందేహాలు. ఒక్క ఎవరెస్టే కాదు, మొత్తంగా హిమాలయాలే తరతరాలుగా మనిషి అన్వేషణకు ఆకర్షణకేంద్రం అవుతున్నాయి. ఉరుకుల పరుగుల రోజువారీ జీవితం నుంచి కాస్త పక్కకు మళ్లి తాత్విక చింతన చేసే చాలామందిని ఆకట్టుకునేది హిమాలయాల మాటున దాగిన మార్మికతే! ఏముందో తెలియదు కానీ, ఏదో ఉందనిపిస్తుంది. సూదంటురాయిలా మనసును పట్టిలాగుతుంది. అందుకే హిమాలయాలను సందర్శించడానికి ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతుంటారు.

ప్రకృతి అందాలకు నెలవులు!
ఇంత విస్తృతమైన పర్వతశ్రేణి అదీ మంచుతో కప్పబడి ఉన్నది ప్రపంచంలో మరెక్కడా లేదు. ధ్రువ ప్రాంతాల తర్వాత అంత మంచు ఉన్నది హిమాలయాల్లోనే. ఈ పర్వతాల సానువుల్లో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తుంటుంది. మనాలీ, నైనిటాల్‌, ముస్సోరీ, డార్జిలింగ్‌... లాంటి పలు వేసవి విడుదులు ఇక్కడే ఉన్నాయి. పచ్చటి పొలాల మధ్య అక్కడొకటీ ఇక్కడొకటీ విసిరేసినట్లుండే గ్రామాలు ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నట్లుంటాయి. సరదాగా పర్వతారోహణ చేయాలని ఉబలాటపడేవాళ్లు చాలామంది ఈ గ్రామాలనుంచీ సహాయకులు లేకుండానే ట్రెకింగ్‌కి వెళ్లవచ్చు. ఆ చల్లని పరిసరాల్లో ప్రశాంతంగా గడపవచ్చు. అవి దాటితే దట్టమైన అడవులూ, లోయలూ, జలపాతాలూ ఉంటాయి. అవీ దాటి ఇంకా పైకి వెళ్తే ఆకాశాన్ని తాకుతున్నట్లుండే శిఖరాలతో ఠీవిగా నిలిచిన పర్వతాలు పలకరిస్తాయి. వాటి మధ్య తెల్లని మంచుదిబ్బలూ సరస్సులూ మురిపిస్తాయి. ఒకేచోట ఇంత విభిన్నమైన వాతావరణం ప్రపంచంలో మరెక్కడా కన్పించదు. ఒక్కసారైనా ఆ అందాలను తమ కెమెరాల్లో బంధించాలని దేశవిదేశీ ఫొటోగ్రాఫర్లు కలలు కంటారు. అవకాశం దొరకగానే కెమెరా పుచ్చుకుని వచ్చి వాలిపోతారు. దాదాపు సగం భారత దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్న గంగ, యమున, బ్రహ్మపుత్ర లాంటి జీవనదులు హిమాలయాలనుంచే ప్రవహిస్తున్నాయి. ఇవి కాక టిబెట్‌ పీఠభూమిపై పుట్టి భారత్‌ మీదుగా పాకిస్థాన్‌ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే మరో పెద్ద నది సింధూతోపాటు రావి, బియాస్‌, సట్లెజ్‌, జీలం, చీనాబ్‌ లాంటి నదులన్నీ కూడా హిమాలయాల్లో పుట్టినవే.

నదుల వెంటే నమ్మిన దైవాలూ..!
హిమాలయాల్లో పుట్టి అక్కడి మట్టినీ, ఖనిజలవణాలనూ తమతో తెస్తూ దేశాన్ని సారవంతం చేయడమే కాదు, ఆ నదులు హిమాలయాలనుంచీ ఆధ్యాత్మికతనూ తమ వెంట తెస్తున్నాయి. అందుకే వీటి వెంట ఎన్నో దేవాలయాలు వెలశాయి. రావణుడిని చంపిన పాప పరిహారం కోసం రాముడు రిషికేశ్‌ వచ్చాడట. అక్కడ ప్రవహిస్తున్న గంగానదిని నాడు రామ, లక్ష్మణులు దాటినచోటే నేడు రామ్‌ ఝూలా, లక్ష్మణ్‌ ఝూలా వంతెనలు ఏర్పాటుచేశారు. ప్రపంచ యోగా రాజధానిగా పేరొందిన రిషికేశ్‌ ఎన్నో శతాబ్దాలుగా సాధుసంతులకు ధ్యానవాటికగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఏటా నిర్వహించే అంతర్జాతీయ యోగా ఫెస్టివల్‌కి విదేశాల నుంచి ఆసక్తి కలవారెందరో వస్తుంటారు. రుద్రప్రయాగ్‌, హరిద్వార్‌, ఉత్తరకాశి మాత్రమే కాదు, భక్తులు చార్‌ధామ్‌ యాత్ర పేరుతో సందర్శించే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లూ ఇక్కడే ఉన్నాయి. చుట్టూ ఎత్తైన కొండలూ గుహలూ, మధ్యగా ప్రవహించే నదులూ వాటి అంచునే వెలసిన దేవాలయాలూ... మొత్తంగా అక్కడి గాలిలోనే ఆధ్యాత్మిక భావన పరిఢవిల్లుతుంటుంది. ఏడాదికోసారి మాత్రమే కన్పించే మంచుశివలింగాన్ని చూసి రావడానికి అమరనాథయాత్రకు బారులు తీరేవారి గురించి చెప్పనక్కరలేదు. హిందువులకే కాదు టిబెటన్లు, బౌద్ధులు, జైనులకు కూడా హిమాలయాలతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. టిబెట్‌లోని మానససరోవరం, కైలాస పర్వతాల సందర్శన అనేది చాలామందికి జీవితకాల కోరిక.

జీవ వైవిధ్యం... మూలికా వైద్యం
దక్షిణాన హిందూ మహాసముద్రమూ ఉత్తరాన హిమాలయాలూ... అంటూ అవి మన దేశానికే సొంతమైనట్లు మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ నిజానికివి ఆరు దేశాల్లో విస్తరించి ఉన్నాయి. భూటాన్‌, టిబెట్‌, నేపాల్‌, భారత్‌ల మీదుగా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ల వరకూ హిమాలయ పర్వతశ్రేణి వ్యాపించివుంది. కాబట్టే విభిన్నమైన భౌగోళిక పరిస్థితులకూ జీవవైవిధ్యానికీ ఇవి నెలవయ్యాయి. ఉందో లేదో తెలియని ‘యతి’ సంగతి అలా ఉంచితే, తెల్లని మంచు చిరుతల్నీ, జడల బర్రెల్నీ, అడవి మేకల్నీ, కస్తూరి మృగాల్నీ, ఊలు బస్తాల్లా నడిచే టిబెటన్‌ గొర్రెల్నీ చూడడానికి ఎందరో జంతుప్రేమికులు వస్తుంటారు. అక్కడి ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ఓపిగ్గా పర్యటిస్తూ అరుదుగా కన్పించే అపురూప దృశ్యాల్ని కెమెరాల్లో బంధించుకుని ఆనందిస్తారు. ఇక పక్షుల్ని అవి సహజంగా తిరిగే వాతావరణంలో పరిశీలించాలనుకునేవారికి అయితే ఈ ప్రాంతం ఓ అద్భుతాల గని. హిమాలయన్‌ మోనల్‌, బుల్‌బుల్‌ లాంటి పక్షుల సందడి చూసి తీరాల్సిందే. మరో పక్క ఆకాశానికి నిచ్చెనవేసినట్లుండే దేవదారు, టేకు, రోజ్‌వుడ్‌, జూనిపర్‌, పైన్‌ లాంటి చెట్లూ దట్టమైన ఇక్కడి అడవులకు వింతశోభనిస్తుంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇక్కడ లభించే వనమూలికలు మరో ఎత్తు. ఈ భూగోళం మీద ఇప్పటివరకూ కాలుష్యం కోరలకు చిక్కని ప్రదేశాలు రెండే రెండు మిగిలాయి. అందులో ఒకటి అంటార్కిటికా అయితే రెండోది హిమాలయ ప్రాంతం. మనుషులు అతి తక్కువగా సందర్శించిన ప్రాంతాలు కావడంతో ఇవి ఆ స్వచ్ఛతను నిలుపుకున్నాయి. అక్కడ పెరిగే వనమూలికలు ఎంతో శక్తిమంతమైనవై ఉంటున్నాయి. అందుకే మన దేశ ఆయుర్వేద మందుల పరిశ్రమలకు మూలికలనందించే పెన్నిధిÅగా హిమాలయ ప్రాంతం పేరొందింది.

ఆ థ్రిల్లింత... జీవితానికి సార్థకత!
సామాను చేరవేసే చిన్న ఆటోతో పగలూ రాత్రీ కష్టపడే సుభాష్‌ పాల్‌కి ఎవరెస్టు ఎక్కాలన్నది కల. వచ్చే కొద్దిపాటి సంపాదననుంచే వేల రూపాయల ఫీజులు కట్టి పర్వతారోహణలో శిక్షణ పొందాడు. అతడు అన్నీ సమకూర్చుకుని ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి యాభై ఏళ్లొచ్చాయి. తనకేమన్నా అయితే ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తేమిటన్న ఆలోచనే అతనికి రాలేదు. ఆటోనీ భార్యకున్న కొద్దిపాటి బంగారాన్నీ అమ్మేసి మొత్తం రూ.18లక్షలు చెల్లించి పర్వతారోహణకు వెళ్లిపోయాడు.
త్వరలోనే వచ్చి అతడు తన సాహసయాత్రను కథలుగా చెబుతాడని ముసలి అమ్మానాన్నా భార్యాబిడ్డా ఎదురుచూస్తున్నారు. కానీ అతడి ఉత్సాహానికి పరిస్థితులు సహకరించలేదేమో, ఆ పర్వతం ఒడిలోనే కన్నుమూశాడు. ఇలాంటి సంఘటనలు పర్వతారోహణ పట్ల ఆసక్తిని తగ్గిస్తాయా అంటే ‘ఏ మాత్రం తగ్గించకపోగా మరింత పెంచుతాయి. వారు చేయలేకపోయారు కానీ, మేం విజయవంతంగా యాత్ర పూర్తిచేసుకొస్తామ’ంటూ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంకా ఎక్కువ మంది వెళ్తారు’ అని చెబుతారు శిక్షణ సంస్థల వాళ్లు.
సుభాష్‌ లాంటి వాళ్లు మనదేశంలోనే కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నారు. వారికి హిమాలయాలంటే పిచ్చి. ఉత్తరాదిన ఇలాంటివాళ్లను ‘ఎవరెస్టు పిచ్చోళ్లు’ అంటారు. ప్రాణాలొడ్డి ఎందుకు అక్కడికి వెళ్లడం... దాని వల్ల ఉపయోగం ఏమిటీ- అని ఎవరైనా వాదిస్తే వాళ్లు నొచ్చుకుంటారు. ‘అన్నం పప్పూ తింటే కూడా ఆకలి తీరుతుంది. అయినా రకరకాల వంటకాలు కష్టపడి వండుకుని తినడం ఎందుకు. అలాగే ఇది కూడా. దాని వల్ల ఉపయోగం ఏమిటీ అంటే ఏం చెబుతాం. అంతెత్తున ఠీవిగా నిలబడి రారమ్మని పిలుస్తుంటే వెళ్లాలనిపిస్తుంది... అంతే’ అన్నది వారి సమాధానం. వెళ్లివచ్చిన వారు చెప్పేదీ అదే... చూపు ఆనినంత మేరా పిండి ఆరబోసినట్లు కన్పించే ఆ మంచుకొండల మీదికి ఎంత కష్టపడి ఎక్కినా శిఖరాన్ని చేరగానే పడిన కష్టం అంతా మర్చిపోతామనీ... చుట్టూ ఉన్న దృశ్యాన్ని చూసినపుడు కలిగే ఆ అనుభూతికి మాటల్లేవనీ..!
హిమాలయాలు ప్రపంచంలోని పలు ఇతర పర్వతాల్లా విశాలంగా, ఎక్కడానికి వీలుగా ఉండవు. చాలావరకూ నిటారుగా, పర్వతారోహకులకు సవాలు విసురుతున్నట్లుగా ఉంటాయి. వాటి మధ్యనుంచి వీచే గాలి కత్తితో కోసేస్తున్నట్లుంటుంది.
వాతావరణం ఉన్నట్లుండి మారిపోతుంది. పాదాలు మంచులోకి కూరుకుపోతుంటాయి. అంత కష్టపడి ఎక్కినా కాసేపు తీరిగ్గా కూర్చుని అక్కడి అందాలను ఆస్వాదించే పరిస్థితి ఉండదు. ఎవరెస్టు శిఖరాగ్రంమీద అంతా కలిపి పది మంది నిలబడడానికి కూడా చోటుండదు. ఒక్క ఎవరెస్టే కాదు, దాని తర్వాత ఎత్తైన పర్వతాలుగా చెప్పుకునే కె2, కంచన్‌ జంగా లాంటివీ ఎక్కుతారు చాలామంది. మొత్తంగా ఈ పర్వతారోహణ ప్రక్రియ మనిషిలోని పట్టుదలకీ శారీరకమానసిక దృఢత్వానికీ, వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితుల్లో నిలదొక్కుకోగల శక్తి సామర్థ్యాలకీ పరీక్ష పెడుతుంది. అయినా సరే, ఏటా కొన్ని వందల మంది ఆ సవాలును స్వీకరిస్తున్నారు.

అరవయ్యారేళ్లు... ఎన్నో మార్పులు!
హిమాలయాల మీద ఏటా ఇంత రద్దీ ఉండదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 825 మంది ఎవరెస్టును అధిరోహించారు. ఎవరెస్ట్‌ పర్వతారోహణ సీజన్‌ మేలో కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. శిఖరాగ్రానికి దగ్గరలోకి వెళ్లాక వాతావరణాన్ని బట్టి రద్దీ ఏర్పడుతుంది. ఒక వారం రోజుల పాటు వాతావరణం బాగుంటే ఏమాత్రం రద్దీ లేకుండా అందరూ ప్రశాంతంగా శిఖరదర్శనం చేసుకుని వచ్చేస్తారు. రెండు మూడు రోజులే వాతావరణం అనుకూలిస్తే అప్పుడు రద్దీ ఏర్పడుతుంది. మే 19-20 తేదీల్లో రెండు రోజులూ, 22 నుంచి 24 వరకూ మూడు రోజులూ మాత్రమే ఈసారి సీజన్‌లో వాతావరణం అనుకూలించింది. దాంతో రద్దీ ఏర్పడి, ఎక్కువ సమయం అక్కడ ఉండాల్సిరావడంతో అలసిపోవడం, పర్వతారోహణలో తగినంత అనుభవం లేకపోవడం... తదితర కారణాల వల్ల ఈసారి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా కొండచరియలు విరిగిపడటం, వాతావరణం ప్రతికూలంగా ఉండడం, ప్రమాదవశాత్తూ జారిపడిపోవటం లాంటి కారణాల వల్ల మాత్రమే పర్వతారోహకులకు ప్రాణాపాయం ఉంటుంది.

అరవయ్యారేళ్ల క్రితం మొదటిసారి
ఎవరెస్ట్‌ ఎక్కినప్పటికీ ఇప్పటికీ ఈ యాత్రలో ఎంతో మార్పు వచ్చింది. ఒక విధంగా అడవి జంతువును మచ్చిక చేసుకుని సాధుజంతువుగా మార్చినట్లు తొలితరం పర్వతారోహకులు రకరకాల ప్రయత్నాలు చేసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కటానికి వీలుగా చేశారు. దారి పొడుగునా వంతెనలు కట్టి, నిచ్చెనలు వేసి, కర్రలు పాతి తాళ్లు కట్టి... ఇలా రకరకాల ఏర్పాట్లు చేశారు. దాంతో ఇప్పుడు ఎక్కువ మంది ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కగలుగుతున్నారు. అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు.

* * * * *

ఒకప్పుడు శత్రుసేనలు దండెత్తకుండా భారతదేశాన్ని కాపాడింది హిమాలయాలే అంటుంది చరిత్ర.
అప్పుడే కాదు, ఇప్పుడూ ఎప్పుడూ హిమగిరులు మనకు రక్షాకవచాలే.
భయంకరమైన గాలుల్ని భారత భూభాగం వైపు రాకుండా ఆపుతూ...
రుతుపవన మేఘాలు దేశంలోనే నిలిచి కురిసేలా చేస్తూ...
తమ అందాలతో ప్రకృతి ప్రేమికులనూ...
ధ్యానగమ్యాలతో యోగసాధకులనూ...
తీర్థక్షేత్రాలతో ఆధ్యాత్మికులనూ...
సవాళ్లతో సాహసికులనూ...
‘రారమ్మని’ పిలిచే హిమవత్పర్వతశ్రేణి భారతావనికి మణికిరీటమే కాదు, మొత్తం భూమండలం మీదే ఓ అద్భుతం..!

 


ఫొటో లేదు... మంచు కరగదు!

హిమాలయాలు మంచు కొండలకే కాదు ఎన్నోవింతలూ విశేషాలకూ నెలవులే!
* బ్రిటిష్‌ సైన్యానికి చెందిన ఓ అధికారి సర్‌ జార్జ్‌ ఎవరెస్ట్‌ గౌరవార్థం ఆయన పేరును ఈ పర్వతానికి పెట్టారు. నేపాలీలు దీన్ని సాగర్‌మాత అనీ, టిబెటన్లు కోమోలుంగ్మా అనీ పిలుస్తారు.
* 1953లో తెన్జింగ్‌ నోర్గే అనే షెర్పా తోడు రాగా ఎడ్మండ్‌ హిలరీ ఎవరెస్టు మీద పాదం మోపాడు. అయితే ఎవరెస్ట్‌ మీద తెెన్జింగ్‌ దిగిన ఫొటో ఉంది కానీ హిలరీ ఫొటో లేదు. తెన్జింగ్‌కి కెమెరా వాడడమెలాగో తెలియకపోవటంతో హిలరీ ఫొటో తీయలేదు.
* ఇప్పటివరకు 24 సార్లు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు నేపాల్‌కి చెందిన కామి రీటా షెర్పా. మరో షెర్పా మహిళ లాక్పా 9 సార్లు ఎక్కితే, ఐదురోజుల్లోనే రెండుసార్లు ఎక్కి రికార్డు సృష్టించింది భారతీయ మహిళ అంశు.
* జపాన్‌కి చెందిన యుచిరో మియురా 80 ఏళ్లు నిండాక ఎవరెస్టు ఎక్కితే, 13 ఏళ్ల 10 నెలలకే ఆ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు అమెరికాకు చెందిన జోర్డాన్‌ రోమెరో.
* కళ్లు లేనివారు, కాళ్లు లేనివారు(కృత్రిమ కాలుతో), క్యాన్సర్‌, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌ లాంటి వ్యాధిపీడితులు... ఇలాంటివారు ఇరవై మంది ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కి చూపించారు.
* భూమి లోపల టెక్టానిక్‌ ప్లేట్ల కదలిక వల్ల హిమాలయ పర్వతాలు ఏటా 5మి.మీ.ల చొప్పున ఎత్తు పెరుగుతున్నాయట. భూ ప్రకంపనలకీ కొండచరియలు విరిగిపడటానికీ కూడా ఈ మార్పులే కారణం.
* ప్రపంచంలో అతి పెద్ద మంచుదిబ్బ(గ్లేసియర్‌)లు హిమాలయాల్లోనే ఉన్నాయి. దాదాపు 15వేల మంచుదిబ్బలు ఉంటే వాటిల్లో అన్నిటికన్నా పెద్దది సియాచిన్‌.
* ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు కావడంతో హిమాలయాల మీద మంచు అసలు కరిగిపోదు.

(9  జూన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.