close
అమ్మో కిమ్మో..!

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిపిన చర్చలు విఫలం అవడంతో అందుకు కారకులంటూ అయిదుగురు అధికారులకు మరణశిక్ష విధించాడని విని ప్రపంచం అవాక్కైంది. కానీ ఇలాంటి హత్యలూ ఇంతకు మించిన దారుణాలూ ఉత్తర కొరియాలో ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి.

నకు స్వాతంత్య్రం వచ్చాక ఏడాదికి ఉత్తర కొరియాకి స్వతంత్రం వచ్చింది. కానీ ఆ తర్వాతే అక్కడి ప్రజల స్వేచ్ఛ హరించుకుపోయింది. గత డెబ్భై ఏళ్లుగా వారికి మరో ప్రపంచం తెలియదు. తెలియకుండా చేశారు వాళ్ల అధ్యక్షులు. ఉత్తర కొరియా మొదటి అధ్యక్షుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ అధికారంలోకి రాగానే ఆ దేశంతో ప్రపంచానికి ఉన్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసేశాడు. అప్పట్నుంచీ బయట ఏం జరుగుతుందో కూడా వారికి తెలియని పరిస్థితి. అధ్యక్షుడే వారికి దైవం. మరో దైవాన్ని పూజించినా ఒప్పుకోరు. తినడానికీ బట్టకట్టడానికీ జుట్టు కత్తిరించడానికీ అన్నిటికీ ప్రభుత్వ నిబంధనలే. పాటించకపోతే కఠిన శిక్షలే. పోనీ దేశం విడిచి వెళ్లి ఎక్కడైనా బతుకుదామంటే పోనివ్వరు. అందుకే,  మిగిలిన ప్రపంచంతో పోల్చితే తామెంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామన్న విషయం కూడా అక్కడి జనానికి తెలీదు. ఇంటర్నెట్‌ వచ్చిన ఈరోజుల్లో ఏమూల ఏం జరుగుతున్నా తెలుస్తుందిగా అనుకోవచ్చు. కానీ వారికి ఇంటర్నెట్‌ ఉండదు. ఈమధ్యే ఫోన్‌ సదుపాయం వచ్చింది కానీ లోకల్‌కాల్స్‌ మాత్రమే మాట్లాడాలి. టీవీల్లో ప్రభుత్వానికి చెందిన మూడు ఛానెళ్లే వస్తాయి.
* కిమ్‌ జాంగ్‌ ఉన్‌... ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు. 1948లో అవతరించిన ఆ దేశానికి మొదటి అధ్యక్షుడు ఇతడి తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ అయితే, రెండో అధ్యక్షుడు కిమ్‌ ఉన్‌ తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌. తండ్రి మరణం తర్వాత 2011లో వారసత్వంగా అధికారంలోకి వచ్చాడు కిమ్‌ ఉన్‌. ఆశ్చర్యం ఏంటంటే క్రూరత్వం, నియంతృత్వంలో ఈ ముగ్గురూ ఒకరిని మించిన వాళ్లు మరొకరు.
* అధికారం చేపట్టేనాటికి కిమ్‌ ఉన్‌ వయసు 27 ఏళ్లు. వయసులో చిన్నే కానీ హింసా ప్రవృత్తిలో ఇతడిని మించిన వారుండరేమో. ఎంతగా అంటే తన తండ్రి మరణించినందుకు ఆ దేశ ప్రజలందరూ తీవ్రంగా బాధపడాలని ఆదేశించాడు. సైనికుల్ని నియమించి కన్నీళ్లు కార్చని వారినీ తండ్రి సంతాప కార్యక్రమాలకు హాజరుకాని ప్రజలనూ బంధించి ఆరునెలల జైలు శిక్ష వేశాడు. వారిని లేబర్‌ క్యాంపులకి పంపించి చిత్ర హింసలకు గురిచేశాడు. కిమ్‌ ఉన్‌ తండ్రి కూడా అతడి తండ్రి చనిపోయినపుడు బాధపడని వారిని ఇలానే శిక్షించాడట.
* కిమ్‌ ఉన్‌ అధికార పర్వమే పదుల సంఖ్యలో ఉన్నతాధికారుల హత్యలతో మొదలైంది. తన అధికారానికి ఎవరైనా అడ్డుతగులుతారనే ఊహ వచ్చినా వారిని నిర్దాక్షిణ్యంగా చంపించేస్తాడు. తన మేనత్త భర్త జాంగ్‌ సంగ్‌ థేక్‌కి అధికారం దక్కించుకునే అవకాశం ఉండడంతో 2013లో అతడిపైన నమ్మక ద్రోహం నేరం మోపి దారుణంగా చంపించాడు. ఆ తర్వాత మేనత్తనూ ఆమె పిల్లలూ మనవలూ దగ్గరి బంధువులూ... ఇలా వారి వంశంలో ఒక్కరు కూడా మిగలకుండా చేశాడు. రెండేళ్ల కిందట సవతి సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ను కూడా విష ప్రయోగంతో చంపించాడు.
* అధికారులు తనకి నచ్చని చిన్న పని చేసినా కిమ్‌ ఉన్‌కి చిర్రెత్తుకొచ్చేస్తుంది. కొంతకాలం కిందట తనకి సరైన సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలతో అయిదుగురు రక్షణ శాఖ ఉన్నతాధికారుల్ని శరీరం తునాతునకలయ్యేలా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌లతో కాల్చి చంపించాడన్నది దక్షిణ కొరియా నిఘా విభాగం సమాచారం. 2015లో ఓ రక్షణ శాఖ అధికారిని వందలమంది ప్రజలు చూస్తుండగా కాల్చి చంపించాడు.
* ప్రభుత్వ నిబంధనల్ని పాటించని వారిని బహిరంగంగా అందరూ చూస్తుండగా కాల్చి చంపడం కిమ్‌ జాంగ్‌ ఉన్‌కి ఓ సరదా.
* కిమ్‌ ఉన్‌ అనుచరులు గ్రామాలకు తిరిగి అందం, శరీర సౌష్టవం ఉన్న టీనేజీ పిల్లల్ని ఎంపిక చేసి, వారిని రాజధానికి పంపిస్తారు. అక్కడ కిమ్‌ కుటుంబ సభ్యులకు సేవలందించే విశ్రాంతి భవనాల్లోనూ ప్రత్యేక ఆసుపత్రుల్లోనూ వినోదం కోసం వారిని నియమిస్తారు. విచిత్రం ఏంటంటే దీన్ని ప్రజలు కనీసం వ్యతిరేకించరు కూడా.
* కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తలకట్టుని చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. కానీ అతడి దృష్టిలో అదో అద్భుతం. ఇంకా చిత్రం ఏంటంటే... ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులందరూ చచ్చినట్లూ ఆ తలకట్టునే చేయించుకోవాలన్నది నిబంధన. మిగిలిన జనం కూడా ఆడైనా మగైనా ప్రభుత్వం అనుమతించిన హెయిర్‌ స్టైల్స్‌లో మాత్రమే కనిపించాలి. అంతేకాదు, అబ్బాయిల జుట్టు పొడవు రెండంగుళాల లోపే ఉండాలి. పెళ్లికాని అమ్మాయిలు జుట్టు పెంచుకోకూడదు.
* అణు పరీక్షలు చెయ్యడం కిమ్‌కి నిరంతర వ్యాపకం. అణు బాంబులూ క్షిపణులను తయారుచేసి శత్రు దేశాలను భయపెట్టడంతోపాటు, అదే తమ దేశ అభివృద్ధికి చిహ్నంగా చెబుతుంటాడు.
* కిమ్‌ ఉన్‌ తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ కూడా క్రూరుడే. అతడికి సినిమాలంటే తెగ పిచ్చి. కానీ ఉత్తర కొరియాలో సినిమాలు అంతబాగా తీసేవాళ్లెవరూ లేరని దక్షిణ కొరియాకు చెందిన ఓ దర్శకుడినీ నటి అయిన అతని భార్యనూ కిడ్నాప్‌ చేయించాడు. పదేళ్లపాటు వారితో బలవంతంగా ఉత్తర కొరియా సినిమాలు తీయించాడు. చివరికి ఓసారి ఉత్తర కొరియా సినిమాల ప్రచారంలో భాగంగా ఆస్ట్రియా వెళ్లిన ఆ జంట ఎలాగోలా అక్కణ్నుంచి తప్పించుకుంది.

ఒకరి తప్పుకి మూడు తరాలకు శిక్ష
ఉత్తర కొరియాలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఎవరైనా ఒకరు తప్పు చేస్తే వారి కుటుంబంలోని మూడు తరాలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అంటే తప్పు చేసిన వ్యక్తితో పాటు అతడి కుటుంబాన్ని కూడా ప్రిజన్‌ క్యాంపుల్లో బందీలుగా చేస్తారు. ఆ తర్వాత వారికి పుట్టిన పిల్లలూ మనవలూ కూడా అక్కడే వెట్టి చాకిరీ చేస్తూ బతుకీడ్చాలి. ఇంతకీ అక్కడ పెద్ద పెద్ద నేరాలంటే ఏంటో తెలుసా... కిమ్‌ల ఫొటోలకు దుమ్ము అంటుకుంటే తుడవకపోవడం, దక్షిణ కొరియావాసులతో సంబంధాలు పెట్టుకోవడం, దేశం నుంచి పారిపోవడం... లాంటివి.
ఆ దేశ జైళ్లూ లేబర్‌ క్యాంపుల్లో రోజుకి పన్నెండు గంటలూ వారానికి ఏడు రోజులూ గొడ్డు చాకిరీ చేయిస్తారట. కానీ కడుపు నిండా తిండీ పెట్టరు. కట్టుకోవడానికి బట్టలూ ఎప్పుడో గానీ ఇవ్వరు. బతకడం కోసం ఖైదీలు లేబర్‌ క్యాంపుల్లో ఎలుకలతో సహా ఏ జంతువు కనిపించినా వదలకుండా వేటాడి తింటారట.
* ఆమ్నెస్టీ అంతర్జాతీయ నివేదిక ప్రకారం వివిధ నేరాలకింద లక్షలమంది ప్రజలు అక్కడి లేబర్‌ క్యాంపుల్లో బతుకీడుస్తున్నారు.
* స్థానికంగా ఉన్న మీడియా మొత్తం ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వం ఏం చెబితే అదే జనానికి చెప్పాలి.
* ప్రభుత్వం అనుమతించిన మూడు ఛానెళ్లు కాకుండా అక్రమంగా దేశంలోకి వచ్చిన డీవీడీలూ పెన్‌ డ్రైవ్‌ల ద్వారా ఇతర దేశాల సినిమాలూ వార్తా కార్యక్రమాలు చూసినా విదేశీ పుస్తకాలు చదివినా మరణశిక్ష లేదా జైలు శిక్ష ఖాయం.
* ఇతరులు తమ దేశంలోకి రావడం వల్ల అక్కడి విషయాలు బయటికి తెలుస్తాయనే కారణంతో పర్యటకుల మీద కూడా ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. ప్రభుత్వం నియమించిన మెండరు ఎప్పుడూ పర్యటకుల వెంటే ఉంటూ వారిని నిరంతరం గమనిస్తుంటాడు. ఆఖరికి వాళ్లు బస చేసిన హోటల్లో కూడా ఒంటరిగా వదలడు. పర్యటకుల దగ్గర పుస్తకాలూ సంగీత పరికరాలూ ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలేవైనా ఉన్నాయేమో అని బాగా తనిఖీ చేసి తమకు ఇబ్బంది లేదు అనుకున్నవాటిని మాత్రం ఉంచుకోనిస్తారు.
* ఉత్తర కొరియాలో గూగుల్‌ ఫేస్‌బుక్‌లాంటివి ఏవీ రావు. ఆ దేశానికే ప్రత్యేకమైన ఓ ఇంటర్నెట్‌ వ్యవస్థ ఉంది. 28వెబ్‌సైట్లు మాత్రమే ఉంటాయి. ఎవరైనా కంప్యూటర్‌ కొనుక్కోవాలన్నా ప్రభుత్వం అనుమతి
తీసుకోవాల్సిందే. అది కొనడం కూడా అక్కడి ప్రజల ఆర్థికస్థితికి చాలా కష్టమైన పని.
* ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లడం తీవ్రమైన నేరం. కానీ పేదరికాన్నీ ప్రభుత్వ అరాచకాలనూ భరించలేక ఏటా వేలమంది సరిహద్దు దేశాలైన చైనాకూ దక్షిణ కొరియాకూ పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా పారిపోయేటపుడు దొరికినవాళ్లు ఎంతోమంది ప్రస్తుతం లేబర్‌ క్యాంపుల్లో మగ్గుతున్నారు. ఎవరైనా అలా దొరక్కుండా దేశం దాటిపోతే వాళ్ల కుటుంబ సభ్యులకు శిక్ష విధిస్తారు.
* దైవ పార్థనలు చెయ్యడం, బైబిల్‌ చదవడం కూడా ఉత్తర కొరియాలో చట్ట వ్యతిరేకమే. సొంతానికి బైబిల్‌ కలిగి ఉన్నా మరణ శిక్ష తప్పదట. ఆ దేశంలో నీలి రంగు జీన్స్‌ వేసుకోవడమూ నేరమే.
* అన్నట్లూ అక్కడ ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా, ఉత్తర కొరియా రాజధాని ‘ప్యోంగ్‌యాంగ్‌’లో నివసించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.

వాళ్లే దేవుళ్లు
వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ పెద్ద సైజు కిమ్‌ల బొమ్మలు కనిపిస్తాయి. ప్రజలు ఆ విగ్రహాల ముందు నుంచి వెళ్లిన ప్రతిసారీ తప్పనిసరిగా వంగి నమస్కరించాలి. ప్రతి ఇంట్లోనూ ఆఖరికి హోటళ్లలో కూడా కిమ్‌ల ఫొటోలు ఉండాల్సిందే.
* కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మృతదేహాన్ని ఇప్పటికీ పాడవకుండా భద్రపరిచారు. అద్దాల గదిలో ఉన్న దాన్ని చూసేందుకు పర్యటకులకీ అనుమతి ఉంది. కాకపోతే అక్కడికెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ పార్థివ దేహం దగ్గరా వంగి నమస్కరించాలన్నది నిబంధన.
* అందరూ చొక్కాపై కిమ్‌ ఉన్‌ తాత లేదా తండ్రి బ్యాడ్జిలను కచ్చితంగా ధరించాలి. ఆ బ్యాడ్జి లేకుండా ఇల్లు దాటితే శిక్షే.

బతుకంతా చీకటే...
చిత్రం ఏంటంటే ఈ దేశంలో ఏటా ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాల్సిందే. మరైతే దుర్మార్గుడైన కిమ్‌ని దించేసి కొత్త నాయకుడిని ఎన్నుకోవచ్చుగా అనుకోవచ్చు. కానీ ఆ అవకాశం ప్రజలకు ఉండదు. ఎందుకంటే బ్యాలెట్‌ పత్రాలపైన ప్రభుత్వం ఎంపిక చేసిన ఒకే వ్యక్తి పేరు ఉంటుంది. అతడికే ఓటు వెయ్యాలి.
* నిషేధిత మత్తుమందులూ ఔషధాలూ సిగరెట్లూ నకిలీ అమెరికన్‌ డాలర్లను జపాన్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చెయ్యడం, పేలుడు పదార్థాలూ తుపాకులూ క్షిపణుల్లాంటివాటిని తీవ్రవాదులకు అమ్మడమే ఉత్తర కొరియా ఆదాయ మార్గం. ఈమధ్య ఆ మార్గాలు మూసుకుపోతుండడంతో లక్షమందికి పైగా పౌరుల్ని ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు పంపించారు. వాళ్లు ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతం మొత్తం ప్రభుత్వానికి పంపాలి. వారి ఖర్చులకోసం తిరిగి కొంత డబ్బు ఇస్తారు.
ఈరోజుల్లోనూ ఓ దేశ ప్రజలందరూ ఇంత నియంతృత్వ పాలనలో మగ్గుతున్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.