close

ఈ బెలూన్లు తింటారోచ్‌!

పుట్టినరోజు, పెళ్లిరోజు... వంటి వేడుకల్లో హాలంతా అలంకరించిన బెలూన్లను చూసి ఆనందించేవాళ్లు కొందరయితే, వాటితో హాయిగా ఆడుకోవాలనుకునేవాళ్లు ఇంకొందరు. సరదాగా పగలగొట్టీ ఆనందించేవాళ్లూ లేకపోలేదు. కానీ ఈ బెలూన్లు కనిపిస్తే వాళ్లూ వీళ్లూ అన్న తేడా లేకుండా అంతా నోట్లోనే పెట్టుకుంటారు. ఇవి తినే బెలూన్లు మరి..!

లేచింది మొదలు... పడుకునేవరకూ ఎన్నో తింటుంటాం. ఆరోగ్యం కోసం తినేవి కొన్నయితే, ఇష్టంగా తినేవి మరికొన్ని. ఈ రెండూ కాకుండా ఈమధ్య కేవలం సరదాకోసం తినేవీ వస్తున్నాయి. ఈ తినే బెలూన్లు ఆ కోవకే చెందుతాయి. వీటిల్లో రెండు రకాలున్నాయి. హీలియం గ్యాస్‌తో నింపిన బెలూన్లను దారంతో కట్టి తినడానికి ఇచ్చేవి ఒక రకమైతే, కాస్త చిన్నసైజులో రంగురంగుల బెలూన్లను చేసి కేకులమీద అందంగా అలంకరించుకుని చప్పరించేవి మరోరకం. అయితే బెలూన్‌ ఏదయినాగానీ చేసేది మాత్రం జెలాటిన్‌, చక్కెరలతోనే.

కొన్ని థీమ్‌డ్‌ రెస్టరెంట్లలోనూ పార్టీల్లోనూ ప్రత్యేకంగా సర్వ్‌ చేస్తోన్న ఈ హీలియం బెలూన్‌ డెజర్ట్‌ను టేస్ట్‌ చేయడం పాశ్చాత్య దేశాల్లో క్రేజీగా మారింది. అమెరికాలో మొదలైన ఈ ట్రెండ్‌, సింగపూర్‌కీ అక్కడి నుంచి మెల్లమెల్లగా మన మెట్రో నగరాలకీ వ్యాపిస్తోంది.

ఎలా చేస్తారు?
ఓ గిన్నెలో కాస్త జెలాటిన్‌, నీళ్లు పోసి కలుపుతారు. మరో గిన్నెలో పంచదార, కార్న్‌స్టార్చ్‌, మంచినీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి మరిగించి, జెలాటిన్‌ మిశ్రమాన్ని కలుపుతారు. తరవాత ఓ పాలీవినైల్‌ ట్యూబ్‌ తీసుకుని దాన్ని హీలియం సిలిండరుకి అనుసంధానిస్తారు. ట్యూబుకి మరో చివరి భాగాన్ని పంచదార మిశ్రమంలో ముంచి, గ్యాస్‌ బటన్‌ ఆన్‌ చేస్తే పంచదారపాకం పల్చని పొరలా సాగి గాలితో నిండి బెలూన్‌లా అవుతుంది (అచ్చంగా- సబ్బు నీళ్లలో బుడగలు ఊదినట్లన్నమాట). కావలసిన సైజు వచ్చాక గ్యాస్‌ బటన్‌ ఆఫ్‌ చేసి, బెలూన్‌ చివర భాగానికి దారాన్ని కట్టి ప్లేటుకి అతికిస్తే, అది గాల్లో ఎగురుతూ నోరూరిస్తుంటుంది. వీటిని అప్పటికప్పుడు తయారుచేసి అతిథులకి అందిస్తున్నారు. ఒకసారి దీన్ని నోట్లో పెట్టుకోగానే అది టప్‌మని పేలి, అందులోని గాలి అంతా బయటకు పోతుంది. కేవలం చక్కెర పాకం మాత్రం పెదాలకి కొంతా దారానికి కొంతా అతుక్కుంటుంది. అలా పేలిన బెలూన్‌ని ఎంచక్కా చŸప్పరించేస్తున్నారు.

కేకులమీద అలంకరించే రెండో రకం బెలూన్లనయితే నిజం బెలూన్ల సాయంతోనే తయారుచేస్తున్నారు. అదెలా అంటే - బెలూన్‌ని ఊది, దాని మూతిభాగంలో చిన్న పుల్ల లేదా చిన్న స్టిక్‌ను దూర్చి దారంతో కట్టేస్తారు. తరవాత జెలాటిన్‌లో కాసిని నీళ్లు, కోరిన రంగు వేసి కలిపి, ఆ మిశ్రమంలో బెలూన్‌ని ముంచి తీస్తారు. అది ఆరాక దారంతో కట్టిన ముడి దగ్గర జాగ్రత్తగా బెలూన్‌ని కత్తిరిస్తే గాలి కాస్తా పోయి లోపలున్న బెలూన్‌ బయటకు వచ్చేస్తుంది. జెలాటిన్‌ బుడగ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇలా అనేక బెలూన్లను తయారుచేసుకుని వీటిని కేకుమీద కోరినట్లుగా అతికించుకుని మరీ తినేస్తున్నారు. చూశారుగా మరి... ఇదండీ తినే బెలూన్ల సంగతి.?!

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.