close
జోడీ కుదిరె... ప్రకటన అదిరె

మూడు గంటలుండే సినిమా హిట్‌ అవ్వాలంటే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరాలి. అలాంటిది 30 సెకన్ల నిడివి ఉండే వాణిజ్య ప్రకటన హిట్‌ అవ్వాలంటే వారి మధ్య కెమిస్ట్రీ మరింతగా అదిరిపోవాలి. అందుకే ఇప్పటికే భార్యాభర్తలుగా ‘ఆర్గానిక్‌ కెమిస్ట్రీ’తో ఒక్కటైన జంటలవైపే మొగ్గుచూపుతున్నాయి కొన్ని బ్రాండ్‌లు. అలాంటి జంటలే ఇవి!

మొదటిసారి జోడీకట్టారు...

దీపికా పదుకునే, రణ్‌వీర్‌ సింగ్‌ బాలీవుడ్‌లో ఓ హిట్‌ జోడీ. ఈ జంట నటించిన ప్రతి సినిమా హిట్టే. విడివిడిగా బోలెడు వాణిజ్య ప్రకటనలు చేస్తోన్న వీరిద్దరూ పెళ్లి తర్వాతే మొదటిసారి ఓ యాడ్‌లో కలిసి నటించారు. ఏసీల తయారీ కంపెనీ లాయిడ్‌ ప్రకటనలో వీళ్లిద్దరూ దంపతుల్లానే కనిపించారు. కొత్తజంట మధ్య సహజంగా ఉండే సరాగాల్ని చక్కగా చూపించారు ఇందులో! సోషల్‌ మీడియాలో వీరిద్దరిదీ ఒక్క ఫొటో కనిపిస్తేనే లైకులమీద లైకులు కొట్టేసే అభిమానులు... ఈ ప్రకటనలో  నిమిషం పాటు కనిపించేసరికి ఊరకే ఉంటారా, ‘కూల్‌ కపుల్‌’ అని తెగ మెచ్చేసుకుంటున్నారు.

ప్రకటన కలిపింది ఇద్దరినీ...

విరాట్‌ కోహ్లికి అనుష్క పరిచయమైంది ఓ వాణిజ్య ప్రకటన ద్వారానే. 2013లో ‘క్లియర్‌’ షాంపూ ప్రకటనని వీరిద్దరూ చేశారు. అప్పటికే కోహ్లి టీమ్‌ ఇండియాలో కీలక ఆటగాడు. అనుష్క బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. ఆ తర్వాత కథ తెలిసిందే. ప్రేమలో ఉన్నపుడు మాన్యవర్‌-మోహే ప్రకటనలోనూ ఇద్దరూ కనిపించారు. అదే సంస్థకు పెళ్లి తర్వాతా చేశారు. ప్రస్తుతం గూగుల్‌ డువో, శ్యామ్‌ స్టీల్‌, మింత్రా... ఇలా చాలా ప్రకటనల్లో కనిపిస్తున్నారు. ఈ ప్రకటనలు చాలావరకూ వారి వ్యక్తిగత జీవితం గురించి తెలిపేలా ఉండటం గమనార్హం.

స్ఫూర్తి పాఠం

పెళ్లైన కొత్తలో ధోనీతో కలిసి భార్య సాక్షి టీవీఎస్‌ బైకు ప్రకటనలో కనిపించింది. తర్వాత ఇన్నాళ్లకు ఇద్దరూ కోల్గెట్‌ ప్రకటనలో దర్శనమిస్తున్నారు. 2015 ప్రపంచకప్‌ ప్రారంభానికి కేవలం వారం ముందు వాళ్లమ్మాయి జీవా పుట్టింది. ‘జీవా పుట్టినపుడు నేను పక్కనలేను. జట్టుతో ఉండాలని ఓ చిరునవ్వుతో సాక్షీకి అర్థమయ్యేలా చెప్పాను. పెదాలపై చిరునవ్వుతో బాధ్యతను స్వీకరించడమే అసలైన బలమంటే’ అంటాడు ధోనీ. 30 సెకన్ల ఆ ప్రకటన నేటి యువతకు ఓ స్ఫూర్తి పాఠం కూడా.

సినిమాకంటే ముందే!

పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించింది ఎప్పుడో తెలుసా..? అంటే, ‘మజిలీ’లో అని టక్కున చెప్పేస్తారు. కానీ వాళ్లు అంతకంటే ముందు వాణిజ్య ప్రకటనల్లో కలిసి నటించారు. ‘చైతూతో కలిసి బిగ్‌ బజార్‌ కమర్షియల్స్‌ చేయడం చాలా సరదా అనుభవం. ఈ ప్రకటన కూడా ఒక యువ జంట గురించి ఉంటుంది. కాబట్టి చేయడానికి అంగీకరించాం’ అని చెబుతుంది సమంత. ఈ యాడ్‌ సిరీస్‌లో నాలుగైదు ప్రకటనలు ఉంటాయి. వాటిని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చిత్రీకరించాడు. రెక్సోనా ప్రకటనలోనూ ఈ దంపతులు కనిపిస్తున్నారు.

ప్రకటనలకు బ్రేక్‌ లేదు...

టి స్నేహ... తమిళం, తెలుగు రెండుచోట్లా లోకల్‌ అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లినాటి నుంచీ భర్త ప్రసన్నతో కలిసి ప్రకటనల్లో కనిపిస్తోంది. కంఫర్ట్‌, ఆశీర్వాద్‌, కాంప్లాన్‌ ప్రకటనల్లో ఈ జంటను మనం చూడొచ్చు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకూ ఆరేడు ప్రకటనలకు పనిచేశారు. ‘సినిమాలకు పట్టినంత ఎక్కువ సమయం ప్రకటనలకు పట్టదు. అందుకే ప్రకటనల్లో నటిస్తూ వచ్చాను. మన జీవనశైలికీ, సంప్రదాయాలకూ అద్దంపట్టేలా ఉంటేనే ప్రకటనల్ని అంగీకరిస్తాం’ అని చెబుతుంది స్నేహ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.