close

పాటలు పాడే పర్సూ... ఫొటో తీసే లాకెట్టూ!

చెవికి పెట్టుకున్న పోగులతో ఫోన్‌ మాట్లాడేస్తే... మెడలో వేసుకున్న లాకెట్‌ ఆపదలో అయినవారికి సమాచారం అందిస్తే... చేతిలో పట్టుకున్న పర్సు స్పీకర్‌లా పనిచేస్తే... భలే ఉంటుంది కదా..! ఇవే కాదు, ఇలాంటి స్మార్ట్‌ ఫీచర్లతో ఉన్న ఆభరణాలూ యాక్సెసరీలూ మార్కెట్లోకి ఇంకెన్నో వస్తున్నాయి. వాటి సంగతేంటో చూద్దామా..?

కళ్లజోడే స్మార్ట్‌టీవీ!

చూపు సరిగాలేనపుడూ చల్లదనానికీ స్టైల్‌కోసమూ కళ్లజోళ్లు పెట్టుకోవడం సహజమే. అయితే, టెక్నాలజీ పుణ్యమా అని ఇపుడు ఆ కళ్లజోళ్లు ఏకంగా టీవీల్లానూ మారిపోతున్నాయి. అలాంటివే ‘హెచ్‌డీ మల్టీ మీడియా ప్లేయర్‌ వీడియో గ్లాసెస్‌’. ఈ కళ్లజోడునీ, దాంతో వచ్చే ఇయర్‌ ఫోన్లనూ పెట్టుకుని బటన్‌ నొక్కితే 52 అంగుళాల వర్చువల్‌ టీవీ తెర కంటిముందు ప్రత్యక్షమవుతుంది. ఇంకేముంది ప్రయాణాల్లో అయినా ఇంకెక్కడ ఉన్నా సినిమాలూ ఫొటోలూ వీడియోలను ఎంచక్కా చూసేయొచ్చు. నచ్చిన పుస్తకాలనూ చదువుకోవచ్చు, సంగీతాన్నీ వినొచ్చు.

బ్రేస్‌లెట్టూ చిందేస్తుంది

ఈ జీమియో బ్రేస్‌లెట్‌ని పెట్టుకుని పార్టీలకెళ్లి చిందేస్తే ఆ కిక్కే వేరు. బయట వినిపించే సంగీతానికి తగ్గట్లూ దీన్లోని ఎల్‌ఈడీలు ఓ రిథమ్‌లో వెలిగి ఆరిపోతుంటాయి మరి. అంతేకాదు, దీన్లోని సెన్సర్లు బయటి లైట్‌ని బట్టి కాంతిని పెంచడం తగ్గించడం చేస్తుంటాయి. ఇక, ఈ లైట్లు ఏయే రంగుల్లో ఎలాంటి డిజైన్‌లో వెలగాలో ఫోన్లోని ఆప్‌తో సెట్‌ చేసుకోవచ్చు. అలా డ్రెస్‌కి మ్యాచ్‌ అయ్యే రంగులోనూ బ్రేస్‌లెట్‌ మెరిసేలా మార్చుకోవచ్చు. బాగుంది కదూ..!

ఈ నగ అమ్మాయిలకు రక్ష!

ఆడపిల్లలు బయట అడుగుపెడితే ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ నుంచి అయినవారికి సమాచారం అందించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అలాంటపుడు మెడలో ఉన్న ఈ ‘షేర్‌మోర్‌’ లాకెట్‌ని వెంటవెంటనే తడితే మనం ప్రమాదంలో ఉన్నామని దగ్గరివారికి సమాచారం వెళ్లిపోతుంది. మనం ఉన్న లొకేషన్‌ని కూడా ఇది షేర్‌ చేస్తుంది. అందుకోసం చెయ్యాల్సిందల్లా ఈ లాకెట్‌ ఆప్‌ని ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని దగ్గరివారి ఫోన్‌ నంబర్లను ఫీడ్‌ చెయ్యడమే. ఇదేకాదు, షేర్‌మోర్‌ వల్ల మరిన్ని ఉపయోగాలూ ఉన్నాయి. ఫోన్‌ని దూరంగా పెట్టి ఎవరికివాళ్లు ఫొటో తీసుకోవాలంటే ఈ లాకెట్‌ని షేక్‌ చేస్తే ఫొటో క్లిక్‌మంటుంది. ఫోన్‌ బ్యాగులో ఉన్నా షేర్‌మోర్‌ లాకెట్‌ మెడలో ఉంటే వైబ్రేషన్‌ ద్వారా మనకి ఫోన్‌ వచ్చినా మెసేజ్‌ వచ్చినా తెలిసిపోతుంది. అన్నట్లూ షేర్‌మోర్‌ స్మార్ట్‌ జ్యువెలరీలో వేరు వేరు డిజైన్లున్న లాకెట్లతో పాటు, బ్రేస్‌లెట్లూ ఉంటాయి.

పోగులతోనే మాట్లాడేయొచ్చు

ఈ పోగుల్ని చూస్తే భలే ఫ్యాషన్‌గా ఉన్నాయి కదూ. పెరిఫెరి ఇంక్‌ కంపెనీ రూపొందించిన ఇవి చాలా స్మార్ట్‌ కూడా. లోపల మైక్రో ప్రాసెసర్‌, మైక్రోఫోన్‌, బ్యాటరీ కలిగి ఉన్న ఈ జుంకాలు మన వాయిస్‌ కమాండ్‌తో పనిచేస్తాయి. బ్లూటూత్‌లా పనిచేసే ఈ పోగుల్ని చెవికి పెట్టుకోవడం వల్ల ఫోన్‌ వచ్చినపుడు మనకు వినబడుతుంది. వెంటనే మనం ‘ఆన్‌’ అని చెప్పి ఎంచక్కా ఫోన్‌ మాట్లాడొచ్చు. అంతేకాదు, పనిలో ఉన్నా ఎవరికైనా మెసేజ్‌ పెట్టాలంటే నోటితో మెసేజ్‌లోని సారాంశం చెప్పి ఎవరికి పంపాలో చెబితే చాలు, మెసేజ్‌ వెళ్లిపోతుంది. ఇలాగే ఫోన్‌ చెయ్యొచ్చు, ఆప్‌లో క్యాబ్‌ కూడా బుక్‌ చెయ్యొచ్చు. అయితే, ఈ రెండు పోగుల్లో ఒక్కటే బ్లూటూత్‌లా పనిచేస్తుంది. మరొకటి మామూలు జుంకాలానే ఉంటుంది. అదండీ సంగతి... ఈ పోగులుంటే, మాటిమాటికీ ఫోన్‌ని చేత్తో పట్టుకునే పన్లేదు. పనిలో ఉన్నపుడు ఇయర్‌ ఫోన్‌, బ్లూటూత్‌లు చెవిలో నుంచి జారిపోతుంటే చిరాకుపడుతూ సరిచేసుకునే అవసరమూ ఉండదు.

లాకెట్టే కెమేరా...

పర్యటనలకు వెళ్లినా పెళ్లిలాంటి వేడుకలకు హాజరైనా ఆ విశేషాలను వీడియో తీసి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌లలో లైవ్‌లో ప్రసారం చెయ్యడం ఈమధ్య ఓ ట్రెండ్‌ అయిపోయింది. అలా అని అస్తమానం కెమేరా పట్టుకుని మనమే షూట్‌ చెయ్యాలంటే కష్టం. దీనికి పరిష్కారంగా వచ్చిందే ‘ఫ్రంట్‌రో’. చూడ్డానికి ఫంకీ లాకెట్‌లా ఉంటుంది కానీ నిజానికిది చిన్నసైజు స్మార్ట్‌ కెమేరాలాంటిది. ఈ లాకెట్‌కి ముందూ వెనకా కెమేరాలుంటాయి. అంతేకాదు, ఫ్రంట్‌రో స్మార్ట్‌ తెరమీద ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌ల లైవ్‌ స్ట్రీమింగ్‌తో పాటు ఇతర ఆప్షన్లూ కనిపిస్తాయి. మనం కావల్సినదాన్ని ఎంపిక చేసి, మెడలో ఉన్న లాకెట్‌తోనే మన ముందు జరుగుతున్నదాన్ని సోషల్‌ మీడియా వీక్షకులకి ప్రత్యక్ష ప్రసారంగా చూపించొచ్చు.

పెండెంటే రిమోట్‌..!

స్వరోవ్‌స్కీ రాళ్లు పొదిగి చూడచక్కగా ఉన్న ఈ ‘టొట్‌వూ లవ్‌ బ్లూమ్‌’ లాకెట్‌ అమ్మాయిల మెడలో ఉంటే ఆ అందమే వేరు. ఫోన్‌లోని ఆప్‌తో అనుసంధానం అయ్యే ఈ లాకెట్‌ ఉంటే సెల్‌ మనకి దూరంగా ఉన్నా, బ్యాగులో ఉన్నా దానికి ఫోన్లు వస్తే మనకి తెలియజేస్తుంది. ఆ సమయంలో లాకెట్‌ వైబ్రేట్‌ అవడంతో పాటు, స్వరోవ్‌స్కీ రాళ్ల వెనకున్న చిన్నసైజు ఎల్‌ఈడీలు వెలిగి ఆరిపోతుంటాయి. దాంతో రాళ్లు రంగురంగుల్లో మెరుస్తుంటాయి కూడా. ఇక ఫోన్‌ని దూరంగా పెట్టి ఫొటో తీసుకోవాలనుకుంటే ఈ లాకెట్‌ని రిమోట్‌ కంట్రోల్‌లా కూడా వాడొచ్చు. దీన్ని చిన్నగా తడితే ఫొటో క్లిక్‌ మంటుంది మరి. దీన్లో ఉండే యాక్టివిటీ ట్రాకింగ్‌ మోడ్‌ మనం ఎక్కువసేపు కూర్చున్న చోట్నుంచి కదలకుండా ఉంటే వెంటనే వైబ్రేట్‌ అయ్యి కాసేపు నడవమంటూ ఫోన్‌కి మెసేజ్‌ పంపుతుంది. అంతేకాదు, ప్రేమికులు ఇద్దరూ లవ్‌బ్లూమ్‌ లాకెట్‌ లేదా బ్రేస్‌లెట్‌ని పెట్టుకుంటే దూరంగా ఉన్నా మనసుతో మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే... ఈ లాకెట్‌ని తడితే ప్రియమైనవారికి వైబ్రేషన్‌ వెళ్తుంది. వారూ అలాగే తమ మనసుని వ్యక్తం చెయ్యొచ్చు. ఇక, ఛార్జింగ్‌ కోసం ఈ లాకెట్‌ని తీసి దాని బాక్సులో పెడితే చాలు. బాక్సుకేమో నెలకోసారి ఛార్జింగ్‌ పెట్టాలి. 

బ్యాగే ఫోనూ స్పీకర్‌!

‘ఎఫ్‌వైబీ స్మార్ట్‌’ హ్యాండ్‌బ్యాగ్‌ మనదగ్గర ఉంటే బ్యాగులోని విలువైన వస్తువులు పోతాయన్న భయమే అక్కర్లేదు. బ్లూటూత్‌ ద్వారా ఫోన్లోని ఆప్‌తో కనెక్ట్‌ అయ్యే ఈ బ్యాగుకి బయోమెట్రిక్‌ లాక్‌ ఉంటుంది. అంటే దీని జిప్‌ని తెరవాలంటే ఆప్‌లో రిజిస్టర్‌ చేసిన మన వేలి ముద్రను వెయ్యాల్సిందే. ఇక, ఈ బ్యాగులోని పాకెట్‌లో ఫోన్‌ పెడితే చాలు, దానంతటదే ఛార్జింగ్‌ అయిపోతుంది. అంటే బ్యాగు పవర్‌బ్యాంకులానూ పనిచేస్తుందన్నమాట. 
దీనికి ఇంకాస్త భిన్నమైందే ‘స్టెల్లె ఆడియో మినీ క్లచ్‌ స్పీకర్‌’. ఇదుంటే ఫోనొచ్చిన ప్రతిసారీ పర్సుని తెరిచి ఫోన్‌ తీసుకుని మాట్లాడే పనే ఉండదు. నేరుగా క్లచ్‌తోనే ఫోన్‌ మాట్లాడేసేయొచ్చు. బ్లూటూత్‌తో కనెక్ట్‌ అయ్యే ఈ పర్సు ముందు భాగంలో ఫోన్‌ని లిఫ్ట్‌ చెయ్యడానికీ స్పీకర్‌ని ఆన్‌ చెయ్యడానికీ శబ్దాన్ని పెంచడానికీ తగ్గించడానికీ బటన్లు ఉంటాయి. కాబట్టి, దీని స్పీకర్‌ ఆన్‌ చేసి సంగీతం కూడా వినొచ్చు. ఇది పార్టీలూ ఫంక్షన్లకు తీసుకెళ్లడానికీ బాగుంటుంది కదూ..! 

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.