close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విరాట్‌ వికెట్‌తో ధైర్యం వచ్చింది!

ఏ తరహా పిచ్‌ అయినా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఏ ఫార్మాట్‌లో అయినా వికెట్లు తీయగల బౌలర్‌... జస్‌ప్రీత్‌ బుమ్రా. స్వల్ప వ్యవధిలోనే భారతజట్టు బౌలింగ్‌ బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నాడు. తన క్రికెట్‌ ప్రస్థానం గురించి ‘బూమ్‌’ ఏం చెబుతున్నాడంటే!

నేను పుట్టి పెరిగింది అహ్మదాబాద్‌లో. నాకు ఏడేళ్లపుడే నాన్న చనిపోయారు. దాంతో ఇంటి బాధ్యత అమ్మ(దల్జీత్‌) మీద పడింది. అమ్మ టీచర్‌. అమ్మ పనిచేసిన స్కూల్లో చదివేవాణ్ని. అమ్మ, అక్క జుహికా, నేను... ముగ్గురిమే ఇంట్లో. అందరిలా నేనూ గల్లీ క్రికెట్‌తో మొదలుపెట్టాను. కానీ క్రమంగా క్రికెట్‌, బౌలింగ్‌లమీద ఇష్టం ఏర్పడింది. నా బంతులకి బెయిల్స్‌, స్టంప్స్‌ ఎగురుతుంటే ఎంతో మజా అనిపిస్తుంది. అమ్మ అహ్మదాబాద్‌లోనే ‘నిర్మాణ్‌ హైస్కూల్‌’లోని నర్సరీ విభాగానికి ప్రిన్సిపల్‌గా వెళ్లడంతో నేను కూడా అదే స్కూల్‌కి మారాను. ఆ స్కూల్‌ అండర్‌-14 జట్టుకి ఆడాను. ఉదయం సాయంత్రం క్రికెట్‌, మధ్యలో స్కూల్‌... ఇదీ నా షెడ్యూల్‌. నేను ఫాస్ట్‌ బౌలర్‌ని. ‘అందరితో సమానమైన వేగంతో కాకుండా అందరికంటే వేగంగా బంతి విసరాలి’ అని లక్ష్యం పెట్టుకున్నాను. అందుకే వకార్‌ యూనస్‌, వసీం అక్రమ్‌, అలెన్‌ డొనాల్డ్‌, బ్రెట్‌లీ, షోయబ్‌ అక్తర్‌ల బౌలింగ్‌ని టీవీలో ఎక్కువగా చూస్తూ అనుకరించేవాణ్ని. అందరూ యార్కర్లు వేసి వికెట్లు తీసేవాళ్లు. దాంతో నేనూ యార్కర్లు ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాను. మొదట్లో టెన్నిస్‌ బాల్‌, రబ్బరు బాల్‌ క్రికెట్‌ ఆడేవాణ్ని. యార్కర్‌ వేయాలంటే బంతిని చాలా బలంగా విసరాలి. అయినా శక్తినంతా కూడదీసుకుని వేసేవాణ్ని. మా ఇంటికి పెద్ద హాల్‌ ఉండేది. వేసవికాలం మధ్యాహ్నం పూట అక్కడే నా ప్రాక్టీసు. గోడ మీద వికెట్లు గీసి అంచున బంతి పడేలా యార్కర్లు వేసేవాణ్ని. 16 ఏళ్లు వచ్చినపుడు క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకుంటానని అమ్మతో చెప్పాను. ‘స్పోర్ట్స్‌లో సక్సెస్‌ రేట్‌ తక్కువ. డిగ్రీ వరకూ చదువు. ఆలోపు క్రికెట్‌లో అవకాశం వస్తే సరే, లేకపోతే ఏదో ఉద్యోగం చేద్దువు’ అంది. నాకుమాత్రం నామీద నమ్మకం ఉండేది. ప్లస్‌టూ తర్వాత చదువు గురించి ఆలోచించలేదు. రాష్ట్ర అండర్‌-16 జట్టుకి ఎంపికైనపుడు నైకీ షూస్‌ కొనమని అడిగితే ‘అంత డబ్బు ఎక్కడిది మనకి’ అని దిగాలుగా చెప్పింది అమ్మ. ‘ఏం బాధపడకు, నేనే ఏదో ఒక రోజు కొనుక్కుంటాలే’ అని చెప్పాను. అప్పుడే లీగ్‌లు ఆడితే డబ్బు వచ్చేది. ఆ మొత్తాన్ని అమ్మకు ఇచ్చేవాణ్ని. ఇప్పటికీ నా ఆర్థిక వ్యవహారాలు అమ్మే చూసుకుంటుంది.

యాక్షన్‌పైన ఎన్నో సలహాలు...
చిన్నపుడు టీవీలో క్రికెట్‌ చూస్తూ ఒక్కో సిరీస్‌ తర్వాత ఒక్కో బౌలర్‌ని అనుకరించేవాణ్ని. ఎప్పటికప్పుడు నా బౌలింగ్‌ యాక్షన్‌ మారిపోయేది. పన్నెండేళ్లు వచ్చినప్పట్నుంచీ ఇప్పుడున్న యాక్షన్‌ స్థిరపడింది. చాలామంది ఇది మంచి యాక్షన్‌ కాదనేవారు.
ఇంకొందరు మాత్రం సహజంగా వచ్చిన యాక్షన్‌ కొనసాగించడమే మేలన్నారు. చివరకు గుజరాత్‌ అండర్‌-16 జట్టుకి ఎంపికయ్యాక ఎం.ఆర్‌.ఎఫ్‌. ఫౌండేషన్‌కి పంపించి డెన్నిస్‌ లిల్లీ, మెక్‌గ్రాత్‌ల అభిప్రాయం తీసుకుంటే యాక్షన్‌ని కొనసాగించవచ్చని చెప్పారు.
పదహారేళ్లపుడే ఓసారి అండర్‌-19 గుజరాత్‌ జట్టు క్యాంప్‌కి వెళ్లాను. అనుకోకుండా అప్పుడే నాకు జట్టులో స్థానం దొరికింది. నిజానికి రాష్ట్ర అండర్‌-16 జట్టుకి బాగా ఆడినా నాకు మొదట అండర్‌-19 జట్టులో స్థానం దొరకలేదు. ఓ కీలక మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసినా నా ప్రతిభను గుర్తించకపోయేసరికి బాధపడ్డాను. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాను. ‘అందుకే చదువుని నిర్లక్ష్యం చెయ్యొద్దనేది’ అని ఓదార్పుగా చెప్పింది. తర్వాత స్వల్ప వ్యవధిలోనే గుజరాత్‌ అండర్‌-19 జట్టుకి ఎంపికయ్యాను. అండర్‌-19 క్యాంప్‌కి వెళ్లానని చెప్పాను కదా, అక్కడ ప్రాక్టీసులో నేను వేసిన యార్కర్‌ జట్టులో ఓ బౌలర్‌ బొటనవేలికి తగిలి గాయమైంది. దాంతో అతడి స్థానంలో నాకు చోటు వచ్చింది. తర్వాత రెండేళ్లపాటు అండర్‌-19కి ఆడాను. అది... మార్చి 18, 2013. అహ్మదాబాద్‌లోని మొతేరా మైదానం... సయ్యద్‌ ముస్తక్‌ అహ్మద్‌ ట్వంటీ20 టోర్నీ, ముంబయి-సౌరాష్ట్రల మధ్య మ్యాచ్‌. ఆ మ్యాచ్‌ చూడ్డానికి ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ జాన్‌రైట్‌ వచ్చారు. ఆఖరి ఓవర్లలో నా యార్కర్లకు ముంబయి బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడటాన్ని చూశారు. నిజానికి మ్యాచ్‌లో నాకు వికెట్లు రాలేదు. ఆ తర్వాత మ్యాచ్‌లోనూ నా బౌలింగ్‌ చూసిన జాన్‌రైట్‌... అప్పటి మా(సౌరాష్ట్ర) జట్టు కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ దగ్గర నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. నాతోమాత్రం ఏం మాట్లాడలేదు. రెండ్రోజుల తర్వాత ముంబయి ఇండియన్స్‌ ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నువ్వు ముంబయి ఇండియన్స్‌ జట్టుకి ఆడతావా’ అన్నది అవతల వ్యక్తి అడిగిన ప్రశ్న. ‘తప్పకుండా’ అని చెప్పాను. అమ్మకి చెబితే చాలా సంతోషించింది. అలా ముంబయి ఇండియన్స్‌ జట్టులో 2013లో చేరి అదే సీజన్లో మొదటి మ్యాచ్‌నీ ఆడాను.

అదే మలుపు...
ఐపీఎల్‌లో ముంబయి జట్టు ఆటగాడిగా సచిన్‌, పాంటింగ్‌, మలింగా, మిచెల్‌ జాన్సన్‌ లాంటి దిగ్గజాలతో డ్రెసింగ్‌ రూమ్‌ పంచుకున్నాను. జట్టులో చేరిన కొద్దిరోజులకే బెంగళూరుతో మ్యాచ్‌ ఆడాను. వర్షం పడి ఔట్‌ఫీల్డ్‌ కాస్త తడిగా ఉండటంతో నా కాళ్లు జారుతున్నాయి. ఆ మ్యాచ్‌లో మొదట నాలుగు బంతుల్లో మూడింటిని విరాట్‌ కోహ్లి బౌండరీకి పంపాడు. ఆ టైమ్‌లో నా పరిస్థితిని అర్థం చేసుకున్న సచిన్‌... దగ్గరకి వచ్చి ‘ఒక్క మంచి బాల్‌ మ్యాచ్‌నే మార్చేస్తుంది. ప్రయత్నించు’ అన్నాడు. ఆ తర్వాత బంతికి విరాట్‌ వికెట్‌ తీశాను. దాంతో నాకు ధైర్యం వచ్చింది. ఆరోజు మొత్తం మూడు వికెట్లు తీశాను. ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయినా నాకది మర్చిపోలేని అనుభవం. ‘బ్యాట్స్‌మన్‌ పేరు చూసి ఎప్పుడూ భయపడకు. అతడో బ్యాట్స్‌మన్‌ అన్నంతవరకే ఆలోచించు’ అని అప్పుడు సచిన్‌ ఇచ్చిన సూచనని ఇప్పటికీ పాటిస్తాను. ఆ మ్యాచ్‌లో మలింగా ఆడలేదు. తర్వాత మ్యాచ్‌కి జట్టుతో కలిశాడు. పరిచయం చేసుకున్నాక, ‘నీ ఆట చూశాను. నీకు సాయంగా ఉంటాను’ అన్నాడు. హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మలింగా యార్కర్లకి అప్పటికే మంచి గుర్తింపు ఉంది. నా బలమూ యార్కర్లే. యార్కర్లు ఏ టైమ్‌లో వేయాలీ, ఏ బ్యాట్స్‌మన్‌కి ఎక్కడ వేయాలీ లాంటి అంశాల్ని నాతో పంచుకున్నాడు. మొదట్లో బ్యాట్స్‌మన్‌ని స్లెడ్జింగ్‌ చేసేవాణ్ని. కానీ మలింగా ఇచ్చిన సలహాతో ఆ అలవాటుని మార్చుకున్నాను. ‘మనం ఎంత శాంతంగా ఉంటే బంతిమీద అంతబాగా దృష్టిపెట్టగలం. అనవసరమైన ఆలోచనలు బుర్రలోకి వెళ్తే, బంతిని అనుకున్నట్టు వేయలేం’ అని చెప్పాడు. మలింగాకి చాలా సిగ్గు. కొత్త వాళ్లతో అంత వేగంగా కలవలేడు. అయినా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ నా ఎదుగుదలకు చాలా సాయపడ్డాడు. 2015లో ఫిట్‌నెస్‌కోసం ఫుట్‌బాల్‌ ఆడుతుండగా కాలికి గాయమైంది. తగ్గడానికి ఎన్నాళ్లు పడుతుందో అనుకున్నాను. కానీ నన్ను జాగ్రత్తగా చూసుకుని మంచి చికిత్స ఇవ్వడంతో నాలుగు నెలల్లో తిరిగి ప్రాక్టీసుకి వచ్చాను. ఆ సమయంలో బాండ్‌ నా చికిత్సని పర్యవేక్షించేవాడు.
ఏ మ్యాచ్‌కైనా నేను ప్రత్యేకంగా సిద్ధమయ్యేవాణ్ని కాదు. బంతి చేతికి వచ్చాక అక్కడికక్కడే ఆలోచించి బౌలింగ్‌ చేసేవాణ్ని. బాండ్‌ మాత్రం ‘ప్రత్యర్థి జట్టులోని ప్రతి బ్యాట్స్‌మన్‌నీ ఔట్‌ చేయడానికి నీకంటూ ఒక ప్లాన్‌ ఉండాలి’ అని చెప్పాడు.
అప్పట్నుంచీ నా ప్రిపరేషన్‌ పద్ధతి మార్చుకుని టీమ్‌నిబట్టి ప్లాన్‌ చేయడం మొదలుపెట్టాను.

టెస్టులు ఆడతాననుకోలే!
జాతీయ జట్టుకి ఆడాలన్నదే నా అంతిమ లక్ష్యం. ఐపీఎల్‌ తర్వాత ఇండియా-ఎకి రెండేళ్లు ఆడాను. 2015లో రంజీల్లో రాణించాను. ఆ సంవత్సరం ముస్తక్‌ అలీ(టీ20), విజయ్‌ హజారే(వన్డే) ట్రోఫీల్ని గుజరాత్‌ గెలిచింది. అందులో నా పాత్ర కూడా ఉండటంతో 2016 జనవరిలో టీమ్‌ ఇండియాకి ఎంపికయ్యాను. ఆస్ట్రేలియాతో సిరీస్‌. దిల్లీ నుంచి సిడ్నీకి డైరెక్ట్‌ ఫ్లైట్‌లో వెళ్లాను. అక్కడ దిగాక ప్రాక్టీసు కూడా చేయలేదు. అప్పటికి రవిశాస్త్రి టీమ్‌ డైరెక్టర్‌. ‘రెడీగా ఉన్నావా’ అంటే ఊకొట్టాను. లేనని ఎలా చెప్పగలను. ‘అయితే మ్యాచ్‌కి సిద్ధంగా ఉండు’ అన్నారు. నిజానికి నన్ను టీ20 సిరీస్‌కి ఎంపిక చేశారు. వన్డే జట్టులో లేను. నేను వెళ్లేసరికి భువనేశ్వర్‌కి గాయం కావడంతో వన్డే జట్టులో ఆడించారు. ఆ మ్యాచ్‌లో గెలిచాం. కానీ అప్పటికే నాలుగు వన్డేలు ఓడిపోయాం. ఆరోజు నేనెలా ఆడాలో చెబుతారేమోనని చాలాసేపు చూశాను. కానీ ఎవరూ ఏమీ చెప్పలేదు. చివరికి నా చేతికి బంతి ఇచ్చి ‘నీకు ఎలా అనిపిస్తే అలా వేయి’ అని చెప్పాడు ధోనీ. అంతే, మరో రంజీ మ్యాచ్‌ అనుకుని బౌలింగ్‌ వేయడం మొదలుపెట్టాను. ఆరోజు రెండు వికెట్లు తీశాను. తర్వాత జరిగిన టీ20ల్లో మన జట్టు ఆస్ట్రేలియాని 3-0తో ఓడించింది. నాకు టెస్టు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అదే కష్టమైన ఫార్మాట్‌ కూడా. నేను టెస్టుల్లో ఆడగలనా అన్న సందేహం చాన్నాళ్లు వెంటాడేది. చివరకు 2018 జనవరిలో టెస్టులకి ఎంపికయ్యాను. ఇప్పుడు మూడు ఫార్మాట్‌లలో జట్టుకి ఆడటం చాలా సంతృప్తిగా ఉంది. జట్టులోని బౌలర్లందరం ఒక యూనిట్‌గా పనిచేస్తూ మా ఆలోచనల్ని పంచుకుంటూ బౌలింగ్‌ కొనసాగిస్తాం.
దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. విండీస్‌మీద హ్యాట్రిక్‌ వికెట్లు తీయడం చాలా ప్రత్యేకం. ఈ సిరీస్‌ నాకు చాలా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది.
టీమ్‌ ఇండియాకి అనే కాదు, ఏ జట్టుకి ఆడినా ఒత్తిడిగా ఫీలవ్వను. వేయాల్సిన ఓవర్‌ గురించి ఆలోచిస్తాను. గెలుపోటముల గురించి అతిగా ఆలోచించను. అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభించి మూడున్నరేళ్లే అవుతోంది. నేనింకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.
అందుకోసం ఎంతయినా శ్రమిస్తాను. 


స్విచ్ఛాఫ్‌ అయిపోతా...

ఆటవిడుపు కోసం ప్లే స్టేషన్‌లో ఫిఫా ఆడతాను. టీమ్‌ ఇండియాలో దాదాపు అందరూ ప్లే స్టేషన్‌ ఆడతారు. వాళ్లమీద గెలవడం కష్టం కానీ, నా ఫ్రెండ్స్‌ని మాత్రం ఓడించేస్తాను.
* ముంబయి ఇండియన్స్‌ జట్టులో చేరినపుడు మిచెల్‌ జాన్సన్‌ నాకు షూస్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది ఎప్పటికీ మర్చిపోలేను.  తను నా ఆరాధ్య క్రికెటర్లలో ఒకడు.
* జిమ్‌లో, ప్రాక్టీసులో, డైట్‌లో ఎక్కడా నన్ను మోసం చేసుకోను. ట్రైనర్లు చెప్పినట్లు కష్టపడతాను.  మానసిక ప్రశాంతత కోసం యోగా చేస్తాను.
* క్రికెట్‌ కోసం నిత్యం ప్రయాణాల్లోనే ఉంటాను. అప్పుడు టైమ్‌ దొరికితే నెట్‌ఫ్లిక్స్‌ చూస్తాను. సంగీతం ఎక్కువగా వింటాను. ఫోన్‌, హెడ్‌ ఫోన్స్‌ నా దగ్గర ఎప్పుడూ ఉండాల్సిందే!
* ఎక్కువగా చదివిన పుస్తకం ‘ఐ యామ్‌ ఫుట్‌బాల్‌: జ్లతాన్‌ ఇబ్రహిమోవిచ్‌’.
* క్రికెట్‌ ఆడకపోతే స్నేహితులూ, కుటుంబ సభ్యులతోనే గడుపుతాను. ఆట గురించి అస్సలు చర్చించను. ఒకరకంగా స్విచ్ఛాఫ్‌ అయిపోతా. గెలుపోటములతో సంబంధంలేకుండా సాధారణంగా ఉండగలిగేది వాళ్లతో మాత్రమే.
* అభిమానులు ‘బూమ్‌’ అనీ, ఇంట్లో జస్ప్రీ, స్నేహితులు జేబీ అనీ పిలుస్తారు.

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.