close

హెచ్చరికో హెచ్చరిక..!

భూతాపం పెరిగిపోతోంది!

ఆ మధ్య భోపాల్‌లో ఓ కప్పల జంటకి విడాకులు ఇప్పించారు ఊరి వాళ్లు. రెండు నెలల క్రితం వాటికి పెళ్లి చేసిందీ వాళ్లే. వానలు కురవలేదని పెళ్లిచేసి, ఆ తర్వాత ముంచుకొచ్చిన వరదలు తగ్గాలని విడాకులు ఇప్పించారు. పల్లెప్రజల మూఢనమ్మకాన్ని పక్కన పెడితే అసలీ వాతావరణం ఎందుకిలా మారింది? అయితే అనావృష్టి... లేదంటే కుంభవృష్టి... తరచూ తుపానులు... కాకుంటే భూకంపాలు... కబళిస్తున్న కార్చిచ్చులు... బద్దలవుతున్న అగ్నిపర్వతాలు... ఏటికేడూ ప్రకృతి విలయం ఎన్నో రెట్లు పెరుగుతోంది. పెరుగుతున్న భూతాపమే దీనంతటికీ కారణమనీ, భూగర్భం కుతకుతా ఉడికిపోతోందనీ కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ హెచ్చరికల్ని ఎవరూ లెక్కచేయకపోవడంతో ఇప్పుడిక యువతరం గొంతు విప్పింది. ‘మా భవిష్యత్తును నాశనం చేసే హక్కు మీకెవరిచ్చా’రంటూ నిలదీస్తోంది.

‘బాగా చదువుకోమంటారు... భవిష్యత్తు గురించి బంగారు కలలు కనమంటారు... కానీ, ఉందో లేదో తెలియని భవిష్యత్తు గురించి కలలు కనడం ఎందుకు?’ వీధుల్లోకి వచ్చిన లక్షలాది పిల్లలు ముక్తకంఠంతో అడిగిన ప్రశ్న ఇది! వారికేం సమాధానం చెప్పాలో తెలియక దేశాధినేతలే తలలు దించుకున్నారు.

‘మీవన్నీ శుష్కవాగ్దానాలు... ఎన్నాళ్లని నమ్ముతాం? పాతికేళ్ల నుంచీ ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నా మాటలు తప్ప చేతలు లేవేం?’

అంటూ సూటిగా వారు నిలదీస్తే ‘అవును, మా తరం ఏమీ చేయలేకపోయింది...’ అంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి జరిగిన తప్పుకు బాధ్యతను తలకెత్తుకున్నారు.

వాతావరణ మార్పులపై గత కొద్దిరోజులుగా ప్రపంచమంతా అట్టుడికిపోతోంది. ఎన్నడూ లేని రీతిలో నూటపాతికకు పైగా దేశాల్లో ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ అంటూ సెప్టెంబరు 20న యువగళాలు నినదించాయి.

బడుల్లో కళాశాలల్లో చదువుకుంటున్న లక్షలాది పిల్లలూ బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న వేలాది యువతీ యువకులూ... ఈ ‘క్లైమేట్‌ స్ట్రైక్‌’లో పాల్గొన్నారు. ఉన్నది ఒకటే భూమి, దాన్ని కాపాడుకుందామంటూ నినదించారు.
ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకూ అన్ని దేశాల్లోనూ... దిల్లీ నుంచి హైదరాబాద్‌ వరకూ మన నగరాలన్నిటిలోనూ ఆ సమ్మె జరిగింది. బడుల్లో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డెక్కి నినదించే పరిస్థితి ఇప్పుడెందుకు వచ్చింది... ఏమిటీ వాతావరణ మార్పులు... వీటి వల్ల మన భవిష్యత్తుకు వచ్చిన
ప్రమాదమేమిటి... అంటే-

 

ఎండాకాలమే...
ఈ ఏడాది మనకి నైరుతి రుతుపవనాలు రావడం చాలా ఆలస్యమైంది. జూన్‌, జులైల్లో కూడా మండువేసవి వాతావరణం కొనసాగడంతో వాన చినుకు కోసం తపించిపోయాం. ఒకప్పుడు వానాకాలం నాలుగు నెలలూ సమంగా వర్షాలు పడేవి. దాంతో చెరువులూ నదులూ నిండేవి, పంటలు పండేవి.
ఇప్పుడేమో అసలు వానలు కురవవు, కురిస్తే వరదలే! రెండూ తట్టుకోలేని పరిస్థితులే. వరదలూ తుపానులూ భూకంపాలూ ఓ పక్క ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంటే, కార్చిచ్చులు లక్షలాది ఎకరాల అడవుల్నీ వాటిలోని వన్యప్రాణుల్నీ బూడిద చేస్తున్నాయి. ఒక దేశమని లేదు, ఒక ఖండమని లేదు. ఎప్పుడు ఎక్కడ ప్రకృతి ప్రకోపిస్తుందో తెలియని పరిస్థితి. మరో పక్క ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు గత ఐదేళ్లవేనని నిపుణులు లెక్క తేలిస్తే వచ్చే ఐదేళ్లూ కూడా ఉష్ణకాలమేనని డచ్‌ పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. పలు కారణాల వల్ల వాతావరణంలో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నందున
ఏడాదిలో మూడొంతులు ఎండాకాలమే ఉండే పరిస్థితి వస్తుందంటున్నారు. వేడిగా ఉంటే ఏసీలూ కూలర్లూ వేసుకుంటాం అంతే కదా... అనుకుంటే పొరపాటే. దానివల్ల అటు విద్యుత్‌ వినియోగమూ ఇటు గ్రీన్‌హౌస్‌ వాయువులూ పెరిగి భూతాపం ఇంకా ఎక్కువవుతుంది. అంటే, మరింత ఎండలు, మరిన్ని వరదలు.

ఊళ్లు మునిగిపోతాయి!
ఉష్ణోగ్రతలు పెరిగితే ధ్రువప్రాంతాల్లో మంచు శరవేగంగా కరుగుతుంది. అక్కడెక్కడో మంచు కరిగితే మనకేంటంటారా? అలా కరిగితే ఈ శతాబ్దాంతానికి సముద్ర మట్టం మీటరు వరకూ పెరగవచ్చని శాస్త్రవేత్తల అంచనా. అదే జరిగితే మాల్దీవులు, సీషెల్స్‌ లాంటి ఎన్నో దీవులు మునిగిపోతాయి. వియత్నాం, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో చాలాభాగం మునిగిపోతుంది. మనదేశంలోనూ తీరప్రాంతాల్లో నివసించేవారు కొంపాగోడూ వదులుకొని వలసవెళ్లాల్సిందే. దాదాపు వెయ్యికిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట ప్రభావితమయ్యేది నెల్లూరనీ, శ్రీకాకుళంలోనూ లోతట్టు ప్రాంతాలకూ, దివిసీమకూ ఇబ్బంది ఉంటుందనీ అంటారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి చెందిన చీఫ్‌ సైంటిస్ట్‌ జీపీఎస్‌ మూర్తి. సముద్రంలో పోటు వచ్చినప్పుడు అలలు ఎక్కడ దాకా వస్తున్నాయో అంతమేరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందట. ఇప్పటికే తమిళనాడులో కావేరీ డెల్టావద్ద సముద్రం ముందుకు రావడం వల్ల ఉప్పునీటి ప్రభావంతో తీరానికి కొంతదూరం వరకూ వరి పండే భూములు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొన్ని వందల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.
చేజేతులా పెంచుతున్నాం
భూమ్మీది వాతావరణం సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కుతుంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింపజేస్తుంది. ఇదే లేకపోతే భూమి చల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజంగా ఉండే ఈ గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌కి మనం చేసే పనులు మరింత వేడిని జతచేస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమల వల్ల మరిన్ని గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలై వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. వాతావరణ మార్పులనీ గ్లోబల్‌ వార్మింగ్‌ అనీ పేర్కొనేది దీన్నే. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ సహజంగా ఉంటే సమతౌల్యం చెడదు. కానీ పెట్రోలు ఉత్పత్తుల్ని వాడుతూ మరింత
కార్బన్‌డైఆక్సైడ్‌ని గాల్లోకి వదలడమే కాక మరో పక్క కార్బన్‌డైఆక్సైడ్‌ని పీల్చుకునే చెట్లను కొట్టేస్తూ ఉండడంవల్ల వాతావరణంలో అది బాగా ఎక్కువైపోతోంది. పారిశ్రామిక విప్లవం తర్వాత గాల్లో కార్బన్‌డైఆక్సైడ్‌ స్థాయులు 30 శాతమూ మీథేన్‌ 140 శాతమూ పెరిగాయట.

 

నూటపాతికేళ్లు!
వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్‌ పెరిగే కొద్దీ భూతాపం పెరుగుతుందనీ బొగ్గును మండించడం వల్ల గాలిలో కార్బన్‌డైఆక్సైడ్‌ పరిమాణం పెరుగుతుందనీ స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే అర్హీనియస్‌ చెప్పి నూట పాతికేళ్లయింది. పైన మండే సూర్యుడూ కింద చల్లని సముద్రాలూ ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న ప్రజలు దాన్ని లక్ష్యపెట్టలేదు. గనుల్ని తవ్విపోసుకోవడం, పరిశ్రమలను పెట్టి కాలుష్యాలను నదుల్లోకీ గాలిలోకీ వదలడం, విద్యుత్తు అవసరాలకోసం బొగ్గును మండించడం, అడవుల్ని కొట్టేయడం, సముద్రాల్ని చెత్తకుండీలుగా మార్చేయడం- ఒకటా రెండా... అన్నీ విధ్వంసక చర్యలే. భూమి మీద మనిషి ఎంత ప్రభావం చూపగలడో అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే జ్వరం వచ్చేసిందని కిందామీదా అయిపోతాం. మరి భూమి ఉష్ణోగ్రత పెరిగితే? గత కొంతకాలంగా అది పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ప్రకృతి సహజమైన కారణాలు కాక మనిషి చేపడుతున్న చర్యలే ఈ వేడిని పెంచుతున్నాయి. ఆ వేడికి భూమి లోలోపల జరుగుతున్న మార్పుల వల్ల భూకంపాలు వస్తున్నాయి. గత వందేళ్లలో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరిగితేనే పరిస్థితి ఇలా ఉంది కాబట్టే ఇప్పుడీ ఉద్యమాలు!

 

అడవి అంటే...
ఈ భూమి మీద బతికే వృక్ష, జంతుజాలంలో 80 శాతం అడవుల్లోనే ఉంటాయి. మూడింట ఒకవంతు మనుషులకూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అడవులే జీవనాధారం. చెట్లు వాతావరణాన్ని క్రమబద్ధం చేస్తాయి. అడవులు ఇచ్చే ఉత్పత్తులు లేకుండా మనకు రోజు గడవదు. అయినా సరే, ఆ అడవుల్ని కాపాడుకోలేకపోతున్నాం. కలపకీ సాగుకీ కొత్త ప్రాజెక్టులు కట్టడానికీ గనులను తవ్వుకోవడానికీ... ప్రతిదేశమూ ప్రతి రాష్ట్రమూ అడవుల్ని నరికేస్తూనే ఉంది. ఈ అడవుల విధ్వంసం ఇలాగే కొనసాగితే మరో 80 ఏళ్ల తర్వాత- అంటే మన మునిమనవళ్లు- అడవి అంటే ఏమిటో గూగుల్‌ ఫొటోల్లో చూడాల్సిందేనట. ఒక కారు 26వేల మైళ్లు తిరిగితే వెలువడే కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకోవడానికి ఎకరం దట్టమైన అడవిలో ఉన్న చెట్లకు ఏడాది పడుతుంది. అవే చెట్లు 18 మంది ఏడాది పాటు బతకడానికి అవసరమైన ప్రాణవాయువునీ విడుదల చేస్తాయి. ఈ లెక్కన లక్షల్లో ప్రజలు నివసించే నగరాలకు చాలినంత ప్రాణవాయువు కావాలంటే, మన పరిశ్రమలూ వాహనాలూ వదులుతున్న కార్బన్‌డైఆక్సైడ్‌ని పీల్చుకోవాలంటే ఎన్ని కోట్ల ఎకరాల అడవులు కావాలి!

 

బొగ్గు ‘మసి’ ఇంకెన్నాళ్లు?
‘ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి రెండువందల కోట్ల టన్నుల బొగ్గును కాలుస్తున్నాం. గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో కలిసి అది వాతావరణంలోకి ఏడు టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ని వదులుతోంది. అదంతా ఓ దుప్పటిలా కప్పేయడంతో భూమికి గాలి ఆడక ఉక్కిరిబిక్కిరవుతోంది. వేడెక్కిపోతోంది. ఇప్పుడిది ఒక డిగ్రీ అర డిగ్రీగానే కన్పిస్తున్నా భవిష్యత్తులో దాని ఫలితం తీవ్రంగా ఉండబోతోంది...’ సరిగ్గా 107 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌లోని ఓ వార్తాపత్రిక ప్రచురించిన వార్త ఇది. వందేళ్ల క్రితమే హెచ్చరికలూ మొదలైనా అవి మనని మార్చలేదనడానికి సాక్ష్యం- 2016లో ప్రపంచం వివిధ అవసరాలకోసం 530కోట్ల మెట్రిక్‌ టన్నుల బొగ్గుని తగలబెట్టడం. గత ఏడాది వాతావరణంలో ఎప్పుడూ లేనంతగా 407.8 పీపీఎం కార్బన్‌డైఆక్సైడ్‌ ఉంది. భూమి చరిత్రలోనే ఇది అత్యధికం. ఈ ఏడాది చివరికి అది 410కి చేరుతుందని అంచనా. ఇతర దేశాలన్నీ బొగ్గు వాడకాన్ని బాగా తగ్గించేస్తే భారత్‌, చైనాల్లో మాత్రం బొగ్గు గనుల తవ్వకమూ వాడకమూ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

తప్పెవరిదైనా...
వాతావరణ మార్పులకీ పర్యావరణ విధ్వంసానికీ కారకులెవరైనా శిక్ష మాత్రం అందరూ అనుభవించాల్సిందే. ఆ పాపంలో పెద్ద వాటా అమెరికాదైనా చైనాదైనా పర్యవసానాల ప్రభావం మాత్రం భూమిమీద ఉన్న అన్నిదేశాల మీదా పడుతుంది. ఈ శతాబ్దాంతానికి భూతాపం గరిష్ఠంగా 2.6-4.8 డిగ్రీలు
పెరగవచ్చని అంచనా. దాన్ని కనీసం 1.5 డిగ్రీలు దాటకుండా చూడగలిగితేనే పర్యావరణ దుష్ప్రభావాలను అడ్డుకోవడంలో కొంతమేరకైనా విజయం సాధించగలమంటున్నారు నిపుణులు. ఆ దిశగా కృషి చేసేందుకే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం, ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై అంతర్‌ప్రభుత్వ సంఘం ఏర్పాటైంది. వివిధ దేశాలకు చెందిన వేలాది శాస్త్రవేత్తలూ నిపుణులూ దీనికి స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు.

 

మనుగడకే ముప్పు
ఈ శతాబ్దంలో మనిషి మనుగడకి అన్నిటికన్నా పెద్ద ముప్పు వాతావరణ మార్పులవల్లే సంభవిస్తుందని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక తేల్చిచెప్పింది. దాని ప్రకారం...
* రుతుచక్రమూ కాలాలూ మారిపోతాయి. ఫలితంగా ఎన్నో ప్రాణులు అంతరించిపోతాయి. ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా చాలు ఇప్పుడు మనం పండిస్తున్న చాలా పంటలు పండవు.
ప్రకృతి విపత్తులు తీవ్రమై కరవు రాజ్యమేలుతుంది. గత 50 ఏళ్లలోనే కరవు తీవ్రత రెట్టింపైంది.
* వ్యవసాయమూ దాని అనుబంధ పరిశ్రమల దిగుబడీ తగ్గడంతో వలసలు పెరిగి వాతావరణ శరణార్థులు తయారవుతారు. ఇప్పటికే సెకనుకు ఒకరు చొప్పున తాము నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నారనీ ఇప్పుడు రెండు కోట్లు ఉన్న వీరి సంఖ్య 2050కి ఇరవై కోట్లకు చేరుతుందనీ అంచనా.
* తాగునీరూ గాలీ కలుషితమై ఇన్‌ఫెక్షన్లూ, గుండెజబ్బులూ, శ్వాససమస్యలూ ఎక్కువవుతాయి.
* ఆఖరికి మనిషి మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. మనం మండే ఎండల్నీ ముంచే వరదల్నే చూస్తున్నాం. కొన్ని దేశాలు చీటికీ మాటికీ ఎగసిపడే తుపానుల్నీ మరికొన్ని దేశాలు తరచూ కంపించే భూమినీ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాయి! అందుకే ‘మా భవిష్యత్తేమిటీ’ అని పిల్లలు నిలదీస్తున్నారు. వారికి మన చేతలతో సమాధానం చెప్పాల్సిన సమయం ఇది!

*

ఏడేళ్ల ఇషా అమెరికాలో చదువుకుంటోంది. ‘ఒక్క చెట్టు ఇచ్చే ఆక్సిజన్‌తో ఆరుగురు బతకొచ్చు’ అని టీచరు చెప్పిన పాఠం విన్నప్పట్నుంచీ ఆ చిన్నారి చెట్లను అబ్బురంగా చూసేది. పిల్లలందరూ వీడియో గేమ్‌లు ఆడుకుంటుంటే తను చెట్ల కింద ఆడుకుంటూ వాటితో కబుర్లు చెప్పేది. తండ్రి పుట్టినరోజు వేడుక ఎలా జరపాలా అని కుటుంబమంతా ఆలోచిస్తున్నప్పుడు ఇషా కొత్త ఆలోచనను వారి ముందుంచింది. బామ్మా తాతయ్యలతో మొదలుపెట్టి కుటుంబసభ్యులందరి వయసుల్నీ లెక్కేసి, అందరమూ కలిసి ఈ భూమి మీద 750 సంవత్సరాలు బతికామ్ కాబట్టి 750 చెట్లు నాటదామని చెప్పింది. కూతురి ఆలోచన తల్లిదండ్రులకూ నచ్చింది. పెద్దలతో కలిసి ఆ పండగ చేసుకోడానికి ఇండియా వచ్చారు. దిల్లీ పరిసరాల్లో 750 మొక్కలు నాటి తమకు ప్రాణవాయువును అందించి బతికించిన ప్రకృతికి తమ వంతు మొక్కలను కానుకగా ఇచ్చారు! మరి మీరెప్పుడు ఇస్తున్నారు?

ప్రపంచాన్ని కదిలించింది!

పిల్లలు ఇంత పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించడానికి కారణం పదహారేళ్ల స్వీడన్‌ బాలిక గ్రెటా థన్‌బెర్గ్‌. చిన్నప్పటి నుంచీ సైన్సును ఇష్టపడే గ్రెటాకి వాతావరణ మార్పులు ఇష్టమైన సబ్జెక్టు. స్వీడన్‌లో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం ఆ అమ్మాయిని ఆలోచింపజేసింది. ఎన్నికలు కూడా ఉండడంతో ప్రభుత్వాన్ని వాతావరణం గురించి ఆలోచించేలా చేయాలనుకున్న ఆమె ఒక్కతే వెళ్లి ప్లకార్డు పట్టుకుని పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన మొదలెట్టింది. కొన్నాళ్లకు స్నేహితులూ టీచర్లూ తోడువచ్చారు. ఎన్నికలు అయిపోయాక చదువు దెబ్బతినకుండా శుక్రవారాల్ని మాత్రం నిరసన ప్రదర్శనలకు ఎంచుకుంది. పర్యావరణ రక్షణ రంగంలో పనిచేస్తున్న ఎన్జీవోలన్నీ ఆ అమ్మాయి పట్టుదలని గుర్తించి మద్దతు తెలిపాయి. అలా ఆమె ప్రదర్శన పత్రికలకూ సోషల్‌ మీడియాకూ ఎక్కింది. నాలుగు నెలలు తిరిగేసరికల్లా అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించడం మొదలుపెట్టిన గ్రెటా వివిధ దేశాల్లోని యువతలో స్ఫూర్తి రగిలించింది. దాంతో సోషల్‌మీడియా వేదికగా అందరూ అనుసంధానమై ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. సియాటిల్‌లోని మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అమెజాన్‌ లాంటి సంస్థల ఉద్యోగులు సైతం ఈ ప్రదర్శనల్లో పాల్గొనడమే కాక తమ యాజమాన్యాల మీదా ఒత్తిడి తేవడంతో అవీ స్పందించి కార్బన్‌ న్యూట్రల్‌ అవడానికి తమ లక్ష్యాలను ప్రకటించడం విశేషం.

మన వంతుగా...

భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలే కాదు, ప్రతి వ్యక్తీ పూనుకోవాల్సిందే.
* ఉన్న చెట్లను కాపాడుకోవాలి, కొత్తగా ఏటా మొక్కల్ని నాటుతూనే ఉండాలి.
* పెట్రో ఉత్పత్తులనూ విద్యుత్తు వాడకాన్నీ తగ్గించాలి. ఇంధనం సహాయంతో మనం వాడే పరికరాలన్నీ అటు ఇంధన రూపంలోనూ ఇటు పరికరాల రూపంలోనూ- రెండు రకాలుగా కర్బన ఉద్గారాల విడుదలకు కారణమవుతాయి.
* సౌర, పవన విద్యుత్తులను సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవాలి.
* సొంతవాహనాలు తగ్గించి ప్రజారవాణా సాధనాలు వినియోగించాలి. చిన్న చిన్న దూరాలకు సైకిల్‌ ఉత్తమం.
* కలప వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. రీసైకిల్డ్‌ ఉత్పత్తులు వాడాలి.
* ఆర్థిక స్తోమత ఉందని పెద్ద ఇల్లూ మనిషికో కారూ కొనుక్కుంటే అదే స్థాయిలో విద్యుత్తూ పెట్రోలూ ఖర్చవుతాయి. భూగోళం అనే ఇంట్లో మనందరం సంతోషంగా ఉండాలంటే వ్యక్తిగత విలాసాలు కొన్ని త్యాగం చేయాలి.
* పెన్సిల్‌ నుంచి పర్ఫ్యూమ్‌ బాటిల్‌ దాకా మనం వాడే ప్రతి వస్తువు ఉత్పత్తిలోనూ ఎంతో కొంత గ్రీన్‌హౌస్‌ వాయువులు తయారవుతాయి. భూతాపాన్ని పెంచుతాయి. అందుకని అవసరానికీ విలాసానికీ మధ్య కచ్చితమైన విభజనరేఖను గీసుకోవాలి.
* కంప్యూటర్‌, టీవీలాంటి పరికరాలన్నిటినీ వాడనప్పుడు ఆపేయాలి.
* ఏ విషయంలోనైనా వృథాని ఎంతగా తగ్గిస్తే అంతగా ప్రకృతి వనరులను ఆదా చేసినట్లే, పర్యావరణానికి మేలు చేసినట్లే.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.