close

కొత్తా పంటలండీ..!

నవధాన్యాలను గంపకెత్తుకుని చద్ది అన్నమూ మూటగట్టుకుని ముల్లుగర్రనూ చేతబట్టుకుని ఇల్లాలును నీ వెంటబెట్టుకుని ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న... అంటూ సాగుతుంది ‘రోజులు మారాయి’ చిత్రంలోని పాట. అప్పుడేమో కానీ ఇప్పుడు నిజంగానే రోజులు మారాయి. ఆధునిక సాంకేతికŸతని వ్యవసాయ రంగమూ అందిపుచ్చుకుంది. తొలకరులూ ఏరువాకలతో సంబంధం లేని సాగు జోరందుకుంది. ఆరుగాలం కష్టపడి అవే పంటలు పండిస్తూ ఫలితాల కోసం దేవుడిపై భారం వేసే బదులు అందుబాటులో ఉన్న వాటిని తనకనువుగా మలచుకుని కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించడానికి రైతు కొత్త దారులు వెతుకుతున్నాడు. అది పండుతుందీ ఇది పండదూ అనుకోకుండా ఏ పంటనైనా ఎందుకు పండించకూడదూ అని పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే తెలుగు నేల సరికొత్త పంటలకు వేదిక అయింది. అరకు నుంచి ఆదిలాబాద్‌ దాకా ఎక్కడైనా... ఆపిల్‌ నుంచీ లిచీ వరకూ ఏ పంటైనా పండుతోంది ఇప్పుడు.

 

పదెకరాలు... పదివేల మొక్కలు!

వ్యవసాయం అంటే ఇష్టమున్నవారు పంటల ఎంపికలోనో సాగు విధానాల్లోనో ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన రైతు సుఖవాసి హరిబాబు మాత్రం ఒకటీ రెండూ కాదు- మొత్తంగా తన పొలాన్నే రకరకాల పంటల ప్రయోగశాలగా మార్చేశాడు. సేంద్రియ, మిశ్రమ వ్యవసాయం చేస్తూ ఆయన పొలాన్ని పరిశోధనాక్షేత్రంగా మారిస్తే దాన్ని చూడటానికి వచ్చే రైతులతో, శాస్త్రవేత్తలతో ఇప్పుడదొక పర్యటక క్షేత్రంగా కూడా మారిపోయింది. వేర్వేరు ఉద్యోగాలూ వ్యాపారాలూ చేసి అవేవీ తనకు సరిపడవని నిర్ణయించుకుని వ్యవసాయంలోకి దిగిన హరిబాబు కూడా ఒకప్పుడు అందరిలాంటి రైతే. మూస పద్ధతిలో రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ వాడి, నష్టపోయి, దండగమారి వ్యవసాయం అనుకున్న వ్యక్తే. క్రమంగా ఆయన ఆలోచనాధోరణి మారింది. సేంద్రియ, మిశ్రమ వ్యవసాయ విధానాల మీదికి దృష్టి మళ్లింది. ఏడేళ్లక్రితం అమీర్‌పేటలో పదెకరాల పొలం కొని వంద రకాల మొక్కల్ని నాటాడు. అందులో రకరకాల పండ్ల చెట్లు మూడువేలు; ఎర్రచందనం, శ్రీగంధం చెట్లొక నాలుగు వేలు; వాటి మధ్యలో రుద్రాక్ష, శంఖపుష్పి, అశ్వగంధ లాంటి ఔషధ మొక్కలు 180 రకాలూ ఉండగా కంచెగా మరో మూడువేల వాక్కాయ చెట్లు ఉన్నాయి. జామ, ద్రాక్ష, సపోటా, దానిమ్మ లాంటి మామూలు పండ్లతో మొదలుపెట్టి లిచీ, వాటర్‌ ఆపిల్‌, కివి, స్టార్‌ఫ్రూట్‌, ప్యాషన్‌ ఫ్రూట్‌ లాంటి ఇక్కడి వారికి అలవాటు లేని ఎన్నో రకాల పండ్లను ఆయన పండిస్తున్నాడు. మరి, ఇన్ని రకాల పంటలు చక్కగా పండాలంటే నేల ఎంత సారవంతంగా ఉండాలీ... అందుకే సేంద్రియ వ్యవసాయవిధానాల్నీ బిందుసేద్యాన్నీ ఎంచుకుని నేలనీ, నీటినీ కూడా సంరక్షించుకుంటున్నాడు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల దగ్గరకు వెళ్లి వారి సాగు పద్ధతులను గమనించడమే కాక ఇజ్రాయెల్‌ వెళ్లి బిందుసేద్యం గురించి కూడా తెలుసుకుని వచ్చిన హరిబాబు వాటన్నిటినీ ఆచరణలో పెడుతూనే మరో పక్క కోళ్లనీ, గొర్రెల్నీ, చేపల్నీ, ఆవుల్నీ కూడా పెంచుతూ వాటి ఎరువునే పొలానికి వాడుతున్నాడు. చీడపీడల నివారణకు మందుల్ని కూడా సహజ ఉత్పత్తులతో తయారుచేసుకుంటాడు. ఈ పదెకరాల తోట నుంచీ పండ్ల దిగుబడిని తన పేరుతోనే ఒక బ్రాండ్‌గా పెట్టి విక్రయించడమే కాక, రైతులకు నర్సరీ మొక్కల్నీ సరఫరా చేస్తూ ఆదాయం పొందుతున్నాడు హరిబాబు. ఆసక్తి ఉన్న చిన్న, సన్నకారు రైతులను బృందాలుగా ఆహ్వానించి శిక్షణ ఇస్తున్నాడు. ఆయన పొలం ఇప్పుడు తోటి రైతులకే కాదు, దేశ విదేశీ వ్యవసాయ పరిశోధనా సంస్థలకూ శాస్త్రవేత్తలకూ కూడా అధ్యయనకేంద్రమైంది.

తైవాన్‌ జామ...ఎంతో లాభం

 

ఆ మధ్య హైదరాబాద్‌ మార్కెట్లో జాంపళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కోటీ అరకిలో ముప్పావు కిలో తూగాయి మరి! గింజలు తక్కువగా, నీటిశాతం ఎక్కువగా ఉండే ఆ తైవాన్‌ జామకాయలు ఇక్కడ పండినవే. కృష్ణాజిల్లా ఎ.కొండూరుకు చెందిన యువరైతు శబరీనాథ్‌కి మిశ్రమ పంటలతో ప్రయోగాలు చేయటమంటే ఇష్టం. అతడు ఆరు ఎకరాల్లో తైవాన్‌జామ వేసి ఆ చెట్ల మధ్య అంతరపంటలుగా బొప్పాయి, సీతాఫలం లాంటి పండ్లూ కూరగాయలూ కూడా పండిస్తున్నాడు. ఈ జామ మొదటి ఏడాదే కాపుకి వచ్చింది. ఒక్క సీజన్‌లోనే మొత్తం అన్ని పంటల మీదా కలిపి రూ.4 లక్షల ఆదాయాన్ని పొందానని గర్వంగా చెబుతాడు సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో వ్యవసాయంలోకి వచ్చిన శబరీనాథ్‌. ప్రకృతి సేద్యంతో పెట్టుబడి ఖర్చు తగ్గిందనీ, మిశ్రమ పంటలు వేయటం వల్ల ఒకటి రెండు పంటలు సరిగా పండకపోయినా మిగతా పంటలు ఉంటాయి కాబట్టి ఆదాయానికి ఢోకా ఉండదంటాడు.
సంగారెడ్డికి చెందిన కిలారు అప్పారావు అందరూ తినే పండ్లు పండించాలన్న ఉద్దేశంతో తైవాన్‌ జామను ఎంచుకుని సాగు చేస్తుండగా ఐటీ ఉద్యోగం చేస్తూనే హనుమారెడ్డి ప్రకాశం జిల్లాలోని సొంతూళ్లో తైవాన్‌ పింక్‌ జామని పండిస్తున్నాడు. సంతనూతలపాడుకి చెందిన అరవిందబాబుది మరో కథ. అతడు పొగాకు, మిర్చి పండించి తీవ్రంగా నష్టపోయిన అనుభవంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ ఈ పంటవైపు వచ్చాడు. ఈ జామలో ఉన్న వెసులుబాటు కొమ్మలు కత్తిరించడం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు పంట దిగుబడి పొందడం. రెండు నెలల ముందుగా ప్లాన్‌ చేసుకుంటే మార్కెట్లో ఇతర పండ్లు అందుబాటులో ఉండని సమయంలో ఇవి చేతికొచ్చేలా చేయొచ్చంటారు ఈ రైతులు.

 

ఆపిల్‌ పండ్లు... ఆదిలాబాద్‌లో!

 

ఆపిల్‌ పండ్లు కశ్మీర్‌లో పండుతాయన్నది పాతమాట.  అరకులో, ఆదిలాబాద్‌లో పండుతాయన్నది ఇప్పటి మాట. ధనోరా గ్రామానికి చెందిన బాలాజీకి వ్యవసాయం అంటే ఇష్టం. ఎక్కడ మంచి వ్యవసాయం జరుగుతోందన్నా వెళ్లి చూసొచ్చేవాడు. అలా చూసి చూసి పండ్లతోటల సాగు మొదలెట్టాడు. బత్తాయి, నారింజ బాగా పండడంతో హిమాచల్‌ ప్రదేశ్‌నుంచి కొన్ని ఆపిల్‌ మొక్కలు తెప్పించి నాటాడు. ఎలాంటి శిక్షణా లేకుండా తనకున్న పరిజ్ఞానంతోనే వాటికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాడు. ఆ మొక్కలు చక్కగా పెరిగాయి. ఆ మాట ఆనోటా ఈనోటా పడి వ్యవసాయాధికారులూ, సీసీఎంబీ శాస్త్రవేత్తలవరకూ వెళ్లింది. అప్పటికే వారు మనలాంటి వేడి ప్రాంతాల్లో ఆపిల్‌ పండుతుందా లేదా అని పరిశోధనలు చేస్తున్నారు. ఎండల్ని తట్టుకునేలా ఆపిల్‌ మొక్కల్లో జన్యుపరమైన మార్పుల్నీ చేశారు. అలా చేసిన 150 మొక్కల్ని బాలాజీకి ఇచ్చి సాగుచేయమన్నారు. ఇది ఐదేళ్ల క్రితం సంగతి. బాలాజీ ఆ మొక్కల్ని కంటికి రెప్పలా కాపాడాడు. రెండో ఏటికల్లా అవి బాగా పెరిగి పూతపూసినా మూడేళ్లు కాయల్ని కోయకుండా వదిలేస్తే చెట్లు దృఢంగా తయారవుతాయని చెప్పడంతో అలాగే చేశాడు. నాలుగో ఏటి నుంచీ కశ్మీర్‌ ఆపిల్‌కి దీటైన ఆపిల్స్‌ బాలాజీ తోటలో పండడం మొదలెట్టాయి. తోటలో అంతరపంటలుగా అరటి లాంటి పండ్లూ చిరుధాన్యాలూ పండిస్తున్నాడు  బాలాజీ.
ఇక, విశాఖ మన్యంలోని చింతపల్లి, గూడెం కొత్తవీధి, అరకు, అనంతగిరి తదితర మండలాల్లోనూ రైతులు ఆపిల్‌ పండిస్తున్నారు. మన్యంలో వాతావరణం ఆపిల్‌ సాగుకు అనుకూలంగా ఉంటుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 2014లో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఉద్యానశాఖ ద్వారా గిరిజన రైతులకు పదివేల ఆపిల్‌ మొక్కల్ని పంపిణీ చేయడంతో అవన్నీ ఇప్పుడు కాపుకొచ్చాయి.

డ్రాగన్‌ ఫ్రూట్‌... పక్కా లోకల్‌!

 

నాలుగైదేళ్ల క్రితం సూపర్‌ మార్కెట్లలో కనిపించిన డ్రాగన్‌ ఫ్రూట్‌ని విచిత్రంగా చూశారు జనం. పైన కాస్త గరుగ్గా ఎర్రగా ఉన్న ఆ పండుని ఇప్పుడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల రైతులూ పండించేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన వనిపల్లి శ్రీనివాసరెడ్డి లాయరూ క్రీడాకారుడే కాదు, కొన్నాళ్లు ప్రభుత్వోద్యోగం కూడా చేశాడు. అయినా పంటల మీద మక్కువ అతడిని సొంతూరికి తీసుకెళ్లింది. నీటి వసతి సరిగా లేని తమ మెట్ట పొలంలో ఏ పంట వేయాలా అని అధ్యయనం చేసిన శ్రీనివాసరెడ్డి చివరికి డ్రాగన్‌ ఫ్రూట్‌ని ఎంచుకున్నాడు. ఎకరానికి 400 మొక్కల దాకా నాటవచ్చనీ, మొదటి ఏడాది తనకి ఎకరాకు టన్ను చొప్పున దిగుబడి వచ్చిందనీ ఇది ఏటా రెట్టింపవుతుందనీ చెబుతాడు శ్రీనివాసరెడ్డి.
ఖమ్మం జిల్లాలో సంపత్‌నగర్‌కి చెందిన శ్రీనివాస్‌, అన్నపురెడ్డి పల్లికి చెందిన మిద్దె నరేశ్‌, రుద్రాక్షపల్లికి చెందిన సంతోష్‌కుమార్‌రెడ్డి కూడా తమ పొలాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ పండిస్తున్నారు. బ్రహ్మజెముడు మొక్క లాగా ఉండే దీన్ని పొలంలో పెంచేందుకు ద్రాక్ష తోటల్లో పాతినట్లు వరసగా రాతి స్తంభాలను పాతి వాటి ఆధారంగా మొక్క పైకి వెళ్లాక పాత టైరుని అమరుస్తారు. దాని మీద చుట్టూ కొమ్మల్ని విస్తరిస్తూ మొక్క కాయలు కాస్తుంది. తొమ్మిది నెలలకే కాపుకొచ్చి ఆర్నెల్లపాటు కాస్తుంది. పాతిక ముప్పై ఏళ్ల వరకూ దిగుబడి నిస్తుంది కాబట్టి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. ఎకరానికి అయిదారు లక్షలవరకూ పెట్టుబడి అవుతుందంటున్నారు ఈ రైతులు.
ఇక, విజయశ్రీరాం అనే ప్రవాసాంధ్రుడు ఉద్యానపంటలపై ఉన్న ఆసక్తితో మన్యం ప్రాంతానికి డ్రాగన్‌ఫ్రూట్‌ని పరిచయం చేశాడు. కౌలుపొలంలో అతడు పండిస్తున్న డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుని చూసి పలువురు రైతులు స్ఫూర్తి పొంది తామూ పండించడం మొదలెట్టారు. మన్యం వ్యాప్తంగా దాదాపు 375 ఎకరాల్లో ఇప్పుడు డ్రాగన్‌ఫ్రూట్‌ పండుతోంది. నీటి వసతి సరిగా లేని ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండటమూ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటమూ రైతుల్ని ఈ పంటవైపు ఆకర్షిస్తున్నాయి.

ఐటీ ఉద్యోగం... సేద్యం ఖర్జూరం

 

ఐటీ ఉద్యోగం చేస్తున్న సుధీర్‌ నాయుడుకు పంటలంటే ఆసక్తి. ఆ ఆసక్తే అతడికి ఇప్పుడు ఎకరాకు 20 లక్షల ఆదాయాన్నిస్తోంది. సుధీర్‌ అనంతపురం జిల్లాలోని బొందలవాడ గ్రామంలో ఉన్న తన పొలంలో ఏదో ఒకటి పండించేవాడు కానీ ఏనాడూ సరైన దిగుబడి వచ్చేది కాదు. ఓసారి కోయంబత్తూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ రైతు ఖర్జూరం పండించడం చూసి వివరాలు తెలుసుకున్నాడు. ఏడేళ్ల క్రితం మూడెకరాల పొలంలో ఖర్జూర సాగు ప్రారంభించాడు. ఒక్కో మొక్కా మూడున్నర వేలు చొప్పున విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఎకరానికి 76 మొక్కలు చొప్పున నాటించాడు. నీటిని పొదుపుగా అందివ్వడానికి బిందుసేద్యం ఏర్పాటుచేశాడు. మూడో ఏట నుంచి పంట దిగుబడి మొదలు కాగా నాలుగేళ్ల కల్లా పెట్టుబడి తిరిగి వచ్చేసింది. దాంతో ఇప్పుడు మొత్తం ఎనిమిది ఎకరాల్లో ఖర్జూరం సాగు చేస్తున్నాడు. ఉద్యోగం చేసుకుంటూనే వారంలో ఒకటి రెండు రోజులు తోట పని చూసుకుంటున్నాడు. గాలిలో తేమ తక్కువగా ఉండే ఉష్ణప్రాంతాల్లో- దాదాపు అన్ని రకాల నేలల్లోనూ పండే ఖర్జూరంలో బర్హి రకం తమ వాతావరణానికి సరిపోయిందనీ ఈ పంటకు చీడపీడలు తక్కువే కాబట్టి నిర్వహణ తేలికేననీ చెబుతాడు సుధీర్‌. మొదటి కాపులో చెట్టుకి వంద కిలోల చొప్పున దిగుబడి రాగా తర్వాత సంవత్సరం అది 250 కిలోలయింది.
ఆ తర్వాత చెట్టుకి 300 నుంచి 500 కిలోల చొప్పున దిగుబడి వస్తుందనీ ఈ చెట్లు 80 ఏళ్ల పాటు కాయలు కాస్తాయనీ చెబుతున్నాడు సుధీర్‌. ఒకరిని చూసి ఒకరన్నట్లు ఇప్పుడు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సంకినేని పూర్ణచందర్‌, నల్గొండ జిల్లా నర్సింగ్‌బాట్ల గ్రామంలో సాంబశివరావు, నిజామాబాద్‌ జిల్లా బాసరలో సందీప్‌... ఇలా ఎందరో రైతులు ఖర్జూరం పండిస్తున్నారు.

లీచీ, స్ట్రాబెర్రీ... నాల్‌కోల్‌, బ్రకోలీ

 

విదేశీ పేర్లలా ఉన్న ఈ పంటలన్నీ ఇప్పుడు మన రైతులకు సుపరిచితాలు. వారు కేవలం తమ ఆసక్తితో కొత్త పంటలపై ప్రయోగాలు చేయడం చూస్తే ముచ్చటేస్తుంది. ఐదారేళ్ల క్రితం సంగతి. లంబసింగి ప్రాంత రైతు రాంబాబు కాఫీతో పాటు నిమ్మ తదితర పంటల్ని పండించేవాడు. ఏ పండు తిన్నా గింజని నాటి మొక్క మొలుస్తుందేమోనని పరిశీలించడం అతనికి అలవాటు. అలా ఓసారి ఆపిల్‌ నాటి పెంచాడు. చౌడుపల్లి గ్రామానికి చెందిన కంఠా వెంకటరమణ అనే రైతు తన ఇంటి వద్ద పెరట్లో లిచీ మొక్కల్ని పెంచాడు. వీరిని చూసి ఇతర రైతులూ ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయోగాలు చేస్తుండేవారు. అప్పటికే మన్యం వాతావరణంలో సాగుచేయడానికి వీలైన కొత్త పంటల గురించి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాకేంద్రంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. రైతుల ఆసక్తిని గమనించి, వారు పెంచుతున్న కొత్త పండ్ల మొక్కల్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు తగు సూచనలు ఇచ్చి ప్రోత్సహించడంతో ఇప్పుడు మరెన్నో కొత్త కొత్త పండ్లూ కూరగాయలూ మన్యం పొలాల్లో కన్పించడం మొదలెట్టాయి. ఇప్పుడు అక్కడ 200 ఎకరాల్లో స్ట్రాబెర్రీ, మరో 250 ఎకరాల్లో లిచీ పండుతున్నాయి. మన్యంలోనే మరికొందరు రైతులు సేంద్రియ పద్ధతుల్లో విదేశీ కూరగాయలను సాగుచేస్తున్నారు. దాదాపు 500 ఎకరాల్లో బ్రకోలీ, రెడ్‌ క్యాబేజీ, నాల్‌కోల్‌, జుకుని లాంటివి పండిస్తున్నారు. ఈ పంటల దిగుబడిని రైతు బజార్లలోనూ, విశాఖపట్నంలోనూ స్వయంగా అమ్ముతున్నారు. అందమైన ప్రకృతినీ ఆహ్లాదకరమైన వాతావరణాన్నీ ఆస్వాదించడానికి మన్యం ప్రాంతానికి వచ్చే పర్యటకులకు ఇప్పుడీ పంటలు మరో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

థాయ్‌ ఆపిల్‌... మన ఆపిల్‌ రేగు

 

మంచి దిగుబడితో తొలి ఏడాది నుంచే రైతును ఆదుకుంటున్న మరో పండు థాయ్‌ ఆపిల్‌. మొదటినుంచీ వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న జడ్చర్లకు చెందిన కృష్ణారెడ్డి కొన్నేళ్లపాటు థాయ్‌ పండ్ల జాతులమీద పరిశోధన చేశాడు.
సాధారణంగా మన సంప్రదాయ ఉద్యానపంటలు చేతికందిరావటానికి కాస్త సమయం పడుతుంది. అదే థాయ్‌ వెరైటీలైతే తక్కువ సమయంలోనే దిగుబడినిస్తాయి. వాటిని ఇక్కడివారికి అందుబాటులోకి తెస్తే రైతులు లబ్ధి పొందుతారని భావించి మొక్కల్ని దిగుమతి చేసుకుని తానే ఒక నర్సరీ ఏర్పాటు చేయటమే కాక కొన్ని పంటలను స్వయంగా సాగు చేయడమూ మొదలెట్టాడు. వాటిల్లో ఆపిల్‌ రేగు అందరినీ ఆకట్టుకుంది. ఆసక్తి కలవాళ్లు కొనుక్కెళ్లి సాగు చేయడం మొదలెట్టారు. రేగు చెట్టు మొదలునీ ఆపిల్‌ చెట్టు కాండాన్నీ జత చేసి పెంచేదే ఆపిల్‌ బేర్‌ లేదా ఆపిల్‌ రేగు. దీనికి రేగు చెట్టుకుండే ముళ్లుండవు. ఆపిల్‌ పళ్లలా కన్పిస్తూ రేగు పళ్ల రుచినిచ్చే ఈ పండ్లలో ఒకటే గింజ ఉంటుంది. ఎనిమిది నెలల కల్లా కాతకొస్తుంది. ఒక్కో చెట్టు 50 నుంచి 80 కిలోల వరకూ దిగుబడినిస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.50 వేలు మించదనీ మొదటి ఏడాది నుంచే రెట్టింపు ఆదాయం పొందవచ్చనీ చెబుతారు కృష్ణారెడ్డి. కొమ్మల్ని కత్తిరించినప్పుడల్లా కొత్త కొమ్మలు వచ్చి కాయలు కాస్తాయి.
ఈ చెట్టు ఆకుల్ని పశువులకు మేతగా వాడొచ్చు. ఉద్యానశాఖ అధికారుల ప్రోత్సాహంతో ఇప్పుడీ పంటని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు రైతులు పండిస్తున్నారు.

 

రైతుకి నేలంటే గౌరవం. దానిమీద పచ్చగా పెరిగే మొక్కంటే ప్రేమ. సమయానికి రాని వానలూ వద్దన్నా వచ్చే వరదలూ ఆ ప్రేమకు పరీక్ష పెడుతున్న కాలంలో... అన్నిరకాల ఆటుపోట్లనూ తట్టుకుని నిలిచి గెలిచే ప్రయత్నాలే... ఈ కొత్త పంటలూ, సరికొత్త సాగు విధానాలూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.