close
మనసు మరక

- రమ ఇరగవరపు

ఫోను మోగుతోంది. ఈ టైమ్‌లో ఫోను అంటే అది చందూ నుంచే. నిన్నటిదాకా వాడి దగ్గర నుంచి ఫోను అంటే ఆనందంగా ఉండేది. బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఇద్దరం. ఎప్పుడు ఫోను వచ్చినా ‘హాయ్‌ మై బ్యూటిఫుల్‌ మామ్‌’ అంటూ మొదలుపెట్టి ‘యూ ఆర్‌ ద బెస్ట్‌ మామ్‌’ అంటూ ముగిస్తాడు. వాడు ఆ మాటలు అంటుంటే గుండెల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. కాదా మరి... ఒక్కగానొక్క కొడుకును కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. వాడి ప్రతి కోరికా మనసులో ఉండగానే గ్రహించి తీర్చేది... ఠక్కున ఆగిపోయాయి ఆలోచనలు. నిజంగా వాడి ప్రతి కోరికా తీర్చిందా... నిజంగా వాడి మనసు తనకి తెలుసా..? నిన్నటిదాకా అయితే ఇలాంటి ప్రశ్నలకి ధైర్యంగా గర్వంగా ‘అవునని’ సమాధానం చెప్పేది తన మనసు. కానీ, నిన్న చందూ రూము సర్దుతుంటే అనుకోకుండా బయటపడ్డ వాడి చిన్నప్పటి డైరీ తనని కుంగదీసింది. మనసు మనసులో లేదు. అపరాధభావం మనసుని కమ్మేస్తోంది. ఎన్నెన్నో ప్రశ్నలు మనసు మీద భూతంలా దాడిచేస్తున్నాయి. ఎప్పుడూ తనవైపు నుంచి ఆలోచించింది కానీ... చందూ వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోయింది. వాడి మనసు ఎందుకు తెలుసుకోలేకపోయింది. ఇన్నాళ్ళల్లో చందూ కూడా ఒక్కమాట అయినా తనతో అనలేదెందుకు... మరచిపోయాడా, మన్నించేశాడా?

ఈసారి ల్యాండ్‌లైనూ సెల్‌ఫోనూ రెండూ ఒక్కసారే గణగణమని మోగటం మొదలుపెట్టాయి. తప్పనిసరై ఫోను ఎత్తితే గొంతు పెగల్లేదు. నెమ్మదిగా ‘హలో’ అన్నాను.

‘‘అమ్మా, ఏమయింది? ఆర్‌ యూ ఓకే. ఎప్పటినుంచి ఫోన్‌ చేస్తున్నానో తెలుసా... ఒంట్లో బాగోలేదా? ఇక్కడికి రమ్మంటే రావు. ఒక్కదానివి ఎలా ఉన్నావో - తిన్నావో లేదో - నీ ఒంట్లో ఎలా ఉందో అని ప్రతిక్షణం భయంభయంగా బెంగగా అనిపిస్తోంది. ఇలా ఫోను ఆన్సర్‌ చేయకపోతే నాకు భయంతో పిచ్చెక్కిపోతోంది. అంత దూరంలో ఉన్నావు.’’

తన సమాధానం కోసం కూడా ఆగకుండా అంత ఆత్రంగా కొడుకు మాట్లాడుతుంటే ఒకప్పుడైతే ముచ్చటపడేది. వాడి ప్రేమకి మురిసిపోయేది. కానీ, ఇప్పుడా మూడ్‌లో లేదు. కొడుకు మాటల్ని దాటి వాడి మనసు దాకా తొంగిచూస్తోంది. ఆ మనసులో ఇంకా ఎక్కడైనా తనమీద కోపం మిగిలుందా అని.

‘‘అమ్మా, మాట్లాడవేమిటి... ఏమయింది? డాక్టరుకి ఫోను చెయ్యనా, సరోజ పిన్నిని రమ్మని చెప్పనా?’’

‘‘వద్దు వద్దు. ఏవో ఆలోచనలు అంతే! ఎలా ఉన్నావు? చిన్నూ స్కూలుకి రెడీ అవుతున్నాడా?’’ ఏమాత్రం ప్రాణంలేని గొంతుతో చాలా మామూలుగా వచ్చాయా మాటలు.

‘‘అమ్మా, నిజం చెప్పు... నీ ఒంట్లో బాగానే ఉంది కదా? నాన్న గుర్తుకువచ్చారా? ప్లీజ్‌ అమ్మా, ఏమీ ఆలోచించకు, రిలాక్స్‌డ్‌గా ఉండు. నువ్వలా డల్‌గా ఉంటే నాకు బెంగగా ఉంటుంది.’’ ఎక్కడో దేశంకాని దేశంలో ఉన్న వాడి గొంతులోని బెంగ నా మనసుని తాకింది. ‘‘లేదు నాన్నా, నేను బాగానే ఉన్నాను. నువ్వు రేపు ఫోను చేసేసరికి రిలాక్స్‌డ్‌గా పలకరిస్తాను. ఓకేనా, టెన్షన్‌ పడకు... బై.’’

ఎప్పటిలాగే ఫోను పెట్టేముందు ‘లవ్‌ యూ మామ్‌, యూ ఆర్‌ ద బెస్ట్‌ మామ్‌’ అంటున్న చందూ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. గతం గతః అనుకోవాలా? గట్టిగా నిట్టూర్చి ఫోను పక్కన పెట్టాను. వద్దన్నా మనసు వెనక్కి పరుగులు పెడుతోంది. అలసటగా సోఫాలో పక్కకి వాలాను- గత చిత్రాలు కళ్ళముందు కదలాడుతుంటే.

*

చదువు పూర్తవుతూనే పెళ్ళిపీటలు ఎక్కింది. మార్చిలో పరీక్షలు, మేలో పెళ్ళి. అత్తగారూ మామగారూ ఆడపడుచూ మరిదీ... ఒక్కసారిగా జీవితం బరువెక్కి పోయింది. ఉదయం ఉద్యోగానికి వెళ్ళిన భర్త రాత్రి ఇంటిల్లిపాదీ పడుకున్నాక గదిలోకొచ్చేదాకా ఎదురుచూపులే. చాలా సామాన్యంగా, చాలా సాదాసీదాగా జీవితం సాగిపోతోంది. ఏదో అసంతృప్తి. ఏవో రెండు కళ్ళు తనని ఇరవైనాలుగు గంటలూ గమనిస్తున్నట్టు అనిపించేది. అది తన అపోహో నిజమో తెలీదు. తను నిల్చున్నా కూర్చున్నా నవ్వినా ఆ రెండు కళ్ళు తనని చూస్తున్నట్టూ, బయటకి మాటల్లో చెప్పలేకపోయినా అత్తగారి ఆ రెండు కళ్ళు తనకి ఎన్నో ఆజ్ఞలు ఇస్తున్నట్టూ ఉండేవి. ఆ ఆజ్ఞలకి అనుగుణంగా తను నడుచుకునేది. పెద్దగా బుర్రతో పనిలేని పనులెన్నో చకచకా చేసేది. ఊపిరి అందకపోవటం అంటే ఏమిటో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఒకరు తననీ తన పనులనీ గమనిస్తూ వాటిని విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఉంటే ఊపిరి గడ్డకట్టుకుపోతుంది. ఆ అనీజీనెస్‌ మనసుని చికాకుపెట్టేది. ఇలా రెండేళ్ళు గడిచిపోయాయి. ఇంతలో ఆయనకి వేరే ఉద్యోగం రావటం, ఉన్న ఊరు నుంచి సిటీకి రావటం... అలా తనది అంటూ ఒక ఇల్లు, సంసారంతోపాటు గుండెలనిండా గాలి సొంతమయింది. మనసులో నుంచి ఏదో బరువు దిగినట్టు ఫీలింగు. అటు తరవాత తను కూడా పోటీ పరీక్షలు రాయటం, ప్రభుత్వ ఉద్యోగం, సంపాదన... జీవితం పూర్తిగా తనకు నచ్చినట్టు మారిపోయింది. చందూ పుట్టడంతో ఆనందం మరింత పెరిగిపోయింది.చందూ హైస్కూలుకి వచ్చేసరికి మామగారు చని పోయారు. అప్పటికే మరిది, ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయిపోవడంతో అత్తగారు తమ దగ్గరికి చేరారు.

అత్తగారు రావటంతో మొదట్లో ప్రాణం కాస్త కుదుటపడినట్లు అనిపించింది. ఇంటిపనిలో వంటపనిలో చేదోడువాదోడుగా ఉండేవారు. పరుగులతో అలసిపోయిన నాకు కాస్త ఊపిరి అందుతోంది. ముఖ్యంగా చందూ డేకేర్‌లో ఉండాల్సిన అవసరం తప్పింది. ఆఫీసులో లేటు అయితే పిల్లాడు ఆకలితో ఉంటాడన్న బెంగ లేదు. పైగా అలసి ఇంటికి చేరితే చేతిలో వేడివేడి టీ, టిఫిన్‌! ‘నేనింత ఉడకేస్తా కానీ, పిల్లాడిని నువ్వు చదివించుకో’ అనేవారు. ఈయన మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోయి అమ్మతో కబుర్లు, నాయనమ్మతో చందూ ఆటపాటలు అయితే చెప్పక్కర్లేదు. హోమ్‌వర్క్‌ పూర్తిచేస్తూనే నాయనమ్మ పక్కన చేరేవాడు. కబుర్లు, కథలు సాగిపోయేవి. కాలం సాగిపోతోంది.

మా ముగ్గురి మధ్యకి అత్తగారు వచ్చి రెండేళ్ళు అయిపోయింది. ఎప్పుడు మొదలయిందో తెలీదు- మళ్ళీ ఆ అనీజీనెస్‌, ఏవో రెండు కళ్ళు నన్ను అనుక్షణం వెంటాడుతున్నట్టూ, నా ఇల్లు నాది కానట్టూ, నా ఇంట్లోనే నేను పరాయిదాన్ని అయిపోయినట్టూ, నా భర్తకి నా అవసరం తగ్గినట్టూ అనిపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఆవిడ స్వతంత్రంగా అన్నీ అమర్చిపెడుతుంటే ‘అమ్మయ్య, పని తప్పింది’ అనుకున్న నాకు, నెమ్మది నెమ్మదిగా నా అధికారాన్ని ఎవరో లాగేసుకున్నట్టు అనిపించటం మొదలు పెట్టింది. ఊపిరి సలపలేక, ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నా ఇంట్లో నాకు స్వతంత్రం కావాలి, నాకు నచ్చినట్టు నేనుండాలి. మళ్ళీ నాతో నేను యుద్ధం చేస్తున్న సమయంలో మరిది నుంచి ఫోను. ‘తోటికోడలికి ఏదో అనారోగ్యం, ఏదో ఆపరేషన్‌ చెయ్యాలి. పిల్లలు చిన్నవాళ్ళు కదా, అమ్మని పంపుతారా’ అంటూ.

వంద జాగ్రత్తలు చెప్పి, అన్నీ అప్పజెప్పి ఆవిడ గుమ్మం దాటారు. వెళ్ళొద్దంటూ గొడవ చేసిన చందూకి ఒక్క మూడు నెలల్లో వచ్చేస్తానని నచ్చచెప్పారు.

ఆవిడ వెళ్ళడంతోనే ఒక్కసారిగా పోయిన ఊపిరి వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ నా ఇల్లు, నా సామ్రాజ్యం అంతా నాకే సొంతం. రోజుకి పదిసార్లన్నా ఆయనా, చందూ అత్తగారిని తలచుకునేవారు. చందూ మరీనూ, ఒకటే గొడవ చేసేవాడు- నాయనమ్మ లేకపోతే నాకు బోర్‌గా ఉందంటూ. తోడికోడలు కోలుకుంది. ఇక అత్తగారు రేపోమాపో వచ్చేస్తారు. మనసులో బెంగ మొదలయింది. మళ్ళీ నా స్వతంత్రాన్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. రెండు కళ్ళు నన్ను గమనిస్తుంటే, ఎవరివో ఆజ్ఞలు నన్ను నడిపిస్తుంటే ఊపిరి అందకుండా రోజులు నెట్టుకురాలేను. ఏం చెయ్యాలి అని ఆలోచించాను. ఉపాయం తట్టింది, ఆయనతో మాట్లాడాను.

‘‘మీ అమ్మగారు వస్తే మనకి హాయిగా ఉంటుంది. నాకూ వంటా వార్పుల్లో తోడుగా ఉంటారు. కానీ, పెద్దావిడతో పనులు చేయించుకుంటే ఏం బావుంటుంది? ఎంత వద్దని చెప్పినా నేను ఆఫీసు నుంచి రావటం లేటయితే ఆవిడ హడావుడిపడతారు. అంత పెద్దావిడతో పనులు చేయించుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటోంది. అక్కడైతే వేణు భార్య ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆవిడకి పని ఒత్తిడి ఉండదు. పైగా వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు. మనవాడు పెద్దయ్యాడు, వాడి పనులు వాడు చేసుకోగలడు. ఆవిడ అక్కడ ఉంటే వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది. మన స్వార్థం కోసం ఆవిడని ఇబ్బందిపెట్టొద్దు.’’

ఆయనకి నా మాటలు కరెక్టే అనిపించాయి. ఆ ఆదివారం ముగ్గురం ఆవిడని చూడటానికి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు మాతో రమ్మని పిలవలేదు. మా ఇంట్లో ఉన్న ఆవిడ బట్టలు సూట్‌కేసులో పెట్టి ఇచ్చి వచ్చాం.
చందూ ‘మాతో రావా నాయనమ్మా’ అని అడిగాడు.

‘పిన్నికి ఒంట్లో బాగోలేదు కదా... నాయనమ్మగారు సాయంగా ఉండాలి’ అంటూ ఆవిడకంటే ముందు నేనే చెప్పేశాను.

దాంతో ఆవిడకి చెప్పకనే చెప్పినట్టు అయిందని నా ఉద్దేశం. అంతే, ఇక ఆ తర్వాత ఎప్పుడూ- చందూ నాయనమ్మ కావాలంటే సెలవులకి వాడిని పంపడం, మేము ఓ నాలుగు రోజులు వెళ్ళిరావటమే తప్ప, ‘రండి’ అని ఆవిడని పిలవలేదు. ఆవిడకి ఏం అర్థమయిందో ఆవిడ కూడా ఎప్పుడూ వస్తానని అనలేదు.

మాకు కాలం పరిగెత్తింది చందూ చదువులతో, మా ఉద్యోగాలతో. చందూ ఇంటర్‌ పరీక్షలు పూర్తయినరోజే అత్తగారు హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు. చందూ చాలా గిలగిలలాడాడు- ఒక్కరోజు ఉంటే నాయనమ్మని చూసేవాణ్ణి అని. ఎన్నో రోజులు ముభావంగా ఉండేవాడు. ‘చిన్నపిల్లాడు- మొదటిసారి ఒక చావుని చూశాడు, అందుకే ఇంత బాధ’ అనుకున్నాను. నెమ్మదిగా వాడి చదువు హడావుడితో తిరిగి మామూలుగా అయిపోయాడు. ఐఐటీలో సీటు రావటం, హాస్టల్‌లో చేరటం, అక్కడ భోజనం పడక ఆరోగ్యం పాడయితే, ఒక్కగానొక్క కొడుకుకంటే తన ఉద్యోగం ఎక్కువ కాదని ఉద్యోగం వదిలేసి, వాడిని పెట్టుకుని వేరే రాష్ట్రంలో ఆయనకు దూరంగా ఉండటం, అక్కడ చదువు అవుతూనే వాడు అమెరికా వెళ్ళిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అక్కడ ఆ దేశపు అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్ళి అన్నాడు. చిన్నప్పటి నుంచీ వాడి ప్రతి కోరికా తీర్చి, వాడితో ‘బెస్ట్‌ మామ్‌’ అనిపించుకున్న నేను ఈ కోరిక కూడా కాదనలేదు. వాడికి ఒక కొడుకు. పరుగెత్తే కాలంలో ఆయన కలిసిపోతే, ఒంటరిగా ఇక్కడ నేను. ‘నా దగ్గరికి వచ్చేయ్‌’ అని చందూ గోలచేసినా, చూసిరావటమే కానీ, అక్కడ ఉండలేక ఇక్కడే ఉన్నాను.

 

ఆలోచనలు ఆగాయి. జ్ఞాపకాల బరువు మనసుని కమ్ముకుంది. జీవితంలో అన్ని బాధ్యతలూ సక్రమంగా పూర్తిచేసి, కొడుకుని బాగా పెంచాను అనుకున్నాను. కానీ, నిన్న అనుకోకుండా చందూ చిన్నప్పటి డైరీలు కళ్ళబడ్డాయి. అందులో వాడు నాయనమ్మతో వాడి అనుబంధం, ఆవిడ వెళ్ళాక ఒంటరిగా ఫీల్‌ అవ్వటం, ఆవిడని ఎంత మిస్‌ అయ్యిందీ రాశాడు. అమ్మకి నాయనమ్మని తేవటం ఇష్టంలేదంటూ, నాయనమ్మ మాట ఎత్తితే తను ఎంత కఠినంగా మాట్లాడేదో రాశాడు. ఒకచోట ‘నాయనమ్మ దూరం కావటానికి అమ్మే కారణం. అందుకే అమ్మంటే కోపం’ అని కూడా రాశాడు.

ఆ మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆ డైరీలు చదువుతున్నంతసేపూ వాడికి వాళ్ళ నాయనమ్మతో ఎంత అనుబంధం ఉండేదో, దాన్ని తాను ఎంత దారుణంగా తుంచేసిందో అనిపించింది. ఎంత పొరపాటు చేసింది తను, అత్తగారిని అత్తగారిలాగానే చూసింది కానీ, తన ఇంట్లో మరో ఇద్దరికి ఆవిడతో ఉండే అనుబంధాన్ని గుర్తించలేక
పోయింది. ఒకరికి తల్లి, మరొకరికి నాయనమ్మ. వారికి ఆమెతో ఉండే అనుబంధం వేరు. అది గుర్తించకుండా తనకి ఇబ్బంది అని ఆవిడని దూరం పెట్టింది. తను తృప్తిగానే ఉంది. కానీ, తనవాళ్ళ మనసులో శూన్యాన్ని నింపింది. చిన్నవాడు చందూకే ఇలా అనిపిస్తే, ఇక ఆయన ఏమనుకున్నాడో? ఎంత పొరపాటు చేసింది. కొడుకు కోసం అన్నీ చేశాను అనుకుంది. వాడి ప్రతి ఇష్టాన్నీ గుర్తించి తీర్చాను అనుకుంది. కానీ, వాడి మనసుకి దగ్గరైనవారిని- అత్యంత ఇష్టమైన వ్యక్తిని- దూరంచేసి, వాడిని బాధపెట్టి తాను సుఖపడింది. పరాయిదేశపు పిల్లని కోడలిగా ఒప్పుకుని, వాడి చదువుకోసం ఉద్యోగాన్ని వదులు కుని గొప్ప త్యాగాలు చేశానని పొంగిపోయింది. కానీ, వాడికోసం సొంత అత్తగారిని ఇంట్లో ఉంచుకోలేకపోయింది. ఆవిడ ప్రేమని కొడుక్కి అందించలేకపోయింది. మనసు కుమిలిపోతోంది. కాలం వెనక్కి వెళ్ళదు. తన పొరపాటు దిద్దుకోలేదు. ఇప్పుడు తనేం చేయగలదు?
ఆలోచనల్ని చీలుస్తూ సెల్‌ఫోను మోగింది. గబుక్కున తీసి చూశాను. చందూ ఫోను. మళ్ళీ ఈ టైమ్‌లో ఎందుకు చేశాడు..?

‘‘అమ్మా, ఎలా ఉన్నావ్‌? ఒకటే గుర్తుకొస్తున్నావు. ఇంకా పడుకోలేదా?’’ చందూ గొంతు వింటూంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. వాడి పసిమనసు నాయనమ్మ కోసం ఎంత తపించిందో కదా. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను. సరే, జరిగింది ఎలాగూ మార్చలేను. కానీ, ఇప్పుడు మరో పొరపాటు చేయకుండా, తన స్వతంత్రం పోగొట్టుకోవటం ఇష్టంలేక, పరాయిదేశం కోడలి దగ్గర ఉండలేక, తను ఇన్ని రోజులూ చందూ దగ్గర ఉండటానికి వెళ్ళలేదు. కానీ, తను వాడికి అమ్మ, కోడలికి అత్తగారే కాదు, తన మనవడికి నాయనమ్మ కూడా. వాడికి ఆ ప్రేమని దూరం చేయకూడదు.

‘‘నాన్నా, నేను నీ దగ్గరికి వచ్చేస్తా. టికెట్‌ బుక్‌ చెయ్‌. చిన్నూగాడిని చూడాలని ఉంది’’ తన మాట ఇంకా పూర్తికాలేదు. చందూ ఆనందంతో అరుస్తున్నాడు.

ఇంతలో చిన్నూ ఫోను లాక్కొని ‘‘నానీ, నిజంగా నువ్వు వస్తున్నావా?’’ అని గట్టిగా అరుస్తూ అడుగుతున్నాడు. వాళ్ళిద్దరి గొంతుల్లోని ఆనందం మనసు లోపలి పొరల్లో ఉన్న అపరాధభావాన్ని కొంచెం తగ్గిస్తోంది.

ప్రతి బంధాన్నీ మనవైపు నుంచే చూస్తాం కానీ, మనతో ఉన్నవారికి ఆ బంధంతో వేరే అనుబంధం ఉంటుందని మర్చిపోతాం. ఇక, ఆ పొరపాటు చేయదు తను. చందూ ఆనందంతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి మాటలు వింటూ నా ‘రేపటిలోకి’ వెళ్ళటానికి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.