close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్నూలుని హైదరాబాద్‌కు తెచ్చా!

ఓ చిన్న లెక్క... 2003 నుంచి ఇప్పటిదాకా హిట్టయిన తెలుగు సినిమాలెన్నున్నాయో ఓసారి చూడండి. అందులో సగం సినిమాలకి ఆర్ట్‌ డైరెక్షన్‌ ఏఎస్‌ ప్రకాశ్‌దే అయ్యుంటుంది. గత పదిహేనేళ్లలో ఏటా రిలీజైనవాటిని లెక్కించినా ఆయన చేసినవే ఎక్కువుంటాయి. ఒక్క 2014లోనే ఆయన పనిచేసిన సినిమాలు పన్నెండు రిలీజయ్యాయంటే... చూస్కోండి! రాశిలో మాత్రమే కాదు ‘జనతా గ్యారేజీ’, ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల సెట్టింగ్‌లు ఆయన హస్త‘వాసి’ ఏపాటిదో వివరిస్తాయి. ఆయనతో మాట్లాడితే...

మాది విశాఖ. నాన్న శంకర్‌రావు అక్కడ వ్యాపారిగా ఉండేవారు. నాకో అక్కయ్య, అన్నయ్య, తమ్ముడూ ఉన్నారు. ఆర్ట్‌తో ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. కానీ చిన్నప్పుడోసారి శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం ముఖచిత్రాన్ని యథాతథంగా గీస్తే నా స్నేహితులంతా భలే మెచ్చుకున్నారు. ఓసారి చవితి కోసం మట్టితో వినాయకుడి బొమ్మా, దాని వెనక దూదితో కైలాసంలాంటి డిజైన్‌ చేశాను. అది చాలా బాగా వచ్చి ఓ పత్రిక స్థానిక ఎడిషన్‌లో వేశారు. దాన్ని చూడటానికి చుట్టుపక్కలవాళ్లందరూ తరలివచ్చారు. ఆర్టిస్టుగా నాకు వచ్చిన తొలి గుర్తింపు అది. అయినా ఆర్ట్‌ని కెరీర్‌గా ఎంచుకోవాలనే ఆలోచన నాకు రాలేదు. ఇంటర్‌ చదివేటప్పుడు బ్లాకు బోర్డుపైన బొమ్మలు గీస్తుండేవాణ్ణి. అవన్నీ చూసి రాజు అనే సీనియర్‌ నన్ను ఫైనార్ట్స్‌లో చేరమన్నాడు. నాన్నతో చెబితే సరేనన్నాడు కానీ ‘నువ్వు ఏది చదివినా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలు రాసి తీరాల్సిందే!’ అనే షరతూ పెట్టాడు. అలా ఆంధ్రా వర్సిటీ క్యాంపస్‌లో చేరిపోయాను. చేరాక పోటీ పరీక్షలు కాదుకదా... అసలు ప్రపంచం గురించే పట్టించుకోవడం మానేశాను. ఎప్పుడూ ఆర్ట్‌ గురించే నా ధ్యాస. మధ్యలో నాన్న కేంద్రప్రభుత్వం ఆర్ట్‌ టీచర్‌ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయమని చెబుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే, ఓసారి స్నేహితులతో కలిసి ‘గ్రూప్‌ 2’కి దరఖాస్తు చేశాను. ఆ పరీక్షలకని హైదరాబాద్‌ వచ్చాను. అప్పుడే ఈనాడు పేపర్‌లో ‘ఫైనార్ట్స్‌ విద్యార్థులు కావలెను!’ అంటూ ఓ యాడ్‌ వచ్చింది. ఇంటర్వ్యూ స్థలం ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ అని ఉంది. ఆ రకంగానైనా ఫిల్మ్‌ సిటీ చూడొచ్చనే ఆశతో ఇంటర్వ్యూకి హాజరయ్యాను. నాకు ఎన్నో ప్రశ్నలు వేసి, కొన్ని ఆలోచనలు చెప్పి స్కెచెస్‌ గీయమన్నారు. గీసిచ్చి వచ్చేశాను. విశాఖ వచ్చిన వారంలోనే జూనియర్‌ ఆర్ట్‌ డిజైనర్‌గా ఎంపిక చేసినట్టు లేఖ వచ్చింది. అప్పట్లో రామోజీ ఫిల్మ్‌ సిటీకి ఓ రూపాన్నిస్తున్న ప్రఖ్యాత కళాకారుడు నితేశ్‌రాయ్‌కి సహాయకుడి ఉద్యోగం నాది. నా పనితీరు నచ్చి ఉషాకిరణ్‌ మూవీస్‌ పనులూ అప్పగించారు. అంతేకాదు, ఉషాకిరణ్‌ మూవీస్‌ తీసిన ‘ఒకరాజు ఒకరాణీ’ సినిమాకి నన్నే ఆర్ట్‌ డైరెక్టర్‌గా నియమించారు. నా గురించి విన్న దిల్‌రాజు, సుకుమార్‌లు ‘ఆర్య’కి ఆర్ట్‌డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు.

అందుకే వెళ్లలేదు!
‘ఆర్య’ సూపర్‌హిట్టయ్యాక ఆ సినిమా నిర్మాత దిల్‌ రాజు తన నిర్మాణ సంస్థలోనే ఉండిపొమ్మన్నారు. అలా ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’ సినిమాలకీ పనిచేశాను. ఆర్య, బొమ్మరిల్లులాంటి సినిమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా మీరేం చేశారని అడగొచ్చు. ఆర్ట్‌ డైరెక్షన్‌ అంటే అబ్బురపరిచే సెట్టింగ్స్‌ వేయడం మాత్రమే కాదు ప్రతి సీనులోనూ అందుకు తగ్గ వాతావరణాన్ని డిజైన్‌ చేయడం కూడా. ఆకాశం ఏ రంగులో ఉండాలి అన్నదాని దగ్గర్నుంచి చుట్టూ ఏ చెట్టూచేమ, ఏయే వస్తువులు ఉండాలో కూడా నిర్ణయించాల్సింది ఆర్ట్‌ డైరెక్టరే. నాకు ముందునుంచీ భారీ సెట్టింగులకన్నా ఇలా సహజత్వాన్ని తీసుకురావడంపైనే ఎక్కువ ఆసక్తి. నేను మొదట చేసిన చిత్రాలన్నీ ఇటువంటివే..! ఆ తర్వాత ‘దుబాయ్‌ శీను’, ‘కంత్రి’, ‘కృష్ణ’, ‘సింహ’లాంటి సినిమాలు చేశాను. వాటి హిట్‌లతో ఎన్నో అవకాశాలొచ్చాయి. దేన్నీ వదులుకోలేదు... చాలా వేగంగా, ఎడాపెడా సినిమాలు చేయడం మొదలుపెట్టాను. గత పదిహేనేళ్లలో ఎనభైకి పైగా సినిమాలు చేశాను! ఇవన్నీ ఒక్క తెలుగులోనే చేశాను. తమిళం, కన్నడ, హిందీ పరిశ్రమల నుంచీ చాలాసార్లు రమ్మన్నారు కానీ... ఇక్కడ వెల్లువలా వస్తున్న అవకాశాలు నన్ను కదలనివ్వలేదు.
మన సినిమాల ప్రొడక్షన్‌ వాల్యూ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ మిగతా భాషలవాళ్లని నోరెళ్లబెట్టించాలనే తపన నాది. ‘ఆర్య’ నుంచి ‘అలవైకుంఠపురంలో...’ దాకా ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాను!

నాణేనికి మరోవైపు...
నిజానికి నేను ‘ఆర్య’ సినిమా ఒప్పుకోవడానికి ముందు ఎంతో తటపటాయించాను. ‘అన్ని రకాలా భద్రతనిస్తున్న నౌకరీని వదులుకుని సినిమాలవైపు వెళితే ఏమవుతుందో ఏమో!’ అనుకుంటూ ఓ మామూలు ఉద్యోగిలా భయపడ్డాను. ఆ పరిస్థితుల్లో నన్ను ముందుకు అడుగేయమని ధైర్యాన్నిచ్చింది నా భార్య కమల. ‘మీ కళకి సినిమాయే సరైన కాన్వాస్‌... అందులో సక్సెస్‌ అవుతారనే నమ్మకం నాకుంది. కాకున్నా మీతో కలసి నేను ఎన్నికష్టాలైనా పడతాను!’ అని తను ధైర్యం ఇచ్చింది. ఆ భరోసాతోనే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. అంతేకాదు, నేను పూర్తిగా పనిపైన దృష్టిపెట్టగలిగేలా ఇంటికి సంబంధించిన ప్రతి బాధ్యతనీ కమల తనపైన వేసుకుంది. నేను కెరీర్‌పైన దృష్టిపెడితే నన్నూ, నా ఆరోగ్యాన్నీ, మా పిల్లల బాధ్యతలన్నీ తనే తీసుకుంది. ఆ రకంగా నా విజయంలో యాభైశాతం తనకే దక్కుతుంది. మా అమ్మ గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘మన దగ్గర ప్రతిభ, క్రమశిక్షణలుంటే ఈరోజు కాకపోయినా రేపైనా గొప్పగా సాధించి తీరతాం!’ అనే నమ్మకాన్ని నాలో చిన్నప్పుడే నూరిపోసింది. ఆ మాటలే సినిమా రంగంలోకి అడుగుపెట్టాక ఏదో ఒకటి సాధించి తీరాలనే తపనని నాలో నింపాయి. కాకపోతే ఈ విజయాలన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపుని చూస్తే... నేను పగలూ, రాత్రీ పనిలో పడి నా కుటుంబంపైనా, అమ్మానాన్నలపైనా పెద్దగా శ్రద్ధపెట్టలేదు. ఎప్పుడైనా అమ్మానాన్నల దగ్గరకి వెళితే... ఏదో హడావుడిగా చూసి వచ్చేసేవాణ్ణి. మా అమ్మ సావిత్రమ్మ నన్ను టీవీలో చూసినప్పుడల్లా ఆనందంతో ఫోన్‌ చేస్తుండేది. ఈ మధ్య ఇలాగే అమ్మ ఏదో పత్రికలో నా ఇంటర్వ్యూ చదివిందట. దాన్ని తలగడ కిందే పెట్టుకుని వచ్చీపోయేవాళ్లందరికీ చూపి మురిసిపోయిందట. అంతేకాదు... ‘నిన్నోసారి చూడాలనుందిరా చిన్నా! రెండుమూడురోజుల్లో వచ్చేలా చూడు!’ అంటూ ఫోన్‌ చేసింది. నేను ఎప్పట్లాగే పనిలోపడి మరచిపోయాను. రెండురోజుల తర్వాత... అమ్మ గుండెపోటుతో చనిపోయిందంటూ తమ్ముడి నుంచి ఫోన్‌ వచ్చింది! చివరి చూపుకి వెళ్లినప్పుడుకానీ... నేనేం కోల్పోయానో అర్థంకాలేదు నాకు. అమ్మకి దూరమై అప్పటిదాకా నేను సాధించినవన్నీ అర్థంలేనివి అనిపించాయి. ఆ శ్మశాన వైరాగ్యంలోనే ఎన్నో తీర్మానాలు చేసుకున్నాను. ఇకపైన నాన్నతోనైనా ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాను. పిల్లలు సాయిచరణ్‌, శ్రీసౌఖ్యలని ఎక్కువసార్లు చూసేది వాళ్లు నిద్రపోతున్నప్పుడే. ఉదయం ఏ నాలుగున్నరకో వెళ్లి, అర్ధరాత్రికిగానీ ఇంటికి రానినాకు అంతకన్నా భాగ్యం ఏముంటుంది! అందుకే ఇకపైన కొంత సమయం తప్పనిసరిగా వాళ్ల కోసం కేటాయించాలనుకుంటున్నాను. అమ్మకి నేనివ్వగల నివాళి ఇదే అనుకుంటున్నాను!

ఉత్త గ్యారేజీ కాదు...

‘మనం సృష్టించాల్సింది ఒట్టి గ్యారేజీ మాత్రమే కాదు... అది మోహన్‌లాల్‌గారి ఇల్లులాగానూ ఉండాలి. నలుగురికి మంచి చేసే ఆశ్రమంలా అనిపించాలి. పైగా, ఇందులోని హీరో ప్రకృతి ప్రేమికుడు కూడా కాబట్టి పచ్చదనం కూడా కనిపించాలి!’ - ‘జనతా గ్యారేజీ’ కథాచర్చలప్పుడే దర్శకుడు కొరటాల శివ నాకు చెప్పిన విజన్‌ ఇది! దీనంతటికీ ఓ రూపం తీసుకురావడానికి నాకు నెలపట్టింది. చూసిన ప్రతి ఒక్కరూ ఈ గ్యారేజీని కూడా సినిమాలో ఓ పాత్రని చేసేశావు అని ప్రశంసించారు. దర్శకుడికి ఈ గ్యారేజీ ఎంత నచ్చిందంటే దీన్ని సినిమాలో మరింత అందంగా చూపించడానికి ఇక్కడో డ్యూయెట్‌ని కూడా తీశారు! ఈ సినిమా నాకు రెండోసారి నంది అవార్డుని అందించింది. ఈ గ్యారేజీని ఆ ఒక్క సినిమాకే కాదు ‘అరవింద సమేత’లోనూ ఉపయోగించాం. అందులో కనిపించే హీరోయిన్‌ ఇల్లు... ఒకప్పటి మా గ్యారేజీయే!

‘అదిరిపోయింది డార్లింగ్‌!’

మిర్చి... కొరటాల శివగారి తొలి చిత్రం. మూడుగంటలపాటు నాకు కథ చెప్పాడు. చెప్పిన రెండురోజులకే ఈ కథకి కావాల్సిన స్కెచెస్‌, కలర్‌ స్కీమ్‌, సినిమాకి కీలకమైన గడీ ఇల్లు, అందులో ఉపయోగించాల్సిన వస్తువులూ అన్నీ పక్కాగా గీసి ఇచ్చాను. అది చూడగానే... ‘నా కలలకి ఓ రూపాన్నిచ్చావ్‌ థ్యాంక్యూ!’ అన్నారు శివ. దీనికి తోడు షూటింగ్‌లోనూ అప్పటికప్పుడు అదనపు హంగులు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. కొన్ని వస్తువులు బయటదొరక్క అప్పటికప్పుడు తయారుచేసుకోవాల్సి వచ్చింది. అవన్నీ చూసిన ప్రభాస్‌ ‘అదిరిపోయింది డార్లింగ్‌!’ అని హగ్‌ చేసుకున్నాడు. సినిమారంగంలో నన్నో పెద్ద స్థాయి ఆర్ట్‌ డైరెక్టర్‌గా నిలబెట్టిన సినిమా ఇది. నాకు తొలి నంది అవార్డుని అందించిన సినిమా కూడా!

కర్నూలునే తెచ్చిపెట్టారేమో!

ర్నూలు కొండారెడ్డి బురుజు అనగానే మనకు ‘ఒక్కడు’ సినిమానే గుర్తుకొస్తుంది! ఆ సినిమాలో బురుజుకి సంబంధించి ఒక్క సీనే తీశారు. కానీ, ‘సరిలేరు నీకెవ్వరు’కి దాదాపు పదిహేను రోజుల షూట్‌ అవసరమైంది. అన్ని రోజులపాటు అక్కడికి హీరో మహేశ్‌బాబుని తీసుకెళ్లడం అయ్యేపని కాదు. దాంతో బురుజుని కొంతవరకూ సెట్‌లో సృష్టించి మిగతాదంతా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌(సీజీ) చేసుకోవచ్చని భావించాం. అందుకు ఓ చిక్కొచ్చి పడింది. ‘సరిలేరు...’ని సంక్రాంతికి విడుదలజేయాలన్నది మాకున్న టార్గెట్‌. సీజీకి వెళితే ఆలస్యమై ఆ టార్గెట్‌లోపు సినిమాని రిలీజ్‌ చేయలేకపోవచ్చు. అందుకే కొండారెడ్డి బురుజుని ఉన్నదున్నట్టు హైదరాబాద్‌లో సెట్‌గా వేయాలనుకున్నాం. కాకపోతే, అందుకోసం బురుజులోని డిజైన్‌లని బ్లాక్స్‌ తీసుకోవడానికి దాన్ని పరిరక్షిస్తున్న ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) ఒప్పుకోలేదు. దాంతో నేను వారంపాటు ఆ బురుజు దగ్గరే కూర్చుని బొమ్మలు గీసి... కొలతలూ తీసుకున్నాను. వాటితోనే రామోజీ ఫిల్మ్‌సిటీలో దాన్ని పునఃసృష్టించాను. కేవలం బురుజు మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న అంగళ్లూ భవనాలతో సహా మొత్తం వాతావరణాన్నీ అక్కడ దించేశాం. దీన్ని చూసినవాళ్లందరూ ‘ఎవరో కర్నూలుని పెళ్లగించి తెచ్చి ఇక్కడ పెట్టినట్టుంది!’ అని అంటుంటే గర్వంగా అనిపిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.