close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తనే నా కలల రాణి!

అందమైన నవ్వుతో ‘సఖి’, ‘చెలి’ అంటూ అమ్మాయిల మనసుల్ని జోరుగా ‘రన్‌’ తీయించిన చాక్లెట్‌బాయ్‌ అతను! అంతలోనే ఇద్దరు పిల్లల తండ్రిగా ‘అమృత’లో, విలన్‌గా ‘యువ’లో కనిపించి వావ్‌ అనిపించినవాడు! ‘సవ్యసాచి’తో తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. సినిమాల్లోనే కాదు జీవితంలోనూ మాధవన్‌ది వైవిధ్య పంథానే. అందుకే మోటివేషనల్‌ స్పీకర్‌గా మారాడు! ఆ కథేంటో కాస్త చూద్దామా...

 

ఓ మోటివేషనల్‌ స్పీకర్‌గా నేను తరచూ నీళ్ళలో ప్రయాణించే బాతు ఉదాహరణొకటి చెబుతుంటాను. చూడటానికి హాయిగా తేలిపోతున్నట్టే ఉంటుంది దాని వాలకం. కానీ ఆ సుకుమారం వెనక మన కళ్లకి తెలియని కష్టం ఉంటుంది. ఆ సునాయాస ప్రయాణం అడుగున బాతు కాళ్లు నిమిషానికి వందసార్లు ఈతకొట్టడం కనిపిస్తుంది. నా జీవితం కూడా అలాంటిదే! నా నవ్వుల వెనక ఎన్నో అవమానాలున్నాయి. అందుకున్న శిఖరాల నుంచి అథోపాతాళానికి పడిపోతానేమోననే అభద్రతుంది. ‘ఇక మన పని అయిపోయింది..’ అనే నిరాశ ఉంది. సాధారణంగా ఎవరికైనా ఇలాంటి అవమానాలూ, అభద్రతలూ, నిరాశానిస్పృహలూ కెరీర్‌ ప్రారంభంలో ఉంటాయి. కానీ ఇవి నన్ను నిన్నమొన్నటి ‘సాలా ఖడూస్‌’(తెలుగులో వెంకటేశ్‌తో ‘గురు’గా రీమేక్‌ అయింది) దాకా కూడా వేధించాయి. కాకపోతే ఇవన్నీ నాలో సత్తా లేకో, శ్రమించడం చేతకాకో వచ్చినవి కావు. ‘సినిమాలని ఇప్పుడు చేస్తున్నట్టు కాకుండా కాస్త వైవిధ్యంగా చేద్దాం..’ అన్నందుకూ, ఆ దిశలో వెళ్తున్నందుకూ ఎదురైనవి! 
మిలటరీలో చేరాలనుకున్నా... 
మా అమ్మానాన్నలది తమిళనాడు. నాన్న జంషెడ్‌పూర్‌ టాటా స్టీల్‌ సంస్థలో మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేసేవారు. అమ్మ బ్యాంకు ఉద్యోగిని. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. సాధారణంగా దక్షిణాది నుంచి వచ్చినవాళ్లనగానే స్థానికులు ‘ఇడ్లీసాంబార్‌ వాలా’ అని పిలుస్తుండేవారు! బడిలో ఆ పిలుపు నాకు చాలా అవమానకరంగా అనిపించేది. వాళ్లతో కొట్లాటకు దిగిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. దాన్నుంచి బయటపడాలనే స్థానికులకంటే బాగా హిందీ మాట్లాడటం నేర్చేసుకున్నా. నాన్నకి కొల్హాపూర్‌ ట్రాన్స్‌ఫర్‌ కావడంతో... అక్కడి రాజారామ్‌ కాలేజీలో ఇంటర్‌లో జాయినయ్యాను. అప్పటికే ఏ అంశం ఇచ్చినా వేదికనెక్కి ఇంగ్లిషులో లెక్చరివ్వడం అలవాటుచేసుకున్నాను. రోటరీ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్వహించిన పోటీలో నెగ్గి కెనడా దేశానికి విద్యార్థి రాయబారిగా వెళ్లాను. ఏడాదిపాటు సాగిన ఆ పర్యటన నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. ఎదుటివాళ్లని ఎలా పలకరించాలనే విషయం నుంచి ఎటికెట్‌ దాకా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇండియా వచ్చి సైన్యంలో చేరాలనుకున్నాను కానీ... నాన్న ఒప్పుకోలేదు. 
‘జీవితంలో అది ఎన్నో త్యాగాలు చేయాల్సిన రంగం. నువ్వలా చేయలేవు!’ అన్నారు నాన్న. నేను విన్లేదు. ‘సరే ముందు డిగ్రీ చెయ్‌. ఆ తర్వాతా నీకు వెళ్లాలనిపిస్తే వెళ్లు..’ అన్నారాయన. ఆయన చెప్పినట్టే డిగ్రీలో చేరాను. అక్కడా ఎన్‌సీసీలో టాపర్‌గా రాణించాను. భారతదేశం నుంచి నాతోపాటూ ఏడుగుర్ని ఎంపిక చేసి బ్రిటిష్‌ ఆర్మీ, రాయల్‌ నేవీ, రాయల్‌ ఎయిర్‌ఫోర్సులో శిక్షణకి పంపించారు! ఆ శిక్షణ ముగించాక ఇక భారత సైన్యంలో చేరడమే తరువాయనుకున్నా. డిగ్రీ పూర్తవ్వగానే మిలిటరీ ట్రైనింగ్‌ అకాడమీకీ వెళ్లాను. వాళ్లు నిర్ణయించిన అర్హత వయసుకన్నా ఆరునెలలు ఎక్కువగా ఉన్నానని చెప్పి... వద్దనేశారు! నాకు ఆపైన ఏం చేయాలో తోచలేదు. 
లెక్చరర్‌గా...! 
నాకప్పట్లో ఇంజినీరింగ్‌ చదివే ముగ్గురు స్నేహితులుండేవాళ్లు. వాళ్లకోసారి క్యాంపస్‌ ఇంటర్వ్యూ జరిగింది. నా ఫ్రెండ్స్‌కి సబ్జెక్టుపైన మంచి పట్టుంది కానీ ఇంగ్లిషు చక్కగా మాట్లాడటం రాలేదు. అందువల్ల కంపెనీల వాళ్లని మెప్పించలేకపోయారు. నా దగ్గరకొచ్చి బాధపడితే... వాళ్లకి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేను నేర్పిస్తానని చెప్పాను. మూడు రోజులపాటు నేను అందించిన సూచనలు చాలా బాగా పనిచేశాయి! ముగ్గురికీ టాటా స్టీల్‌ సంస్థలో ఉద్యోగాలొచ్చాయి. అప్పట్నుంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై వర్క్‌షాపులు నిర్వహించడం మొదలుపెట్టాను. ఇంజినీరింగ్‌, ఎయిర్‌హోస్టెస్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు ఎక్కువగా వచ్చేవారు. ఈ నైపుణ్యంలో మరింత పట్టుసాధించాలని ముంబయిలో ఉన్న కిషన్‌చంద్‌ చెల్లారామ్‌ కాలేజీలో ‘పబ్లిక్‌ స్పీకింగ్‌’లో డిప్లమో కోర్సు చేశాను. ఆ కాలేజీ ద్వారా పబ్లిక్‌ స్పీకింగ్‌లో దేశవ్యాప్తంగా పోటీపెట్టారు. మొదటి స్థానం అందుకున్న నన్ను టోక్యోలో జరిగిన ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సు’కి పంపించారు. వెళ్లొచ్చాక ఎవరో అన్నారు ‘మీరు మోడలింగ్‌ కూడా ప్రయత్నించొచ్చు కదా!’ అని. సరే ఓ రాయేసి చూద్దామని పోర్ట్‌ఫోలియో తయారుచేసుకుని ఏజెన్సీలకి ఇవ్వడం మొదలుపెట్టాను.

 

సెట్స్‌లోనే నటన నేర్చుకున్నా... 
నేనో రోజు ముంబయి లోఖండ్‌వాలా ప్రాంతంలో నడిచి వస్తూ ఉంటే... ఎవరో పిలిచారు. ‘ఏమిటండీ’ అని అడిగితే ‘మేం హిందీ సీరియల్‌ తీస్తున్నాం... నటిస్తావా!’ అన్నారు. ఎవరు మాత్రం వద్దంటారు! వెళ్లాను. జీ టీవీలో వచ్చిన ‘యూల్‌ లవ్‌స్టోరీ’ అనే సిరీస్‌ కోసం అలా తొలిసారి మేకప్‌ వేసుకున్నాను. నటనలో అ, ఆలు సెట్‌లోనే నేర్చుకోవడం మొదలుపెట్టాను! చిన్నప్పటి నుంచీ అరమరికల్లేకుండా అందరితో కలిసిపోయే స్వభావం కావడంతో దర్శకుడి నుంచి లైట్‌బాయ్‌ దాకా అందరూ నాకు ఫ్రెండ్సయిపోయారు. వాళ్లే నాకు సిఫార్సు చేసి మరెన్నో అవకాశాలు ఇప్పించడంతో చాలా సీరియళ్ళూ, ప్రకటనల్లో కనిపించాను. దూరదర్శన్‌లో కోస్ట్‌ గార్డుల జీవితాల ఆధారంగా తీసిన ‘సీ హాక్స్‌’, సోనీలో వచ్చిన ‘సాయా’ సీరియళ్లు బాగా పేరుతెచ్చిపెట్టాయి. 1996లో కెమెరామ్యాన్‌ సంతోష్‌శివన్‌ ఓ యాడ్‌లో నటించడానికని పిలిచాడు. ఆ షూటింగ్‌ పూర్తయ్యాక దర్శకుడు మణిరత్నానికి నా గురించి చెప్పాడు. ఆయన 1997లో ‘ఇద్దరు’ సినిమా కోసం నన్ను ఇంటర్వ్యూ చేశారు. స్వయంగా కెమెరా పట్టుకుని కొన్ని డైలాగులు చెప్పమన్నారు. చెప్పాక ‘నీ కళ్ళలో ఇంకా పసితనం పోలేదు. ఈ పాత్రకి ఇంకా పరిణతి ఉన్నవాళ్లు కావాలి’ అన్నారు. ఆ పాత్రనే తర్వాత ప్రకాశ్‌రాజ్‌ చేశారు. రెండేళ్ల తర్వాత మణిరత్నం మళ్లీ పిలిచారు. వెళ్లగానే ‘నువ్వు కాస్త ఒళ్లు తగ్గాలి మ్యాడీ. హెయిర్‌ కట్‌ చేయాలి...’ అన్నారు. ‘ఇంతకీ మీ సినిమాలో నేను నటిస్తున్నానా సార్‌!’ అని అడిగాను. ‘అరె.. చెప్పడం మరిచిపోయాను. నువ్వే హీరోవి!’ అన్నారు నవ్వేస్తూ. అలా ‘సఖి’ సినిమా చేశాను. ఏడాదిలో నా దశ తిరిగిపోయింది. 

అజ్ఞాతంలోకి... 
‘చెలి’, ‘రన్‌’ సినిమాలు నన్ను దక్షిణాది అభిమానులందరికీ దగ్గరచేశాయి. కేవలం చాక్లెట్‌బాయ్‌గా ఇలాంటి కథలే చేస్తుంటే మూస పాత్రలకి పరిమితమై కనుమరుగవుతామని తెలుసు. అందుకే ఇద్దరు పిల్లల తండ్రిగా ‘అమృత’లో, కమల్‌హాసన్‌కి సపోర్టింగ్‌ రోల్‌లో ‘సత్యమే శివం’, విలన్‌గా ‘యువ’, మరో సపోర్టింగ్‌ పాత్రలో ‘3 ఇడియట్స్‌’, హీరోయిన్‌ ప్రాధాన్యమున్న ‘తనూ వెడ్స్‌ మనూ’ వంటివి చేశాను. కాకపోతే సినిమాల ఎంపికలో సంఖ్యకన్నా నాణ్యత కోసం పాకులాడేవాణ్ణి. పక్కా కమర్షియల్‌ కథతో ఎవరన్నా వస్తే నిర్మొహమాటంగా వద్దనేవాణ్ణి. దాంతో ‘నిర్మాతలు వెళితే కుక్కతో ఆట్లాడుతుంటాడుకానీ పట్టించుకోడు!’ అనడం మొదలుపెట్టారు. నా సినిమా హిట్టయినా సరే ‘అందులో అతని గొప్పేమీ లేదు. అంతా ఆ దర్శకుడి ప్రతిభ’ అనో ‘కమెడియనే ఇందులో హీరో!’ అనో ప్రచారం చేసేవాళ్లు. అవన్నీ పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ ‘జానే దో’  తత్వం మన చేతిలో విజయాలు ఉన్నంతవరకే బావుంటుంది. మనస్థాయి కిందికి దిగితే... అంతకు రెండింతలు మనల్ని అవమానిస్తారు. 2011 తర్వాత నా పరిస్థితి అదే! నాకు వరసగా కొన్ని ఫ్లాపులొచ్చాయి. మార్కెట్‌ పడిపోయింది. శరీరం కూడా లావెక్కింది. నాలో ముందున్న ఫైర్‌ పోయిందనిపించింది. అప్పుడే మోకాలి చిప్ప దెబ్బతింది. మూడేళ్లు సినిమాలకి దూరమయ్యాను. 
మాధవనా... అయితే?! 
సుధాకొంగర నాకు మణిరత్నం సహాయకురాలిగా తెలుసు. నేను అజ్ఞాతంలో ఉన్నప్పుడు తన ‘సాలా ఖడూస్‌’ కథకి నన్నే హీరోగా అనుకుని ఫోన్‌ చేసింది. కంఫర్ట్‌జోన్‌లో ఉండిపోయి... స్తబ్దుగా ఉన్న నాలో మళ్లీ ఆ పాత ఫైర్‌ని రగిలించిన కథ అది. కాకపోతే సుధ ఆ కథని ఎంతమంది నిర్మాతలకి వినిపించినా వాళ్లు ముందుకురాలేదు. దాంతో నేనే నిర్మాతగానూ ఉండాలనుకున్నాను. రిటైరయిన నడివయసు బాక్సర్‌గా కనిపించడానికి బాడీ బిల్డింగ్‌ చేశాను. కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ రితికా సింగ్‌ని హీరోయిన్‌గా ఎంపికచేశాను. అప్పటికి మూడేళ్లు సినిమాలు లేనివాణ్ణి కదా! ఉన్న డబ్బంతా పెట్టేశాక చేతిలో ఏమీ మిగల్లేదు. నా లగ్జరీ కార్లన్నీ అమ్మేశాను. కచ్చితంగా ఇంకెవరైనా నిర్మాతగా ఓ చేయి వేస్తేకానీ సినిమా వెలుగు చూడదు. దాంతో నిర్మాతల కార్యాలయాల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. నా పరిస్థితి చూసి చూపుల్తోనే చులకన చేసేవారు. కన్నీళ్లతో నిద్రలేని రాత్రులెన్నో గడిపాను. 
మళ్లీ నిలబడ్డాను... 
అలాంటి పరిస్థితుల్లోనే ‘3 ఇడియట్స్‌’ తీసిన రాజ్‌కుమార్‌ హిరానీ ఆపద్బాంధవుడిలా వచ్చాడు. కథ నచ్చి సహ-నిర్మాతగా ఉంటానన్నాడు! దాంతో సినిమా పూర్తి చేయగలిగాను. ‘సాలా ఖడూస్‌’ తమిళం, హిందీల్లో పెద్ద హిట్టయింది!! ఈలోపు ‘తనూ వెడ్స్‌ మనూ రిటర్న్‌’ కూడా రిలీజై వసూళ్ళలో రికార్డు సృష్టించింది. ఆ రెండు సినిమాలిచ్చిన నమ్మకంతోనే మనదేశంలో నిర్మిస్తున్న తొలి స్పేస్‌ సినిమా ‘చందామామా దూర్‌ కే’ సినిమాలో చేస్తున్నాను. ఇంకా షారుఖ్‌ఖాన్‌ ‘జీరో’లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాను. ఇక, ‘సవ్యసాచి’ అలరించే అంశాలతో వస్తున్న హాయైన చిత్రం. తెలుగులో నేను నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇదే! 
నా తీరు మారింది... 
సినిమాలకి వచ్చాక కూడా ఎవరైనా పిలిస్తే మోటివేషనల్‌ స్పీకర్‌గా వెళ్తూనే ఉన్నాను. కాకపోతే ఇరవై ఏళ్లకిందటి నా ప్రసంగాలకీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అందువల్లే ఒకప్పటిలా నేను యువతకి  కలలు కనడమెలాగో చెప్పి ఊరుకోవడం లేదు! ఆ సాధించే క్రమంలో వచ్చే కష్టాలని ఎదుర్కోవడమెలాగో కూడా చెబుతున్నాను!


తనెప్పుడూ నా వెంటే!

 

ఇరవైఏళ్లకిందటి మాట... సరితకి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో సమస్య ఉండి నా క్లాసులకి అటెండ్‌ అయింది. నేను శిక్షణ ఇచ్చాక ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం కొట్టేసింది. నాకు థ్యాంక్స్‌ చెబుతూ లెటర్‌ రాసింది. అలా ఇద్దరం ప్రేమలో పడ్డాం... పెద్దల్ని ఒప్పించి కులాలకతీతంగా పెళ్లిచేసుకున్నాం. ముంబయిలోని ఓ సింగిల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్లో ఉండేవాళ్లం. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా  నేను ఏ షూటింగ్‌కీ తను లేకుండా వెళ్లిందే లేదు. ‘సాలా ఖడూస్‌’ కోసం డబ్బు వెతుక్కుంటున్నప్పుడు ‘నీతో కలిసి మళ్లీ సింగిల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్లోనే ఉండిపోవడానికి నేను సిద్ధం. ఆ సినిమా పూర్తిచెయ్‌’ అని భరోసా ఇచ్చింది. నన్ను యువతుల కలల రాకుమారుడని అంటారుకానీ తనే నా కలల రాణి... ఎప్పటికీ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.