close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇవీ ఉద్యోగాలే!

‘పొద్దస్తమానం ఆ టీవీనే చూడకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా... చిన్న పిల్లాడిలా వీడెప్పుడూ ఆటలాడుతూనే ఉంటాడు. ఏం ఉద్యోగం చేస్తాడో ఏమో... అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్‌ అంటూ తిరుగుతుంది. ఇలా అయితే రేపు వచ్చిన జీతం అంతా షాపింగ్‌కే సరిపోతుందేమో...’ కుర్రకారుని చూసి తల్లిదండ్రులు ఇలా టెన్షన్‌ పడటం చూస్తూనే ఉంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే... టీవీ చూడటం, ఆటలాడటం, షాపింగ్‌ చెయ్యడం... ఇలాంటి పనులు చేసినందుకూ జీతాలిచ్చే ఉద్యోగాలున్నాయి.


టీవీ చూడటమే ఉద్యోగం

నెట్‌ఫ్లిక్స్‌ ట్యాగర్‌: హాయిగా సోఫాలో వెనక్కి వాలి పాప్‌కార్నో పకోడీనో తింటూ టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమాన్నీ సినిమానీ వదలకుండా చూసేవారికి ఇంతకుమించిన మంచి ఉద్యోగం ఉండదేమో. ‘నెట్‌ఫ్లిక్స్‌ ట్యాగర్‌’గా పిలిచే ఈ ఉద్యోగానిక్కావాల్సిన అర్హత కూడా అదే. నెట్‌ఫ్లిక్స్‌లో కొత్తగా అప్‌లోడ్‌ అయ్యే రకరకాల సినిమాలనూ టీవీ షోలనూ చూస్తూ హాస్యం, థ్రిల్లర్‌, బాధ... ఇలా ఒక్కోరకం సినిమానీ సంబంధిత విభాగాల్లో చేర్చడం, సినిమాలోని ప్రధాన పాత్రల ప్రత్యేకతను తెలియజేయడమే నెట్‌ఫ్లిక్స్‌ ట్యాగర్‌ పని. ఇంట్లో ఉండి పార్ట్‌టైమ్‌గా ఈ ఉద్యోగం చేసినా నెలకు రూ.లక్షకు పైగా ఆర్జించొచ్చట.


ఆడినందుకు లక్షల జీతం

వాటర్‌ స్లైడ్‌ టెస్టర్‌: నీళ్లల్లో ఆటలాడటం పిల్లలకే కాదు, చాలామంది పెద్దలక్కూడా సరదానే. అలాంటివాళ్లకు అదే ఉద్యోగం అయితే ఎగిరి నీళ్లలో గెంతేయకుండా ఉంటారా... రకరకాల వాటర్‌ స్లైడర్‌లలో జారుతూ ఆడుకుని ఆ స్లైడర్‌ ఎలా ఉంది... దాన్లో జారుతుంటే ఎలాంటి అనుభూతి కలుగుతోంది... ఇంకేమైనా మార్పులు చెయ్యాలా... లాంటి విషయాలు తెలియజేయడమే వాటర్‌ స్లైడ్‌ టెస్టర్‌ పని. దీనికోసం వేరు వేరు దేశాలకు వెళ్లి అక్కడి కంపెనీల స్లైడర్‌లనూ పరీక్ష చేయాల్సుంటుంది. అలా టూర్‌కి వెళ్లినట్లూ ఉంటుంది, ఏడాదికి దాదాపు రూ.18లక్షల జీతం కూడా ఇస్తారు.


బంపర్‌ ఆఫర్‌!

ఛీఫ్‌ షాపింగ్‌ ఆఫీసర్‌: నెలకు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలిస్తారు. అందులో పైసా కూడా మిగల్చకుండా ఇష్టమొచ్చినట్లూ ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేయొచ్చు. కొన్న వస్తువులన్నీ మనమే తీసేసుకోవచ్చు. అందుకోసం ప్రతి నెలా రూ.27.5 లక్షల జీతాన్ని కూడా ఇస్తుంది షాప్‌బ్యాక్‌ వెబ్‌సైట్‌. ఈ సంస్థ ఎంపికచేసే ‘ఛీఫ్‌ షాపింగ్‌ ఆఫీసర్‌’- ఆ వెబ్‌సైట్‌లోని వేరువేరు బ్రాండ్ల వస్తువుల్ని కొనుగోలు చేయాల్సుంటుంది. అలా కొనేటపుడు ప్రతి ఉత్పత్తిమీదా ఆ సైట్‌లో ఎలా క్యాష్‌బ్యాక్‌ని పొందొచ్చో చూపిస్తూ ఆసక్తికరమైన వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చెయ్యాలి, అంతే.


విందుభోజనానికీ జీతం!

లైవ్‌ స్ట్రీమ్‌ ఈటర్‌: నోరూరేలా ఉన్న రకరకాల వంటకాలను టేబుల్‌ నిండా పరచుకొని వెబ్‌కెమేరా ముందు కూర్చుని ఆ రుచులను వర్ణిస్తూ కబుర్లు చెబుతూ ఓ రెండు గంటలు తింటే చాలు, నెలకు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు సంపాదించేసుకోవచ్చు. దక్షిణ కొరియా టీవీల్లో మొదలైన ఈ ‘లైవ్‌ స్ట్రీమ్‌ ఈటర్‌’ ట్రెండ్‌ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. టీవీలో కనిపించేవారికి ఆయా ఛానళ్లు జీతాన్ని ఇస్తుంటే విడిగా వెబ్‌సైట్‌లూ యూట్యూబ్‌లలో ఛానళ్లు నిర్వహిస్తూ సొంతంగా సంపాదించుకునేవారూ ఉన్నారు.


మనసుని హత్తుకునే ఉద్యోగం

ప్రొఫెషనల్‌ కడ్లర్‌: దుఃఖంలో ఉన్నవారినీ ఒంటరిగా ఉన్నవారినీ దగ్గరకు తీసుకుని హత్తుకుంటే, ప్రేమగా కాసేపు వారితో మాట్లాడితే వారి బాధంతా పోతుందంటారు. కానీ ఉద్యోగాల పేరుతో కుటుంబాలకు దూరంగా నగరాల్లో ఉండేవారికీ ఒంటరిగా ఉండే వృద్ధులకూ చాలామందికి అలాంటి అవకాశం దొరకదు. అందుకే, విదేశాల్లో కొన్ని కంపెనీలు ‘ప్రొఫెషనల్‌ కడ్లర్‌’లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రేమగా హత్తుకుని ఓదార్పుని ఎలా ఇవ్వాలీ మంచి మాటలు చెప్పి, మనసులో నుంచి బాధను ఎలా దూరం చెయ్యాలి... లాంటి విషయాల్లో వారికి శిక్షణ ఇస్తాయి. అవసరమైనవారు ఫీజు చెల్లించి ఈ కడ్లర్‌లను కొన్ని గంటలూ లేదా ఓ రోజుకి పిలిపించుకోవచ్చు. ఈ ఉద్యోగం ద్వారా ఏడాదికి రూ.50లక్షలకు పైగా సంపాదించేవారూ ఉన్నారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయంటే నమ్మబుద్ధికావడంలేదు కదూ..!

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు