close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీట్‌రూట్‌తో దోమలకు ట్రాప్‌

సాయంత్రం ఆరయితే చాలు... తలుపులూ, కిటికీలూ ఎంత బిగించుకున్నా దోమల దాడి మాత్రం ఆగదు! నెలనెలా ఇంటి బడ్జెట్‌లో దోమల మందులకు కొంత కేటాయించాల్సిందే. అయితే తక్కువ ఖర్చుతో వీటిని తరిమికొట్టేలా స్వీడన్‌లోని లాండ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన విషయం తేలింది. మనుషులను కుట్టేది ఆడ దోమలేనని తెలుసు కదా! గుడ్లు పెట్టేందుకు సిద్ధమయ్యే సమయంలో ఈ దోమలు జియోస్మిన్‌ అనే ఒక రకమైన వాసనకు ఆకర్షితమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ వాసన ఉండేచోట వాతావరణాన్ని మైక్రోఆర్గానిజమ్స్‌ సాయంతో లార్వాలు పెరిగేందుకు అనుకూలంగా ఉండేలా దోమలు మలుచుకుంటాయట. అందుకే జియోస్మిన్‌ను ఉపయోగించి దోమలకు ట్రాప్‌ తయారుచేయవచ్చని చెబుతున్నారీ శాస్త్రవేత్తలు. ఈ పదార్థం బీట్‌రూట్‌ తొక్కల్లో అధికంగా అధికంగా ఉండటంతో ఆ జ్యూస్‌ వాడి దోమలన్నీ ఒకేచోట చిక్కుకునేలా చేయొచ్చని గుర్తించారు. దీన్ని పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానం చవకైనదే కాక, పర్యావరణ హితం కూడానట.


మొక్కలతో ఊబకాయం దూరం

ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. జీవనశైలి మార్పుల వల్ల తిన్నా తినకపోయినా విపరీతంగా లావైపోతుంటారు కొందరు. ఈ ఊబకాయంపై పచ్చదనం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పరిశీలించారు బార్సిలోనియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ పరిశోధకులు. ఈ పరిశోధనలో భాగంగా 20 నుంచి 85 ఏళ్ల మధ్య వయసుగల 2,300 మంది మహిళలను సర్వే చేశారట. ఎత్తు, బరువు, తీసుకునే ఆహారం, జీవనశైలి తదితర వివరాలన్నీ నమోదు చేసుకున్నారట. అవన్నీ క్రోడీకరించి చూడగా తెలిసిందేంటంటే... ఏ మహిళలైతే పచ్చదనానికి వీలైనంత దగ్గరగా జీవిస్తున్నారో, వారి బరువు సాధారణంగా ఉండాల్సినంత ఉంటోందట. మొక్కలకు దగ్గరగా ఉండటం వల్ల కలిగే మానసిక ఆనందం, తోటపని వల్ల జరిగే వ్యాయామం తదితర కారణాలన్నీ దీనికి దోహదం చేస్తున్నట్లు గమనించారు. సో, ఊబకాయంతో ఇబ్బందిపడే వారు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం మొక్కల మధ్య గడపడం మంచిదన్నమాట!


సొంత వైద్యం వద్దు

పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు తొలి ఐదేళ్లు ఎంతో కీలకం. ఈ సమయంలో వారికిచ్చే యాంటీబయోటిక్స్‌ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు స్విట్జర్లాండ్‌లోని హౌస్‌హోల్డ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసెర్చ్‌ యూనిట్‌ పరిశోధకులు. ఎందుకంటే చిన్నపిల్లలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతుంటారు. అలాంటప్పుడు ముందు మెడికల్‌ షాప్‌ నుంచి మందులు తెచ్చి వేసి, తగ్గకపోతేనే ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు చాలామంది. కానీ ఇలా చేయడం చిన్నారులకు మంచిది కాదట. ఎందుకంటే దుకాణాల్లో ఔషధానికి అనుబంధంగా యాంటీబయోటిక్స్‌ కూడా ఇస్తుంటారు. ఆ డోసేజ్‌ ఎంతవరకు ఇవ్వాలన్నది సక్రమంగా తెలియకపోయినా, తరచూ అలా అధికంగా మందులు వాడినా...  పిల్లల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందట. ఆ యాంటీబయోటిక్స్‌ వల్ల శరీరానికి అవసరమైన బ్యాక్టీరియా కూడా మరణించి, ఇతర రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందట. అందువల్ల అంతకుముందు డాక్టర్లు ఇచ్చిన మందులైనా సరే, మరోసారి జబ్బు పడ్డప్పుడు వైద్యుల సలహా లేకుండా పిల్లలకు వాడకూడదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.


అర్థం చేసుకోరూ...

మెనోపాజ్‌కు దగ్గరగా ఉన్న మహిళల్లో లైంగికాసక్తి తగ్గడం అనేది తరచూ వినేదే. దీనికి శారీరక మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి దోహదం చేస్తుంటాయి. అయితే భాగస్వామి సహకారం లోపించడం వీటన్నిటికంటే పెద్ద సమస్య అని చెబుతున్నారు యూనివర్శిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు. దీనికోసం 40 ఏళ్లు దాటిన మహిళలను వారి లైంగిక జీవితం ఎలా ఉందనే విషయంపై సర్వే చేశారట. ఇందులో నలభై శాతం మందికిపైగా తాము గతంలో మాదిరిగా శృంగారంపై ఆసక్తి ప్రదర్శించలేకపోతున్నామనీ, తమను భాగస్వామి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, సహకరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనీ చెప్పారట. ఇందువల్ల వచ్చే మనస్పర్థల కారణంగానే తాము దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నామని తేల్చిచెప్పారట. అందువల్ల మెనోపాజ్‌ సమయంలో మహిళల్లో కలిగే శారీరక మార్పులనూ ఇబ్బందులనూ పురుషులు అర్థం చేసుకుని... దానికి తగ్గట్టు వారికి సహకారం అందిస్తే శృంగారజీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు