close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్క ప్యాంటు అమ్మినా... చాలనుకున్నాం!

జీన్స్‌ ప్యాంట్లంటే లీ, పెపె, లెవీస్‌ లాంటివే కాదు... ఆ జాబితాలో దేశీయ బ్రాండ్‌లూ చేరొచ్చని చాటిన సంస్థ స్పైకర్‌. ఒకప్పుడు మూడువందల గజాల గదిలో ప్రారంభించిన ఈ సంస్థ నేడు అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపైనా చోటు సంపాదించుకునే స్థాయికి చేరుకుందంటే దానికి కారణం ఆ సంస్థ వ్యవస్థాపకుడు సంజయ్‌ వఖారియా. ఫ్యాషన్‌ ప్రియులకు నచ్చేలా తమ వస్త్రశ్రేణిని ఎప్పటికప్పుడు కొత్తగా మార్కెట్లో విడుదల చేస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్న సంజయ్‌ గెలుపుకథ అతడి మాటల్లోనే...

ఒకప్పుడు అబ్బాయిలకు రెండు జీన్స్‌ప్యాంట్లుంటే గొప్ప. ఇప్పుడు వాళ్ల అల్మారా తెరిస్తే చాలు... కుప్పలుగా పోగుపడి ఉండే దుస్తుల్లో మెజారిటీ జీన్స్‌ ప్యాంట్లే ఉంటాయి. అమ్మాయిల అల్మారా పరిస్థితీ ఇదేనని  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ జీన్స్‌లన్నీ మా స్పైకర్‌ బ్రాండ్‌వే అయ్యుండాలనేది నా కల. దాన్ని కొంతవరకూ నిజం చేశా కానీ సాధించాల్సింది ఇంకా ఉంది. అప్పటివరకూ మా స్పైకర్‌ ప్రయోగాలూ, ప్రయత్నాలూ    సాగుతూనే ఉంటాయి. నిజానికి అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా ఓ సంస్థను పెట్టడమంటే సాహసమే కానీ ప్రయత్నించడంలో తప్పులేదుగా. స్పైకర్‌ను ప్రారంభించి 28 ఏళ్లు గడిచినా... ఇంకా 1992లో ఉన్నట్లు భావిస్తూనే, ఫ్యాషన్‌పైన ఈతరానికి ఉండే అభిరుచులూ, ఆసక్తుల్ని తెలుసుకుంటూ దానికి తగినట్లుగా మార్పులు చేసుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తున్నాం.

మా సొంతూరు రాజ్‌కోట్‌లోని భగాసరా అయినా... నేను పుట్టి పెరిగినదంతా ముంబయి. మా అమ్మ గృహిణి. నాన్న చెప్పుల ఎగుమతి వ్యాపారం చేసేవారు. బీకాం చదివిన నేను స్పైకర్‌ పెట్టక ముందు ఓ పబ్లిషింగ్‌ సంస్థలో మార్కెటింగ్‌ విభాగంలో పనిచేశా. ఏడాదిన్నర తరువాత ఏదో అసంతృప్తి. దాంతో నేనూ, నా కొలీగ్‌ కలిసి రాగ్జ్‌ అనే డెనిమ్‌ తయారీ సంస్థను ప్రారంభించాం. కొన్నిరోజుల తరువాత మాకో  ప్రకటన కనిపించింది. తమకు దుస్తులు తయారుచేసే ఫ్యాక్టరీ ఉందనీ... ఆర్డర్‌లిస్తే ఎంత మొత్తంలోనైనా దుస్తులు తయారుచేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. పేరు చూస్తే ప్రసాద్‌ పబ్రేకర్‌ అని ఉంది. మాకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అతడితో మాట్లాడితే మా అభిప్రాయాలు ఒకటేనని అర్థమైంది. దాంతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాం. కొన్నాళ్లకు ప్రసాద్‌, నేనూ కలిసి ఓ దుస్తుల బ్రాండ్‌ తీసుకురావాలనుకున్నాం. అలా 1992 ఆగస్టులో మూడువందల చదరపు అడుగుల గదిలో స్పైకర్‌ని మేమిద్దరం ప్రారంభించాం. 2014 వరకూ మా ప్రయాణం సాగింది. ఆ తరువాత అతడు బయటకు వెళ్లిపోయాడు. అప్పటినుంచీ స్పైకర్‌ బాధ్యతల్ని పూర్తిగా నేనే చూస్తున్నా.

సవాళ్లు సహజమనుకున్నాం...
సంస్థను ప్రారంభించిన మొదటి రెండేళ్లు మేం కేవలం జీన్స్‌ప్యాంట్లనే తయారుచేసేవాళ్లం. ముంబయిలో వాటికి ఆదరణ లభిస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందనేది మా ఆశ. పైగా 1992 అంటే... మాది కూడా ఓ సగటు వినియోగదారుడి వయసే. కస్టమర్లుగా మేం ఎలాంటి ఉత్పత్తులు కోరుకుంటున్నామో అలాంటివే మార్కెట్లో విడుదల చేయాలనుకునేవాళ్లం. అంతేతప్ప మాకంటూ ఎలాంటి ప్రణాళికలూ లేవు. ప్యాంట్ల తయారీలో ప్రయోగాలు చేయాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా మనసుకు ఏదనిపిస్తే అదే చేసేవాళ్లం. అయితే మార్కెట్లో ఎలాంటి ఫ్యాషన్‌ లోపిస్తోందో గుర్తించి వినియోగదారులకు అలాంటి దుస్తులు అందించాలనే తపన మాత్రం ఉండేది. అయినప్పటికీ  మేం ఊహించని విధంగా మొదటి ఏడాదిలోనే కొంత నష్టం వచ్చింది. ఉత్సాహంగా ప్యాంట్లను తయారుచేసినా మార్కెటింగ్‌ చేయడంలో విఫలం కావడమే అందుకు కారణం. ఆ నష్టం ఎలా జరిగిందో తెలుస్తోంది కాబట్టి బాధపడుతూ కూర్చోలేం కదా...   బాగా ఆలోచించి వినియోగ    దారుల్నే మా ప్రకటనదారులుగా మార్చేందుకు ప్రయత్నించాం. అంటే... బొమ్మలకు ప్యాంట్లు తొడిగి, స్టోర్‌ బయట పెట్టడం కన్నా నేరుగా వినియోగదారుల దగ్గరకే  వెళ్లాలనుకున్నాం. దాంతో ఎక్కడ కాలేజీ ఫెస్టులు జరిగినా మా సిబ్బంది వెళ్లి విద్యార్థులతో మాట్లాడి, వాళ్ల ఆసక్తుల్ని తెలుసుకునేవారు. ఇంత చేసినా ఒక్కోసారి ఒక్కరు కూడా మా స్టోర్‌కి వచ్చేవారు కాదు. మహా ప్రయత్నిస్తే ఒకటీ ఆరా ప్యాంట్లు అమ్ముడుపోయేవంతే. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు నుంచి అయిదువందల ప్యాంట్లు కావాలంటూ ఓ ఆర్డరు వచ్చింది. అయితే మేం తయారుచేసి ఇచ్చే జీన్స్‌కు వాళ్ల బ్రాండు పేరు పెట్టుకుంటామన్నారు. మా పేరు ఉండదు కాబట్టి వద్దని చెప్పాలనుకున్నా. కానీ ఆ సమయంలో మాకది పెద్ద ఆర్డరు కావడంతో రాజీపడక తప్పలేదు. ఏదో విధంగా మా ప్యాంట్లు బజార్లోకి వెళ్తాయి కాబట్టి చేసేందుకే సిద్ధమయ్యాం. అయితే అప్పటికే ప్యాంట్లకు పెట్టే బటన్లు స్పైకర్‌ పేరుతో వచ్చేశాయి. వాటిని చూశాక మనసు మార్చుకున్నాం. మా బ్రాండ్‌ పేరుతోనే జీన్స్‌ ఇస్తామని చెప్పాం. వాళ్లు ఒప్పుకోలేదు. ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేశారు. తరువాత ఆ ప్యాంట్లన్నింటినీ అమ్మడం మాకెంత కష్టమైందో! ఒక్క ప్యాంటు అమ్మినా పండగ చేసుకున్నంత ఆనందం కలిగేది. అలాగే మా   ఉత్పత్తుల్ని రిటెయిలర్ల దగ్గరకు తీసుకెళ్తే... మమ్మల్ని అంతర్జాతీయ బ్రాండ్లతో పోల్చేవారు తప్ప మా కష్టం చూసేవాళ్లు కాదు. పెద్ద సంస్థల విషయంలో ఎంత ఖర్చయినా పెట్టేవాళ్లు కానీ... మేం ఏ కాస్త ఎక్కువ ధర పెట్టినా ‘అబ్బో అంత రేటా’ అనేవారు. మా డిజైన్లు, వస్త్ర నాణ్యత గురించి పట్టించుకునేవారు కాదు. ఇలా మొదటి అయిదారేళ్లు సమస్యలెన్నో ఎదుర్కొన్నాం.

వాళ్లే లక్ష్యంగా...
ఓ వైపు మేం మార్కెట్లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంటే మరోవైపు పెద్దపెద్ద సంస్థలు తమవైన మార్కెటింగ్‌ వ్యూహాలతో మాలాంటి చిన్నసంస్థల్ని ఢీకొట్టేందుకు ప్రయత్నించేవి. నిపుణుల్ని నియమించుకోవాలంటే బోలెడు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ముడిసరకూ దొరికేది కాదు. బజార్లోనేమో నకిలీ ప్యాంట్లు వచ్చేవి. ఈ పరిస్థితుల్లో కొన్ని జీన్స్‌ తయారీ సంస్థలు నష్టపోయే దశకు చేరుకున్నాయి. ఒకానొక సమయంలో మేం కూడా ఆ జాబితాలోకి చేరిపోయేవాళ్లమే కానీ... మా బ్రాండ్‌ని నిలబెట్టుకునేందుకు చావోరేవో అన్నట్టుగా కష్టపడ్డాం. 15-40 వయసు  వాళ్లనే లక్ష్యంగా పెట్టుకుని వాళ్లకు నచ్చేలా దుస్తులు రూపొందించేందుకు ఓ డిజైనర్‌ బృందాన్ని నియమించుకున్నాం. వాళ్లు మార్కెట్లో ఉన్న ఫ్యాషన్లూ, ట్రెండ్లపైన ఎంతో అధ్యయనం చేస్తారు. వినియోగదారుల అభిరుచులు తెలుసుకునేందుకు రకరకాల ప్రాంతాలకు వెళ్లొస్తుంటారు. ఇవన్నీ అయ్యాక ప్రతి ఆర్నెల్లకోసారి 400 నుంచి 500 రకాల డిజైన్లను మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాం. ఆర్నెల్ల తరువాత మళ్లీ కొత్త డిజైన్లను రూపొందిస్తాం. ఇలా ఏడాదిలో రెండుసార్లు మాత్రమే  డిజైన్లను మారుస్తాం. రంగుల విషయంలోనూ అంతే. రకరకాల రంగుల్ని మేళవించి, జీన్స్‌షేడ్లలో ప్రయోగాలు చేస్తాం. ఒకసారి వచ్చిన మోడల్‌ మళ్లీ కనిపించకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం.  ఇలా... మార్కెటింగ్‌ మెలకువలు తెలియక నష్టపోయిన మేము ఇప్పుడు అందుకు ఉపయోగపడే ప్రతి సాధనాన్నీ సద్వినియోగం చేసుకున్నాం. యువత ఎక్కువగా చూసే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, సెల్‌ఫోన్లనే మా ప్రచారమాధ్యమాలుగా ఎంచుకున్నాం. అలాగే టీనేజర్లూ, పాతికేళ్లలోపు యువతతో ఎక్కువగా మాట్లాడుతుంటాం. వాళ్లు చెప్పే ప్రతి సూచననూ పరిగణనలోకి తీసుకుంటాం. వాస్తవానికి అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడటం అంటే సవాలే కానీ నాణ్యమైన ఉత్పత్తినీ, వినియోగదారులు కోరిన డిజైనునీ ఇస్తే మార్కెట్లో నిలదొక్కుకోవచ్చన్నది మా నమ్మకం. అంతర్జాతీయ ఫ్యాషన్‌ మార్కెట్లో డెనిమ్‌లో ఎలాంటి మార్పు వచ్చినా.. దాన్ని మన దగ్గర తీసుకొచ్చేలా మా పరిధిని విస్తరించుకున్నాం. ఇవన్నీ కలిసే స్పైకర్‌కు గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు దేశంలోని మూడు ప్రముఖ బ్రాండ్లలో మేం రెండోస్థానంలో ఉన్నాం. మొదట మేం పెద్దపెద్ద షాపింగ్‌  మాల్స్‌లో మా దుస్తుల్ని ఉంచుతూనే నెమ్మదిగా రిటెయిల్‌ స్టోర్‌ని తెరిచాం. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ మా ఉత్పత్తులు దొరుకుతున్నాయి. అలాగే సంస్థను ప్రారంభించిన రెండేళ్లపాటు ప్యాంట్లనే తయారుచేసిన మేం క్రమంగా క్యాజువల్స్‌, ఫార్మల్‌వేర్‌, అయిదు జేబులున్న జీన్స్‌, కార్గోస్‌, లూజర్స్‌, చినోస్‌, టీషర్ట్స్‌, క్యాప్స్‌, బెల్టులు, వాలెట్స్‌, డియోడరెంట్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌.. ఇలా చాలానే తీసుకొచ్చాం. అమ్మాయిలకు అవసరమయ్యే ట్యూనిక్స్‌, టీషర్ట్స్‌, జాకెట్స్‌నీ విడుదల చేశాం. త్వరలో జుట్టు సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులనీ తీసుకురాబోతున్నాం. అమ్మాయి, అబ్బాయి... ఎవరైనా సరే,  ఒక వ్యక్తికి అవసరమయ్యే  వస్తువులన్నీ మా స్పైకర్‌లోనే దొరికేలా చేయాలనేది మా లక్ష్యం.


పుస్తకాలు చదువుతా

సంస్థ సీఈఓగా ఏసీగదిలో కూర్చుని లాభనష్టాల్ని బేరీజు వేసుకోవడం ఒక్కటే కాదు.... మా సిబ్బంది దుస్తులపైన చేసే ప్రయోగాల్లో నేనూ భాగం అయ్యేందుకు ప్రయత్నిస్తా. అదేవిధంగా వినియోగదారులు కొనే ఉత్పత్తులకు సంబంధించీ ఎప్పటికప్పుడు డేటా సేకరిస్తుంటాం. వాళ్లిచ్చే ఫీడ్‌బ్యాక్‌ కూడా మా విజయ రహస్యంలో ఓ భాగమే మరి. సంస్థ కోసం నేను ఎక్కువ సమయం కేటాయిస్తోంటే ఇంటిబాధ్యతను పూర్తిగా మా ఆవిడ తీసుకుంది. ఆమె లాయర్‌. కూతురు పదో తరగతి చదువుతోంది. తను జాతీయస్థాయి స్కేటింగ్‌ క్రీడాకారిణి కూడా. కొడుకు కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేస్తున్నాడు. మా అమ్మాయి స్కేటింగ్‌లో, అబ్బాయి ఉన్నత చదువులు  చదవడంలో క్రెడిట్‌ అంతా మా ఆవిడదేనని గర్వంగా చెబుతా. నాకు సమయం దొరికితే పుస్తకాలు చదువుతా. ప్రయాణాలూ చేస్తుంటా.
* సంస్థను విస్తరించే క్రమంలో ఎక్కువ పెట్టుబడులు అవసరమవుతాయి. అందుకోసమే ఆరేళ్లక్రితం బాగ్రీ మెడ్‌సెట్‌ గ్రూపులో భాగమయ్యాం.
* మెట్రో నగరాల్లోనే కాదు... గ్రామీణులకూ మా జీన్స్‌ అందుబాటులో ఉండేవిధంగా వందకు పైగా నగరాల్లో మా అవుట్‌లెట్లను ప్రారంభించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 285కు పైగా స్పైకర్‌ అవుట్‌లెట్లు ఉంటే, 800కు పైగా మల్టీబ్రాండ్‌ స్టోర్లలోనూ మా ఉత్పత్తులు దొరుకుతాయి. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 12 అవుట్‌లెట్లు ఉన్నాయి. ఇవి కాకుండా షాపర్స్‌స్టాప్‌, పాంటలూన్స్‌, లైఫ్‌స్టైల్‌... ఇలా అన్నింట్లో మా దుస్తులు దొరికేలా వాటితో అనుసంధానమయ్యాం.
* సొంతంగా ఆన్‌లైన్‌స్టోర్‌ తెరవడమే కాదు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, జబాంగ్‌, పేటీఎం, షాప్‌క్లూస్‌ వంటివాటిల్లోనూ మా ఉత్పత్తులు దొరికేలా చేస్తున్నాం. ఈకామర్స్‌ స్టోర్‌నీ ఇంకా పెద్దస్థాయిలో విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం.
* అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్‌ ప్రియులు మా స్పైకర్‌ని ఎలా స్వీకరిస్తారో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా, లండన్‌లలో మూడేళ్లపాటు స్టోర్లు తెరిచి, తరువాత మూసేశాం. దానివల్ల వినియోగదారుల అభిరుచులూ, ఆలోచనలూ తెలిశాయి. ఆ డేటాను మన దేశంలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాం.
* సంస్థను పెట్టిన కొత్తలో మేం జీన్స్‌ ప్యాంటును అమ్మిన ధర 550 రూపాయలు. ఇప్పుడు మా ఉత్పత్తులు దాదాపు ఆరేడువందల రూపాయల నుంచి మొదలై... ఆరువేల వరకూ ఉంటాయి.
* ప్రస్తుతం మా దగ్గర ప్రత్యక్షంగా 270 మంది దాకా సిబ్బంది పనిచేస్తుంటే పరోక్షంగా అన్ని  విభాగాలూ కలిపి అయిదువేల మంది దాకా ఉన్నారు. మా ఫ్యాక్టరీలు మహారాష్ట్ర, కర్ణాటక, ఎన్‌సీఆర్‌లలో ఉన్నాయి. వస్త్రం తయారీకోసం మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌లలో మిల్లులు ఏర్పాటు చేసుకున్నాం.
* 2017-18లో రూ 550 కోట్లు టర్నోవరు అందుకున్నాం. ఈ ఏడాది రూ.700 కోట్ల టర్నోవరు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.